కుంభమేళా తరవాత అంతటి వైభవోత్సవం

Date:

అవిగో… జగన్నాథ రథచక్రాలు…
జగన్నాథ రథ యాత్ర వెనుక ఎంతో చరిత్ర
(డా.వైజయంతి పురాణపండ)
వైకుంఠం భువికి దిగివచ్చిందా, భగవంతుడే భక్తులను అనుగ్రహించడానికి స్వయంగా విచ్చేసాడా అనేట్లుగా నేత్రపర్వంగా జరిగే జగన్నాథుని రథయాత్ర జూన్ 20 న జరుగుతోంది.
సముద్ర తీరాన…
పచ్చటి ప్రకృతిలో…
సముద్రాన్ని ఆకాశం తాకుతోందా అన్నట్టుగా కనిపించే క్షితిజరేఖ …
ఇటువంటి సుందర ప్రదేశంలో కొలువయి ఉంది పూరీ. ఇక్కడి దేవుడు జగన్నాథుడు. ప్రతి సంవత్సరం ఈ జగన్నాథునికి జరిగే రథయాత్ర చాలా ప్రత్యేకమైనది. కుంభమేళ తరవాత అంతటి పెద్ద ఉత్సవం ఈ జగన్నాథుని రథయాత్రే. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌ నుంచి 65 కి.మీ. దూరంలో సముద్రపు ఒడ్డున కొలువై ఉన్న ఈ జగన్నాథుడు ఆత్మీయానురాగాలకు ప్రతీక. ప్రపంచంలో ఇక్కడ ఒక్కచోటే అన్న, చెల్లెళ్లకు గుడి ఉంది. సుభద్ర, బలభద్ర సమేతుడైన జగన్నాథుడు ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. విగ్రహాలు చాలా చిత్రంగా ఉంటాయి. చెంపకు చారెడు కళ్లతో ఉన్న ఈ విగ్రహాలను చూస్తుంటే ప్రపంచాన్ని వీరు తమ చల్లని చూపులతో కాపాడుతున్నారా అనిపిస్తుంది. మరో చిత్రం వీరికి చేతులు ఉండవు. కేవలం చూపులతోనే చేతుల సహాయం లేకుండా వీరు అందరినీ చల్లగా చూస్తారని చెప్పడానికి ప్రతీకగా ఈ విగ్రహాలను చెక్కారేమో అనిపిస్తుంది.
చారిత్రక ఆధారం
కళింగ రాజు అయిన అనంతవర్మ చోడంగ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు మనకు లభించిన తాళ పత్రాల ఆధారంగా తెలుస్తుంది. దీనికి క్రీ.శ.1174లో అప్పటి ఒరిస్సా ప్రభువయిన అనంగ భీమదేవుడు ఈ విగ్రహాలకు పూర్తి రూపం తీసుకువచ్చారు. క్రీ.శ.1558లో ఆప్ఘన్‌ రాజు కాలాపహాడ్‌ ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత వచ్చిన రామచంద్రదేవుడు ఒరిస్సాలోని ఖుర్దాను స్వతంత్య్ర రాజ్యంగా ప్రకటించుకుని, వెనువెంటనే ఈ ఆలయాన్ని సంప్రోక్షణ చేసి విగ్రహాలను పునఃప్రతిష్టించాడు.
పురాణ ఆధారాలు
స్కాంద, బ్రహ్మ పురాణాలు ఇంకా ఇతర పురాణాలు జగన్నాథుని నీలమాధవునిగా ‘సవర’ (గిరిజన) రాజు అయిన విశ్వవసు కొలిచేవాడని చెప్తోంది. ఈ దేవుని గురించి విన్న ఇంద్రద్యుమ్న మహారాజు తన కుల పురోహితుడయిన విద్యాపతిని పిలిచి, ఆ దైవం ఎక్కడున్నదీ తెలుసుకురమ్మని పంపాడు. సవర రాజయిన విశ్వవసు చీమలు కూడా దూరలేనటువంటి చిట్టడవిలో రహస్యంగా దేవుని పూజించేవాడు. విద్యాపతి ఎంత ప్రయత్నించినా ఆ స్థలాన్ని గుర్తించలేకపోయాడు. విశ్వవసు కుమార్తె అయిన లలితను వివాహం చేసుకున్నాడు. అనంతరం దైవాన్ని చూపంచమని విశ్వవసువుని పదేపదే అర్థించడం వల్ల, అల్లుని కళ్లకు గంతలు కట్టి నీలమాధవుడున్న గుహ దగ్గరకు తీసుకు వెళ్లాడు. యుక్తి పన్నిన విద్యాపతి దారిపొడవునా ఆవాలు చల్లుకుంటూ వెళ్లాడు. కొన్ని రోజులకే ఆ ఆవాలు మొలకెత్తాయి. అప్పుడు గుహ చేరుకోవటం తేలికయ్యింది. ఈ విషయం తెలిసిన ఇంద్రద్యుమ్న మహారాజు వెంటనే దైవాన్ని పూజించడానికి ఒరిస్సా వచ్చాడు. గుహ దగ్గరకు వెళ్లిన రాజుకి నిరాశే మిగిలింది. అక్కడ ఉండవలసిన రూపం అదృశ్యమయ్యింది. దేవుడు భూమిలో దాక్కున్నాడని తెలుసుకున్న రాజు భగవత్సాక్షాత్కారం కలగనిదే అక్కడ నుంచి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు. ఆయన కనపడే వరకు పచ్చిగంగ కూడా ముట్టనని శపథం చేశాడు. అప్పుడు ఆకాశవాణి ‘రాజా! నువ్వు భగవంతుని దర్శించగలవు’ అని పలికింది. ఆ తరవాత రాజు అశ్వమేధయాగం చేసి విష్ణు దేవాలయం నిర్మించాడు. నారదుడు తెచ్చిన నరసింహమూర్తిని ప్రతిష్టించాడు. ఒకరోజు నిదురిస్తున్న రాజుకి జగన్నాథుడు కలలోకి వచ్చి, దివ్య స్వరంతో ‘సముద్రంలో సుగంధభరితమయిన ఒక కొయ్యదుంగ కొట్టుకు వస్తుందని, ఆ దుంగతో మూర్తులని తయారుచేయించమని’ చెప్పాడు. మేల్కొన్న మహారాజుకి స్వప్నంలో జగన్నాథుడు చెప్పినట్టుగానే సముద్రంలోంచి దుంగ అలలపై తేలియాడుతూ తీరానికి చేరింది.

