గేర్ మారుస్తున్నా… వేగం పెంచండి

Date:

175 సీట్లూ ఎందుకు గెల‌వ‌లేం
దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టండి
మ‌నం చేసిన మంచిని న‌లుగురు చెప్పుకునేలా చేయండి
జిల్లా అధ్య‌క్షులు గెలిస్తే మంత్రుల‌వుతారు
త‌ర‌వాత రెండున్న‌రేళ్ళు పార్టీ ప‌టిష్ట‌త‌కు కృషి చేయాల్సిందే
అతి పెద్ద వ్య‌వ‌స్థ‌ను సృష్టించుకున్నాం
పార్టీ స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
అమరావతి, ఏప్రిల్ 27:
ఏపీ ముఖ్య‌మంత్రి పూర్తి ఆత్మ‌విశ్వాసంతో క‌నిపిస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయ‌న మాట తీరు ఆయ‌న ఆత్మ‌విశ్వాసాన్ని చాటి చెప్పింది. స‌మావేశంలో పాల్గొన్న వారికి జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. మే నెల నుంచి గేర్ మారుస్తున్నా… స్పీడు పెంచండంటూ పార్టీలో ఉత్సాహాన్ని పెంచారు. 175 సీట్ల‌నూ ఎందుకు గెల‌వ‌లేమ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ దిశ‌గా మ‌నం ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుందామంటూ పిలుపునిచ్చారు. నా పెర్ఫ్మారెన్స్ 60శాతం బాగుంది. మిగిలిన 40శాతం ఎమ్మెల్యేల‌ది. గెలిచిన వారికే ప‌ద‌వులు లేక‌పోతే లేదంటూ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ముందు చెప్పిన‌ట్లు ఎవ‌రైనా స‌రే మంత్రి ప‌ద‌విలో రెండున్న‌రేళ్లే ఉంటారు. త‌ర‌వాత వారంతా పార్టీ ప‌టిష్ఠ‌త‌కు ప‌నిచేయాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహానికీ తావు లేద‌న్నారు జ‌గ‌న్‌. స‌మావేశంలో ఆయ‌న ఏమ‌న్న‌దీ ఆయ‌న మాట‌ల్లోనే..
వేగంగా అడుగులు వేయాలి…
మనం వేగంగా అడుగులు ముందుకేయాల్సిన సమయం వచ్చిందనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికే మూడు సంవత్సరాలు అయ్యింది. కళ్లు మూసుకుని తెరిచేలోగానే రెండేళ్లు కూడా పూర్తవుతాయి. మనం అధికారంలో కొనసాగాలి అంటే.., అడుగులు కరెక్ట్‌గా వేయాలి. కిందటసారి వచ్చిన దానికన్నా మెరుగైన ఫలితాలు వచ్చేలా ప‌నిచేయాలి. హోప్‌ అన్నది.. రియల్టీకన్నా.. చాలా బలమైనదని వింటూ ఉంటాం. మొట్టమొదటి సారిగా రియాల్టీ కూడా చాలా బలమైనదని మనం నిరూపించాం. మేనిఫెస్టోలో చూపించిన హామీలలో 95 శాతం హామీలను మనం ఇప్పటికే నెరవేర్చాం. ఇంత బలమైన ఫెర్ఫార్మెన్స్‌ చూపించి ఎన్నికలకు పోవడం అన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. మొదటి 3 సంవత్సరాలు మేనిఫెస్టో అమలుపై దృష్టిపెట్టాం. రేపు లేదన్న ధోరణిలోనే మేనిఫెస్టోను అమలు చేస్తూ అడుగులు ముందుకేశాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిపథకం అమలు చేశాం.


