అభివృద్ధిలో శిఖ‌రాగ్రాన తెలంగాణ‌

Date:

సాధించిన విజ‌యాలెన్నో
అన్నింటా దేశంలో అగ్ర‌గామిగా నిలిచాం
అవ‌త‌ర‌ణ దినోత్స‌వంలో సీఎం కేసీఆర్‌
హైద‌రాబాద్‌, జూన్ 2:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగంలో అన్ని రంగాల‌నూ స్పృశించారు. ఆయ‌న ప్ర‌సంగం పూర్తి పాఠం…ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి. 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది.
ప్రతీ విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్తు సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటి రంగాల ప్రగతిలో ఇలా అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం.
అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారింది. ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే ఇదంతా సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం.
కఠినమైన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 2014 నుంచి 2019 వరకు 17.24 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, కరోనావంటి విపత్తులు తలెత్తుతున్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోంది.
కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా దక్షతకు దక్కిన గుర్తింపు.
2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీ.ఎస్.డి.పి., 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది.
తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1 లక్ష 49 వేల 848 రూపాయలకంటే ఇది 86 శాతం అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం శుభ పరిణామం.


కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. ఈనాడు రాష్ట్రంలో అన్ని రంగాలకూ నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్ కోతలతో, పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన విషయం మనకు తెలుసు.
రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది.
2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. ఇక జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికంగా ఉంది.
మిషన్ భగీరథ
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నపుడు పల్లెలు సాగునీటి కోసమే కాదు, తాగునీటి కోసం కూడా తల్లడిల్లాయి. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది. చిన్న వయస్సులో నడుం వంకరపోవడం, బొక్కలు విరగడం, కాళ్ళు వంకర తిరగడం లాంటి సమస్యలతో నల్లగొండ బిడ్డలు సతమతమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. నేడు రాష్ట్రంలోని 100 శాతం ఆవాసాలలో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తిచేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. తెలంగాణ అమలుపరచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించి వెళ్ళడం మనందరికీ గర్వకారణం.
ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతం లేదు. నీటికోసం బిందెలతో మహిళలు బారులుతీరిన దృశ్యాలు లేవు. మంచినీటి యుద్ధాలు లేవు. ప్రజల దాహార్తి తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనం.
వ్యవసాయం నేడు పండుగ
సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. సాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు.
అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించిన నాకు ఆనాడు రైతాంగం దుస్థితిని చూసి మనసు వికలమైంది. కృష్ణా, గోదావరి నదులు మన ప్రాంతంగుండా ప్రవహిస్తున్నా సాగునీటికి నోచని రైతుల దుస్థితి చూసి చలించిపోయాను. అందుకే, స్వరాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయరంగంపైనా, రైతుల సంక్షేమంపైన ప్రత్యేక దృష్టిని సారించాను. రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, పథకాలూ అమలులోకి తేవటంతో నేడు మన రాష్ట్రం ‘సజల సుజల సస్యశ్యామల తెలంగాణ’ గా మారింది.
రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతురుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రతీ ఐదువేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్ గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించటం, రైతువేదికల నిర్మాణం, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితిల ఏర్పాటు, పంటకాలంలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, విధివశాత్తూ అసువులు బాసిన రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు రైతుబీమా, ప్రాజెక్టులు నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించడం, నీటి తీరువా బకాయిల రద్దు చేయటం, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీటి సరఫరా చేయటం ద్వారా నేడు వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించగలిగాం. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలోనూ రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేనేలేవంటే అతిశయోక్తి కాదు. నేడు ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి.


తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయరంగానికి శతాబ్దాలుగా ఆదరువుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై, పూడిపోయి, గట్లు తెగిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్ కాకతీయ పేరుతో పెద్దఎత్తున ఈ చెరువులను పునరుద్ధరించుకున్నాం. 15 లక్షలకుపైగా ఎకరాల సాగుభూమిని స్థిరీకరించుకున్నాం. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. ఈ చెరువులన్నింటికీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసిన ఫలితంగా నేడు నిండు వేసవిలో కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. చెరువులు అభివృద్ధి చెందటంతో చేపల పెంపకం జోరందుకుని, మత్స్యకారులు పెద్ద ఎత్తున లబ్ది పొందుతున్నారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకున్నం. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వఘట్టం. కేవలం మూడేళ్ళలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తోంది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి.


ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగర్. దీని నిల్వ సామర్థ్యం 50 టి.ఎం.సి.లు. కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి మొక్కు తీర్చుకున్నాం. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంతోపాటు, సస్యశ్యామల తెలంగాణను కూడా కన్నుల పండుగగా చూసుకోగలగటం మనందరికీ గర్వకారణం.
తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85.89 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలు, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాం లు, ఆనకట్టలు, కత్వలు, చిన్న, పెద్ద ఎత్తిపోతల పథకాలు ఒకే గొడుగు కిందకి తెచ్చి సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే ధ్యేయంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాం.
దళితబంధు– ఒక గొప్ప సామాజిక ఉద్యమం
సమాజంలో అనాదిగా అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే ధ్యేయంగా, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా, తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నాం.దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించాలని, దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆ లక్ష్య సాధనకోసం నేనే స్వయంగా దళితబంధు పథకానికి రూపకల్పన చేశాను. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇది రుణం కాదు. తిరిగి చెల్లించే పనిలేదు. పూర్తి గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన వచ్చిన పనిని లబ్దిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. అంతేకాదు కొందరు లబ్దిదారులు ఒక సమూహంగా ఏర్పడి కూడా వ్యాపార ఉపాధి మార్గాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు. ఏ విషయం లోనూ లబ్దిదారునిపై ఎటువంటి ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ కూడా ఏర్పాటు చేస్తున్నది. దళితబంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబం ఆ ఆపద నుండి తేరుకొని తిరిగి ఆర్థికంగా, మరింత పటిష్టంగా నిలదొక్కుకోవడానికి ఈ నిధి దోహద పడుతుంది.


దీనితో పాటుగా, దళితబంధు లబ్ధిదారులు వివిధ వ్యాపార రంగాలలో పైకి ఎదిగేందుకు వీలుగా, ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకొనే లాభదాయక వ్యాపారాలైన మెడికల్ షాపులూ, ఫెర్టిలైజర్ షాపులూ, వైన్ షాపులూ, హాస్టళ్ళూ, హాస్పిటళ్ళకు సరఫరా చేసే, వివిధ రకాల కాంట్రాక్టులలో ప్రభుత్వం దళితులకు పదిశాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది.
రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఏడాది దళితబంధు అమలు కోసం బడ్జెట్ లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ఒక ఉత్తమ లక్ష్యంతో, మహోన్నత ఆశయంతో, ఉద్యమ స్ఫూర్తితో అందిస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
గూడు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను తీర్చడమే కాకుండా గౌరవ ప్రదమైన నివాసాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. దేశంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం ఇప్పటివరకు 2 లక్షల 91 వేల ఇండ్లు మంజూరు చేసింది. ఇందుకోసం 19,126 కోట్ల రూపాయలు కేటాయించింది. స్వంత స్థలం కలిగిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి దశలవారీగా 3 లక్షల రూపాయలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారునికి అందే వరకూ ఈ పథకం అమలవుతుంది.


విద్యారంగం
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ వికాసం కోసం మొదటిదశలో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్థినీ, విద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం “మన ఊరు – మన బడి” అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. వర్తమాన కాల అవసరాలకు తగినట్టుగా పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయల వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధిపనులు చేపడతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించింది.
ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నది.
రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .


ఆరోగ్యరంగం
రాష్ట్ర ప్రజలు చక్కటి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించాలన్నదే ప్రభుత్వ ఆశయం. అందుకోసమే తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషిచేస్తోంది. ప్రజావైద్యం, ఆరోగ్య రంగాలలో రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిస్తోంది.
తెలంగాణ అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముందుగా ప్రభుత్వ హాస్పటిళ్ళలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచింది.
