అవినీతికి తావు లేని వ్య‌వ‌స్థ‌ను రూపొందిస్తా

Date:

మంచి చేయ‌డంలో జ‌గ‌న్ రాజీప‌డ‌డు
అడుగ‌డుగునా దుష్ట చ‌తుష్ట‌యం అడ్డు
పైడివాడ అగ్ర‌హారంలో సీఎం జ‌గ‌న్ ఫైర్‌
16 నెల‌ల క్రిత‌మే అడుగులు… ఆ అడుగుల‌కు అవాంత‌రాలు
ఇల్లు లేని కుటుంబం ఉండ‌కూడ‌ద‌నేదే ల‌క్ష్యం
నాన్న‌గారి స్వ‌ప్నం ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతిని సాకారం చేస్తా
అన‌కాప‌ల్లి (పైడివాడ అగ్ర‌హారం), ఏప్రిల్ 28:
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌ల‌లు ఒక్కొక్క‌టిగా సాకార‌మ‌వుతున్నాయి. న‌వ‌ర‌త్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఇళ్ల పట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ మంజూరు పత్రాలను ఆయ‌న గురువారం పంపిణీ చేశారు. తొలుత పైడివాడ అగ్రహారంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్కు నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగనన్న కాలనీ నిర్మాణానికి సంబంధించి లే అవుట్‌ను, మోడల్‌ హౌస్‌ను పరిశీలించి, పైలాన్‌ ఆవిష్కరించారు. ల‌క్ష‌ల మంది జీవితాల‌ను మార్చే అవ‌కాశం త‌న‌కు ల‌భించింద‌ని ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ జ‌గ‌న్ చెప్పారు. ఈ ఒక్క కాలనీలోనే దాదాపు 10,228 ప్లాట్లు ఇళ్ల నిర్మాణం జరగబోతుందనీ ఈ కుటుంబాలకు మంచి జరగడమే కాకుండా… ఇక్కడ విలేజ్‌ క్లినిక్‌లు, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ స్కూల్స్, హైస్కూల్స్, కమ్యూనిటీ హాల్స్, మూడు పార్కులు, మార్కెట్‌ యార్డు, సచివాలయంతో సహా రాబోతున్నాయనీ వివ‌రించారు. ఈ అవకాశం వ‌చ్చినందుకు త‌న‌కు చాలా సంతోషంగా ఉందన్నారు.


రూ.6 లక్షల విలువైన ఇంటిస్ధలం…
ఇక్కడకు రాకముందు… ఒక్కొక్కరికి ఇచ్చిన సెంటు స్ధలం విలువ ఎంత అని కలెక్టరు, ఎమ్మెల్యేను అడిగితే గజం రూ.12 వేలు ఉంది, 50 గజాలు అంటే రూ.6లక్షలు కేవలం ఇంటి స్ధలం విలువ అని చెప్పారు. రూ.6 లక్షల విలువైన ఇంటిస్ధలం ఇవ్వడమేకాకుండా.. మరో రూ.2 లక్షలు పై చిలుకు విలువ చేసే ఇంటిని కట్టిస్తే.. ఈ రెండూ కలిపి రూ.8లక్షలు అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు వస్తాయి. దీంతో కనీసం రూ.10 లక్షల రూపాయలు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ చేతిలో పెట్టినట్లవుతుందని జ‌గ‌న్ తెలిపారు.


ఈ కార్య‌క్రమంలో సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే
16 నెలల క్రితమే అడుగులు వేశాం, కానీ…
ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 16 నెలల క్రితమే ఈ కార్యక్రమం చేయడానికి అడుగులు ముందుకు వేశాం. కానీ రాష్ట్రంలో పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందో.. ఎక్కడ జగన్‌కు ప్రజలందరూ మద్దతు పలుకుతారో అని కడుపుమంట పెరిగిపోయిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే కోర్టుకు పోవడం, ఇన్ని లక్షల మందికి మేలు జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఇవన్నీ అధిగమించి 16 నెలలు తర్వాత కచ్చితంగా చెప్పాలంటే 489 రోజులు పట్టింది. ప్రతిరోజూ కూడా ఎప్పుడెప్పుడు ఈ కోర్టు వ్యవహారాలు పూర్తవుతాయి, ఎప్పుడెప్పుడు నా అక్కచెల్లెమ్మలకు మంచి చేసే రోజు వస్తుందని ఎదురు చూశాం. దీనికోసం వారానికొకసారి అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడుతూ వచ్చాం. దేవుడి దయ వలన ఈనాటికి కోర్టుల నుంచి సమస్యలు తీరిపోయి ఇన్ని లక్షల మందికి మేలుచేసే కార్యక్రమం ఇవాళ జరగడం చాలా సంతోషంగా ఉంది.