దానితో దేవతామూర్తులను చేయించాలని నిశ్చయించుకున్నాడు. శిల్పాలు చెక్కే దారు శిల్పుల కోసం రాజు అన్వేషిస్తుండగా ఒక వృద్ధ శిల్పి అక్కడకి వచ్చి తాను శిల్పాలు చెక్కుతానన్నాడు. అందుకు ఒక షరతు విధించాడు. తనకు ఒక గది ఇవ్వాలని, శిల్పాలు చెక్కడం పూర్తయ్యేంత వరకు తనను ఎవరూ కదిలించకూడదని అన్నాడు. రాజు అంగీకరించాడు. ఎన్నాళ్లకూ గుడి తలుపులు తెరుచుకోకపోవడం, అందులో నుంచి శిల్పాలు చెక్కే శబ్దాలు వినిపించకపోవడంతో ఉత్సుకత పట్టలేక రాజు గుడి తలుపులు తెరిచాడు. అంతే! మొండెం వరకు చెక్కిన విగ్రహాలను అక్కడే వదిలేసి శిల్పి అదృశ్యమయ్యాడు. దిక్కు తోచక రాజు ఖిన్నుడయ్యాడు. అప్పుడు జగన్నాథుడు కళ్ల ముందు సాక్షాత్కరించి ‘‘ఓ రాజా! దిగులు చెందకు, వీటిని ఇలాగే ప్రతిష్టించు’’ అని చెప్పి అంతర్థానమయ్యాడు. ఆ ప్రకారంగా జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు, చక్ర సుదర్శనాన్ని తయారు చేయించి వాటిని ప్రతిష్టించాడు. ఈ విగ్రహాలను రత్నమాణిక్యాలతో అలంకరించిన వేదికపై నిలిపాడు. సుమారు 18 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అధిక ఆషాఢంలో ఈ విగ్రహాలను పునఃప్రతిష్టిస్తూ ఉంటారు.
రథయాత్ర
పూరీ దేవాలయం రథయాత్రకు ప్రసిద్ధి. ప్రతి సంవత్పరం ఆషాఢ శుద్ధ విదియనాడు ఈ రథయాత్ర జరుగుతుంది. 125 మంది కళాకారులు ప్రత్యేకమైన చెక్కను తీసుకువచ్చి ముగ్గురు మూర్తులకు రథాలు తయారు చేస్తారు. అప్పుడు ఒరిస్సా రాజు ముందుగా రథాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి నీళ్లు చల్లుతాడు. ఆ తరవాత రథం మీదకు భగవంతుని తీసుకువస్తారు. ఇదొక అరుదైన ఆచారం, ఇది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. దేవుని ముందు రాజు పేద సమానమేని చూపే అంశం ఇక్కడ మనకు కనపడుతుంది. అలాగే రాజు దేవునికి ఊడిగం చేయడం అనేది ఇక్కడే కనపడుతుంది. అంతేకాక ఈ విగ్రహాలకు లేపనంగా పూయడానికి కస్తూరి మృగం నుంచి తీసిన కస్తూరిని నేపాల్‌ రాజు వీరేంద్ర ఆనవాయితీగా పంపేవారు. ఇలా ప్రభువులంతా ఈ దేవునికి సేవ చేయడమంటే అది వారికి లభించిన అదృష్టంగా భావిస్తారు.
ఇక్కడికి జగన్నాథుని రథాన్ని లాగడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. ఆలయం ముందు భాగంలోని వీధి సువిశాలంగా ఉంటుంది. రథయాత్ర కోసమే విశాలంగా ఉంచారు. తన దగ్గరకు రాలేని భక్తుల కోసం, వారికి సంతోషం కలిగించడం కోసం భగవంతుడే స్వయంగా భక్తులకు దర్శనమివ్వడానికి బయటకు వస్తాడు. ఇక్కడ కుల, మత, పేద, ధనిక, వర్ణ, వర్గ భేదాలు లేకుండా అందరూ ఇందులో పాల్గొనడం విశేషం. ఈ జగత్తుకే నాథుడయిన ఆ జగన్నాథుడు తానే కదలి వచ్చే కమనీయ దృశ్యం ఈ రథయాత్ర. భగవంతుని ముందు భక్తులంతా సమానమేనని చాటిచెప్పే గొప్ప పర్వదినం ఈ రథయాత్ర. ఈ రథాన్ని గట్టిగా పేనిన తాళ్లతో లక్షలాది మంది భక్తులు లాగుతుంటే, మధ్యమధ్యలో రథచక్రాలు కదలనని మొరాయిస్తాయి. అప్పుడు వేల కొలదీ కొబ్బరికాయలు కొట్టి ముందుకు లాగుతారు. అప్పుడు కూడా కదలకపోతే శృంగార ప్రియుడయిన ఆ దేవునికి ఉత్సాహం తెప్పించటం కోసం సవరలు పలికే బూతు పదాలు, బాజా భజంత్రీలు, గంటల ధ్వనులు, భజనలు, కీర్తనలు, ప్రార్థనలు జోరుగా సాగుతుంటే అప్పుడు రథం ముందుకు సాగుతుంది. ఈ రథయాత్ర సుమారు మూడు కి.మీ. పొడవున జరుగుతుంది. లక్షల మంది భక్తులు భగవంతుని ఒకే పిలుపుతో పిలుస్తూ చేసే ధ్వనులకి భూమి దద్దరిల్లిపోతుందేమో అనిపిస్తుంది. ఇసుక వేస్తే రాలనంత జనం అన్నది ఇక్కడ అక్షరసత్యం. నేల ఈనిందా అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ జనసంఖ్య. మానవులంతా ఒక్కటే అని నిరూపిస్తుంది ఈ రథయాత్ర. తరతమ భేదం, భాషా ద్వేషం, మంచిచెడు పదాలు…ఇటువంటి వాటికి ఇక్కడ తావులేదు. ఎవరు ఎలా పిలిచినా, ఎవరు ఏ విధంగా నిందించినా ఇద్దరినీ సమానంగానే చూస్తాడు భగవంతుడు అని ఈ రథయాత్ర నిరూపిస్తుంది.


