Friday, June 9, 2023
Homeటాప్ స్టోరీస్శిక్షణ లేకనే తప్పిదాలు

శిక్షణ లేకనే తప్పిదాలు

టి.ఎస్.పి.ఎస్.సి. ప్రశ్న పత్రం నేర్పుతున్న పాఠాలు
(వనం జ్వాలా నరసింహారావు)
అంచనా వేయలేని విధంగా ఇటీవలి కాలంలో జరిగిన ప్రశ్న పత్రం లీక్ కొందరు రాజకీయ నాయకులకు కోతికి కొబ్బరికాయ దొరికినట్లయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి. ఎస్. పి. ఎస్. సి.) లోనే ఇద్దరు ఉద్యోగులు చేసిన తప్పు లేదా తుంటరి పని వారికి ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఆఫీస్ కంప్యూటర్లలో తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోని కారణంగా ప్రశ్న పత్రం బహిర్గతం కావడానికి ప్రధాన కారణమై ఉండవచ్చు. విశ్వసనీయ సమాచారాన్ని నిల్వ ఉంచే కంప్యూటర్లలో మరిన్నీ గట్టి చర్యలు తీసుకోవడం అవసరం. ఏమైనప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పరిశోధన బృందం (ఎస్. ఐ. టి.) ఇద్దరు నిందితులను అదుపులో తీసుకుని విచారణ ప్రారంభించింది. ఇదే సమయంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసినట్టు టి. ఎస్. పి. ఎస్. సి. ప్రకటించింది. కిందటి ఏడాది అక్టోబర్ పదహారున ఈ పరీక్షను నిర్వహించింది. కమిషన్ శాఖాపరంగా నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా ఇచ్చిన నివేదికతో ఈ చర్య తీసుకుందని మీడియా కూడా తెలియజేసింది. అరెస్టు చేసిన వారిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు హాజరై 100 కు పైగా మార్కులను సాధించారు. వీరందరినీ తదుపరి విచారణ కోసం సిట్ అదుపులోకి తీసుకుంది.
ప్రధానంగా ఇద్దరు ఉద్యోగుల తీరు లీకేజీకి కారణమైంది. ఇదే సంస్థలో పనిచేస్తున్న మరి కొందరు ఉద్యోగులకు పర్యవేక్షణ, రక్షణ విభాగాలలో సరైన అవగాహన, నైపుణ్యం, వైఖరి లోపించడం దీనికి దారితీసింది. ప్రారంభ దశలోనే ఇలాంటి ఉద్యోగులకు శిక్షణ అవసరాన్ని ఈ సంఘటన తెలియచెబుతోంది. కీలక సమయాల్లో ఎలా వ్యవహరించాలో తెలియజేసే రీతిలో ఈ శిక్షణ ఉండాలి. కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. తప్పులు జరగకుండా…పొరపాట్లు చోటు చేసుకోకుండా ఇది సహకరిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి కీలకమైన విభాగాలలో అవగాహన, నైపుణ్యం, వైఖరి అంశాలలో మెరుగుపడేందుకు ఇది ఉపకరిస్తుంది. దృష్టిని మరింత విస్తృతపరిచేందుకు వీలవుతుంది. వైఖరి, సూక్ష్మగ్రాహ్యత, సున్నితత్వం (సెన్సిటివిటీ అండ్ సెన్సిటైజేషన్… ఎస్ అండ్ ఎస్) తదితర విశేష అంశాలను మెరుగుపరుస్తుంది. సెన్సిటైజేషన్ ఉద్యోగులను ఉత్తేజపరుస్తుంది. సున్నితత్వం ఉద్యోగులలో సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో టి. ఎస్. పి. ఎస్. సి. ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక తరహాను అనుసరించాల్సిన అంశాన్ని లీకేజీ ఉదంతం తెలియజెబుతోంది. సందర్భోచితంగాను, అవసరాన్ని బట్టి వ్యవహరించడంలో శిక్షణ కచ్చితంగా కీలక పాత్రను పోషిస్తుందనడంలో సందేహం లేదు.
