జ‌ల‌య‌జ్ఞం – పోల‌వ‌రం

Date:

ఓ సాహ‌సికుని ప్ర‌యాణం
పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్‌
(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)
పెద్ద వారి మ‌ధ్య మాట‌ల తూటాలు ఎలా పేల‌తాయో తెలియ‌చెప్ప‌డానికి ఓ సాహ‌సి ప్ర‌యాణం (జ‌ల‌య‌జ్ఞం..పోల‌వ‌రం) పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం వేదిక‌గా నిలిచింది. కార్య‌క్ర‌మం ఆసాంతం డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ – పోల‌వ‌రం నిర్మాణం చుట్టూ తిరిగింది. ప్ర‌ముఖ పుస్త‌క ప్ర‌చుర‌ణ సంస్థ ఎమెస్కో ఈ పుస్త‌కాన్ని ప్ర‌చురించింది. ఈ కార్య‌క్ర‌మంలో రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్‌, పూర్వ ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్ మీడియా స‌ల‌హాదారు సంజ‌య్ బారు, మాజీ రాజ్య స‌భ స‌భ్యుడు కెవిపి రామ‌చంద్ర‌రావు, ఎమెస్కో అధినేత ధూపాటి విజ‌య్‌కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జై రాం ర‌మేష్ జూమ్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు. జ‌స్టిస్ జాస్తి చ‌లమేశ్వ‌ర్ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. హేమాహేమీలు పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌తో క‌లిసి న‌డిచిన అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌సంగించారు. క్లుప్తంగా వారు చేసిన ప్ర‌సంగాల‌లో వైయ‌స్ఆర్ కృషి, ప‌ట్టుద‌ల ఎలాంటివో వివ‌రించారు. జి. వ‌ల్లీశ్వ‌ర్‌, జ‌ల‌వ‌న‌రుల శాఖ మాజీ కార్య‌ద‌ర్శి భాను, మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీ ర‌మాకాంత్ రెడ్డి, మాజీ ప్రెస్ సెక్ర‌ట‌రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎన్‌. ర‌ఘువీరారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, సిపిఐ మాజీ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌, పార్ల‌మెంటు మాజీ స‌భ్యులు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, త‌దిత‌రులు ప్ర‌సంగించారు. వీరందరి ప్ర‌సంగాలూ ఒక ఎత్త‌యితే.. జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్‌, పుస్త‌క ర‌చ‌యిత డాక్ట‌ర్ కెవిపి రామ‌చంద్ర‌రావుల ప్ర‌సంగాలు మరొక ఎత్తు.


పోల‌వ‌రం పూర్త‌యితే ఏపీ ముఖ‌చిత్ర‌మే మారుతుంది
ఒక న్యాయ‌మూర్తిగా… జాస్తి త‌న ప‌రిధిని నిర్ణ‌యించుకుని మాట్లాడారు. చ‌ట్టం… సంబంధిత అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. రాజ‌కీయ నాయకుల్లా తాము మాట్లాడ‌లేము అన్న తీరులో ఆయ‌న ప్ర‌సంగం సాగింది. ఇందుకు డాక్ట‌ర్ కెవిపి చ‌మ‌త్కారంగా మాట‌ల తూటాల‌తో బ‌దులు ఇచ్చారు. జ‌డ్జిమెంట్ ఇచ్చేట‌ప్పుడు సాక్ష్యాలు మాత్ర‌మే చూస్తార‌నీ, అంత‌కు మించి వారు మిగిలిన విష‌యాల‌ను ప‌ట్టించుకోర‌ని అంటూ కెవిపి అన‌డంతో స‌భ‌లో హ‌ర్ష‌ధ్వానాలు మార్మోగాయి. పోల‌వ‌రం గురించి డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ ప‌డిన క‌ష్టం ఇంకా ఫ‌లితాన్నివ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆయ‌న త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం పూర్త‌యితే ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ చిత్ర‌మే మారిపోతుంద‌న్నారు. రాజ్య స‌భ నుంచి తాను రిటైర‌య్యే వ‌ర‌కూ తాను పోల‌వ‌రం గురించి చేసిన పోరాటాన్ని కెవిపి వివ‌రించారు. పోల‌వ‌రం ముంపు ప్రాంతాల బాధితుల‌ను ఆదుకోవ‌డానికి వైయ‌స్ఆర్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను ప‌ర్యావ‌ర‌ణవేత్త‌ మేథా పాట్క‌ర్ సైతం ప్ర‌శంసించార‌ని కెవిపి అన‌గానే స‌భ‌లో చ‌ప్ప‌ట్లు మార్మోగాయి. అస‌లు తాను ర‌చయిత అవ‌తారం ఎత్తాల్సి వ‌స్తుంద‌ని అనుకోలేద‌నీ, చ‌రిత్ర‌ను గ్రంథ‌స్థం చేయాల్సిందేన‌న్న ఎమెస్కో విజ‌య‌కుమార్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కె. రామ‌చంద్ర‌మూర్తి కార‌ణంగానే తాను త‌న అనుభ‌వాల‌ను ప్రోది చేశాన‌నీ, కొంద‌రి స‌హ‌కారంతో అది పుస్త‌క రూపం దాల్చింద‌ని చెప్పారు.

