ఇది చ‌దివితే మీరిక ప్లాస్టిక్ వాడరు!

Date:

ప్రపంచాన్ని భూతంలా క‌మ్మేసిన ప్లాస్టిక్‌
ఆరు త‌రాల నిలిచిఉండే వ్యర్థాలు
(Dr. ఎన్. కలీల్, హైదరాబాద్)

అగ్గిపుల్ల…దీనితో ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు, ఇంటిని తగులబెట్టుకోవచ్చు. ఎలా వినియోగిస్తే అలా ఉపయోగపడుతుంది. అలాగే ప్లాస్టిక్ కూడా. నేలలో కరిగిపోయేందుకు కనీసం 500 ఏళ్లు పట్టే ప్లాస్టిక్‌ను ఎడాపెడా ఎలాపడితే అలా వినియోగించి భవిష్య తరాలను అంధకారంలోకి పడేస్తున్నాం. ఉదయం లేవగానే చేసుకునే బ్రష్‌ నుండి టబ్‌లు, మగ్‌లు, బకెట్‌లు దువ్వెనలు, బెల్టులు,వాటర్‌ బాటిల్స్‌, లంచ్‌ బాక్స్‌లు, కుర్చీలు, ఇలా మన జీవితం మొత్తం ప్లాస్టిక్‌తో ముడిపడిపోయింది. సులభంగా ఉపయోగించగలగడం, తేలికగా ఉండటం, మన్నిక, చౌకధరల్లో లభించడం, తడవకపోవడం వంటి గుణాల వల్ల ప్లాస్టిక్‌ అత్యంత వేగంగా ప్రజాజీవితంలో భాగమైంది. కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌, క్యారీ బ్యాగులు, ప్లేట్లు, టీగ్లాసులు, స్ట్రాలు ఇలా ప్రతి ఒక్కటి విస్తృత ఉపయోగంలో ఉంది. సింథటిక్‌, సెమీసింథటిక్‌ రసాయన ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌ కాలుష్యం నేడు భూతంలా తయారై మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్లాస్టిక్‌ తయారీ దశ నుండి సముద్రాలను చేరే దశవరకు కణాలుగా గాలిలో కలవడం, విషరసాయనాలను విడుదల చేయడం ద్వారా జల, నేల, పర్యావరణం కాలుష్యం ఏర్పడుతుంది. జీవజాతి ఆరోగ్యాన్ని కబళిస్తున్న ప్లాస్టిక్‌ను ఇప్పటికే 60 దేశాలు నిషేధించాయి. మనదేశంలో సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, నాగాలాండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో నిషేధించగా మరికొన్ని రాష్ట్రాలు నిషేధ బాటలో పయనిస్తున్నాయి.
మానవ జీవితంలో విడదీయ రానంతగా పెనవేసుకుపోయిన ప్లాస్టిక్‌ ఆవిర్భావం 1839లో జరిగింది. ఒకసారి మాత్రమే ఉపయోగపడే ప్లాస్టిక్‌ వస్తువులు చాలా ఆలస్యంగా శిధిలమై విచ్ఛిన్నమవుతాయి. దినపత్రిక కాగితం- ఆరువారాలు, సిగరెట్‌ బట్‌-ఐదు సంవత్సరాలు, అస్తి పంజరం పది సంవత్సరాలు, క్యారీబ్యాగులు 20 సంవత్సరాలు, నైలాన్‌ 40 సంవత్సరాలు, కాప్‌లు యాభై సంవత్సరాలు, స్ట్రా- 200 సంవత్సరాలు, వాటర్‌ బాటిల్‌ 450 సంవత్సరాలలో శిధిలమై భూమిలో కలిసిపోతుంది. సగటు భారతీయుని జీవన కాలం 70 సంవత్సరాలు కాగా బాటిల్‌ ఆరు తరాల వరకు అలాగే ఉంటుంది.