ఇల్లు అంటే శాశ్వత చిరునామా – సామాజిక హోదా
ఇల్లు అంటే ప్రతి అక్కచెల్లెమ్మకు శాశ్వత చిరునామా ఇచ్చినట్లు. ఇళ్లు కట్టడం అంటే ప్రతి అక్కచెల్లెమ్మకు ఒక సామాజిక హోదాను కల్పించినట్లు అవుతుంది. జీవితకాలమంతా పైసా, పైసా కూడబెట్టుకుని ప్రతి కుటుంబం ఆలోచన చేస్తుంది. నాలుగేళ్ల పాటో, ఐదేళ్లో, ఆరేళ్ల సంపాదన పైసా, పైసా కూడబెట్టుకుని చివరకి ఒక మంచి చోట స్ధలం కొని, అక్కడ ఇళ్లు కట్టుకోవడమే ఒక జీవితానికి పరమార్ధం అని భావించే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ప్రతిచోటా ఉన్నాయి. ఇళ్లు కట్టుకోవడం అంటే పైసా, పైసా కూడబెట్టుకని ఇళ్లు కట్టుకోవడమే కాదు… ఆ తర్వాత తమ పిల్లలకు ఇచ్చే ఆస్తిగా భావించేది ఏదైనా ఉందంటే అది ఇళ్లు మాత్రమే. అటువంటి మంచి కార్యక్రమం ఇవాళ దేవుడి దయతో మీ అందరి అన్న, తమ్ముడిగా చేయగలుగుతున్నా.


ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు…
మనందరం కలిసి సాగించే ఈ అభివృద్ధి ప్రయాణంలో ఏ ఒక్క కుటుంబం శాశ్వత చిరునామా లేని కుటుంబంగా, సొంతిళ్లు లేని కుటుంబంగా మిగిలిపోరాదనే మిగిలిపోకూడనే గొప్ప సంకల్పంతో ఎన్నికలప్పుడు మాటిచ్చాం. ఎన్నికల ప్రణాళికలో వాటిని చేర్చాం. 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో నేను చూసినదాన్ని ఆ ఎన్నికల ప్రణాళికలో తీసుకువచ్చాం. 25 లక్షల మందికి ఇళ్లకట్టి ఇస్తామని మాటిచ్చాం. ఈ రోజు దేవుడి దయతో అంతకన్నా గొప్పగా, ఎక్కువే చేయగలుగుతున్నాం.


ఇచ్చిన మాట కన్నా మిన్నగా…. 30.70 లక్షల ఇళ్ల స్ధలాలు
ఇచ్చిన మాట కన్నా మిన్నగా ఏకంగా 30.70 లక్షల ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయగలిగాం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకటిన్నర సెంటు, పట్టణాల్లో అయితే ఒకటి నుంచి ఒకటిన్నర సెంటు మధ్యలో ఇవ్వగలిగాం. ఇంటి స్ధలాలివ్వడమే కాకుండా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఇప్పటికే ప్రారంభమైంది.
ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఈరోజు మనం కడుతున్న ఇళ్లు కనపిస్తున్నాయి. ఏ గ్రామ పొలిమేరల్లో చూసినా కనులువిందుగా అవన్నీ మన కళ్లెదుటనే కనిపిస్తున్నాయి. 30.70 లక్షల ఇళ్ల స్ధలాలు, 17వేల జగనన్న కాలనీలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇవాళ మొత్తం పంచాయితీలు 13వేలు ఉంటే.. జగనన్న కాలనీలు 17 వేలు వస్తున్నాయి.