ప్రసాదాలు
జగన్నాథునికి 64 రకాల నైవేద్యాలు తయారుచేస్తారు. ప్రసాదంగా వండే అన్నాదులను కేవలం కుండలలో మాత్రమే వండటం ఇక్కడి ప్రత్యేకత. అది కూడ ఏడు కుండలను ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారు. అన్నం, పెసరపప్పుతో ఈ ప్రసాదం తయారుచేసి దేవునికి నివేదన చేస్తారు. విచిత్రమేమిటంటే ఏడుకుండలలోని అన్నం ఒకేసారి ఒకే విధంగా ఉడుకుతుంది. లక్ష మందికి ఒకేసారి వంటచేయగల వంటశాల ఇక్కడ ఉంది. ఇది ఇక్కడి మరో ప్రత్యేకత. అన్నార్తులు ఉండకూడదనే శ్రీకృష్ణుని మనోరథం ఇక్కడ నెరవేరుతుంది.


లక్షమందికి ఒకేసారి భేదభావాలు లేకుండా అన్నదానం ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అందుకే సర్వం జగన్నాథం అంటారు. లక్షల మంది రథాన్ని లాగడానికి ముందుకు వస్తారు. భక్తులంతా ఈ పండగను అత్యంత ఆనందంతో ఆస్వాదిస్తారు. ఏడాదికొక్కసారి వచ్చే ఈ పండగ కోసం భక్తులంతా ఈ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో సంవత్సరం కాలం పాటు ఎదురుచూస్తారు. సర్వం జగన్నాథం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అన్నమయ్యపై రెండు కీర్తనలు

(మాడభూషి శ్రీధర్)అన్నమయ్య రచించి, స్వర రచన చేసి, పాడిన అద్భుతమైన పాటలపై...

Golden Jubilee Marriage Celebration of a Vibrant Family

(Shankar Chatterjee) Marriage is a legal and socially sanctioned union,...

BJP’s problem is un-settled Maharashtra

(Dr Pentapati Pullarao) Maharashtra is one of the problem states...

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...