వేణువై వచ్చారు భువనానికి… గాలిలా వెళ్లిపోయారు గగనానికి..
పాటల మకరందం వేటూరి జయంతి జనవరి 29
(వైజయంతి పురాణపండ, 8008551232)
వేటూరి వెళ్ళిపోయిన ఆయన వదిలిన అక్షర మాధుర్యం మనల్ని ఆనందింపజేస్తూనే ఉంది. ఆచంద్రతారార్కమూ అది నిలిచే ఉంటుంది.
వేటూరి పాటల మాధుర్యానికి మచ్చు తునకలు
గోవుల్లు తెల్లన గోపయ్యనల్లన అంటూ.. అచ్చెరువున అచ్చెరువొందారు…
కోకిలమ్మ పెళ్లికి కోనంతా సందడి.. కలికి చిలకల కొలికి మాకు మేనత్త..
అబ్బ నీ తియ్యని దెబ్బ.. ఆరేసుకోబోయి పారేసుకున్నాను…
పరవశాన శిరసూపి శివగంగను ధరకు జార్చారు..
నా గాన లహరి నువు మునుగంగ ఆనందవృష్టినే తడవంగ అంటూ సాక్షాత్తు ఆ పరమ శివుడిని తన గాన లహరిలో తడిపేశారు.
ఎన్నని లెక్కించగలం, ఎన్నని స్మరించగలం…
అది వేటూరి యుగం.. సినీ ప్రపంచానికి ఒక స్వర్ణయుగం..
కత్తికి రెండు వైపులా పదును ఉంది అనిపించుకున్న వేటూరి గురించి ఆయన పెద్ద కుమారుడు వేటూరి రవిప్రకాశ్ వ్యూస్‌కు ఇచ్చిన ముఖాముఖి.
ముగ్గురం అబ్బాయిలం
నాన్నగారికి మేం ముగ్గురం అబ్బాయిలం. నేను పెద్దబ్బాయిని. 2002లో హైదరాబాద్ వచ్చేశాక, ఎనర్జీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. అంతకుముందు.. ప్రేమించు, జగదేకవీరుడు (కృష్ణ) చిత్రాలకు కథలు రాశాను. తమ్ముడు చంద్రశేఖర్ – ఎం. ఏ సైకాలజీ చేసి, అమెరికన్ కాన్సులేట్‌లో పనిచేసిన అనుభవంతో సొంత కన్సల్టెన్సీ పెట్టుకున్నారు. రెండో తమ్ముడు నందకిశోర్ ఎంబిఏ చేసి, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సిలో రీజనల్ మేనేజర్‌గా పనిచేసి, సొంత కన్సల్టెన్సీ ప్రారంభించారు. నాకు తమ్ముళక్లకి పది సంవత్సరాలు తేడా ఉంది. నాన్నగారు ‘ఆంధ్రజనత’ కి ఎడిటర్ గా పనిచేసిన సమయం నుంచి ఆయనను దగ్గరగా గమనించడం వల్ల, పెద్ద కొడుకునైనందు వల్ల ఆయన రచన, జీవితం, సినిమా సంబంధం గురించి నాకు అవగాహన ఉంది.
ఉద్యోగం చేయాల్సిందే..
నాన్నగారు బిఏబిఎల్ చేశారు. అప్పట్లో రచనాపరంగా ఇష్టం ఉన్నా, ఉద్యోగం చేయమనేవారు ఇంట్లో అంతా. నాన్నగారు అప్పటికే ఆస్తిపరుడు. ఆయనను పిల్ల జమీందారు అని పిలిచేవారు. అయినా సరే, ఉద్యోగం చేస్తూ, ఏది కావాలంటే అది చేసుకోమనేవారు. ఉద్యోగం అంటే నెలకు ఇంత అని నికర ఆదాయం ఉంటుంది అనేవారు
పాటలు రాసే కొత్తల్లో…
పాటలు రాస్తున్న తొలినాళ్లలో ‘ఈ సినిమాకి ఈ పాట రాస్తున్నాను’ అని చెబితే, బిజీ అయిన తరవాత సినిమాల పేర్లే తప్ప మిగిలిన వివరాలు తెలిసేవి కాదు. ఓ సీత కథ, భక్త కన్నప్ప, సిరిసిరి మువ్వ, కల్పన.. చిత్రాలలో పాటలు రాస్తున్నప్పుడు ‘ఇలా రాస్తున్నాను. ఇలా రాశాను’ అని చెప్పేవారు. శంకరాభరణం, సప్తపది, శుభోదయం.. చిత్రాలకు రాస్తున్నాను అనేవారు. అంతే. బావున్నాయనుకున్న సినిమాలను రిలీజ్‌కు ముందుగా ‘ప్రివ్యూ షో థియటర్’లో వేసుకుని చూసే వాళ్లం. మాది బాగా రిజర్వ్‌డ్ ఫ్యామిలీ. మిగతా కుటుంబాలతో కలవటం తక్కువే. నాన్నగారు కూడా ఆడియో ఫంక్షన్లు, శత దినోత్సవాలకు వీలైనంతవరకు వెళ్లేవారు కాదు. కె. విశ్వనాథ్, జంధ్యాల, బాపురమణ, మాధవపెద్ది, చక్రవర్తి.. వీరి కుటుంబాలతో తప్ప మిగిలిన సినిమా వారి కుటుంబాలతో సాన్నిహిత్యం లేదు.