లీకేజ్ ఉదంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని లబ్ది పొందేందుకు ప్రభుత్వాన్ని, ఐ. టి. మంత్రిని లక్ష్యంగా చేసుకుని, బురద జల్లుడు కార్యక్రమం ప్రారంభమైంది. లీకేజీకి బాధ్యత వారిదేనని అంటూ విమర్శల పర్వం మొదలైంది. అధికారికంగా సమాచారాన్ని గాని కచ్చితత్వాన్ని గాని పట్టించుకోకుండా విమర్శలకు దిగడం ప్రజాస్వామ్యంలో సమంజసం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెరెమీ బెంథం చెప్పినట్టు పెద్ద సంఖ్యలో ప్రజానీకానికి, సుదీర్ఘ కాలానికి పనికొచ్చే అతి పెద్ద మంచి పని చేయాలనే సూక్తిని ఈ తరుణంలో గుర్తు చేసుకోవాలి. కారణం లీకేజీ ఉదంతంలో ఇమిడి ఉన్న సున్నితత్వం, మృదుత్వాలే అనేది నిర్వివాదాంశం. యువతలో విశ్వాసాన్ని పాదుగొల్పడానికి వీలుగా టి.ఎస్.పి.ఎస్.సి.లోని లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొందరి కారణంగా ఇబ్బంది పడ్డ వ్యక్తులకు మేలు ఎలా చేకూర్చాలో కూడా ఆలోచిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అనైతికం. ఇది మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం కాదు. ఇది నిస్సిగ్గుగా దూషించడం కిందకు వస్తుంది. ఈ అంశంపై మేధావులు తమ గళాలను వినిపించాలి.
బి.ఆర్.ఎస్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యద్భుత సేవ చేస్తున్న టి.ఎస్.పి.ఎస్.సి. మీద ప్రస్తుతం వస్తున్న విమర్శలు సహేతుకం కాదు. కొందరు రాజకీయ నాయకులు ప్రయోజనం కోసం ఎటువంటి కారణం లేకుండానే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సంస్థ డిసెంబర్ 18, 2014 న ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నేతృత్వంలో ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో చక్రపాణి ముందువరుసలో నిలిచారు. సంస్థ ఏర్పాటైన ఏడాదిలో చక్రపాణి నాయకత్వంలో టి.ఎస్.పి.ఎస్.సి. దేశంలోనే అత్యున్నతమైన సంస్థగా గుర్తింపు పొందింది. చక్రపాణి స్థానంలో ఇప్పుడు డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి నియమితులయ్యారు. ప్రశ్నించలేని నిజాయితీకి, అంకిత భావానికి, సమర్ధతకూ ఇద్దరూ మారు పేరు. చక్రపాణి నేతృత్వంలో సంస్థ సాధించిన విజయాలను పక్కన పెట్టి, ఇద్దరు వ్యక్తులు చేసిన పొరపాటుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా నిందిస్తున్నారు. భవిత పట్ల యువతలో అపోహలు పెంచుతున్నారు.

Professor Ghanta Chakrapani, former Chairma TSPSC


ఈ క్రమంలో టి.ఎస్.పి.ఎస్.సి. యోగ్యత గురించి కొంచెం చెప్పుకుందాం. ఏర్పడిన రెండేళ్లకు అంటే జనవరి 2016 లో ఆల్ -ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్మెన్ కాన్ఫరెన్స్ కు టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ అధ్యక్షత వహించారు. ఇదే అరుదైన గౌరవం. టి.ఎస్.పి.ఎస్.సి. కి సంబంధించి సాంకేతిక పరమైన చొరవ, సృజనాత్మక కార్యకలాపాలను ఇందులో వివరించారు. ఇది అనేక కమిషన్లను ఆకర్షించింది. పన్నెండు కమిషన్లు తెలంగాణ కమిషన్ విధానాలను అనుసరించడం మొదలుపెట్టాయి. మారిషస్ నుంచి వచ్చిన ఒక కమిటీని టి.ఎస్.పి.ఎస్.సి. నుంచి సలహాలు తీసుకోవాలని యు.పి.ఎస్.సి. సూచించడం మన కమిషన్ ఎంత ఎత్తుకు ఎదిగిందో చెప్పకనే చెబుతోంది.
