“మోక్ష”మే రక్ష..!

0

(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)
నీటిని నిల్వ ఉంచే ఎన్నో ప్రాజెక్టులకు ఆయన మేధస్సుతో “మోక్షం”..
అలా భూమి అగ్ని”గుండం” కాకుండా చేయి అడ్డుపెట్టిన
ఆయన యశస్సు అక్షయం..
గంగను భువికి తెచ్చిన భగీరథుడు..
ఆ గంగనే నెత్తిన దాల్చిన విశ్వేశ్వరయ్య..
ఆ ఇద్దరూ ఒక్కరై..
అవ”తరించిన”
మన విశ్వేశ్వరయ్య..!
జీవిత పర్యంతం
జలమే బలమై
ఆ జలమే జీవమై..
జలానికి తానే జవమై..
సాగిన మోక్షగుండం జైత్రయాత్ర
ఇంజనీరుగా..విద్యావేత్తగా
ఆయన బహుపాత్ర..
బహుమతిగా భారతరత్న!
ఎక్కడ పుట్టి
ఎక్కడికి చేరిన ప్రస్థానం..
పేదరికం నుంచి
మైసూరు రాచరికం వరకు
చేర్చిన మేథోత్ధానం…
గమ్యం తెలియక..
సౌమ్యం ఎరుగక
పరుగులు తీసే ప్రవాహాలకు
నడకలు నేర్పి..
మలుపులు తిప్పిన శిల్పి..
ఆధునిక భారత
ప్రాజెక్టుల రూపశిల్పి..!


విద్యాభ్యాసం నాడు
ఆ మస్తిష్కంలో నాటుకున్న
ప్రతి అక్షరం జలాక్షరం..
పారే నదుల పరవళ్ళే
ఆయన భాష..
ఉరికే జలపాతాల ఉరవళ్ళే
ఆయన గుండె ఘోష..
ఆ భాషకు అర్థం తెలిసి
ఆ ఉరుకుల..పరుగుల
పరమార్థం ఎరిగి..


జలమే పుడమి వేలుపై
మానవాళి మేలుకొలుపై
నిలిచేలా మలచిన రుషి..
ఈ గడ్డపై పుట్టిన మహామనీషి!
మాన్యుడై..ధన్యుడై..
భరతభూమిపై కదలాడే..
కృతజ్ఞతగా ఆయన జయంతి
ఇంజనీర్స్ డే..!
మోక్షగుండం జయంతి సందర్భంగా ప్రణామాలు..
(క‌విత ర‌చ‌న విజ‌య‌న‌గ‌రానికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here