‘అమ్మ’ పదం జీవన పథం

Date:

మే 8 మాతృదినోత్సవం
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 94401 03345)
‘అమ్మ’ అనే పదం జీవన పథం. ఆ రెండు బీజాక్షరాలలో అనంత విశ్వం ఇమిడి ఉందంటారు పెద్దలు. ప్రతి ప్రాణికి పట్టుగొమ్మగా నిలిచే అమ్మ ఆత్మీయతకు, అనుభూతికి, ఆర్ద్రతకు ఆనవాలు. ‘తల్లిని మించిన దైవం లేదు‘ (న మాతుః పరదైవమ్), ‘తల్లిని మించిన గురువు లేడు’ (నాస్తి మాతృ సమో గురుః) అని సూక్తి. బ్రహ్మజ్ఞానులు, జగద్గురువులు, ఇతరత్రా ఉన్నత స్థానంలో ఉన్నవారితో వందనం చేయించుకునే వ్యక్తి మాతృదేవత మాత్రమే. ఎంతటి చక్రవర్తి, మహా పాలకుడైనా ఒక తల్లికి తనయుడే. గురుస్తోత్రంలో ‘మాతృదేవో భవ…’ అంటూ తైత్తిరీయోనిషత్తు తల్లికి అగ్రస్థానం ఇచ్చింది. వేదంలో అమ్మను శక్తి స్వరూపిణగా వర్ణించింది.
జనని లేకుండా జగతి ఉండదన్నట్లు, ఆ తల్లి ప్రేమ కోసం హరిహరులే పరమ భక్తులకు తనయులుగా జన్మించారు. పురాణాలు, శంకర రామానుజాది జగద్గురువులు, కవులు, పండితులు అమ్మ ఉన్నతిని వేనోళ్ల శ్లాఘించారు. ఎవరి స్థానాన్నయినా భర్తీ చేయగల తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం లేదంటారు. ‘అమ్మను మించిన నీడ, రక్షణ మరెక్కడా దొరకదు. అమ్మకంటే ఆదరించేవారు, జవజీవాలిచ్చేవారు లేరు’ (నాస్తి మాతృ సమా ఛాయా నాస్తి మాతృసమా గతిః/ నాస్తి మాతృసమం త్రాణం నాస్తి మాతృసమా ప్రాపా) అని స్కంద పురాణం, ‘అమ్మ సర్వపుణ్య తీర్థాలకు ప్రతీక’ (‘సర్వతీర్థమయా మాతా..) అని పద్మ పురాణం పేర్కొన్నాయి. శంకర భగవత్పాదుల విరచిత ‘మాతృపంచకం’లో అమ్మ ఉన్నతిని ఆర్ద్రంగా, అమృతమయంగా ఆవిష్కరించారు. ‘మనం ప్రేమ నుంచి పుట్టాం. ఆ ప్రేమే అమ్మ’ అన్నారు ప్రఖ్యాత సూఫీ తత్త్వవేత్త జలాలుద్దీన్ రూమీ.


