Tuesday, March 21, 2023
HomeArchieveమంచి కిక్ ఇచ్చేది స‌ద్గ్రంధ‌మే

మంచి కిక్ ఇచ్చేది స‌ద్గ్రంధ‌మే

పుస్తక పఠనంతోనే విజ్ఞానం
హైద‌రాబాద్ బుక్‌ఫెయిర్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీఆర్
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
విజ్ఞానం ఆర్జనకు, భావవ్యక్తీకరణకు పఠనమే ప్రధానమని, మన దేశం సహా అనేక దేశాల స్వాతంత్య్ర ఉద్యమాలకు, ఇతర ఉద్యమాలకు రచన, పఠనం సాధనాలుగా నిలిచాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, రావి నారాయణరెడ్డి తదితరులెందరో రచనల ద్వారానే ప్రజా ఉద్యమాలు సాగించారని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాలకు అక్షరమే ఆయుధంగా నిలిచిందని అన్నారు. ‘పుస్తకం హస్తభూషణం’ అనే పెద్దల మాట నేడు వరుస మారి ‘సెల్ ఫోన్’ హస్త భూషణమైందని వ్యాఖ్యానించారు. మంగళవారం (28న) హైదరాబాద్ 34వ పుస్తక మహోత్సవం ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. పెరుగుతున్న సాంకేతికను బట్టి పుస్తకం పఠనం తగ్గిపోయిందనే భావన కలిగేదని, అయితే పుస్తక మహోత్సవానికి లభిస్తున్న ఆదరణను గమనిస్తే గ్రంథ పఠనానికి మంచిరోజులు వస్తాయన్న ఆశ కలుగుతోందని అన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో తెలుగు పుస్తకాలు దొరకడం కష్టంగా ఉండేదని, ఒకటో, రెండో ముద్రణ సంస్థలు అందచేసేవని, అనంతర కాలంలో బాగా మార్పు వచ్చిందని చెప్పారు. కొన్నేళ్లుగా సాగుతున్న పుస్తక మహోత్సవం చదువరులకు పండుగను తీసుకొచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఆసాంతం తేటతెలుగులో గిన ప్రసంగం ఆయన మాటల్లోనే….


మంచి పుస్తకం కొనుక్కో….
‘చినిగిన చొక్కా తొడుక్కో..మంచి పుస్తకం కొనుక్కో’ అన్న మాటల్లోనే పుస్తకం విలువ తెలుస్తోంది. కాఫీ కూడా రాని డబ్బుకు పుస్తకం వస్తుంది. కాఫీలో దొరకని ’కిక్‘ మంచి పుస్తకం పఠనంలో ఉంటుంది. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించండి. బొకేలు ఇస్తూ, పూలదండలు వేయడం కంటే పుస్తకాలను కానుకగా ఇచ్చే సంస్కృతి రావాలి. పుస్తకాలు కొనుగోలు చేయలేని వారు చాలా మంది ఉంటారు. వారికి పుస్తకాలను విరాళంగా అందచేయండి. చదవండి, చదివించండి. ప్రస్తుతం సినిమాలకు సంబంధించే ఎక్కువ సమీక్షలు, విశ్లేషణలు వస్తున్నాయి తప్ప ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు.

ఉద్యోగ బాధ్యతల కారణంగా ఇటీవల సంవత్సరాల్లో ఎక్కువగా చదివే అవకాశం కలగడం లేదు. అత్యధిక సమయం కేసుల ‘కట్టల’ అధ్యయనంతోనే సరిపోతోంది. అయినా పుస్తకాల సేకరణ అలవాటు తగ్గలేదు. పదవీ విరమణ తరువాత సన్మానాలు వంటివి ఉండవు కనుక తీరుబడిగా చదువుకునేందుకు మంచి పుస్తకాలు సేకరిస్తున్నాను. ఇప్పటి వరకు చదివిన, చదవబోయే పుస్తకాల ఆధారంగా నా మీద నాకు నమ్మకం కుదిరితే ఒక పుస్తకం రాస్తాను.