అధునాతన వైద్యపరికరాలు సమకూర్చింది. 57 వైద్యపరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారి కోసం 42 ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేసింది. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రం లోని అన్ని బెడ్స్ ను ఆక్సీజన్ బెడ్స్ గా మార్చింది. 56 వేల ఆక్సీజన్ బెడ్లు నేడు రాష్ట్రం లో అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆసుపత్రులలో హార్ట్ సర్జరీల కోసం క్యాథ్ ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు సైతం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుత్రులలో పడకల సంఖ్య పెంచడం, ఉత్తమ వైద్యసేవలతోపాటు రోగులకు మంచి పౌష్టికాహారం అందించడానికీ, పారిశుధ్య ప్రమాణాలు పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచింది. ప్రభుత్వం జి.హెచ్.ఎం.సి పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు కూడా ఐదు రూపాయలకే భోజనం అందజేస్తున్నది.
గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ కు తీసుకురావడం ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసం ప్రభుత్వం 300 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడం లోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
మాతా శిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలనిచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి 13,000 రూపాయలను, మగపిల్లవానికి జన్మనిచ్చిన తల్లికి 12,000 రూపాయలను ఈ పథకం ద్వారా అందజేయడం జరుగుతున్నది. అదనంగా మాతా, శిశు సంరక్షణకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్టును కూడా ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటివరకు 13 లక్షల 30వేల మంది మహిళలకు లబ్ది చేకూరింది. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుండి 56 శాతానికి పెరిగింది. మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది శుభ పరిణామం.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బస్తీలలో నివసించే పేదల సమీపంలోకి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీదవాఖానాలను కొత్తగా ప్రారంభించబోతున్నది. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలలో ప్రాథమిక వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటుచేస్తున్నది.


నగరవాసులతో పాటూ ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవిధంగా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆధ్వర్యం లో హైదరాబాద్ నగరం నాలుగుచెరగులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీనిలో భాగంగా 2,679 కోట్ల రూపాయల వ్యయంతో అల్వాల్, ఎల్.బి.నగర్, సనత్ నగర్, గచ్చిబౌలీలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళను నిర్మిస్తున్నది. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటవుతాయి. ఈ ఆసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో పాటు వైద్య విద్యనందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. 16 స్పెషాలిటీలు, 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పి.జి కోర్సులు, నర్సింగ్, పారమెడికల్ కోర్సుల్లో విద్యనందిస్తారు. నిమ్స్ హాస్పిటల్లో మరో రెండువేల పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిమ్స్ లో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి.
వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో రెండువేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యలో మానవీయ కోణమే దర్శనమిస్తుంది. వైద్యం కోసం హైదరాబాద్ కు వచ్చినవారు ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే, మృతదేహాన్ని ప్రభుత్వ అంబులెన్సులలో ఇంటివద్ద వదిలిపెట్టేందుకు ప్రభుత్వం పరమపద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని కేంద్రప్రభుత్వం అనేక సార్లు ప్రశంసించింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావడం, ప్రభుత్వ పనితీరుకు ప్రబల నిదర్శనం.
తెలంగాణ ప్రాంతంలో గతంలో కేవలం మూడు మాత్రమే ఉన్న వైద్య కళాశాలలను ఇకపై జిల్లాకి ఒకటి ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రాగల రెండేళ్లలో ఈ లక్ష్యం నేరవేరనుంది.


అరచేతిలో ఆరోగ్యం
రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్ ఫోన్లలో చూసుకొనే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వ వైద్యశాలలు, డయాగ్నస్టిక్ కేంద్రాలలో ఎక్కడైనా ఒక చోట పరీక్షలు చేయిస్తే పరీక్షల రిపోర్టుల వివరాలు ఈ ఆప్ లో పొందు పరుస్తారు. ఆ తర్వాత రాష్ట్రం లో ఏ ఆస్పత్రికి వెళ్ళినా ఈ రిపోర్టుల ఆధారంగా డాక్టర్లు వైద్యసేవలు అందిస్తారు.
భారీగా నియామకాలు
తెలంగాణ పోరాట నినాదమే నీళ్ళు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మన నిధులు మనకే దక్కుతున్నాయి. రాష్ట్రం అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. గడిచిన ఎనిమిదేళ్ళలో 1 లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నం. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీచేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగుల సేవలను మానవతా దృష్టితో క్రమబద్ధీకరించి, ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్తవారితో భర్తీ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరపటం ద్వారా తెలంగాణ యావద్దేశానికి ఆదర్శంగా నిలిచింది.