సొంత భాషను ‘మాతృభాష’, పుట్టిన ప్రాంతాన్ని ‘మాతృభూమి’ అని సంభావించడం తెలిసిందే. ‘జననీ, జన్మభూమి స్వర్గంతో సమానమ’ని వాల్మీకి మౌని రామచంద్రుడి నోట పలికించాడు. రావణ జన్మకారణం, వ్యవహార తీరు ఏదైనా, ఆత్మలింగం సాధనతో అమ్మను ఆనందపరిచాడని, గరుడుడు తల్లి వినత దాస్య విముక్తికి అమృతాన్ని తెచ్చి సవతి తల్లి (కద్రువ)కు ఇచ్చాడని పురాణ కథనాలు. వ్యాధుడు కన్నవారి సేవ చేయడం ద్వారా ధర్మ వ్యాధుడిగా ప్రసిద్ధుడై, ధర్మ ప్రబోధకుడిగా నిలిచాడు. ఆది శంకరులు తల్లికి ఇచ్చిన మాట మేరకు ఆమె అవసాన దశలో వచ్చి దివ్యదర్శనాలు ఇప్పించి, సన్యాసిగా సమాజానికి ఎదురీది అంతిమ సంస్కారం నిర్వహించారని, తల్లి కర్మదోషాలను రమణ మహర్షి క్యాన్సర్ రూపంలో స్వీకరించి ఆమెకు ముక్తిని ప్రసాదించారని చెబుతారు.
అమ్మ ‘పథం’లో నిరాదరణ కంటకాలు
కాలం మారుతోంది. అమ్మ జీవన ‘పథం’లో అడుగడుగునా అడ్డంకులు, నిరాదరణ ముళ్లు చోటు చేసుకుంటున్నాయి. ‘వృశ్చిక సంతతి’ లక్షణ సంతతి పెరుగుతూ అమ్మ విలువ పాతాళం కిందికి జారిపోతోంది. వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతోంది. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా…’అన్నట్లు ఎడారిలో ఒయాసిస్‌లా అమ్మను అవసాన దశలో ప్రాణప్రదంగా చూచుకునే సుసంతంతి ఉన్నట్లే ‘పాత సామాను’గా పరిగణించే కుసంతతీ కనిపిస్తోందని, మొదటి కోవకు చెందిన వారి కంటే ఆశ్రమాలకు అప్పగిస్తున్న, వీధుల పాలుచేస్తున్న రెండవ తరహా శాతమే ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది. భారంగా భావిస్తూనో, ఆస్తిపాస్తుల కోసమో..అర్ధ‌రాత్రి వల్లకాటిలో వదిలేయడం, ప్రాణాలు తీయడం లాంటి సంఘటనలు మాధ్యమాలలో తరచూ కనిపిస్తూనే ఉన్నాయి.
నలుగురిని పోషించే తల్లికి……
నలుగురిని పోషించే తల్లి నలుగురికే భారమని, నాలుగు మెతుకులు కరవనే నానుడి ఉండనే ఉంది. ప్రపంచంలో చెడ్డ సంతతి ఉండవచ్చు కానీ చెడు తల్లి ఉండదని ఆర్యోక్తి (కలికాలంలో అలాంటి వారూ తారసిల్లవచ్చేమో కానీ అది అంత గణనీయం కాకపోవచ్చు). పురిటి పురిటికి పునర్జన్మ ఎత్తుతూ, సంతానం బాగోగులకు కోసం పూజా పున‌స్కారాలు, పారాయణలు, ఉపవాస దీక్షలు చేసే అమ్మల కోసం వృద్ధాశ్రమాలను అన్వేషించే సంస్కృతి (అందరిలో కాకపోయినా కొందరైనా) పెరిగిపోతోంది. వయసు ఉడిగిన కన్నవారిని పంచుకోవడమో, వారితో బంధాలు తెంచుకోవడమో పరిపాటిగా మారుతోందని మానవతావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు నూరిపోస్తూ తోటిమహిళలే ఈ సంస్కృతికి ఊతమివ్వడం ఆందోళన కలిగించే అంశం. తామూ అమ్మానాన్నలమవుతామన్న స్పృహ యువతరానికి(సంతానానికి) లేకపోవడం, ఉన్నా ‘అప్పటి సంగతి తరువాత…’అనే ’తరహా నిర్లక్ష్యమో కారణం కావచ్చని సర్దుబాటు కావచ్చని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. మరోవంక ‘అమ్మతనం’పై నిందలు వేసే నాయకులు పుట్టుకురావడం మరింత శోచనీయం.
వెలయాలి కోరరాని కోరిక తీర్చేందుకు నిద్రిస్తున్న తల్లిని మట్టుపెట్టి ఆమె గుండెను కోసుకుని పరిగెత్తుతూ పడిపోతే….‘ అయ్యో…!దెబ్బతగిలిందా నాయనా!? అని తల్లడిల్లిందట అమ్మ ‘హృదయం’. అమ్మను పూజించడం అంటే పూలతో అర్చించడం, హారతులు పట్టడం, అడుగులకు మడుగులొత్తడం కాదని, శేషజీవితంలో ఓ పలకరింపు చాలని పెద్దలు చెబుతారు. తల్లిని ప్రేమిం చడం, ఆమె సంతోషంగా ఉండేలా చూడడం సంతానం ప్రథమ కర్తవ్యం (మాత్రా భవతు సంమానాః…) అని వేదవాక్కు. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

1 COMMENT

  1. వీలైతే వ్యాసాన్ని కాపీ చేసుకోటానికి పాఠకులను అనుమతించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Telangana a critical election battle ground 

(Dr Pentapati Pullarao) Every national election has different critical states....

మనవడితో రేవంత్ హోలీ

మనవడు అంటే ఎవరికీ ముద్దుగా ఉండదు చెప్పండి. పండుగల్లో తాతయ్యలు వారితో...

Andhra BJP facing problems

(Dr Pentapati Pullarao) Recently, media reported that sad Andhra BJP...

భోజనానంతరం కునుకు ఒక కిక్

శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం(డా.ఎన్. కలీల్) నిదురపో… నిదురపో… నిదురపోనిదురపోరా తమ్ముడానిదురలోన గతమునంతానిముషమైనా...