కార‌ణ‌జ‌న్ముడు కేసీఆర్‌!

0

తెలంగాణలో ఆవిష్కృత‌మైన దృశ్యాలే దీనికి సాక్ష్యం
జాతీయ పార్టీల‌ను ఎదుర్కొని..
పార్టీని న‌డిపించిన తీరు అమోఘం
(ర‌మ‌ణ కొంటిక‌ర్ల, 99126 9996)

కారణజన్ముడంటే ఎవరూ..? ఏదైనా కారణం కోసం జన్మించేవాడే కదా..? మరి 60 ఏళ్ల కల ప్రత్యేక తెలంగాణాను సాధించిన క్రమంలో… అందులో క్రియాశీల పాత్ర పోషించిన నాయకుడై… ఆ తర్వాత ఆ ఉద్యమ నాయకుడే ఏకంగా నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రై… తన పథకాలతో మరోసారీ సీఎం పీఠాన్ని అధిరోహించడమంటే మాటలా…? అలాంటివాణ్ని కారణజన్ముడని ఎందుకనకూడదు..? ఎవరి వాదనలు వారు ఎలా వినిపించినప్పటికీ… నాల్గు కోట్ల తెలంగాణా ప్రజల కళ్లముందు సాక్షాత్కారమైన దృశ్యాలు మాత్రం సీఎం కేసీఆర్ ను కారణజన్ముడిగా నిలబెట్టాయన్నది ముమ్మాటికీ అతిశయోక్తికతీతం.


2001లో ఒక్కడే!
అప్పటికే లైమ్ లైట్ లో ఉన్న టీడీపి వంటి పార్టీ నుంచి బయటకొచ్చి… 2001లో ఒక్కడుగా పార్టీని స్థాపించడం.. ఆ తర్వాత మరో నల్గురు జత కలవడం.. అందులోనూ పొరపచ్చాలు.. అలా అంతర్గతంగానూ ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నప్పటికీ.. ఏకంగా జాతీయపార్టీలనెదుర్కొని.. అనవరతం పార్టీని నడిపించిన తీరు అమోఘమనకుండా ఎలా ఉండగలం..? దానికి తోడు ఊరూరా వీలైనన్న సభలేర్పాటు చేయడం.. తెలంగాణా ప్రజానీకానికి కనెక్టయ్యే యాసతో ఆకట్టుకోవడం… రాను రాను తన సభలంటే ఇసుకవేస్తే రాలని జనానికి ఓ ఉదాహరణనేలా ప్రసంగాలతో ఆకట్టుకోవడం… తన ప్రతీమాటా అక్షరసత్యమనిపించేలా జనాన్ని కన్విన్స్ చేయడం… మెల్లిమెల్లిగా తన శైలిననుసరిస్తూనే… తమకంటూ కొత్త స్టైలును సంతరించుకునేలా తన కుటుంబీకుల్నీ ఆ లీడర్ షిప్ వైపు తయారుచేయగల్గడం… మొత్తంగా మూకుమ్మడిగా తెలంగాణా సమాజానికి గులాబీపార్టీతో.. అంతకుమించి తన కుటుంబంతో ఏదో తెలియని కనెక్టివిటీ పెంచడం.. ఇవన్నీ కేవలం మామూలు విషయాలని ఎలా అనగలం…?


ప‌తాక శీర్షిక‌ల్లోనే క‌ల్వ‌కుంట్ల పేరు
అధికారంలోకి రాగానే కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టుతో తన పేరు పతాకశీర్షికల్లో ఉండేలా చేసుకోవడంతో పాటే.. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, మాడల్ స్కూల్స్, కేసీఆర్ కిట్స్, కంటివెలుగు వంటివెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రిగా తానేం చేయగలడో చూపించిన స్ఫూరద్రూపి కేసీఆర్ లో ఎందుకు కనిపించకూడదు..? తెలంగాణా అంటే ఇలా ఉండాలి అనే ఓ విజన్ ఉన్న నాయకుడు కనిపించని కాలంలో… ఒక ఆకృతిని మనసులో నాటుకుని తాననుకున్న డిజైన్ ప్రకారం తీర్చిదిద్దిన శిల్పి అని కేసీఆర్ ను ఎందుకనకూడదు..? ఎవరెన్ని విమర్శలన్న చేయొచ్చుగాక! కానీ… కేసీఆర్ లాగా తెలంగాణా అంటే ఇలా ఉండాలనే విజన్ కల్గి… ఆ విజన్ ను ప్రజల ముందు స్పష్టంగా ఉంచి… మన్ననలు పొందగల్గిన నాయకులెవ్వరు..? కేవలం విమర్శలు గుప్పించేవారు మినహాయిస్తే… వారేంచేస్తారో చెప్పగల్గి కేసీఆర్ లాగా ఒప్పించగల్గే నాయకులు ఏ పార్టీలో ఇప్పుడు కనిపిస్తున్నారంటే… సదరు విమర్శించే నాయకులే స్పష్టమైన సమాధానం చెప్పగలరా…?


