Friday, June 9, 2023
HomeAP Newsచుక్కల భూముల చిక్కులకు చరమ గీతం

చుక్కల భూముల చిక్కులకు చరమ గీతం

97,471 రైతన్నల కుటుంబాలకు మేలు
రైతన్నకు సర్వ హక్కులూ దాఖలు పరిచిన జగన్ ప్రభుత్వం
కావలిలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వై.ఎస్. జగన్
అమరావతి, మే 11 :
ఎపి ప్రభుత్వం దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడింది. చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపింది. రైతన్నలకు సర్వ హక్కులూ దాఖలు పరిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
చుక్కల భూముల నేపథ్యం ఇదీ..
బ్రిటీష్‌ వారి కాలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి‘ లేదా ‘ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. ఆ భూములే ‘చుక్కల భూములు‘. దీని వల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్నారు.
దీనికి అదనంగా రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో అప్పటి ప్రభుత్వం వీరికి పూర్తిగా అన్యాయం చేసింది. గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఈ భూములన్నీ ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది..

ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు జగన్ ప్రభుత్వం పరిష్కారం చూపింది. జగనన్న ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు లక్ష మంది రైతన్నల కుటుంబాలకు రూ.20,000 కోట్ల మేర లబ్ది చేకూరింది.

సంవత్సరాల తరబడి తమ స్వాధీనంలో ఉండి కూడా ఏ అవసరాలకు (క్రయవిక్రయాలు, రుణం, తనఖా, వారసత్వం, బహుమతి మొదలగు) వాడుకోలేని దుస్థితి నుంచి వారి వారి భూములకు వారిని పూర్తి హక్కుదారులను చేసింది. 2,06,171 ఎకరాల భూమికి సర్వ హక్కులు కూడా లభించేలా నిషేధిత భూముల జాబితా నుండి తొలగించారు.
జగన్‌ ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 22,000 మంది పేద రైతన్నలకు మేలు జరిగేలా నిషేధిత భూముల జాబితా నుండి సుమారు 35,000 ఎకరాల ‘‘షరతులు గల పట్టా భూముల‘ను తొలగించారు.

దేశంలోనే మొదటి సారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వందేళ్ల తర్వాత చేపట్టిన ‘‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష‘ ద్వారా ఇప్పటివరకు 2000 గ్రామాల్లో 7,92,238 కి పైగా భూహక్కు పత్రాలు రైతులకు అందజేసింది. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కరించాలనే దృక్పథంతో డిసెంబర్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,584 గ్రామాలు, పట్టణాల్లో భూముల రీసర్వే. పూర్తి chesindi. శాశ్వత భూహక్కు పత్రాలను జారీచేసింది.

ఇప్పటికే దాదాపు 1,27,313 మంది గిరిజనులకు సుమారు 2.83 లక్షల ఎకరాల అటవీ హక్కుపత్రాలను పంపిణీ చేసింది. పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాల భూమి కేటాయించింది. అక్కచెల్లెమ్మల పేరున పత్రాలు జారీ చేసింది. దాదాపు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇళ్లు కూడా నిర్మిస్తోంది.
గత ప్రభుత్వంలో..
చిన్న మెమో ద్వారా రైతుల ఆధీనంలో ఉన్న చుక్కల భూములన్నింటిని 2016లో ఏకపక్షంగా నిషేధిత భూముల జాబితా క్రింద సెక్షన్‌ 22ఏ(1)(ఈ)పరిధిలోకి తీసుకురావడంతో దశాబ్దాలుగా తమ సాగుబడిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు లేదా మరే ఇతర లావాదేవీలు చేసుకోలేని దయనీయ పరిస్థితి రైతులకు ఎదురైంది. అత్యవసరానికి సైతం విక్రయించాలన్నా వీలు కాని దుస్థితిని చవిచూశారు. రెవెన్యూ ఆఫీసులు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు.. వ్యయప్రయాసలు, వృధా ఖర్చులతో రైతులు ఇబ్బందుల పాలయ్యారు.
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతన్నలకు హక్కు భద్రత కల్పించాలనే లక్ష్యంతో చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం చూపింది.
కలెక్టర్ల ద్వారా గుర్తింపు
కలెక్టర్ల ద్వారా చుక్కల భూమి గుర్తించారు. రైతులకు సంబంధించిన ప్రైవేట్‌ భూములను చుక్కల భూముల స్టేటస్‌ నుండి తొలగించి పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫికేషన్‌ చేసి 97.471 కుటుంబాలకు జగన్ ప్రభుత్వం మేలుచేసింది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 97,471 కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములకు పూర్తి హక్కులను కల్పించింది. రైతన్నలు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా చెల్లించే పని లేకుండా చుక్కల భూముల సమస్యలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముగింపు పలికింది.
ఒకవేళ అవసరమైతే రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం సంప్రదించాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902 ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