ప్ర‌సంగం మ‌ధ్య‌లో ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టు సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు మంతెన సూర్య‌నారాయ‌ణ రాజు పేరును సైతం ప్ర‌స్తావించారు. ఆయ‌నకు నివాళిగా ఒక నిముషం మౌనం పాటించాల‌ని స‌భికుల‌ను కోరారు. పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంలో డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ ఎంత దృఢ నిశ్చ‌యంతో ప‌నిచేశారో ఉదాహ‌ర‌ణ‌ల‌తో వివ‌రించారు కెవిపి. విభ‌జ‌న చ‌ట్టంలో పోల‌వ‌రం గురించి చేసిన అంశాల‌ను చ‌దివి వినిపించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తుండ‌డం ఆవేద‌న క‌లిగిస్తోంద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఆనాడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ చేసింది మిన‌హా ఈనాటి నేత‌లు చేసిందేమీ లేద‌ని.. క‌నీసం ఆ కృషిని కొన‌సాగిస్తే చాలున‌ని అన్నారు. నాడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ ప‌టిష్ట‌మైన పునాది వేసి ఉండ‌క‌పోతే మ‌రో వెయ్యేళ్ళ‌యినా ప్రాజెక్టు పూర్త‌య్యేది కాద‌న్నారు డాక్ట‌ర్ కెవిపి. డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ క‌న్నుమూయ‌డానికి స‌రిగ్గా ప‌దిరోజుల ముందు ఒక్క ప‌వ‌ర్ ప్రాజెక్టుకు మిన‌హా పోల‌వ‌రం ప్రాజెక్టుకు అన్ని అనుమ‌తులూ వ‌చ్చాయ‌నీ చెప్పారు.


అనుమ‌తి అదే వ‌స్తుంద‌న్నారు వైయ‌స్ఆర్
కాల్వ‌లు తవ్వేయండ‌ని ఓ రోజు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ త‌నను ఆదేశించార‌ని అప్ప‌టి జ‌ల‌వ‌నరుల శాఖ కార్య‌ద‌ర్శి భాను చెప్పారు. అనుమ‌తి లేకుండా ఎలా త‌వ్వడం సార్‌… ఇబ్బందులొస్తాయ‌న్న‌ప్పుడు… తవ్వేయండి… అనుమ‌తులు అవే వ‌స్తాయ‌న్నారంటూ వివ‌రించారు. ఆయ‌న అన్న‌ట్లే పోల‌వ‌రం ప్రాజెక్టుకు అన్ని అనుమ‌తులూ వ‌చ్చాయ‌న్నారు. ప్రాజెక్టు క‌ట్ట‌కుండా కాల్వ‌లు తవ్వే కాన్సెప్టే త‌మ‌కు కొత్త‌గా అనిపించిందనీ, చ‌రిత్ర‌లో ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేద‌ని కూడా ఆయ‌న వివ‌రించారు.


