హుజురాబాద్‌లో నెగ్గేసిన కేసీఆర్‌!

0

మాట‌ల మంత్రంతో ఆక‌ట్టుకుంటున్న సీఎం
మాట‌ను ప‌దును వాడుతూ జ‌నం గుండెల్లోకి
తాజా ప‌థ‌కంతో ద‌ళిత కార్డు ప్ర‌యోగం
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సంక్షేమ పథకాలా?
రాజ‌కీయ బేహారుల వేదిక హుజురాబాద్‌
(బండారు రామ్మోహనరావు, 98660 74027)

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గo చుట్టే తిరుగుతున్నాయి. ఉప ఎన్నిక కోసం ఇప్పటి నుండే అనేక కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. అందులో “తెలంగాణ దళిత బంధు” పథకం రాజకీయ విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. మరోవంక ఆపరేషన్ ఆకర్ష్ స‌రేస‌రి. హుజూరాబాద్ నియోజకవర్గంలో కార్య‌క‌ర్త‌ల‌కు గాలం వేస్తున్నారు. ఇందులో టిఆర్ఎస్‌ సహా ప్రతిపక్ష పార్టీలకు మిన‌హాయింపు లేదు. లక్ష నుంచి 10 లక్షల రూపాయల దాకా వారి స్థాయిని బట్టి రాజకీయ కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రేటు ముట్ట చెబుతున్నారు. ఎవ‌రు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియ‌ని స్థితి నెల‌కొంది. రాజకీయ బేహారులకు హుజురాబాద్ వేదికగా మారింది.
అనుభవానికి వస్తే తప్ప బోధ‌ప‌డ‌ని తత్వం
గత రెండేళ్లలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల లో పరాభవాలు, విజయాల అనుభవంతో కేసీఆర్‌కి తత్వం బోధపడింది. అందుకే ప్రస్తుతం ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా రాజకీయ పావులు కదపడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ న‌డుం బిగించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో మొదటి నల్లగొండ జిల్లా లోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన కిక్‌తో కెసిఆర్ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికను ఈజీగా తీసుకున్నారు. తాను, తన కొడుకు, అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ప‌రిథిలో ఉన్న దుబ్బాక నియోజకవర్గం తనను కాదని ఎటు పోతుందిలే అని ప్రచారానికి పోలేదు. అనూహ్యంగా అక్క‌డ ప‌రాభ‌వం ఎదురైంది. దుబ్బాకతో గుణపాఠం నేర్చుకున్న కేసీఆర్ ఆ తర్వాత వచ్చిన జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలతో మరింత కంగుతిన్నారు. ఆ తర్వాత తెలంగాణలో సుమారు మూడు వంతుల జనాభా ఉన్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను స‌వాలుగా తీసుకుని రాజకీయ వ్యూహాలను అమలు చేసి రెండు ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి మొదట టిఆర్ఎస్‌కి గట్టి అభ్యర్థి లేని పరిస్థితి. అనూహ్యంగా పీవీ నరసింహారావు కుమార్తె వాణి దేవిని టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ముందుకు తీసుకువచ్చి ముల్లును ముల్లుతోనే తీసినట్లు బిజెపి సమీప ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామచంద్రరావును ఓడించారు. ఇక నల్లగొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ సీటు చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు చివరి వరకు ఉత్కంఠ రేపిన చివరికి రెండవ మూడవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే తప్ప టిఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వరరెడ్డి గెలుపు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ను కెసిఆర్ పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ ఉద్దండ సీనియర్ నాయకుడు జానారెడ్డిని ఓడించడానికి తనకు తెలిసిన టక్కుటమార విద్యలన్ని ఉపయోగించారు. కొత్త వాడే ఆయన యువ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించుకున్నారు. నోముల న‌ర‌సింహ‌య్య సెంటిమెంట్ కూడా ఇక్క‌డ ప‌నిచేసింది.


పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే… చిన్నపామైనా పెద్ద కర్ర
సమీప భవిష్యత్తులో మళ్లీ ఉప ఎన్నిక రాదనుకుంటే ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ నేపథ్యంలో చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత కెసిఆర్ పాటిస్తున్నాడు. కొందరు దీన్ని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటున్నారు. కేసీఆర్‌కు తెలుసు ఈటల రాజేందర్‌ను ఓడించాలంటే “టక్కు టమార విద్యల” తో ఇతర ఎత్తుగడలు కూడా వేయాలని అనుకున్నారు. ఈటల రాజేందర్ బిసి కులాలను ల‌క్ష్యంగా చేసుకుంటే… దానికి ప్రతి వ్యూహంగా తాను కూడా బీసీ కుల నాయకులను కలుపుకుని పోతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మిగిలిన దళిత నాయకులను ఓటర్లను సొంతం చేసుకోవాలంటే కొత్తగా దళిత రాగం అందుకని దళిత సమాజాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రైతు బంధు పథకాన్ని ప్రకటించారు. అది హుజురాబాద్ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు అధికార ప్రజాప్రతినిధులు అందరూ హుజురాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటికే మోహరించారు. దళిత పథకాన్ని అమలుకు అధికార యంత్రాంగం మొత్తాన్ని నియోజకవర్గానికి పంపించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి నలుగురు చొప్పున దళిత ప్రతినిధులను తన ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడడానికి పూర్తి రంగం సిద్ధమైంది. జూలై 26 సోమవారం నియోజకవర్గం నుంచి 412 మంది గ్రామాల నుంచి వచ్చే దళిత ప్రతినిధుల తో పాటు మరొక 15 మంది ముఖ్యులను కలిపి 427 మంది దళిత ప్రతినిధులతో పూర్తిస్థాయి ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రమ్మని పిలిచి కెసిఆర్ స్వయంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభావం చూపించగల దళిత యువకులకు తానే స్వయంగా ఫోన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే తనుగుల గ్రామంలోని రామస్వామి అనే దళిత నాయకుడికి తానే స్వయంగా ఫోన్ చేసి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పారు. దానికి దళిత బంధు పథకం రంగు పూసి ఎన్నిక నేపథ్యాన్ని దళిత బంధుతో మిళితం చేసి మాట్లాడారు. మాటల మాంత్రికుడు అయిన కెసిఆర్‌కు ఇది వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి దాకా హుజూరాబాద్ నియోజకవర్గం లో రెండవ స్థాయి మూడవ స్థాయి టీఆర్ఎస్ నాయకులకు పదవులు దక్కలేదు. ఇవాళ ఈటల రాజేందర్ తప్పుకోవడంతో వారందరికీ పండుగ లాగా మారిపోయింది. నియోజకవర్గంలోని బండ శ్రీనివాస్ కి రాష్ట్రస్థాయి ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇవ్వడం ఇందులో భాగంగానే చెప్పవచ్చు. హుజురాబాద్ నుండి గ్రామ స్థాయి రాజకీయ కార్యకర్తకు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రగతి భవన్ గేట్లు బార్లా తెరుచుకున్నాయి.
ఋణ శేషం, శత్రుశేషం ఉంచుకోని కేసీఆర్‌
అధికార పార్టీలో గత 20 ఏళ్లుగా ఉంది ఎమ్మెల్యేతోపాటు మంత్రిగా పదవులు అనుభవించిన ఈటల రాజేందర్ పార్టీ విధానాలను విమర్శిస్తూ బయటకు వెళ్లారు. ఆయనకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున పావులు పావులు కదప వలసిన అవసరం ఉందా అని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. శత్రు శేషం రుణ శేషం ఉంచుకోవద్దు అనుకుంటున్న కేసీఆర్ ముందు ప్రధానంగా ఈటల ఓటమి అనే లక్ష్యం ఉంది.


కొనసాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్
హుజురాబాద్ ఎన్నికల లో భాగంగానే దళిత బంధు తో సహా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఆ జిల్లాకు చెందిన టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణను పార్టీలో చేర్చుకున్నారు. గత రెండు ద‌ఫాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప ప్రత్యర్థి గా 60 వేలకు పైగా ఓట్లు సంపాదించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాశ్యప్ రెడ్డిని కూడా టిఆర్ఎస్‌లో చేర్చుకోవడంతో అక్కడ ఈటల రాజేందర్‌ను ఒంటరి చేద్దామని ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. ఇంకా టిఆర్ఎస్ పార్టీ లోకి మారే వరసలో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు కూడా ఉన్నారు.

బిజెపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఇనుగాల పెద్దిరెడ్డి కూడా ఈ వరసలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాకుండా ఇటీవల ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజీనామా సమర్పించిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సహా మరొక డి.ఎస్.పి కూడా టిఆర్ఎస్ హైదరాబాద్ టికెట్ కోసం వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. దళిత బంధు పథకం ప్రకటనకు ముందు మొదటి సమావేశం జగతి ప్రతిపక్షాలు ఆహ్వానించిన కేసీఆర్ కొన్ని ప్రతిపక్షాలు ఆ సమావేశాన్ని బహిష్కరించడంతో వారికి వారే బౌన్స్ అయ్యేలా చేశారు. అందులో మొదటి డిపి తర్వాత బిజెపిలో ప్రముఖ నాయకుడిగా కొనసాగి గవర్నర్ పదవి ఆశించిన ప్రముఖ దళిత నాయకుడు మోత్కుపల్లి నరసింహులును కేసీఆర్ తన వలలో వేసుకున్నారు. దళిత బంధు పథకం కోసం బిజెపి పార్టీకి రాజీనామా చేసిన నరసింహులు టిఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇలా ఒక్కొక్కరిని ఈటల రాజేందర్ కి వ్యతిరేకంగా కేసీఆర్ తనదైన శైలిలో మోహరిస్తున్నారు.


హుజురాబాద్‌కే ఎందుకు ప‌థ‌కం ప‌రిమితం?
దళిత బంధు పథకం రాజకీయ సుడిగుండంలో ఎదుర్కొని విమర్శల పాలు అవుతుంది. దళిత బంధు పథకం మంచిదే. కానీ ప్రస్తుత ఈ సమయంలో ప్రకటించడానికి ప్రధానమైన కారణం హుజురాబాద్ ఉప ఎన్నిక అనేది అందరికీ తెలిసిన రహస్యమే. ఇక రెండవ అంశం పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ ఎందుకు ఎంపిక చేశారు. రాష్ట్రం మొత్తానికి 1200 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయించి ఈ పథకం కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే మొత్తం కవర్ చేయడానికి 1500 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించారనేది రాజకీయ విమర్శ. సహజంగానే దీనిని కేసీఆర్ మొండిగా ఎదుర్కొన్నారు. తప్పేంటి” అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజంగా హుజురాబాదు ఎన్నిక గురించి భయపడకపోతే తెలంగాణ దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ఉన్న 33 జిల్లాలలో జిల్లాకు ఒక్క నియోజక వర్గం ఎంపిక చేసి ఆ పథకాన్ని అమలు చేస్తే బాగుండేది. కానీ సీతయ్య కెసిఆర్ ఎవరు చెప్పినా వినరు కదా! ఈ విమర్శలను ఆయన అయితే తప్పేంటి అన్న ఒక్క మాటతో అడ్డంగా కొట్టి వేస్తున్నారు. సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా కొత్త సంక్షేమ పథకాల ప్రకటన సర్వసాధారణంగా జరిగేదే. ఉప ఎన్నికల సందర్భంగా కొత్త సంక్షేమ పథకాల ప్రకటన అనేది కేసీఆర్ రాజ్యం నుండే మొదలైంది.50 వేల ఉద్యోగాల కల్పన అనే ఎండమావిని గత రెండేళ్లుగా కెసిఆర్ తెలంగాణ సమాజానికి చూపిస్తున్నారు. అదిగో నియామకాలు ఇదిగో నియామకాలు అంటూ రెండేళ్లుగా తెలంగాణ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఇక కొత్తగా ప్రస్తుతం 57 సంవత్సరాల పెన్షన్ పథకాన్ని వచ్చేనెల నుంచి ప్రారంభిస్తామన్నారు. దాని కోసం సుమారు ఐదు లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా ఎంపిక అవుతారు అని అంటున్నారు.

అదీకాక ప్రజా పంపిణీ వ్యవస్థలో మరొక ఐదు లక్షల కొత్త తెల్ల రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకాలు అన్ని హుజురాబాద్ ఎన్నికలలోపే అమలు కావాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. ఎన్నికల కోసం ఇలా సంక్షేమ పథకాలు ప్రకటిస్తే మరి మౌలిక సమస్యల పరిష్కారం అభివృద్ధి సంగతి ఏమిటి అని తెలంగాణ సమాజం కేసీఆర్ ను ప్రశ్నిస్తుంది. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో సంక్షోభం ఎదుర్కొంటున్న విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకుండా దళితులు నిమ్న వర్గాల పేరుమీద అనుచిత ఉచితాల పందేరం చేస్తూ పన్నులు కట్టే ప్రజల డబ్బును తమ ఇష్టం వచ్చినట్లు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారనే విమర్శలు కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నట్లు “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు” అనుకుంటూ తెలుగు లిటరేచర్ లో ఘనాపాటి అయిన కెసిఆర్ తన రాజకీయ ప్రయోజనాల ముందు శాశ్వత పరిష్కారాలు పనికిరావని తేటతెల్లం చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోతుందో చూడాలి. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు)

Bandaru Ramamohanarao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here