ప్రభుత్వం ఉద్యోగార్థుల వయోపరిమితిపై 10 సంవత్సరాలు సడలింపు నిచ్చింది. ఇప్పటికే వివిధ శాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ కూడా ప్రారంభమైంది. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షలలో పోటీపడేందుకు వీలుగా మధ్యమధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి కావల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తున్నది. దీనికోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించింది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం. ఈ సవరణ వల్ల ఇకనుంచి అటెండర్ నుంచి, ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలవుతుంది. ఈ విధంగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ.
ఒకేసారి ఇంతపెద్ద మొత్తంలో ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం, ఉద్యోగార్థులైన యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమం అమలు చేస్తోంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడంతోపాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నది. అదే విధంగా బి.సి. స్టడీ సర్కిళ్ళలోనూ శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది


వృత్తులకు ప్రోత్సాహం
సమైక్యపాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణనిచ్చి ఆదుకుంటున్నది. ఇందులో భాగంగా మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలో అవకాశమున్న ప్రతి చోటా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నిర్మాణం తరువాత రిజర్వాయర్లు నిండి చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. చేపల పెంపకానికి విస్తృత అవకాశం లభిస్తున్నది
దీంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. వారి జీవితాలలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేపల దిగుమతి కూడా తగ్గింది. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని వివిధ జలాశయాలలో ప్రభుత్వమే రొయ్యలు, చేపపిల్లను వదలి మత్య సంపదను అభివృద్ధి చేస్తోంది. గంగపుత్ర, ముదిరాజ్ కులాలవారికి ఉచితంగా చేపలు పట్టుకొనే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో 25.782 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించబడింది.
రాష్ట్రంలో గొల్ల కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. నేడు రాష్ట్రంలో గొర్రెల మందలు పెద్ద సంఖ్యలో పెరిగి, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ స్వావలంబన సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గొల్ల కురుమలు మన రాష్ట్రాన్ని గొర్రెల పెంపకంలో నంబర్ వన్ గా నిలిపారు. వారి ఆదాయం కూడా బాగా పెరిగింది.
గౌడ సోదరుల సంక్షేమం కోసం తాటి చెట్లపై పాత పన్ను బకాయిలు మాఫీ చేయడమే కాకుండా, శాశ్వతంగా చెట్ల పన్ను రద్దు చేసింది. మరణించిన లేదా అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం 50 వేల నుండి 5 లక్షల రూపాయలకు పెంచింది.
మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకు 393 మంది గౌడ సోదరులకు లైసెన్సులు లభించాయి. తాటిచెట్ల నుంచి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ డ్రింక్ గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలుచేస్తోంది.
దోబీఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీ పనిని అప్పగించటంతోపాటూ నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. నేతన్నలకు కూడా రైతన్నల మాదిరిగానే ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ వృత్తులకు ప్రత్యేక ప్రేరణనిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆయా వర్గాలవారి ఆదాయం గణనీయంగా పెరగడం సంతోషాన్నిస్తున్నది.


మైనారిటీల సంక్షేమం
తెలంగాణ ప్రాంతం సర్వమతాల, సంస్కృతుల సంగమస్థానం. ప్రభుత్వం సకలమతాలను సమభావంతో ఆదరిస్తున్నది. తెలంగాణా గంగా జమునా తెహజీబ్ ను కొనసాగిస్తున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే. ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటుచేసింది. మైనారిటీ బాలికల కోసం 50 శాతం గురుకులాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనివల్ల మైనారిటీ బాలికల ఎన్ రోల్ మెంట్ గతంలో 18 శాతంగా ఉంటే, నేడది 42 శాతానికి పెరిగింది. బతుకమ్మ బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. సకల జనులలో సంతోషాన్ని నింపుతున్నది.