ఎవ‌రు… ఎవ‌రికిచ్చారు?
జాతీయ హోదా సాధించిన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను ఎవ‌రు ఎవ‌రికి ఇచ్చారో ఇంత‌వ‌ర‌కూ క్లారిటీ లేద‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు. అస‌లు ఈ విష‌యం తేలితే ప్రాజెక్టు నిర్మాణం చ‌క‌చ‌కా సాగుతుంద‌న్నారు. కేంద్ర‌మేమో రాష్ట్రం తామే క‌ట్టుకుంటామ‌ని అంటోంద‌నీ, కేంద్ర‌మే త‌మ‌ను క‌ట్టుకోమంద‌ని అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అంద‌నీ…. ఈ విష‌యంలో క్లారిటీ లేక‌పోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ క‌ల‌.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న‌ది ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్. జ‌గ‌న్ చొర‌వ‌తీసుకుని ప్రాజెక్టును పూర్తిచేస్తే… తండ్రి రుణం తీర్చుకున్న‌ట్ల‌వుతుంద‌ని అన్నారు ఉండ‌వ‌ల్లి. 1981 నుంచి పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ తీరుతెన్నుల‌ను ఆయ‌న పూస‌గుచ్చినట్లు వివ‌రించారు. డ‌యాఫ్రం వాల్ కొట్టుకుపోవ‌డం గురించి, చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కురిపించారు. అస‌లు కాఫ‌ర్‌ డ్యాం క‌ట్ట‌కుండా డ‌యాఫ్రం వాల్ క‌ట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. డ‌యాఫ్రం వాల్ నీళ్ళ‌లో ఉంటుంది…. కాఫ‌ర్ డ్యాం క‌ట్ట‌క‌పోతే అది కొట్టుకుపోక ఏమ‌వుతుంద‌న్నారు. ఈ సంఘ‌ట‌న ప్రాజెక్టు పూర్త‌యిన త‌ర‌వాత జ‌రిగి ఉంటే న‌ష్టం అపారంగా ఉండేద‌నీ, రాజ‌మండ్రి ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డేద‌నీ అన్నారు ఉండ‌వ‌ల్లి.


వ‌ద్ద‌న్నా విన‌కుండా గోదావ‌రిలో దూకారు
పాద‌యాత్ర స‌మ‌యంలో డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ కొవ్వూరు ద‌గ్గ‌ర గోదావ‌రి నీటిలో తాను వ‌ద్ద‌న్నా దూకార‌ని చెప్పారు. నీటిని చూసేట‌ప్ప‌టికి కొంద‌రు యువ‌కులు గోదావ‌రిలో దూక‌డం చూసి, ఆయ‌న కూడా అందుకు సిద్దమ‌య్యారన్నారు. సూర్యుడు న‌డిమింట ఉండ‌గా గోదావరి నీటిలో దూకితే, ఎక్క‌డ లేని వ్యాధులూ సంక్ర‌మిస్తాయ‌ని తాను చెప్పాన‌నీ కానీ ఆయ‌న విన‌లేద‌నీ అన్నారు. చివ‌ర‌కు ఆయ‌న‌ను చిన్న‌పిల్లాడిని తీసుకొచ్చిన‌ట్లు గోదావ‌రి నీటినుంచి బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు తీసుకురావాల్సి వ‌చ్చింద‌న్నారు. మండుటెండలో నీటి స్నానం చేసిన ఫ‌లితంగా తీవ్ర జ్వ‌రం వ‌చ్చి, మ‌రుస‌టి రోజున ఆయ‌న వ‌డ‌దెబ్బ బారిన ప‌డ్డార‌ని ఉండ‌వ‌ల్లి నాటి అనుభ‌వాన్ని వివ‌రించారు.
ఈ స‌భ‌లో మ‌రెంద‌రో హేమాహేమీలు ప్ర‌సంగిస్తూ వైయ‌స్ఆర్‌తో త‌మ అనుభ‌వాల‌ను తెలియ‌జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...

Fulfil drinking water needs of Hyderabad: CM

Revanth warns Millers and Traders of cancelling license  Hyderabad:  Chief...

“Who killed the rule of law?”: Highlighting Points

Book Written by Justice R.C. Chavan, Former Judge Bombay...