బడిలో గ్రంథాలయం ఎక్కడ
మనిషికి విజ్ఞానం, ఆరోగ్యం ప్రధానమైనవి. విద్యార్ధి దశ నుంచే వాటి పట్ల అవగాహన కలగాలి. దురదృష్టవశాత్తు ఆ రెండూ లోపిస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాలల్లో లేనివి, కనిపించనివి గ్రంథాలయం, ఆటస్థలం. మా చిన్నతనంలో బడులకు సరైన భవనాలు లేకపోయినా శిథిల భవనంలోనైనా చిన్నపాటి గ్రంథాలయాలు ఉండేవి. అక్కడ చదివి నేర్చినదే నాతోపాటు ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఉపకరించింది. వృత్తిలో నిమగ్నమైన తరువాత చదవడం తగ్గింది. ఇప్పుడు కాస్తోకూస్తో మాట్లాడగలుగుతున్నానంటే మూడు దశాబ్దాల క్రితం చదివినదాని ఫలితమే. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు నడుం కట్టాలి. అవసరమైన నిధులు కేటాయించాలి. పుస్తకం పఠనాన్ని ప్రోత్సహించేలా మరో గ్రంథాల‌య ఉద్యమం రావలసి ఉంది.


ఉత్తరాల ఊసెక్కడ..?
పెరుగుతున్న సాంకేతిక ప‌రిజ్ఞానం నేపథ్యంలో ఉత్తరాలు రాసే అలవాటు బాగా వెనకబడి పోయింది.సెల్ ఫోన్లలో పంపే సందేశాలు భాషాపరంగా అర్థవంతంగా ఉండడం లేదు. అవి ఒక్కొక్కసారి విపరీతార్థాలకు దారితీస్తున్నాయి. దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తదితరులు జైలు జీవితం అను భవిస్తూనే ఇతర రచనతో పాటు లేఖలు రాసేవారు. అత్యధిక శాతం మహానేతలు జైలు శిక్షాకాలాన్ని రాయడానికి, చదువడానికి సద్వినియోగం చేసుకున్నారు. సమాచార వ్యవస్థలో ఆధునికత ఎంత అందు బాటులోకి వచ్చినప్పటికీ ఉత్తరాల ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవ డంలోని ఆత్మీయతే వేరు.సెల్ ఫోన్‌లాంటి పరికరాలను కాస్త పక్కన పెట్టి కాలం, కాగితం అందుకుంటే ఆ మాధుర్యం తెలుస్తుంది. యువత ఆ దిశగా ప్రయత్నించాలి.


కాపీరైట్ కేసులపై దృష్టి….
గ్రంథ ప్రచురణ భారంగా మారుతూ ప్రచురణ కర్తలు కష్టాల పాలవుతున్నారు. ఏదోలా పుస్తకాలను అచ్చేసినా, పైరసీ బెడద ఎదురవుతోంది. పుస్తకం విడుదలకు ముందే డిజిటల్ మాధ్యమంలో ప్రత్యక్షమవుతోంది. ఇలాంటి కాపీరైట్ ఉల్లంఘనపై వచ్చే కేసుల పట్ల కఠినంగా వ్యవవహరించాలని న్యాయమూర్తులకు సూచిస్తుంటాను. న్యాయవాదవృత్తిలో రాణింపునకు ముందు పత్రికను నడిపిన నాకు అందులోని సాదకబాధకాలు తెలుసు. ఏడాదికి మించి దానిని తీసుకురాలేకపోయాను.


మాతృ భాషను గౌరవించండి
అమ్మను,అమ్మ భాషను గౌరవించండి. పుట్టిన ప్రాంతాన్ని ప్రేమించండి.మంచిపేరు తీసుకురండి. ఇదే నేను చెప్పదగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