ప్లాస్టిక్‌ కాలుష్యం జీవజాతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. దేశంలోని పంపునీటిలో 72 శాతం ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నట్లు తేలింది. ఒక వ్యక్తి సంవత్సరానికి మూడువేల నుండి నాలుగువేల సూక్ష్మప్లాస్టిక్‌ కణాలను లేదా 250 గ్రాముల బరువుగల ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నారని తేలింది. ఈ కాలుష్యం నీటి వనరులలో చేరి చేపల ద్వారా మన ఆహారంలోకి ప్రవేశిస్తుంది. ప్లాస్టిక్‌ వల్ల మురికి చేరి దోమలు పెరుగుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. మనశరీరంలో హార్మోన్‌ వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా ఎండోక్రైన్‌ వ్యాధులు రావడం, వ్యంధత్వానికి దారితీయడం జరుగుతుంది. 2019లో ప్లాస్టిక్‌, పర్యావరణ నివేదిక ప్రకారం ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల 850మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌కు సమానమైన గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారం జరిగింది.
సముద్రజీవరాశుల మనుగడకు మూలమైన పైటోప్లాంక్టన్‌లపై ప్లాస్టిక్‌ విషం ప్రభావం చూపు తుంది. తిమింగలాల ప్రేగులలో పెద్దమొత్తం ప్లాస్టిక్‌ అవశేషాలు దొరికాయి. కేన్సర్‌, ఇతర ఉదరసంబంధ వ్యాధులు మనుషులకు సంక్రమిస్తున్నాయి. వ్యర్థాల వల్ల నేలల కాలుష్యం జరిగి పంట దిగుబడి తగ్గుతుంది. ప్లాస్టిక్‌ దుష్ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ మార్గాలు వచ్చాయి. 45-50 సార్లు ఉపయోగించగలిగే పాలసరఫరా కోసం పిఎఫ్‌వై పర్సులు, సంచులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను రహదారుల నిర్మాణం, ప్లాస్టిక్‌ ఇటుకల తయారీ, కార్లునడిపే వంతెనల తయారీలో వాడుతున్నారు. ఏమైనప్పటికీ ఈ ప్లాస్టికాసురున్ని అంతం చేయాలంటే ప్రజల భాగస్వామ్యం, సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం జరిమానాలు విధించడం, విస్తృతoగా ప్రజల్లో అవగాహన కల్పించడం,ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్లు నెలకొల్పటం, ఆంటీప్లాస్టిక్‌ స్క్వాడ్‌ బృందాల ఏర్పాటు, జనపనార, నూలు, గుడ్డ సంచుల వాడకం, స్టీలు గ్లాసు వాడకాన్ని ప్రోత్సహించడం, బయోడిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ తయారీ, తదితర మార్గాలు అనుసరిస్తే అవని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
చట్టాలు ఏం చెబుతున్నాయి?
పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించడం, వినియోగించడంపై 1986లో చట్టం చేశారు. 20 మైక్రానులు కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులను విక్రయించకూడదని నిబంధన విధించారు. ఈ తర్వాత దాన్ని సవరిస్తూ 50 మైక్రానులకు పెంచారు. నిషేధిత వస్తువులు తయారు చేసినా, అమ్మినా, వాడినా రూ.2,500 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధించారు. 2016లో కేంద్రం రూపొందించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు స్థానిక సంస్థలు బాధ్యత వహించాలి. రోజువారీ వచ్చే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా విభజించి ఇంటింటికీ వెళ్లి సేకరించడం, వాటిని రీసైక్లింగ్ చేయడం, అనంతరం మిగిలిన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం చేయాలి. ఈ నిబంధనలకు 2018లో కేంద్రం సవరణలు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలు వెదజల్లే సంస్థలనే బాధ్యులను చేసింది. రీసైక్లింగ్ చేయడానికి వీలులేని మల్టీలేయర్ ప్లాస్టిక్ (చిప్స్ ప్యాకెట్లకు వాడేది)ను రెండేళ్లలో పూర్తిగా నిషేధించాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను కేంద్రం రెండేళ్లపాటు వాయిదా వేసింది. దేశంలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్, 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించినా అమలు సక్రమంగా లేదు. చాలా రాష్ట్రాల్లో తూతూమంత్రంగా సాగుతోంది. అసలు ఉత్పత్తే లేకుంటే వినియోగం ఉండదు కదా! ఉత్పత్తినెందుకు నిషేధించరు? అనే ప్రశ్న జనసామాన్యంలో ఉదయించేది. కాబట్టి ప్లాస్టిక్‌తో పర్యావరణానికి హాని కలిగించే సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. ప్యాకింగ్ అవసరాల కోసం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. సిక్కిం దేశంలోనే తొలిసారిగా 1998లోనే సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. ప్రజల్లో విసృత అవగాహన కల్పించి.. సమర్థంగా అమలు చేస్తోంది. సిక్కింను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి.