సంస్కరణలతో పాలన పరుగులు
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పరిపాలన అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం వివిధ సంస్కరణలు చేపట్టింది. ఈ సంస్కరణల ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతున్నాయి. భూవివాదాల పరిష్కారానికి తగిన సంస్కరణలు తెచ్చింది. భూ రికార్డులు ప్రక్షాళనచేసి, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించింది. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ రూపొందించింది. దీంతో ప్రజలకు ప్రయాస లేకుండా, సులభతరంగా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ధరణి పోర్టల్ భూ పరిపాలనలో నవశకానికి నాంది పలికింది.
రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు కొత్త డివిజన్లు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. “మా గూడెంలో మా పాలన – మా తండాలో మా పాలన” అనే ఎస్టీ సామాజిక వర్గాల చిరకాల వాంఛకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,146 మంది గిరిజనులు కొత్తగా సర్పంచులయ్యారు. ప్రభుత్వం ఈ పంచాయతీలకు సొంత భవనాలను కూడా నిర్మిస్తున్నది. 30 జిల్లాల్లో అన్ని హంగులతో అధునాతన వసతులతో సమీకృత కలెక్టర్ కార్యాలయాలను నిర్మిస్తున్నది. ఇందులో ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో శాసనసభ్యుల కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మాణమయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తోంది. ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏడు అంతస్తుల భవనం రూపుదిద్దుకుంటోంది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభించడానికి వీలుగా నిర్మాణపనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తయితే, ప్రజలకు ఇంకా మెరుగయిన సేవలు అందుబాటులోకి వస్తాయి.
పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత రమ్యంగా, వైభవంగా తీర్చిదిద్దుకున్నాం. వెయ్యి ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఇదే విధంగా తీర్చిదిద్దుకుందాం.
రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన జలాశయాలన్నీ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలలోనే ఉండటం మన అదృష్టం. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న జలాశయాలన్నింటినీ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతూ, పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం సర్క్యూట్ టూరిజం అభివృద్ధికోసం ఇటీవల బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయలు కేటాయించింది.
పారిశ్రామిక వేత్తలకు స్వర్గధామం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. అతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి.ఎస్. ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా, రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్ళలో మొత్తం 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయి. 16 లక్షల 48 వేల 956 ఉద్యోగాల కల్పన జరిగింది.
ఇక ఐ.టి రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐ.టి పరిశ్రమలు నేడు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయి. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐ.బి.ఎం, కాగ్నిజెంట్, అమేజాన్, ఒరాకిల్ వంటి అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ఐ.టిరంగ ఎగుమతుల విలువ 1 లక్షా 83 వేల 569 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఐ.టి రంగంలో మనం సాధించిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల శాఖ రూపొందించిన సుపరిపాలన సూచిలో మన రాష్ట్రం పరిశ్రమలు-వాణిజ్య రంగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఎనిమిదేళ్ళలో ఐటి రంగంలో నూతనంగా 7 లక్షల 78 వేల 121 ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక, ఐటీ రంగాలలో కలిపి 24 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది.
ఉద్యోగులతో స్నేహ భావం
తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రం అవతరించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్ ను మంజూరు చేసింది. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్మెంట్ అందించింది. కరోనా కష్టాలు వెంటాడుతున్నా సరే కొత్త పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించి అమలుచేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న యావత్ ప్రభుత్వ సిబ్బందికి ఈ 30 శాతం వేతనం పెంపును ప్రభుత్వం వర్తింపచేసింది. నేడు దేశంలో అత్యధిక స్థాయి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే, వారు మన తెలంగాణ ఉద్యోగులని సగర్వంగా తెలియజేస్తున్నాను.