జర్నలిస్టుగా ఆంధ్రజనతలో…
నాన్నగారు ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వార పత్రికలలో సబ్ ఎడిటర్‌గా, ఆంధ్రజనతకి ఎడిటర్‌గా పనిచేశారు. తన ముప్పయ్యవ ఏటే ఎడిటర్ అయ్యారు. 1968లో ఎడిటర్‌గా రిజైన్ చేసి, స్వతంత్ర రచన చేపట్టాలనుకుని, గురు తుల్యులైన విశ్వనాథ సత్యనారాయణ గారితో‘చందవోలు రాణి’ నవలను అడిగి రాయించుకుని, సుందర ప్రచురణలు పేరున ప్రచురించారు. తరవాత ఆయన రాసిన ‘జీవనరాగం’, ‘దేవాలయ చరిత్ర’ పుస్తకాలను కూడా ప్రచురించారు. 1970లో ఆకాశవాణిలో చేరడానికి వెళ్లగా బాలాంత్రపు రజనీకాంతరావు గారు ‘ఏదైనా స్వచ్ఛంద రచన చేయ’మని అడగటంతో, ‘సిరికాకుళం చిన్నది’ అనే సంగీత నాటకాన్ని రాశారు. ఇది 1971లో అన్ని తెలుగు ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమైంది. ఈ సమయంలో చక్రపాణి గారు ఆడవారికి ప్రత్యేక పత్రిక‘ వనిత’ మొదలుపెడుతూ, నాన్నగారిని ఎడిటర్‌గా ఉండమని అడిగారు.
ఓ సీత కథ…
నాన్నగారికి సినిమా రచనల అనుభవం కొంత 1952 – 58 మధ్య ఉంది. 1959లో ‘వసుబాల’ అనే కథను బిఎన్ రెడ్డిగారి కోసం రాశారు. ఎన్‌టిఆర్ ప్రోత్సాహంతో ‘పెండ్లి పిలుపు’ సినిమాకి స్క్రిప్టు వర్క్ చేసిన అనుభవం ఉంది. ఎన్‌టిఆర్ కోరిక మేరకు గొల్లపూడి మారుతీరావుగారు నాన్నగారిని కె. విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. అప్పటికే విశ్వనాథ్ గారు మూగ డ్యాన్సర్ కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమాకు పాటలు రాయమని నాన్నగారిని అడిగారు. నాన్న సరేనన్నారు. ఈ లోగా ‘ఓ సీత కథ’ చిత్రానికి కె. విశ్వనాథ్ గారి కోరిక మీద పాటలు రాశారు. ఆ చిత్రం మంచి పేరు సంపాదించి పెట్టింది. 1975 లో బాపుగారి భక్తకన్నప్ప, 1977లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
నిర్భయంగా రాసేవారు..
నాన్నగారు రచయితగా విభిన్నంగా రాయాలనీ, సమాజంలో తాను, తన రచనలు గుర్తుండిపోవాలనీ అనుకున్నారు. నాన్నగారు ఏది రాసినా మహారాజులాగే చెల్లిపోయింది. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ… ఎక్కడ ఏది రాసినా అందరూ గౌరవించారు. కాంట్రవర్సీ కోరి తెచ్చుకోలేదు.‘హి ఈజ్ ఎ పొయటిక్ క్రిటిక్’. 1965లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలం దగ్గర రోడ్ బ్రిడ్జి ఓపెనింగ్‌కి వచ్చి, సభలో ఒక విషయాన్ని తప్పుగా చెప్పారని, ఆంధ్రప్రభ పత్రికలో నిర్భయంగా ప్రకటించారు. మరో సంఘటన –
అసెంబ్లీ సమావేశాల రిపోర్టింగుకి వెళ్లినప్పుడు అక్కడ అందరినీ తెల్లబట్టల్లో చూడగానే నాన్నగారికి ఒక సరదా ఆలోచన వచ్చింది. మరుసటి రోజు పత్రికలో ‘అదిగో ద్వారక, ఆలమందలవిగో..’ అంటూ వార్త రాశారు. అది చూసిన ఎంఎల్‌ఏలు స్పీకర్‌ని కలిసి, నాన్నను శిక్షించమన్నారు. అందుకు స్పీకర్ చిరునవ్వుతో, ‘సరసంగా తీసుకోవాలి’ అన్నారు. ఆయన అలా అనకుండా ఉంటే, సభాహక్కుల చట్టం కింద నాన్నకు శిక్ష పడేది.