ప్లాస్టిక్ ఉపయోగాలు:
నిజానికి ప్లాస్టిక్ మన నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వైద్యరంగంలో దీనికి ప్రత్యామ్నాయంగా మరొక లోహం వినియోగించలేము అంటే అతిశయోక్తి కాదు. విద్యుత్తు వైర్లకు పూతగా, హాస్పిటల్‌లో వినియోగించే డిస్పోజబుల్ వస్తువులుగా, తెలికబరువు కలిగి, బారీ స్థాయిలో రవాణాకు… ఉపయోగపడుతుంది. తక్కువ శ్రమ శక్తితో ఎక్కువ లాభం వనకూరుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తి చేయడం, వినియోగించడం ఎంత ముఖ్యమో పర్యావరణానికి హానికలిగించకుండా దానిని నిర్వీర్యం చేయడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే కర్భన ఉద్గారాలు వికృత రూపం దాల్చి మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) లెక్కల ప్రకారం.. మన దేశంలో ఏటా దాదాపు 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 50 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు పనికొచ్చేది. అంటే 50 శాతం ప్లాస్టిక్‌ను ఒక్కసారి ఉపయోగించి పడేయాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా రీసైక్లింగ్‌కు పనికొచ్చే 50 శాతం ప్లాస్టిక్‌లో కేవలం 10-13 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. దేశంలో ప్రతి ఒక్కరు ఏడాదికి సగటున 11 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఈ లెక్కన మన దేశంలో 130 కోట్ల జనాభా ఏడాదికి 1,430 కోట్ల కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. దేశంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం ఏడాదికి 2025 నాటికి 25 కిలోలకు చేరుతుందని అంచనా. కాగా.. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఏడాదికి సగటున 109 కిలోలు, చైనాలో 38 కిలోలు వినియోగిస్తున్నారు. అందుకనే ప్రతి దేశంలో వృధా ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతోంది. ఈ వ్యర్థాలన్నీ మన కాలనీల్లో, ఊళ్లల్లో, రోడ్ల పక్కన, పర్యాటక ప్రదేశాల్లో.. భూమిపైన, భూపొరల్లో, వివిధ జల వనరుల్లో, సముద్ర గర్భంలో గుట్టలుగా పేరుకుపోతూ మనిషి మనుగడకు సవాల్‌గా మారింది. ఆహారంతో పాటు తక్కువ పరిమాణం, సూక్ష్మ రూపంలో ఇది జంతువుల, మనుషుల కడుపుల్లోకి వెళుతోంది. ప్లాస్టిక్ ఎప్పుడూ ‘జీవ శైథిల్యం’ చెందదు. అందుకనే అవి తిన్న జీవజాతులు చనిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ 8 మిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి సముద్రంలో చేపల బరువు కంటే ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని ఎలన్ మెక్‌థన్ ఫౌండేషన్ అంచనా వేసింది. ఇలా.. చేపల కడుపుల్లోనే కాకుండా మానవుల రక్తంలో కూడా ప్లాస్టిక్ కణాలు చేరాయని ఇటీవల లండన్ వైద్యులు ధ్రువీకరించారు. ప్లాస్టిక్ కణాలు శరీరంలోని వివిధ అంతర్గత అవయవాలకు చేరుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ కణాల వల్ల మనుషుల్లో ‘ఎండోక్రైన్’ వ్యవస్థ దెబ్బతిని క్యాన్సర్లు, సంతాన వైఫల్యాలు కలగడమే కాకుండా పుట్టుకతో వచ్చే అవలక్షణాలు, చెముడు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్లాస్టిక్‌తో నష్టాలెన్నో..
మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణమించింది. ఇటీవలికాలంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృత తిమింగలం ఉదరంలో దొరికిన కిలోల కొద్దీ ప్లాస్టిక్ వస్తువులు మనిషి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. నేలనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాలను ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తమిళనాడులో ఒక ఆవు అనారోగ్యంతో ఉండటంతో దాని యజమాని వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా పరిశీలించిన వైద్యులు దానికి ఏకంగా ఐదు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి దాదాపు 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు. ఇవి సాదారణమే అని కొట్టిపారేసే విషయాలు కావు. తస్మత్ జాగ్రత్తతో, జాగరూకుతతో మెదలమని మనిషికి ప్రకృతి పంపే సంకేతాలు.

• నదులు, సముద్ర జలాల్లో కలిసే ప్లాస్టిక్ వ్యర్థాలను చేపలు, కొన్ని అరుదైన తాబేళ్లు, తిమింగలాలు తిని మరణిస్తున్నాయి. విధంగా విషతుల్యమైన చేపలను తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలావరకు ప్లాస్టిక్ చెత్తను మండించి ఆ వేడితో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. లేదా వ్యర్థాలు ఎక్కువ స్థలం ఆక్రమించకుండా చూసేందుకు కాల్చేయడాన్ని ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్‌తోపాటు అనేక ఇతర విషవాయువులు గాల్లోకి చేరి పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో సుమారు 60 శాతం చెత్త కుప్పల్లోకి చేరుతోంది. రీసైక్లింగ్ కోసం సేకరిస్తోంది 14 శాతం మాత్రమే.
• వేడి ఆహార పదార్థాలు, పానీయాలను తినడానికి, తాగడానికి వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల నుంచి కరిగిన ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తోంది. దీనివల్ల చర్మ, జీర్ణకోశ సమస్యలు, థైరాయిడ్, గొంతు నొప్పి సంభవిస్తున్నాయి.
• ప్లాస్టిక్‌ను కాలుస్తుండటంతో తీవ్ర వాయు కాలుష్యం విడుదలై శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడంతో భూగర్భ జలాలు కలుషితమై మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
• ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి పొరల్లో వందల ఏళ్లు ఉండిపోతుండటంతో భూసారం తగ్గి పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. ఏటా 8 లక్షల తాబేళ్లు, 10 లక్షల సముద్ర పక్షులు, మరెన్నో చేపలు మృత్యువాత పడుతున్నాయి.
• ప్లాస్టిక్ వ్యర్థాల్లో పాలిథిన్ కవర్లు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తాయి.
• మట్టిలో కలిసి పోయేందుకు ఏళ్లకు ఏళ్లు పడుతుంది. నీరు భూమిలో ఇంకకుండా అడ్డు పడతాయి.
• పాలిథిన్ కణాలు భూసారాన్ని పీల్చేస్తాయి. కొన్నేళ్ల తర్వాత ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతుంది. ఆ ధూళి ఒంట్లోకి వెళ్లి క్యాన్సర్, మూత్రపిండ, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది.
• నగరంలో కర్రీ పాయింట్లు అధికంగా విస్తరిస్తుండగా వారంతా నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల్లోనే వేడి వేడి ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తున్నారు. అలాంటి ఆహారం తీసుకుంటే ప్రమాదకరం. కవర్ తయారీలో ఉపయోగించే పోలి ఇథలీన్ లేయర్ వేడికి కరిగిపోతుంది. అలా కలుషితమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ కారకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో సిల్వర్ కాయిల్‌తో తయారు చేసిన ఉత్పత్తుల్లో ప్యాకింగ్‌పై మొగ్గు చూపాలి.