మొత్తంగా 21.20 లక్షల ఇళ్ల నిర్మాణం…
మొదటి దశ కింద మనం కడుతున్న 15.60 లక్షల ఇళ్లకు అదనంగా ఈ రోజు రెండోదశ కూడా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టమని ఆదేశాలు ఇచ్చాం. ఇదే విశాఖపట్నంలో ఇక్కడ 1.25లక్షల మందికి ఇళ్లపట్టాలివ్వడమే కాకుండా… ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు పత్రాలిచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. ఇక్కడే కాకుండా మరో 1.79 లక్షల ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రారంభిస్తున్నాం. అంటే ఈ రోజు మనం మొదలుపెట్టిన కార్యక్రమంలో 3.03 లక్షల మందికి ఇళ్లు కట్టుకునే మంజూరు పత్రాలను అందిస్తున్నాం. 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వడంతో పాటు.. 15.60 మందికి ఇళ్ల నిర్మాణం ప్రారంభించడమే కాకుండా ఇవాళ మరో 3.03 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం మొదలవుతుంది. ఇవి కాకుండా 2.62 లక్షల టిడ్కో ఇళ్లు యుద్ధ ప్రాతిపదికిన కడుతున్నాం. మొత్తంగా 21.20 లక్షల ఇళ్ల నిర్మాణం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది.


నేడు ప్రారంభ‌మ‌య్యే ఇళ్ల నిర్మాణానికి 5469 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. రాష్ట్రంలో 30.76 లక్షల మందికి ఇంటి స్ధలం కోసం 68,361 ఎకరాలను అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేశాం. విశాఖపట్నంలో మొదలుకాక మునుపు వీటి విలువ సుమారు రూ.25 వేల కోట్లు ఉంటే… ఈ రోజు విశాఖపట్నంలో ప్రారంభిస్తున్న 1.25 లక్షల ఇళ్ల పట్టాలు కలుపుకుంటే వీటి విలువే దాదాపు రూ.10 వేల కోట్లు. అంత విలువైన ఆస్తిని ఇవాళ అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం.


ఇల్లు రాక‌పోతే… గ్రామ స‌చివాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేయండి
మరొక విషయం మీ అందిరికీ తెలియజేస్తున్నా.. ఏ ఒక్కరికీ కూడా ఇళ్లు రాలేదని బాధపడాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. ఎవరికి ఇళ్లు లేకపోయినా గ్రామసచివాలయానికి వెళ్లి దరఖాస్తు పెట్టుకొండి. అర్హత తనిఖీ చేస్తారు. ఆ తనిఖీలో ఇళ్లు నిజంగా లేకపోతే కచ్చితంగా వాళ్లందరికీ ఇంటి స్ధలం ఇప్పించే బాధ్యత మీ జగనన్నది.


90 రోజుల్లో ఇంటి స్ధలమిచ్చే కార్యక్రమంలో…
ఇప్పటికే 90 రోజుల్లో ఇంటిస్ధలం ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా 2.12లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి… ఇందులో 1.12 లక్షల మందికి ఇళ్ల స్ధలాలు మంజూరు చేశాం. మరో 96 వేల మంది అక్కచెల్లెమ్మలకు రాబోయే రోజుల్లో ఇంటి స్ధలం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.


ఏ పథకమైనా ఎలా ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో
అర్హత ఉన్న ఏ ఎక్కరికీ కూడా పథకాలు కట్‌ చేయాలన్న ఆలోచన మీ జగనన్నకి, మీ జగన్‌ తమ్ముడికి లేదు. ఏ పథకమైనా ఎలా ఇవ్వాలి అన్న తపన, తాపత్రయం ఉందని గుర్తుపెట్టుకొండి.
ఇంటి స్ధలాలు ఇవ్వడమే కాకుండా మంచి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న తపన, తాపత్రయం చూపాం. గతంలో ఇళ్లు కట్టే పరిస్థితులు చూశాం… దాని రూపురేఖలు కూడా మార్చాం. గతంలో 225 అడుగులు ఇళ్లు కడితే గొప్పగా కట్టామని చెప్పుకునే పరిస్థితి నుంచి 340 అడుగులతో ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.


