Monday, September 26, 2022
HomeArchieveఏపీలో పొడుస్తున్న రాజకీయ పొత్తులు!

ఏపీలో పొడుస్తున్న రాజకీయ పొత్తులు!

(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధ‌ర్‌)
జగన్ రాజకీయ ఆలోచనల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసి పార్టీ స్ట్రాటజీల్నీ బయటకు కొత్త పద్దతిలో చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని మీడియాతో చెప్పుకొచ్చారు. ముందస్తు సంకేతాలు పంపాలని అనుకున్నారు కాబట్టే చెప్పారని భావిస్తున్నారు. మాములుగా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి. ఏడాదిలో వచ్చే చాన్స్ లేదు. తెలంగాణలో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. ఓ ఆరు నెలల ముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అందుకే కొత్తగా ఏడాదిలో ఎన్నికలు అని చెబుతున్నారని అంటున్నారు. పరిపాలనా, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను చూస్తే జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తార‌ని టీడీపీ కూడా నమ్ముతోంది. అందుకే రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఏపీలో పార్లమెంట్‌తో పాటు కాకుండా విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.


పొత్తుల‌పై బాబు ప‌రోక్ష వ్యాఖ్య‌లు
చంద్రబాబు పొత్తుల విషయంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రజా ఉద్యమం రావాల్సి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీతో పొత్తును ఉద్దేశించి అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వం అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. విపక్షాలు వేరువేరుగా పోటీ చేయడం ద్వారా ఓట్లు చీలే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల విపక్షాలు ఏకమై పోటీచేస్తే జగన్ ప్రభుత్వం గెలిచే అవకాశాలు దాదాపు శూన్యం అనే అభిప్రాయం కూడా ప్రజల్లో విస్తృతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు నుండే చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అన్న విశ్లేషణలు చంద్రబాబు వ్యాఖ్యలపై వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో జనసైనికుల నుండి మాత్రం ఊహించనంత సానుకూల స్పందన లేదు. ఇదే సమయంలో పవన్ కొత్త రాజకీయ సమీకరణం పార్టీ ద్వారా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తమతో కలిసొచ్చే వర్గాలతో పాటుగా – బీసీ – ఎస్సీ – ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కలిపి ప్రతీ జిల్లాలోనూ జనసేన పొలిటికల్ కమిటీలు ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ఓట్ల విషయంలోనూ ఆశించిన స్థాయిలో పార్టీకి ఓటింగ్ జరగలేదని పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో..ఈ సారి కాపు నేతలతో పాటుగా బీసీ – ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త సమీకరణం తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో మాత్రం బీజేపీతో ఇప్పటి వరకు పొత్తు కొనసాగుతోంది. ఇటు పవన్, అటు చంద్రబాబు సైతం పొత్తులకు సై అంటున్నారు. ఇక్కడే చిన్న సమస్య ఉంది. ప్రస్తుతం బీజేపీతో కలిసి పవన్ అడుగులు వేస్తున్నారు. తమతో పాటు టీడీపీని కూడా కలుపుకొని వెళ్లడం మంచిదన్నది పవన్ ప్లాన్. అందుకు బీజేపీ సిద్ధంగా లేదు. తాజాగా జనసేన–టీడీపీ పొత్తు పైన సోము వీర్రాజు స్పష్ట మైన సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాల గురించి తెలిసిన వారు ఎవరైనా.. ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం.. టీడీపీ -జనసేన- బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే బీజేపీ ఏపీ చీఫ్ పొత్తుల అంశం పైన క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీతో ఇప్పటికే తమకు పొత్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే పవన్ తో తప్పా.. ఇంకెవరితోనూ కలిసి పని చేయాల్సిన అవసరం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. టీడీపీ సీనియర్లు సైతం జనసేనతో పాత్తు అవసరమని భావిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా స్పందించాల్సిన అంశాలున్నా, అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నా, దాన్ని అందిపుచ్చుకోలేని పరిస్ధితుల్లో విపక్షాలు ఉండిపోతుండటమే ఇందుకు కారణం. అన్నింటి కంటే మించి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బలమైన రాజకీయ అజెండాను సిద్ధం చేసుకోవడంలో విపక్షాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలను అందరూ తప్పుబట్టే వారే. కానీ కలిసి పనిచేసేందుకు మాత్రం ఏ రెండు పార్టీలు సిద్ధంగా లేని పరిస్ధితి. అటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ టీడీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధ పడటం లేదు. రాష్ట్రంలో ఉమ్మడిగా పోరాడాల్సిన అంశాలు ఎక్కువగానే ఉన్నా వాటిపై పోరాటాలు మాత్రం ఉమ్మడిగా చేపట్టేందుకు వీరిలో ఎవరూ సిద్ధంగా లేరు. దీనికి కారణం ఎవరి అజెండాలు వారికి ఉండటమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు కాబట్టి తెలుగుదేశం సంస్దాగత మైన మార్పులకు మాహానాడూ వేదికగా శ్రీ కారం చుట్టి. జనసేనను ,కమలదళాన్ని సమన్యయం చేసుకుంటూ కొత్త కూటమిగా ఏర్పడి ఎన్నికల ప్రణాళికలు ,వ్యూహరచన చెయ్యాలి. పదవుల కోసం పాకులాడకుండా రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ ప్రజలకొమ్ముకాయాలి. యువతకు ప్రాధాన్యత నివ్వాలి. చిల్లర విమర్శలు మాని బలమైన రాజకీయ అజెండాతో ఊకదంపుడు ఉచిత హామీలు మాని నిజమైన మార్పు తెచ్చే సంక్షేమ పధకాలు, రాజధాని మెదలైన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఉద్యోగ కల్పన, విద్యుత్, వ్యవసాయంపై దృష్టి సారించాలి. గత తప్పిదాలను అనుభవాలుగా తీసుకుని మెలగాలి. జనసేన చరిష్మా , బిజెపి మద్దతు గ్రామస్దాయి నుంచి పటిష్ట మైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం. ఒక్కటై పనిచేస్తేనే ప్రస్తుత పరిస్దితులలో ప్రత్యర్దిని నిలువరించడం సాధ్యం. తెలుగు దేశం పార్టీలో సీనియర్లని క్రియాశీలకంగా ఉపయోగించుకోవాలి వారి ఆభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇజాన్ని మాని నిజాన్ని నమ్ముకుని జనానికి మేలు చేస్తాం అన్న నమ్మకం కల్పించాలి ఆ దిశగా అడుగులు వేసిననాడే మార్పు సాధ్యం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