రోజువారీ పనులు మనకు అధ్యయనం చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ క్రమంలో మనకు నైపుణ్యం, విజ్ఞానం లేదా సమర్ధత చేకూరడం సహజం. ఇవి మనకు అనేక పనులలో ఉపకరిస్తాయి. ఒక ఉద్యోగి విషయంలో విధి నిర్వహణ ఒక క్రమ పద్దతిలో ఉండాలి. ఇది సమకూరడానికి సిస్టమాటిక్ అప్రోచ్ తో ట్రైనింగ్ అవసరం. జాతీయ శిక్షణ విధానాలపై తీసుకుంటున్న చొరవకు తోడు శిక్షణ తీరు ఇప్పటికీ ప్రాధాన్యతను సంతరించుకుంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగి ఏం నేర్చుకోవాలనే అంశాన్ని గుర్తించే బాధ్యులు ఎవరు? వారి పని తీరును మెరుగుపరుచుకోవడం లేదా మార్పులకు అనుగుణంగా మారడం కూడా అవసరమే కదా? క్షణక్షణానికి మారుతున్న ప్రపంచంలో ఏ అంశమైనా అతి కొద్ది కాలానికే పరిమితం… తాత్కాలికం. దీనికి మనం సమాధానం కనుగొనాలి. క్రమపద్ధతిలో నేర్చుకోవడం లేదా శిక్షణ పొందడం ప్రతి ఉద్యోగికీ తప్పనిసరి. ప్రతి ఏటా కనీసం కొన్ని గంటలపాటు ఉద్యోగులకు తప్పనిసరిగా శిక్షణ ఇచ్చి తీరాలి. ఉద్యోగంలో చేరిన మొదటి క్షణం నుంచి దీనిని అమలు చేయాలి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఫాస్ట్ ట్రాక్ట్ శిక్షణను తప్పని సరి చేయాలి. శిక్షణ లేని ఉద్యోగులకు కీలకమైన స్థానాలలో ఉద్యోగాన్ని తిరస్కరించాలి. సంస్థలో సి ఇ ఓ లేదా డిపార్ట్మెంట్ అధిపతి నుంచి కొత్తగా నియమితుడైన జూనియర్ ఉద్యోగి కూడా నిరంతర అధ్యయన శీలిగా మారాలి. ఉద్యోగం అంటే అధ్యయన కేంద్రం కావాలి. అధ్యయనం నిరంతర ప్రక్రియ కావాలి. ఈ అధ్యయనం వారు చేసే ఉద్యోగానికి సంబంధించినదే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఈ అధ్యయనం ఉద్యోగంలో నిర్వహణ ప్రభావాన్ని పెంచుతుందనేది నిర్వివాదాంశం. శిక్షణ ఒక ప్రయోజనం కోసం ఉద్దేశించింది. ఒక ఉద్యోగిని విధులపై వేగంగా అవగాహన పెంచుకునేలా చేస్తుంది. శిక్షణ సమయంలో ప్రభావవంతమైన పరిస్థితులను కల్పిస్తారు. ఒక పనిని అప్పగించి ఎలా చేయాలో చూపించడం జరగాలి.
అధ్యయనం విజయానికి కీలకమైన అంశం. ప్రభుత్వ ప్రాధాన్యతలు అర్థం చేసుకోవడానికీ, పాలసీలు, పథకాలు, కార్యక్రమాలతో పాటు ప్రజలకు చేసిన వాగ్దానాలు, నిష్పక్షపాతంగా అమలు చేయడం వంటివి అధ్యయనంలో తెలుస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందన ఈ మూడు మంచి పాలనకు ముఖ్యమైన సూత్రాలు. అమలులో వేగం ఎంత ప్రధానమో ఖచ్చితత్వం మరింత ముఖ్యం. ఎటువంటి తప్పులకు, పొరపాట్లకు తావివ్వకుండా పాలన సాగాలంటే ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణ అత్యవసరం. సహజ అధ్యయన ప్రక్రియలపై ప్రభుత్వ విభాగాలు ఆధారపడితే విజయం అసాధ్యం. కారణం అటువంటి అధ్యయనానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే కాకుండా తప్పులకు కూడా తావిస్తుంది.