30 లక్షల ఇళ్లు – రూ.55 వేల కోట్లు ఖర్చు
ఒక్కొక్క ఇంటి వ్యయానికి సంబంధించి చూస్తే… మనం కడుతున్న 30 లక్షల ఇళ్లు పూర్తి చేయగలిగితే రూ.55 వేల కోట్లు ఖర్చు చేసినట్లవుతుంది. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్ధలాల విలువ ఈ రోజు రూ.10 వేల కోట్లతో కలుపుకుంటే.. రూ. 35 వేల కోట్ల విలువైన స్ధలాలు ఇచ్చినట్లవుతుంది.
మౌలిక సదుపాయల కోసం మరో రూ.32 వేల కోట్లు….
ఇది కాక ఇళ్ల మధ్యలో కరెంటు, నీళ్లు, డ్రైనేజి వంటి మౌలికసదుపాయల కల్పన కోసం రాబోయే సంవత్సరాలలో మరో రూ.32 వేల కోట్లు ప్రభుత్వం పెడుతుంది. నేను చెప్పదల్చుకుంది ఒక్కటే… మనం కడుతున్నవి.. 30 లక్షలఇళ్లు అంటే దాదాపు 1 కోటి 20 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు అవుతుంది. రాష్ట్రంలో జనాభా చూస్తే.. ఆ జనాభా లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరికి ఇళ్లు కట్టించినట్లవుతుంది. ఇంత గొప్ప యజ్ఞం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది.


ఇళ్ల నిర్మాణం –ఎకనామిక్‌ యాక్టివిటీ
ఇళ్లు నిర్మించి ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ఒక ఎకనామిక్‌ యాక్టివిటీ జరుగుతుంది. స్టేట్‌ జీడీపీలో పెరుగుదల నమోదవుతుంది. ఇళ్లు కట్టడమంటే.. ఒక్కో ఇంటికి కనీసం 20 టన్నుల ఇసుక ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. సబ్సిడీ రేటుకు 90 బ్యాగుల సిమెంటు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో స్టీల్, శానిటరీ, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ అన్నింటినీ మార్కెట్‌ ధర కన్నా తక్కువ ధరకే మార్కెట్‌లో కొనుగోలు చేసి నాణ్యత నిర్ధారణతో వాటిని సరఫరా చేస్తున్నాం.
గతంలో నేను చెప్పినట్టుగా తొలిదశలో చేపట్టిన ఇళ్లలో ..ఈ నెల 26 వరకు చూస్తే.. 28072 ఇళ్లు పూర్తి చేశాం. మిగిలిన వాటి పనులు వేగవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ఏ స్ధాయిలో జరుగుతుందంటే… అది రాష్ట్ర జీడీపీని పెంచుతుంది.


మన కార్యక్రమాలు – దేశానికే ఆదర్శం…
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే… మనం చేసే ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలబడుతుంది. గతంలో 2014 నుంచి 2019 మధ్యలో గత ప్రభుత్వం 5 యేళ్లు ఎలా పనిచేసిందీ మీరు చూశారు. పేదలకు ఎంతమందికి ఇళ్లు కట్టించింది ? పేదల పరిస్థితి గురించి ఆలోచన చేసిందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి. గతానికి ఇప్పటికీ ఏం మార్పు జరిగింది అన్నది కూడా మీరు అందరూ ఆలోచన చేయమని మిమ్నల్ని కోరుతున్నాను. అప్పుడూ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ ఇళ్ల నిర్మాణం జరగలేదు, ఇళ్ల స్ధలాలు ఇవ్వలేదు, అక్కచెల్లెమ్మల మొహంలో సంతోషం చూడలేదు.


ఆ పెద్ద మ‌నిషికి మ‌న‌సు రాలేదు….
ఈరోజు అదే ముఖ్యమంత్రి… చంద్రబాబు బదులు జగన్‌.. పేరు మాత్రమే మారింది. అదే ముఖ్యమంత్రి.. అదే రాష్ట్రం. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల మొహల్లో చిరునవ్వు కనిపిస్తుంది అంటే… మార్పు ఒకసారి గమనించండి. ఇదే పెద్ద మనిషికి గతంలో పేదలకు ఇళ్లు కట్టించడానికి మనసు రాలేదు. ఐదు సంవత్సరాల పరిపాలనలో మొత్తంగా ఊడ్చి, ఊడ్చి 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదు. ఈ రోజు 30 లక్షల ఇంటి స్ధలాలు ఇవ్వడంతో పాటు 21 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పుంజుకుంటుంది.