• మహిళల్లో అధికంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇదే కారణం.
• చికెన్, మటన్ దుకాణాల్లో వినియోగించే నలుపు, ఎరుపు, పింక్ రంగుల్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. వాటిలో తెచ్చే ఆహారం వేగంగా కలుషితమయ్యే అవకాశాలు ఉండటంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపి చిన్న పిల్లల్లో వేగంగా మందబుద్ధి వ్యాపిస్తుంది.
• విచ్చలవిడిగా వాడి పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవులు, పశువులు తిని మృత్యువాత పడుతున్నాయి.
• కర్బన ఉద్గారాలవల్ల, ఇతర కాలుష్యాల కారణంగా భూతాపం పెరుగుతోంది. సముద్ర తీర ప్రాంతాల జనావాసాలు భవిష్యత్తులో పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. కారణం, వేగంగా సముద్ర జలమట్టం పెరగటమే! కర్బన కాలుష్యాల క్రమం ఇలాగే ఉంటే, భూతాపోన్నతి ఇదే రీతిన పెరిగితే… సమీప భవిష్యత్తులోనే ధృవ ప్రాంతపు మంచు శిఖలు కరిగి సముద్ర మట్టాలు అసాధారణంగా పెరుగనున్నాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ముసాయిదా పత్రమొకటి ఇటీవల వెల్లడించింది. ఈ ప్రమాద ప్రక్రియ ఇప్పటికే మొదలయిందని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఇది అత్యంత వేగంగా నష్టం కలిగిస్తుందన్నది నివేదిక సారం. ఉత్తర దక్షిణ ధృవాల్లోని గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలు వేగంగా కరిగిపోతున్నాయి. మానవ కారక కాలుష్యాన్ని తగు చర్యలతో నియంత్రించకుంటే, ఉత్తర ధృవపు మంచుకొండలు ఈ శతాబ్దాంతానికి కనీసం 30 శాతం కరిగి పోతాయనేది అధ్యయనం. అదే జరిగితే, 2050 నాటికి చిన్ని చిన్న దీవులు, కడలి తీరాల్లోని మహానగరాలు తీవ్ర ‘సముద్ర జల మట్టాల’ సమస్యను ఎదుర్కోనున్నాయి. భూతాపోన్నతి 2 డిగ్రీలు మించి పెరక్కుండా కట్టడి చేసినా, 2100 నాటికి సముద్రమట్టాలు 43 సెంటీమీటర్లు పెరుగుతాయనేది పరిశీలన. అప్పుడు సాగరతీరాల నుంచి 25 కోట్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఒక వైపు అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అంతర్జాతీయ రాజకీయ పరిణా మాల్నే శాసిస్తోంది. ఈ ప్రకృతి విపత్తులు ఇంకే విపరిణామాలకు దారితీస్తాయో తెలియదు! పాలకులు, ప్రభుత్వాలు, పౌరసమాజం సమన్వయంతో చొరవ చూపితేనే సమస్య తీవ్రతను కట్టడి చేయగలవు.
• ఇ-వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమైన సమస్య…స్మార్ట్ ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్స్ వంటి సవాలక్ష ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తర్వాత వ్యర్థాలుగా మారి పర్యావరణ, ప్రజారోగ్య విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఇ-వ్యర్థాల నిర్వహణ భౌగోళిక, రాజకీయ సవాలుగా మారి, ప్రపంచస్థాయిలో ఈ వ్యర్థాల నిర్వహణ, నియంత్రణ చేయవలసిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో 2002 ఏప్రిల్‌లో ‘వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ (డబ్ల్యూఈఈఈ) అంతర్జాతీయ వేదిక ఏర్పడింది. అంతర్జాతీయ సమాజంలో ఇ-వ్యర్థాల అనర్థాలు, నియంత్రణ అవసరంపై అవగాహన పెంపొందించేందుకు ‘ఇంటర్నేషనల్ ఇ-వేస్ట్ డే’ను ప్రతి ఏటా అక్టోబర్ 14 తేదీన జరుపుకోవాలని డబ్ల్యూఈఈఈ వేదిక 2018లో పిలుపునిచ్చింది. గ్లోబల్ ఇ-వ్యర్థాల్లో 20 శాతం మించి రిసైక్లింగ్‌కు నోచుకోవడం లేదు. మిగిలిన వ్యర్ధాలు సముద్రాల్లో, డంప్‌యర్డుల్లో దర్శనమిస్తున్నాయి.

