Friday, September 22, 2023
HomeArchieveద‌ళితుల అభివృద్ధికే ద‌ళిత బంధు

ద‌ళితుల అభివృద్ధికే ద‌ళిత బంధు

సామాజిక పెట్టుబ‌డిగా ప‌థ‌కం
వేస‌విలో ధాన్యం సేక‌ర‌ణ(rice procurement) కేంద్రాలుండ‌వు
నూత‌న జోన‌ల్ విధానం ప్ర‌కార‌మే ఉద్యోగ‌లు విభ‌జ‌న‌
అధికారులు, మంత్రుల స‌మావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్ప‌ష్టీక‌ర‌ణ
హైద‌రాబాద్‌, డిసెంబ‌ర్ 18: తర తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నూరుశాతం సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పది లక్షల రూపాయల ద్వారా దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో కీలకపాత్ర వహించి, దళిత బంధు’ సామాజిక పెట్టుబడిగా మారుతుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.


కిలో వ‌డ్లు కొనే ప‌రిస్థితులు లేవు
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినేలా నిర్థాక్షిణ్యంగా వ్యవహరిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనే పరిస్థితులు లేవని, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోవడం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఇది బాధ కలిగించే అంశమే అయినా కేంద్రం మొండి వైఖరివల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
28నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు మొత్తం జ‌మ‌
యాసంగి కోసం రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని డిసెంబర్ 28వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు సీఎం కేసిఆర్ తెలిపారు. ప్రారంభించిన వారం పది రోజుల్లో గతంలో మాదిరిగానే, వరుస క్రమంలో అందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
స్థానిక ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన జోనల్ విధానం నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగులైన భార్యాభర్తలకు ఒకేచోట పనిచేసే అవకాశాలు కల్పించాలని సిఎం కెసిఆర్ సూచించారు.


ఒమిక్రాన్ ‘ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని తగు జాగ్రత్తలు పాటించాలని సిఎం కెసిఆర్ ప్రజలను సిఎం కోరారు.