అచ్చ తెలుగు పదాలు..
సాహిత్యం మీద మక్కువతో నాన్న జర్నలిస్టు, రచయిత రెండూ అయ్యారు. సాహిత్యాన్ని ఆరాధించి, జర్నలిస్టిక్ వేలో తన కంటే పూర్వీకుల గురించి, తన తరవాత వారి గురించి కూడా ఎన్నో రచనలు చేశారు. గతాన్ని, భాషను గుర్తు చేసే కొంటెతనం, ఋతువులు, కాలం, ఆత్మీయత అనుబంధం తెలుగుదనం ఉండాలనుకున్నారు. తెలుగుభాష వాడుక భాష స్థాయికి మారిపోయాక అచ్చతెలుగు పదాలు ఉపయోగిస్తే ఎవరికీ అర్థం కావట్లేదు అనేవారు నాన్న. సాహిత్య పరిజ్ఞానం కలగాలంటే టీకా తాత్పర్యాలు లేకుండా చదివి అర్థం చేసుకోవాలి అని మా తాతగారు అంటుండేవారు. అలా కుదరకపోతే పెద్దల చేత చెప్పించుకోవాలనేవారు. నాన్నగారు సీతారామయ్యగారి మనవరాలు చిత్రం కోసం రాసిన ‘కలికి చిలకల కొలికి’ పాటలో ‘అద్ద గోడలకి’ (వంట గదిలో వండిన పదార్థాలను మరుగున ఉంచటం కోసం ఉండే గోడ) అని చేసిన ప్రయోగం చాలామందికి తెలియలేదు.
ఆడవాళ్లే అభిమానులు..
నాన్నగారు మాస్ రైటరే కాదు, ఆడవారి మనసులలో ఉండిపోయే పాటలు రాసిన మనసు కవి కూడా. ఆయన సాహిత్యం తెలిసినవారు ఆయనను ఏమనుకుంటారో నేను వివరంగా చెప్పక్కర్లేదు. ఒక పాటను మగవారైతే విన్న వెంటనే, కనెక్ట్ అయ్యి, ఆ పాటను ప్రాచుర్యంలోకి తెస్తారు. ఆడవారు అభిమానించి, ఆదరిస్తారు. అందుకే ఇప్పటికీ చాలామంది ఆడవారు మా అమ్మగారిని కలిసినప్పుడో లేదా ఫోన్‌లోనో నాన్నగారి మీద వారికున్న అభిమానాన్ని చెబుతుంటారు. ఇప్పటి పదహారేళ్ల ఆడ పిల్ల దగ్గర నుంచి, 80 ఏళ్లు పైబడ్డ వారికి నాన్నగారి మీద ఉన్న అభిమానం, ప్రేమ ఇది.
తోబుట్టువుల నుంచే…
స్వయంగా సాహితీమూర్తులైన దర్శకులు బాపు, విశ్వనాథ్, జంధ్యాల, క్రాంతి కుమార్ వంటి వారి కోసం తన కలానికి పదును పెట్టారు. అందువల్ల వారికి మంచి పాటలు రాయగలిగారు. నాన్నగారికి తోబుట్టువులే ఇరవై మంది దాకా ఉన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా నాన్నగారి దగ్గర పంచుకునేవారు. అలా వారినందరినీ దగ్గరగా పరిశీలించి, వాళ్ల అనుభవాలను తెలుసుకోవటం వల్ల రకరకాల ప్రయోగాలు చేయగలిగారు.
తెలుగు పండుగలంటే ఇష్టం…
నాన్నకు ఉగాది వంటి తెలుగు పండుగలంటే చాలా ఇష్టం. అందుకే వీలైనంత వరకు పండుగల సమయంలో ఇంటి దగ్గరే ఉండేవారు. ఉదయమే స్టూడియోకి వెళ్లినా, పది గంటలకు ఇంటికి వచ్చేసేవారు. ముఖ్యంగా ఉగాది పండుగను తప్పనిసరిగా అందరం కలిసి చక్కగా చేసుకునేవాళ్లం. పండుగలకు సంబంధించిన కథలన్నీ చెప్పేవారు. మా పక్కనే కూర్చుని, అందరం సరిగా తిన్నామా లేదా అని చూసి, అప్పుడు బయటకు వెళ్లేవారు. నాన్నగారికి నచ్చిన పని.. తనకు నచ్చిన రచనలు, మనుషుల గురించి అందరికీ చెప్పడం. అలాగే తనకు నచ్చిన తినుబండారాలను అందరితో పంచుకోవటం. (వేటూరి జయంతి సందర్భంగా వ్యూస్ ఆయన పెద్ద కుమారుడితో నిర్వహించిన ముఖాముఖి ఇది)