మన పల్లెలు – ప్రగతికి పట్టుగొమ్మలు
ఎప్పుడైనా, ఎక్కడైనా విధ్వంసం అనంతరం ఆయా వ్యవస్థలను పునర్ నిర్మించుకోవడం అంత తేలికైన పనికాదు. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో వివిధ రంగాలలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగుచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి వస్తోంది. అదే సందర్భంలో మన రాష్ట్రాన్ని మనం బాగుచేసుకోవడంలో ఆనందం కూడా ఉంది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రూపొందించి అమలుపరచడం ద్వారా మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయనడంలో అతిశయోక్తి లేదు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామీణ, పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగింది. గ్రామీణ స్థానిక సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెలా 256 కోట్ల 66 లక్షల రూపాయల నిధులు నేరుగా విడుదల చేస్తున్నది. ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను అందించి, చెత్త, ఇతర వ్యర్థాల నిర్వహణ కోసం డంపు యార్డు, మృతులకు సగౌరవంగా అంత్యక్రియల కోసం ఆధునిక వసతులతో వైకుంఠధామాలను సైతం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దోవకిరువైపులా పచ్చని చెట్లు, నర్సరీలు, ప్రకృతి వనాలతో పల్లెలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పచ్చదనం, పారిశుధ్యం వెల్లివిరుస్తున్న తెలంగాణ గ్రామాలు, గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. గ్రామీణ జీవన ప్రమాణాలలో గుణాత్మకమైన అభివృద్ధి వచ్చింది. ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలకు నేడు దేశవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు, ఆదరణ లభిస్తున్నది. రెండు పర్యాయాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పదిగ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంతరంగా నిర్వహిస్తోంది. తిరిగి మరో దఫా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్నాయి. భవిష్యత్ తరాలు శరీర దారుఢ్యంతో, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు నుంచే ఎంపిక చేసిన కొన్ని గ్రామాలలో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సాధించిన ప్రగతిపైన ఇటీవల కొన్ని జాతీయ మీడియా సంస్థలు కార్యక్రమాలు ప్రసారం చేశాయి. అది చూసిన ఇతర రాష్ట్రాలవారు ఆశ్చర్యంతో, ఇంత తక్కువ కాలంలో ఇంతటి అభివృద్ధి ఎలా సాధ్యమైందని ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. మనం అనతికాలంలోనే అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించగలిగామంటే, అందుకు సహకరించిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను.
రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది కాలంలో అత్యంత అభివృద్ధిని సాధించి, తెలంగాణలోని ప్రతి పౌరుని హృదయంలో గొప్ప స్థానాన్ని ప్రభుత్వం సంపాదించుకుంది. చిత్తశుద్ధి, నిబద్ధత, ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఎనలేని శ్రద్ధ, పాలనలో పారదర్శకత, నిర్ణయాలలో మానవీయకోణంతో పాటూ కార్యక్రమాల అమలులో గట్టి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. అనతి కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడింది. రాష్ట్రంలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి.
57 ఏళ్ళకే పింఛన్
అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకు అనుగుణంగానే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హత వయస్సును 57 ఏళ్ళకు తగ్గించుకున్నం. దీనివల్ల మరింత మంది నిస్సహాయులకి ఆసరా అందనుంది. ప్రభుత్వం పింఛను పొందేవారి సంఖ్య మాత్రమే కాదు, పింఛను మొత్తాన్ని కూడా భారీగా పెంచి అమలుచేస్తున్నది.
పేదింటి ఆడబిడ్డను తల్లిదండ్రులు గుండెలపై కుంపటిగా భావించే పరిస్థితి ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 51 వేల రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పుడు 1 లక్షా నూటపదహార్లు అందిస్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 11 లక్షల 44 వేల మంది ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సహాయం అందింది. బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది
ఇవేవీ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు కావు. కానీ, పేదల కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వం మానవతా హృదయంతో అమలులోకి తెచ్చిన పథకాలివి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు.. ఎనిమిదేళ్ళ చిరు ప్రాయంలో రాష్ట్రం సాధించిన విజయాలలో ఇప్పటి వరకూ నేను పేర్కొన్నవి కొన్ని మాత్రమే.
కేంద్రం వివక్షపై నిరంతర పోరాటం
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరం. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళ నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టింది. దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మనం కోల్పోయాం. దీంతో కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆనాటి నుంచి నేటివరకూ మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తున్నది.
ఐదేళ్ళపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. మన హైకోర్టు మనకు ఏర్పాటైన తరువాత అవసరమైన సిబ్బందిని, నిధులను, భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నాం. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు.
కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కొన్నదో అందరకీ తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క నయా పైసా అదనంగా ఇవ్వలేదు. పైగా, న్యాయంగా రావల్సిన నిధులపై కూడా కోత విధించింది.
కేంద్రప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ, ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో తగని జాప్యం చేస్తోంది.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రాత్సాహకాలు ఇవ్వాలని ఏ.పి పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొంది. కానీ, కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు ఏవీ ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదు.