OLYMPUS DIGITAL CAMERA

ఇలా చూస్తుంటే ఉపయోగాలకంటే నష్టాలే ఎక్కువగా కనపడుతున్నాయి….

సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యమిలా…
జన జీవితంలో నిత్యావసరంగా మారిన ప్లాస్టిక్‌ను నిషేధించడం అంత తేలికేమీ కాదు. అయితే దశలవారీగా ప్రయత్నిస్తే కష్టమేమీ కాదు.
• ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించేందుకు ఎవరికివారే స్వచ్ఛందంగా అడుగు ముందుకేయాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్లాస్టిక్ ఉత్పత్తి పరిశ్రమలను సీజ్ చేయాలి.
• చెత్తను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి చెత్త కుండీల్లో వేయకూడదు. ఆహార పదార్థాలను వాటిలో పారేయకూడదు.
• సరుకులు, కూరగాయల కోసం ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, నార సంచులు, పేపర్ బ్యాగ్‌లను ఉపయోగించాలి.
• 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లతో ప్రమాదం అంతా ఇంతా కాదు. పునర్వినియోగానికి పనికి రావు. ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవచ్చు. వీటి వినియోగాన్ని కార్పొరేషన్ నిషేధించినా.. అడ్డుకట్ట పడలేదు. తక్కువ ధరకు వస్తుండటంతో పండ్లు, కూరగాయలు, కిరాణా స్టోర్ సామాన్లను ప్యాక్ చేసేందుకు వినియోగిస్తున్నారు. మంటల్లో కాలిపోయి ప్రమాదకర రసాయనాలు గాల్లోకి వెలువడుతున్నాయి. అందుకు 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తిచేసే పరిశ్రమలను పూర్తిగా నిషేధించడం ఒక్కటే మార్గం.
• అన్ని స్థాయిల్లో ఆయా వర్గాల ప్రజలకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించాలి.
• బస్తీల్లోని స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ అవగాహన కల్పించడం, వారు ఉపాధి పొందేలా క్లాత్, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణనిచ్చి వారి ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ కల్పించాలి. వాటిని వినియోగంలోకి తెస్తూ క్రమేపీ ప్లాస్టిక్ వాడడం మానేలా చేయాలి.
• విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా విషయం కుటుంబానికి చేరుతుంది.
• ప్లాస్టిక్ భూతాన్ని పారదోలాలి అంటే మనం పాత పద్ధతులనే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఫంక్షన్లలో భోజనాలకు ఆకులతో చేసిన విస్తర్లు/అరటి ఆకులు వేసేవారు. సరుకుల ప్యాకింగ్‌కు పాత పత్రికలు, చిత్తు కాగితాలు వాడేవారు. విస్తర్లు, పేపర్ కవర్ల తయారీ కుటీర పరిశ్రమగా ఉండి ఎంతోమందికి స్వయం ఉపాధి లభించేది. అదేవిధంగా జనపనార ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచాలి. అంటే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పుల స్థానంలో అరటి ఆకులు, స్టీల్, పింగాణీ, గాజు రకం వాడేలా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ పద్ధతుల వాడకం అలవాటు చేసుకోవాలి.
• ప్లాస్టిక్ కవర్ల తయారీ, రవాణా, అమ్మకం, పంపిణీ వంటివి పూర్తిగా ఆగిపోవాలి.