క‌లెక్ట‌ర్ల‌తో విస్తృత స‌మావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం
శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో దళిత బంధు అమలు పురోగతి తీరుతెన్నులు రాష్ట్రవ్యాప్తంగా అమలుకోసం చేపట్టవలసిన చర్యలు ., యాసంగి వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ., ఉద్యోగుల జోనల్ పంపిణీ, రైతుబంధు నిధులు విడుదల., కరోనా పరిస్థితి ఒమిక్రాన్ వ్యాప్తి అంశాలపై విస్తృతస్థాయిలో సమీక్షించారు.
ఈ ఉన్నతస్థాయి కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రులు, అందుబాటులో వున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా సిఎంవో అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వారిలో… మంత్రులు కొప్పుల ఈశ్వర్, కె.తారక రామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, సీహెచ్.మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు.
ఎంపీ బీ.బీ.పాటిల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియా నాయక్, రేఖా నాయక్, షిండే, కోరుకంటి చందర్, బాల్క సుమన్, జాజుల సురేందర్, సుంకె రవిశంకర్ తదితరులున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్ లు పాల్గొన్నారు.
వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డి. అశోక్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ ఎ ఏం రిజ్వీ, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్స్ ఐజీ శేషాద్రి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎస్సీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గంగాధర్, శ్రీనివాసరావు, రమేశ్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
రైతాంగాన్ని కాపాడుకునే బాధ్య‌త క‌లెక్ట‌ర్లు, అధికారుల‌దే
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత కలెక్టర్లకు, అధికారులకు ఉన్నదని స్పష్టం చేశారు. అందులో భాగంగా… రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాసంగి వడ్లను కొనడం లేదనే విషయాన్ని రైతులకు అర్థం చేయించాలన్నారు. యాసంగిలో వరి నాటుకు బదులు ప్రత్యామ్న్యాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని కలెక్టర్లను వ్యవసాయ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆహార భధ్రత కల్పించడం కోసం రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన ఎఫ్ సి ఐ, ఉప్పుడు బియ్యం పేరుతో తెలంగాణ యాసంగి వరి ధాన్యం కొనుగోలును నిలిపివేయడం శోచనీయమన్నారు. భారత ఆహార సంస్థ నిర్లక్ష్యం కారణంగా బియ్యం గోదాముల్లో మగ్గిపోతున్న బియ్యం నిల్వలు పేరుకుపోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెల్లాలని సిఎం అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ అనుకూల విధానాలు కొనసాగిస్తాం :
తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టంచేసే దిశగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీటి వనరులను మెరుగు పరుచుకున్నామని, ఇరవైనాలుగు గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు’ పథకంతో పంట పెట్టుబడి సాయాన్ని, బీమా తో రైతులకు భరోసాను కల్పిస్తున్నామన్ని సిఎం కెసిఆర్ వివరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలను ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయండి :
రాబోయే వానాకాలం పంటల సాగు కోసం ఏ ఏ పంటలు వేయాలో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి అధికారులకు సిఎం ఆదేశించారు. వానాకాలంలో ప్రధానంగా మూడు పంటలపై దృష్టిసారించాలన్నారు. పత్తి, కంది, వరి సాగు పై దృష్టి సారించేలా చూడాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగాన్ని ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగుదిశగా సమాయత్తం చేయాలన్నారు.
సామాజిక పెట్టుబడిగా.. దళితబంధు సాయం :
తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళితబంధు పథకం’ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహద పడుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం తో పాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు జిల్లాల నుంచి నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును ముందుగా ప్రకటించిన విధంగానే సంతృప్త స్థాయిలో అమలు చేస్తామన్నారు. నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో వంది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేసే కార్యాచరణను ప్రారంభించాలని కలెక్టర్లను అధికారులను సిఎం కెసిఆర్ అదేశించారు. ఇందుకుగాను స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలన్నారు.
దళితబంధు అమలులో పాల్గొని, దళిత సమాజం దు:ఖాన్ని ఆర్తి ని తెలుసుకోండి :
మీ జీవితంలో అత్యున్నత కార్యాచరణగా మిగిలిపోతుంది – కలెక్టర్లకు సిఎం కెసిఆర్ ఉద్భోధ :
దశాబ్దాల గత పాలకుల చేదు అనుభవాలతో, తాము ఎప్పుడూ మోసగించబడుతూనే ఉంటామనే దుఃఖం దళిత వాడల్లో నెలకొని ఉన్నదని, వారి ఆర్తిని అర్థం చేసుకొని దళితులకు భరోసా కల్పించే దిశగా పనిచేయాల్సిన అవసరం వుందని కలెక్టర్లకు సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ” మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ లేని తృప్తి.. దళితబంధు పథకం అమలులో పాల్గొనడంలో దొరుకుతుంది” అని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఉద్భోదించారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను, ప్రభుత్వ ప్రయివేట్ రంగాల్లోని అన్ని రకాల వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని తెలిపారు. ఈ క్రమంలో దళిత సమాజం అభ్యున్నతి కోసం పాటుపడుతున్న దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ధి కాముకుల సలహాలు సూచనలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు.
నూతన జోనల్ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన :
నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. నూతన జోనల్ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతోపాటు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాలన, అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు. వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాలన్నారు.
భార్యాభర్తలైన ఉద్యోగులు (స్పౌస్ కేస్) వోకే చోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
‘ఒమిక్రాన్’ గురించి ఆందోళన వద్దు :
‘ఒమిక్రాన్’ వ్యాప్తి వార్తల నేపథ్యంలో.. రాష్ట్రంలో కరోనా(corona virus) పరిస్థితి, వాక్సినేషన్ పురోగతిని కలెక్టర్లు, వైద్యారోగ్య అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని వారు సీఎంకు తెలియజేశారు. ఒమిక్రాన్ ‘ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్య ఆరోగ్య అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ‘ఒమిక్రాన్’ విషయంలో ఆందోళన అక్కరలేదని, నిరోధానికి చేపట్టవలసిన ముందస్తు చర్యలపై సమీక్షించి, ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ALSO READ: ఘంట‌సాల స్మృతి ప‌థం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