తెలంగాణలో ఐ.టి.ఐ.ఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. ఇది అమలుచేసి ఉంటే ఐ.టి రంగం మరింతగా పురోగమించి ఉండేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించి వుండేవి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని స్పష్టంగా పేర్కొన్నది. కానీ, ఇపుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తున్నది.
ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన మన వైద్య విద్యార్థులకు ఎదురయిన దుస్థితి మనకు తెలుసు. వీరంతా మన దేశంలోనే వైద్యవిద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ కూడా రాశాను. మన రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్యకు అయ్యే ఖర్చును భరించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలియజేశాను. కానీ, కేంద్రం నుంచి దీనికి ప్రతిస్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మిగిలిపోవడం విషాదం. ఈ విషయంలో కేంద్రం ఉదాసీనతను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తున్నది.
ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఫల్యం
తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అసమర్థతతో చేతులెత్తేసింది. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని నాతో సహా ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేసినం. అయినా ఫలితం లేకపోవడంతో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలసి ఢిల్లీలో ఒకరోజు జరిపిన నిరశన దీక్షలో నేను స్వయంగా పొల్గొన్నాను. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ కూడా మనకు మద్దతుగా ఈ దీక్షలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై 24 గంటల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తే సానుకూలంగా జవాబు రాలేదు. స్పందన లేదు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడిండు. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి.
దేశంలో రైతులు భిక్షగాళ్ళు కాదు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి. లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారు.
ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాను. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
కేంద్రం మొండి చెయ్యి చూపినా మన రైతాంగాన్ని ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటం విద్యుక్త ధర్మంగా భావించి, రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించింది.
ధాన్యం దిగుబడి, కొనుగోళ్ళలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించింది. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి నేను భరోసా ఇస్తున్నాను.
కుట్రపూరితంగా రాష్ట్రాలను బలహీనపరుస్తున్న కేంద్రం
ప్రపంచ దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల పర్యవసానంగా రాచరిక, నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయి. అత్యధిక దేశాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ, పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నాయి. పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం పరిణతి చెందేకొద్దీ ఆయా దేశాలు అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారికతను పెంపొందించాయి. పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. కానీ మన దేశంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. విశాలతరం కావల్సిన సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నది. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించింది. ఇప్పటివరకూ కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాశాయి. అధికారాలను నిస్సిగ్గుగా హరించాయి.
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కేంద్రం పరిధిలోని అధికారాలనూ, రాష్ట్రాల పరిధిలోని అధికారాలనూ స్పష్టంగా నిర్వచించింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలను నిర్దేశించింది.
దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతున్నది. రాష్ట్ర జాబితా తరుగుతున్నది. రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల స్వయంప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నది. గతంలో కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన సర్కారియా మరియు పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయి. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల నివేదికలను బుట్ట దాఖలు చేశాయి. ఇప్పటివరకూ దేశాన్ని ఏలిన ఈ ప్రభుత్వాలు అనుసరించిన ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏరకంగానూ మంచి చేయజాలకపోగా, దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయి.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకున్నది.
కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితం. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది. ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది.
రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయింది. కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
కేంద్రానికి తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలుచేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయింది. మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తోంది. ఈ 25 వేల కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బాయిలకాడ మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణమున్నంతకాలం రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం.
ఈనాడు దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నది. 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్ర్యబాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది ? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యం. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి.
మనతో పాటు స్వాతంత్ర్యం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్ లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నం. ఇప్పడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతున్నది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా పోయాయి. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పెట్రేగి పోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనుకకు తీసుకపోవడం ఖాయం. దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.
నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. భారత దేశంలో ప్రజలకు కావల్సింది కరెంటు, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి.
ఆజన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం నా విధి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం కూడా మనందరి బాధ్యత. ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజీపడే ధోరణేలేదు. రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్ళమా? మృత్యువు నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్ళమా?
సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారత దేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు అగ్రభాగాన నిలవాలి. దేశంలో గుణాత్మక పరివ‌ర్తనను సాధించే శక్తియుక్తులను ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ – జై హింద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...