Saturday, September 23, 2023
Homeటాప్ స్టోరీస్అంత‌రిక్షంలో అంకుర ప‌తాకం

అంత‌రిక్షంలో అంకుర ప‌తాకం

ఆకాశమే హద్దుగా ఇస్రో క్షిపణి
వాణిజ్య విప‌ణిలోకి అడుగు
విక్రమ్ సబార్టియల్ (వీకేఎస్) ప్రయోగం విజయవతం
75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి నింగిలోకి ప్రైవేట్ రాకెట్‌


(శ్రీధర్ వాడవల్లి, హైదరాబాదు)
పేదరికంతో అల్లాడిపోతున్న దేశానికి ఈ రాకెట్లూ, ఉపగ్రహాలూ ఎందుకు అని అన్నవారికి ఇస్రో రూపశిల్పి విక్రమ్ సారాభాయ్ దార్శనికతే సమాధానం. సారాభాయ్ ఇలా అన్నారు: “…జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలి.” ఆ ఎవరికీ తీసిపోకుండా ఉండటమే ఇస్రో విజయాలకు మూల మంత్రం. ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థలో ఒకటిగా ఇస్రో నిలుస్తుంది. ఆక్టోబర్ 22 న బ్రిటిష్ స్టార్టప్‘వన్ వెబ్’ సంస్థకు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లను అంతరిక్షం లోకి విజయవంతంగా ప్రయోగించి నిర్ణీత కక్ష్య లోకి ప్రవేశపెట్టగలిగింది ఇస్త్రో.36 బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లను అంతరిక్షం లోకి ప్రయోగించి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగిస్తోంది ఇస్రో . ఈ పక్రియలో భాగంగానే 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి పంపడం ఇదే తొలిసారి అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం ఉనికిని పెంచేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుంది భారత అంతరిక్ష ప్రయోగాలంటే టక్కున గుర్తుకు వచ్చేది విక్రమ్ సారాభాయ్.. ఆ తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధవన్, అబ్దుల్ కలాం. వీరు ఆనాడు వేసిన పునాదులే నేడు మన దేశాన్ని అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాతీయంగా ఎంతో ఎత్తున నిలిపాయి. సౌండింగ్ రాకెట్ల నుంచి భారీ రాకెట్లను నింగిలోకి పంపడమే కాకుండా మంగళయాన్, చంద్రయాన్ లాంటి భారీ ప్రయోగాలు చేసి అగ్రదేశాల సరసన భారత్ నిలవడంలో ఇస్రో పాత్ర అనన్య సామాన్యం. 1960లో బుడి బుడి అడుగులతో చిన్న చర్చిలో మొదలు పెట్టి 1962 లో తుంబా రాకెట్ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రయోగాలకు ఆంతరిక్ష విజ్ఞాన కార్యకలాపాల రూప కల్పనతో అడుగు పెట్టిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో ) కార్యక్రమాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అభివృద్ది చెందుతూ ప్రస్తుతం వాణిజ్యం వైపు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. 1/2 కేజి బరువున్న ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చాలంటే నాసా 30వేల డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. స్పేస్‌ఎక్స్‌ ఆ ఖర్చును 1,200 డాలర్లకు తగ్గించింది. భవిష్యత్తులో ఈ ధరలు తగ్గేకొద్దీ అంతరిక్ష మార్కెట్‌ మరింత విస్తరిస్తుంది. ప్రయోగ ఖర్చులను తగ్గించుకొనేందుకు ప్రపంచ దేశాలు యత్నాలు వేగవంతం చేశాయి. ఈ విషయాన్ని భారత్‌ కూడా గుర్తించింది. ప్రస్తుతం ఇస్రోకు కేటాయిస్తున్న 14వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోవు. ఈ నేపథ్యంలో దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.