హైదరాబాద్‌లో ప్యాలెస్ క‌ట్టుకున్నారు….
2014–19 మధ్యలో ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలను గాలికొదిలేసి… తాను మాత్రం హైదరాబాద్‌లో ప్యాలెస్‌ కట్టుకుని సంతోషంగా ఉండేందుకు అడుగులు వేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ హైదారాబాద్‌లో ప్యాలెస్‌ కట్టుకుంటుంటే… అదే సమయంలో ప్రతిపక్షనాయకుడిగా ఉంటూ మీ జగన్‌ తాడేపల్లిలో ఇళ్లు కట్టుకునే కార్యక్రమం చేశాడు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకుంటే.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేను మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య ఉండాలని తాడేపల్లిలో ఇళ్లు కట్టుకున్నాను . తేడా ఏమిటనేది గమనించమని కోరుతున్నాను.


లంచాలు, వివక్షకు తావు లేకుండా…
ఇళ్ల పట్టాలిచ్చే విషయంలో కానీ, ఇళ్లు కట్టించి ఇట్టే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కానీ ఎక్కడా లంచాలు లేవు. వివక్షకు తావివ్వడం లేదు. కులం, మతం, ప్రాంతం చివరికి ఏ రాజకీయ పార్టీ అని కూడా చూడకుండా.. అర్హత ఉంటే చాలు నా అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయం అడుగులు ముందుకు వేశాం.


కడుపు మంటతో దుష్టచతుష్టయం….
మీరంతా చూస్తున్నారు.. ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వానికి ఏ రకంగా కడుపు మంటతో మనకి వ్యతిరేకంగా రోజూ వెదికి, వెదికి ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు శాయశక్తులా దుష్టచతుష్టయం ఎలా అడ్డుపడుతున్నారో మీరంతా చూస్తున్నారు.
దుష్ట చతుష్టయం అంటే రాష్ట్రంలో ఈ పాటికే అర్ధం అవుతుంది. చంద్రబాబునాయుడు ఒక్కరే కాదు.. ఆయనకి తోడు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నలుగురూ కలిసి.. రాష్ట్రంలో ప్రతి విషయాన్ని దుష్టచతుష్టయంలా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు.


ఉత్తరాంధ్రా ఆత్మగౌరవం నిలబడేలా…
ఉత్తరాంధ్రా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా.. మూడు రాజధానుల్లో ఒకటి విశాఖకు ఇస్తానంటే ఈ దుష్టచతుష్టయం అడ్డుకుంటుంది. పోనీ వాళ్ల రాజధాని వాళ్లు చెప్పుకుంటున్న ఆ అమరావతిలో నన్నా మన పేదవాళ్లందరికీ, మన అక్కచెల్లెమ్మలందరికీ, నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ కూడా 54వేల ఇళ్ల పట్టాలు ఇస్తానంటే.. దానిపై కోర్టులకు పోయి అడ్డుకునేటప్పుడు వీళ్లన్న మాటలు ఏంటో తెలుసా? డెమొగ్రాఫిక్‌ ఇంబేలన్స్‌ వస్తుంది. అంటే వాళ్ల మధ్యలో పేదవాడు ఉంటే కులాల మధ్య సమతుల్యం మారిపోతుందని చెప్పి… ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసి, స్టేలు తెచ్చిన పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇదే అమరావతిలో ఇప్పటికి కూడా మరో 54వేల మంది పేదలు మాకు ఇంటి స్థలాలు ఎప్పుడొస్తాయని ఈరోజుకీ ఎదురుచూస్తున్నారు. అంటే ఈ దుష్టచతుష్టయం ఏరకంగా అడ్డుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి.
రాయలసీమలోనూ…
రాయలసీమ ప్రాంతంలో.. అక్కడ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి… గతంలో కర్నూలు రాజధానిగా ఉన్న రాయలసీమలో ఆ ఆత్మగౌరవాన్ని వారికి కూడా కల్పిస్తూ… అక్కడ న్యాయరాజధానిగా హైకోర్టు పెడతామంటే దాన్ని కూడా ఎలా అడ్డుకుంట్నున్నారో మీ కళ్లతో మీరే ఈ దుష్టచతుష్టయాన్ని గమనించమని అడుగుతున్నాను.


ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంపైనా కోర్టుకు….
ఇలా ప్రతివిషయంలోనూ పేదపిల్లలకు, ప్రధానంగా.. ఎస్సీలు, ఎస్టీలు,బీసీలు, మైనార్టీలు, చివరకి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ప్రయివేటు బడులకు పోతే ఫీజులు కట్టుకోలేమని చెప్పి.. గవర్నమెంటు బడులకు పోతే.. ఆ గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చి, నాడు–నేడు కార్యక్రమంతో వాటి రూపురేఖలు మార్చుతూ… సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొస్తూ.. ప్రతి పిల్లాడికీ ఒక మంచి మేనమామ తోడుగా ఉన్నాడు అని చూపించే కార్యక్రమం చేస్తుంటే.. దాన్ని కూడా కోర్టుకు వెళ్లి అడ్డుకునే పని చేస్తున్నది.. చేసేదీ ఆ దుష్టచతుష్టయం.
ప్రజలకు మంచి జరిగితే వీళ్లు ఒప్పుకోరు…
రాష్ట్రంలో ఏ మంచి జరగడానికి కూడా వీళ్లెవరూ ఒప్పుకోరు. బ్యాంకులు ఇతర ఆర్ధిక సంస్ధలు అన్నీ కూడా మన రాష్ట్రానికి అప్పులు ఇవ్వకూడదని వీళ్లందరూ తాపత్రయపడతారు. రాష్ట్రానికి ఎక్కడ నుంచి కూడా సహాయం రానే, రాకూడదని వీళ్లందరూ కుయుక్తులు పన్నుతారు. నిరంతరం మనంచేసే మంచిని అడ్డుకునే కార్యక్రమం చేస్తుంటారు. ఏ బ్యాంకులైనా మనకు అప్పులిచ్చినా వీళ్లు తట్టుకోలేరు. కేంద్రం ఒకవేళ మనకు డబ్బులిచ్చినా దాన్ని వీళ్లు జీర్ణించుకోలేరు. రాష్ట్ర ఆదాయాలు పెరిగితే దాన్ని ఓర్చుకోలేరు. పేదలకు ఏ మంచి జరిగినా కూడా వీరికి కడుపు మంట.. కళ్లల్లో పచ్చకామెర్లు. వీళ్లకు ఒళ్లు నిండా పైత్యం, బీపీ, కడుపుమంటతో చాలా చాలా బాధ‌పడతారు.
నిజంగా మంచి చేయడం కోసం పేదల కోసం ఈరోజు లంచాల లేని వ్యవస్ధను తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేశాం. గతంలో ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతున్నాను.


ఇవాళ ఏ అక్కచెల్లెమ్మా ఎక్కడా లంచాలివ్వాల్సిన పనిలేదు. ఎక్కడా వివక్షకు లోనుకావాల్సిన పనిలేదు. నేరుగా మన గడప వద్దనే నేరుగా గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ… తలుపు తడుతూ వాలంటీర్‌ చెల్లెమ్మలు, తమ్ముళ్లు వచ్చి మంచి చేస్తున్నారు.
లంచాలు లేని వ్యవస్ధను క్రియేట్‌ చేస్తూ….
ఈరోజు లంచాలు లేని వ్యవస్ధను క్రియేట్‌ చేస్తూ… బటన్‌ నొక్కిన వెంటనే రూ.1 లక్షా 37 వేల కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లింది. ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏదైనా, ఎవరైనా, ఎప్పుడైనా చేయగలిగారా అని ఆలోచన చేయమని ప్రతి అక్కచెల్లెమ్మను కోరుతున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టే… వీళ్లెవరూ జీర్ణించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా… ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెబుతాను.
ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు వచ్చినా అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో జగన్‌ మాత్రం రాజీపడడు అని కచ్చితంగా చెప్తాను.


నాన్న‌గారి స్వ‌ప్నాన్నీ నెర‌వేరుస్తా….
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నాన్న కన్న స్వప్నం. దాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. పోలవరం నీళ్లు శ్రీకాకుళం వరకు తీసుకుపోయే దిశగా అడుగులు పడతాయంటూ సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజని, టీటీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...

Kejriwal: Noble past and uncertain future

(Dr Pentapati Pullarao) Just today Kejriwal announced his future....

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...