ధిక్క‌రిస్తూ…త‌గ్గుతూ..
రెండుసార్లు పాలన చేస్తున్న క్రమంలో ఓ ప్రభుత్వంపైన విమర్శలు, వ్యతిరేకత వెల్లువెత్తవచ్చుగాక! శాఖలవారీగా చూస్తే 360 డిగ్రీల కోణంలో అన్నిశాఖలకూ మేలు చేసే విధమైన పాలన కనిపించకపోవచ్చునేమో కూడా!! కొన్ని శాఖలపైనే ఫోకస్ చేస్తున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూనే… మిగిలిన శాఖలపై శీతకన్నును పట్టిచూపించొచ్చుగాక!!! పైగా అక్కడక్కడా సభల్లో అహంకారపూరితమైన డైలాగులు, అమలుకాని హామీలు ఇప్పటికీ తెలంగాణా ప్రజల చెవుల రింగుమని మార్మోగుతుండటం.. ఒకవేళ మర్చినా.. నేటి మీడియా, అంతకుమించిన సోషల్ మీడియా వాటిని మరువకుండా చేయడంతో కేసీఆర్ తీరుపైన కొంచెం ప్రజల అభిప్రాయాల్లో మార్పు రావచ్చుగాక కూడా! రాష్ట్రంలోనే ఇంకా ఎంతో చేయాల్సి ఉండగా… తనకు తాను మరింత ఊహించుకుని కేంద్రంలో చక్రం తిప్పుతానని చెప్పుకోవడం కూడా జనానికి అతిశయోక్తిలా కనిపించవచ్చుగాక!! ప్రతిపక్షాలే లేకుండా చేయాలనుకున్న ఆయన తీరు అప్రజాస్వామికమనే చర్చ జరుగొచ్ఛుగాక!!! కేంద్రంతో పోరాటం చేస్తానని చెప్పిన వ్యక్తి… మళ్లీ యూటర్న్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు తగ్గుతూ కనిపిస్తుండటం సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు… ఆయనపై భారీ అంచనాలు పెట్టుకున్నవారిని కొంత నిరాశకు గురి చేయవచ్చుగాక కూడా! ఆ పర్యవసానాలన్నీ దుబ్బాక, జీహెచ్ఎంసీలో కనిపించాయననుకునే ప్రచారమూ ఊపందుకోవచ్చుగాక!! కానీ ఎన్ని ఇలాంటి అప్ అండ్ డౌన్స్ కనిపించినా… కేసీఆర్ కారణజన్ముడు కాదనేందుకివేవీ కారణాలుగా మాత్రం అడ్డుపడకపోవచ్చు. ఎందుకంటే… రాత్రి, పగలు… వెలుగూచీకట్లూ… ఆటుపోట్లు… కష్టసుఖాలు, సుఖదుఖాలు పక్కపక్కనే ఉన్నట్టుగా… ఇవి ప్రతీ మనిషి జీవితంలో సర్వసాధారణమైనవి. ఈ భావోద్వేగాలకు, సమయానుకూల పరిస్థితులకు సామాన్యమానవుడితో పాటు.. అతీతశక్తులున్నవారు కూడా తలొగ్గిన కథలను మనం పురాణగాధల్లోనూ విన్నవే.


కేసీఆర్ శైలి నిత్య నూత‌నం
తనతో పాటే.. తన సహచరులతో ఎప్పటికప్పుడు ఉద్యమకాలంలో రాజీనామాలిప్పించి… రాజీనామాలతో ఉపఎన్నికలకు ఎప్పటికప్పుడు తెరలేపిన నూతన శైలైనా కేసీఆర్ సొంతం. కేంద్రంలో ఏ పార్టీ ఉంటే వారితో కలుసుకుపోవడం… అవసరమైనప్పుడు ఎదురుదాడి చేయడం… మళ్లీ గొంగళిపురుగులా కనిపించే సమయంలోనూ ముద్దెట్టుకోవడం వంటివాటిలో కేసీఆర్ రాజకీయం… వ్యూహాత్మకం కాదని ఎలా అనగలం..? మొత్తంగా ఒక్కడుగా మొదలై… ఒక రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రైన… పార్టీని తెలంగాణా పల్లెపల్లెకూ విస్తరించిన ఉద్యమనేతను కారణజన్ముడు కాదనెలా అనగలం…? అందుకే మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలతో… (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

Ramana Kontikarla

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here