అంతరిక్ష రంగంలో మనం ఎక్కడ..?
చాలా ఏళ్లపాటు భారత అంతరిక్ష రంగంపై ఇస్రో ఏకఛత్రాధిపత్యం ఉంది. కానీ, దాని బడ్జెట్‌ పరిమితులతో అనుకున్నంత వేగంగా పరిశోధనలు జరగడంలేదు. దీంతో ఈ రంగంలో ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరిచింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఐరోపా దేశాల్లో బోయింగ్‌, స్పేస్‌ఎక్స్‌, ఎయిర్‌బస్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌ వంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. భారత్‌లో కూడా ఇస్రో బీహెచ్‌ఈఎల్‌ సహకారంతో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ తయారీకి వివిధ కంపెనీలను కలిపి ఏర్పాటుకు యత్నిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ప్రయోగ వాహక నౌకల ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచంలోనే భారత అంతరిక్ష రంగం ఆరోస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా స్పేస్‌టెక్‌ కంపెనీల్లో కేవలం 3.6శాతం మాత్రమే భారత్‌లో ఉన్నాయి. 2019 నాటికి భారత అంతరిక్ష రంగం విలువ 7 బిలియన్‌ డాలర్లు. ఇది 2024 నాటికి దాదాపు 50 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. అంతరిక్ష కార్యకలాపాల అంతర్జాతీయ విపణి పరిమాణం ఇప్పుడు 400 బిలియన్‌ డాలర్లు ఉంటే, సమీప భవిష్యత్తులో ఇది 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ విభాగంలో అమెరికా అత్యధికంగా 56.4శాతం కంపెనీలతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ భారత్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత చౌకగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం మన సొత్తు. కేవలం 75 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపి రికార్డు సృష్టించింది. భారత్‌లో ఈ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలను ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


అంకుర సంస్దల ఆవిర్బావం
భారత్‌ అంతరిక్ష విధానాలను ఇటీవల మరింత సరళీకరించింది. ఇస్రో అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలను ప్రైవేటు రంగానికి బదలాయిస్తోంది భారత్‌లో ఇప్పటికే దాదాపు 50కుపైగా ఆంకుర సంస్ద లు ఇస్రో వద్ద నమోదు అయ్యాయి. ఐఐటీ మద్రాస్ పర్యవేక్షణలోని అగ్నికుల్‌ సంస్థ రాకెట్‌ ఇంజిన్లను నిర్మిస్తుండగా హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ రాకెట్లను తయారు చేస్తున్నాయి. వీటిల్లో రాకెట్లు తయారు చేసేవి, ఉపగ్రహాలు నిర్మించేవి ఉన్నాయి.క బెంగళూరుకు చెందిన బెలాట్రిక్స్ ఏరోస్పేస్‌ రాకెట్లను, ఉపగ్రహ ఇంజిన్లను రూపొందిస్తోంది. ఇక డిజంత్రా స్పేస్‌ ఉపగ్రహ విడిభాగాలను నిర్మిస్తోంది. రాకెట్‌ ప్రయోగాలు మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ ఒప్పందం కిందకు వస్తాయి. క్షిపణి టెక్నాలజీ వ్యాప్తిని నిరోధించే ఈ ఒప్పందంలో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాకెట్‌ ప్రయోగాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఇన్-స్పేస్‌ అనే నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు కంపెనీలు భారత్‌లోని మౌలిక వసతులను వినియోగించుకొనేలా ఇది సాయం చేస్తుంది. ప్రైవేటు సంస్థలకు , ఇస్రోకు మధ్య వారథిగా పనిచేస్తుంది.మరోవైపు స్పేస్‌ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు కూడా 2021లో 198శాతం పెరిగి 67 మిలియన్‌ డాలర్లకు చేరాయి. 2020లో వచ్చిన పెట్టుబడులు 22 మిలియన్‌ డాలర్లు మాత్రమే. ప్రైవేటు రంగం రాకతో పెనుమార్పులు.. స్పేస్‌ రంగంలోకి ప్రైవేటు సంస్థల రాకతో భవిష్యత్తులో ఉపగ్రహాల వినియోగం భారీగా పెరగనుంది. కంపెనీలు సొంతంగా ఉపగ్రహాలు ప్రయోగించి.. డేటా మ్యాపింగ్‌, వాతావరణం అంచనా వేయడం, పారిశ్రామిక సర్వేలు, నీరు- ఇంధనం గుర్తించడం, వ్యవసాయం, రహదారులు, కమ్యూనికేషన్లు ఇలా విస్తృత అవసరాలకు వినియోగించవచ్చు. భవిష్యత్తులో డైరెక్ట్‌ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులోకి వస్తే.. సెల్‌టవర్ల వినియోగం నిలిపివేసే అవకాశం ఉంటుంది.


విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా..
భారత్‌లో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ముహూర్తం ఖరారు అయింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష అంకురం ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ తమ తొలి రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు అంతా సిద్ధమైంది. ‘విక్రమ్‌-ఎస్‌’ లేదా ‘విక్రమ్‌-1’గా పిలవనున్న తొలి ప్రైవేట్‌ రాకెట్‌ను ఈరోజు (18వ తేదీ నవంబర్ 2022) శుక్రవారం అంతరిక్షంలోకి పంపినట్లు స్కైరూట్‌ సంస్థ తెలిపింది. తమ తొలి రాకెట్‌ ప్రయోగానికి ‘ప్రారంభ్‌’ అని పేరు పెట్టినట్లు స్కైరూట్‌ పేర్కొంది. తొలిసారిగా ఈ రాకెట్‌ మూడు కస్టమర్‌ పేలోడ్స్‌ను అంతరిక్షంలోకి చేర్చింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇందుకు వేదిక అయ్యింది. వాతావరణ పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకున్నారు. ఇస్రో, ఇన్‌స్పేస్‌ సహకారంతో చాలా తక్కువ సమయంలో ఈ మిషన్‌ సిద్ధమైం ది. ”విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ సింగిల్‌ స్టేజ్‌ సబ్‌ ఆర్బిటాల్‌ లాంఛ్‌ వెహికల్‌. ఇది మూడు కస్టమర్‌ పేలోడ్స్‌ను నింగిలోకి తీసుకెళ్ళీంది. ఈ మిషన్‌తో తరువాతి విక్రమ్‌ సిరీస్‌ల్లోని వాహక నౌకలకు సంబంధించి సాంకేతికతలను పరీక్షించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత అంతరిక్ష పితామహుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త‌ విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా స్కైరూట్‌ సంస్థ తమ వాహక నౌకలకు విక్రమ్‌ పేరు పెట్టింది. ఈ రాకెట్‌ ప్రయోగంతో భారత్‌లో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ను ప్రయోగించిన కంపెనీగా స్కైరూట్‌ చరిత్ర కెక్కింది. భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది. షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి తొలి ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-ఎస్‌’ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంతరిక్ష రంగంలో అడుగుపెట్టేందుకు ప్రైవేటు రంగానికి మన దేశంలో రెండేళ్ల క్రితమే అనుమతి లభించింది. అప్పటి నుంచి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఈ రాకెట్‌ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. చాలా తక్కువ ఖర్చుతో, రెండేళ్లలోనే ఈ రాకెట్‌ను తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్‌ కుమార్‌ గతంలో వెల్లడించారు. మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా తమ రాకెట్‌కు ‘విక్రమ్‌-ఎస్‌’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ రాకెట్‌ ప్రయోగం కోసం స్కైరూట్‌.. ఇటీవల 51 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.408 కోట్లు) పెట్టుబడిని సమీకరించింది. మింత్రా వ్యవస్థాపకుడు ముఖేశ్ బన్సల్‌, గూగుల్‌ బోర్డు సభ్యుడు శ్రీరామ్‌.. ఈ సంస్థకు పెట్టుబడులు సమకూర్చిన వారిలో ఉన్నారు. విద్యార్థులు రూపొందించిన పేలోడ్‌.. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లే పేలోడ్‌లలో ఒకటి విదేశీ సంస్థకు చెందినది కాగా.. రెండు మన దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్‌కిడ్జ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల ‘ఫన్‌-శాట్‌’ పేలోడ్‌. దీనిని మన దేశంతో పాటు, అమెరికా, సింగపూర్‌, ఇండోనేసియా విద్యార్థులు రూపొందించారు.