• హోల్‌సేలర్, రిటైలర్, ట్రేడర్, హాకర్, సేల్స్‌మెన్‌తో సహా ఎవరూ ప్లాస్టిక్ కవర్లు అమ్మడం గానీ చేస్తే జరిమానాలు విధించాలి. వరుసగా మూడుసార్లు చేస్తే దుకాణాన్ని సీజ్ చేయాలి.
• ఇళ్లల్లో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి. రాగి, గాజు నీళ్ల సీసాలు వాడాలి.
• పాలు, ఇతర పదార్థాలు, వస్తువుల ద్వారా వచ్చే ప్లాస్టిక్ కవర్లను చెత్తతో కలిపి పారేయకుండా ఒకచోట ఉంచి నెలకోసారి వాటిని పాత సామాన్లు, పాత పేపర్లు కొనేవారికి విక్రయించాలి. ఇలా చేస్తే వాటి రీసైక్లింగ్ సాధ్యమవుతుంది.
• మార్కెట్‌కు వెళ్లేటప్పుడు చేతి సంచీ తీసుకెళ్లడంతోపాటు వాహనాల్లోనూ ఓ సంచీ పెట్టుకోవాలి.
• ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణాలకు జరిమానాలు విధించడంతో పాటు శ్రద్ధతో ప్రజలకు అవగాహన కల్పించాలి.
• కూరగాయలు, ఇతరత్రా కొనేటప్పుడే భూమిలో కలిసి పోయే గుణమున్న చేతి సంచినే వినియోగించాలి.
• ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పును శాశ్వతంగా తొలగించడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. స్పెయిన్‌లోని కాంటాబ్రియా యూనివర్సిటీలో బయోమెడిసిన్- బయోటెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు సింగిల్‌ యూజ్ ప్లాస్టిక్‌ను తినే చిన్న పురుగులను గుర్తించారు. అయితే.. ఆ పురుగులపై ఎంతవరకు ఆధారపడొచ్చు.. వాటితో ఇతర సమస్యలేమైనా తలెత్తుతాయా అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.
• పర్యావరణానికి పెద్ద శత్రువుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛందంగా చైతన్యవంతులై వీటిని వినియోగించడం మానేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలి.
చివరగా చెప్పేదేంటంటే……

ప్లాస్టిక్‌ వాడుక పర్యావరణ ముప్పని తెలుసుకుంటున్నాం!
ప్లాస్టిక్‌ను దొంగచాటుగా విక్రయాలు సాగిస్తూనే ఉన్నాం
ప్లాస్టిక్‌ వినియోగాన్ని మాత్రం నివారించలేకపోతున్నాం!!

శాస్త్రవేత్తల మాటలు కొట్టి చెత్తలో పడేస్తున్నాం
నింగీ, నేలా, గాలీ, నీరు కాలుష్యంతో నింపేస్తున్నాం
సంద్రాలను సైతం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కప్పేస్తున్నాం
మనుగడను మాత్రం ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాం!!

లక్షల లక్షల పక్షులు ప్రాణాలు వదులుతున్నా
మూగ ప్రాణులు ప్లాస్టిక్‌ రక్కసికి బలౌతున్నా?
భూమి అంతర్భాగంలో కరగలేక విషవాయువులు వెలువరిస్తూ మన ఊపిరితిత్తులు తినేస్తున్నా..?
మనలో మాత్రం ప్లాస్టిక్‌ పైన మమకారం చావదెందుకో…?

మనిషి ప్లాస్టిక్‌ కాలుష్య నివారణకు సిద్దమవుదాం
ప్రతి ఒక్కరం ప్లాస్టిక్‌ వాడక నిర్మూలనకై కదులుదాం
గోనె సంచులు, క్లాత్‌ బ్యాగులూ వాడుక చేద్దాం
ప్రకృతి సమతుల్యతను కాపాడుకుందాం
రేపటి తరాలకు మాత్రం ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని కానుకగా ఇద్దాం…..
(వ్యాస ర‌చ‌యిత ఫార్మారంగ నిపుణుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...