ఒక పని లేదా పనులలో నాణ్యతను పెంచడానికి శిక్షణ ఒక క్రమ పద్ధతిలో సాగడం అవసరం. అది ఒక ప్రణాళికయుతంగా సాగాల్సిన ప్రక్రియ. ఉద్యోగి వైఖరి, జ్ఞానం, నిపుణత పెరగడానికి అధ్యయనం దోహదం చేస్తుంది. సంస్థ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగి సామర్థ్యాలను పెంచడానికి శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయి.
శిక్షణ లేని ఉద్యోగులు తమకు కేటాయించిన పనిని సమర్థంగా చేయలేరు. టి.ఎస్.పి.ఎస్.సి. ఉదంతం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. పనిలో తప్పులు చేయడం ఫిర్యాదులకు కారణం అవుతుంది. ఒక సారి తప్పు జరిగితే దానిని వెనక్కి తీసుకోవడం లేదా సరి చేసుకోవడం చాలా కష్టం. వ్యక్తుల్ని, పని చేసే సమూహాలని శిక్షణ బహు ముఖ ప్రతిభ కల వారీగా తీర్చిదిద్దుతుంది. పనిలో సరళత కనిపిస్తుంది. పని విధానంలో అత్యున్నత ప్రమాణాలను సాధించేలా ఉపయోగిస్తుంది. కొన్ని సంస్థలు శిక్షణను విశ్వాస చర్యగా భావిస్తాయి. న్యాయ ఔచిత్యం లేకుండానే ఇవి ఉంటాయి. పెట్టుబడికి తగ్గట్టుగా ఖర్చు, ప్రయోజనాలను మాత్రమే అవి చూస్తాయి. ప్రస్తుతం అలాంటి సంస్థల సమాఖ్య తగ్గింది. అంటే అవి కూడా శిక్షణ ప్రాధాన్యాన్ని గుర్తించాయి.
కానీ తప్పించుకోలేని పరిస్థితులలో మార్పునకు అనుగుణంగా పని చేయాలంటే వ్యవస్థీకృతమైన శిక్షణ ద్వారానే సాధ్యం. కొత్త పథకాలు ప్రవేశపెట్టడమే దీనివల్ల వచ్చిన మార్పునకు ఫలితం. కొత్త విధానాలు, నూతన ఆచరణలు, కొత్త సాంకేతికత కూడా వీటివల్లనే సాధ్యం. ప్రజలలో పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగానూ, సాధారణ అభివృద్ధి పరంగానూ కూడా సత్ఫలితాలను ఇస్తుంది. సరైన శిక్షణ లేకపోతే అది నిర్వహణ పరమైన లోపాలకు దారి తీస్తుంది. పనిచేసే చోట వ్యక్తులు ప్రదర్శించే ప్రవర్తన సంబంధిత లోపాలు కూడా ఇందుకు కారణమవుతుంటాయి. సిస్టమాటిక్ ట్రైనింగ్ ఫంక్షన్ ప్రస్తుత తరుణంలో అత్యవసరంగా మారింది. దీని వల్ల నిర్వహణపరంగా సమస్యలను అధిగమించి, పాలన సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాము. టి.ఎస్.పి.ఎస్.సి. పేపర్ లీకేజ్ ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకుని చెబుతున్న సత్యమిది. టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ ఘంటా చక్రపాణి స్వయంగా కమిషన్ సభ్యులకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో శిక్షణ ఇచ్చారు. యు.పి.ఎస్.సి. స్థాయిలో ఆయన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ట్రైనింగ్ ఫంక్షన్ బృందానికి నేతృత్వం వహించడానికి ఘంటా చక్రపాణి సమర్ధుడైన వ్యక్తి. చక్రపాణిని నియమిస్తే భవిష్యత్తులో పాలన పరమైన లోపాలు, ఉద్యోగుల తీరులో ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టగలడు అనడంలో సందేహం లేదు. (The writer is CPRO to CM Telangana and former Senior Faculty and Additional Director, Dr MCR HRD IT, the Premier Administrative Training Institute of Government of Telangana).

Jwala Narasimharao Vanam
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