ఆత్మ నిర్భ‌రంతో మేక్ ఇన్ ఇండియాకి ఊత‌మిస్తూ
ఆత్మనిర్బరంతో మేక్ ఇన్ ఇండియాకి ఊతమిస్తూ అనేక అంకుర సంస్దలను ప్రోత్సహిస్తూ పరిశోధన ఆభివృద్దిని కొనసాగిస్తోంది . అంతరిక్ష వ్యర్దాలను తిరిగి భూమిపైకి తీసుకురావడం. మానవరహిత అంతరిక్ష కేంద్రాన్ని స్దాపించడం. మరిన్ని నూతన ఆవిష్కరణలు, చంద్రయాన్, ఆదిత్య ఇస్రో ముందున్న సవాళ్ళు. ప్రభుత్వరంగ సంస్దగా కార్యకలాపాలు సాగిస్తు ప్రభుత్వ అధీనంలో పనిచేస్తూ వివిధ సంస్దలనుండి పెట్టుబడులను ఆకర్షిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పలుదేశాలతో సమాచారాన్ని పరస్పరంగా మార్పిడి చేసుకుంటూ మరిన్ని దేశీయ విదేశీయ ఉపగ్రహాలని ప్రయోగించేందుకు మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలి. తక్కువ ఎత్తులో ప్రవేశపెట్టే ఉపగ్రహాలవల్ల వాతావరణ పరిస్దితులని మరింత లోతుగా ఆధ్యనం చేయవచ్చు. దిక్సూచి అవసరాలకు, సమచార ప్రసార అవసరాలకు వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. దీని తరువాత కూడా అనేక ప్రైవేటు ప్రాజెక్టులను చేపట్టనుంది ఇస్రో. అంతరిక్ష రంగంలో పరిశోధనలకు సంబంధించిన రంగంలో కార్యకలాపాలను సాగిస్తోన్న పలు స్టార్టప్‌ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి సిద్ధమౌతోంది.

బెంగళూరులో నిర్వహించిన టెక్‌ సమ్మిట్‌ 2022లో భాగంగా ఇస్రో ఈ ప్రకటన చేసింది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి 2020లో నాంది పడింది. దీని కోసం మోదీ ప్రభుత్వం ఇన్-స్పేస్‌ఈ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. ఇది ఇస్రోకు, ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. 2040 నాటికి వరల్డ్ వైడ్ గా అంతరిక్ష పరిశ్రమ విలువ 80 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం వరల్డ్ స్పేస్ ఎకానమీలో ఇండియా వాటా దాదాపు 2 శాతమే. దీన్ని అధిగమించడం కోసమే భారత్ స్పేస్ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పోత్సాహిస్తోంది. సాంకేతిక స్వావలంబనే ధ్యేయంగా ఖచ్చితత్వంతో తక్కువ ఖర్చుతో సాధికారతతో విజయాలు సాధిస్తోంది అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తోంది ఈ వాణిజ్య ప్రయోగాల ద్వార ఇస్రో విదీశీమారక ద్రవ్యాన్నిఆర్జించవచ్చుఆర్జించిన ఆదాయంతో ఇస్రో పరిశోధ‌న‌కు ,ప్రయోగాలకు మెరుగైన ఆర్దిక వనరు కాగాలదు తద్వారా మరిన్ని నూతన ఆవిష్కరణలు అంకురిస్తాయి. జయహో ఇస్రో

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