సామాజిక న్యాయాన్ని చేత‌ల్లో చూపాం
గతంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం. డీబీటీ పద్ధతి కూడా రాష్ట్ర చరిత్రలో ఈ స్ధాయిలో ఎప్పుడూ లేని విధంగా అమలు చేశాం. ఈ మూడు సంవత్సరాల్లో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రాంతీయ సమన్వయ కర్తలను, జిల్లా అధ్యక్షులను నియమించాం. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను కూడా భాగస్వాములను చేశాం. ఇవాళ మంత్రులుగా ఉన్నవారు అందరూ కూడా.. జిల్లా అధ్యక్షులు , రీజినల్‌ కో–ఆర్డినేటర్లు.. తమ కన్నా వారు ఎక్కువ అనే భావనను మీరు గుర్తుంచుకోవాలి.
గుర్తుంచుకోండి….పార్టీనే సుప్రీం
ఎవరికైనా పార్టీ అన్నదే సుప్రీం, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. రీజినల్‌ కో ఆర్డినేటర్లను, పార్టీ జిల్లాల అధ్యక్షులను గౌరవించాలి. మంత్రులంతా వారికి సమాన స్థాయిలో చూసుకోవాలి. లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుంది. రెండేళ్లలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం. మంత్రి పదవుల్లో ఉన్నవారు.. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కూడా గడపగడపకూ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలి. మంత్రి అయినాకూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నారన్న భావన కలగాలి. ప్రతి మంత్రీ దీన్ని గుర్తు పెట్టుకోవాలి. మంత్రులంతా కచ్చితంగా జిల్లా అధ్యక్షులతోనూ, రీజినల్‌ కోఆర్డినేటర్లతోనూ పూర్తి అనుసంధానం కావాలి. మంత్రులుగా ఉన్నవారు తామే నాలుగు అడుగులు వెనక్కి వేసి, మిగిలిన వారిని కలుపుకుంటూ పోవాలి. పైస్థానంలో ఉన్న మంత్రులు.. అందర్నీ అనుసంధానం చేసుకోవాలి. దీనివల్ల వారి పెద్దరికం పెరుగుతుంది.
మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగానే మంత్రులంతా కూడా గడప, గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. మంత్రి అయిన తర్వాత మాకు ఇంకా ఎక్కువ అందుబాటులోకి వచ్చాడు అన్న పాజిటివ్‌ టాక్‌ మీకు ఇంకా ప్లస్‌ అవుతుంది.


గెలిచిన త‌ర‌వాత జిల్లా అధ్య‌క్షులు మంత్రుల‌వుతారు…
జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలుగా బాధ్యతలు తీసుకుంటున్నవారు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. పార్టీని గెలిపించుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు మంత్రులుగా వస్తారు. రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. ఇలా మార్పులు ఉంటాయి. పార్టీ అన్నది సుప్రీం. పార్టీపరంగా నిరంతరం దృష్టి, ధ్యాస ఉండాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొదట్లో చెప్పాను. పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం.
మే రెండోవారం నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. మే నుంచి ప్రతి ఎమ్మెల్యేకూడా గడపగడపకూ కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాలు, ఒక్కొక్క సచివాలయం పరిధిలో 2 రోజులు తిరగాలి. ఆ 2 రోజులు వెళ్లి.. ఎమ్మెల్యే ఏంచేయాలి అన్నది.. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు మానిటర్‌ చేయాలి. గడపగడపకూ తొలిదఫా పూర్తి కావడానికి దాదాపు 8–9 నెలలు పడుతుంది. దీనివల్ల ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరుగుతుంది. అవినీతి, వివక్ష లేకుండా డీబీటీ బటన్‌ నొక్కుతున్నాం, నేరుగా లబ్దిదార్లకుపోతుంది. వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు. గడపగడపకూ కార్య‌క్ర‌మంలో పాల్గొంటే ఎమ్మెల్యేలకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి ఇంటికీ ఏం మేలు జరిగిందనేది మీ దగ్గర సమాచారం ఉంటుంది. ఇంట్లో అక్కచెల్లెమ్మ పేరుమీద లెటర్స్‌మీకు ఇస్తాం. ఆ లెటర్‌లో ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని అంతా వివరిస్తాం. ఆ ఇంట్లో అమ్మఒడి, ఆసరా, చేయూత, పించన్, ఇళ్ల పట్టాలు ఇలా ఎప్పుడు ఏ పథకం ఇచ్చామన్నది అందులో పేర్కొంటాం.


ప్రతి ఇంటికీ వెళ్లి.. దేవుడి దయతో ఈ మంచి చేయగలిగామని ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి. రానున్న రెండేళ్లు కూడా ఇలాంటి మంచి చేస్తామని చెప్పాలి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కుటుంబం ఆశీస్సులు తీసుకోవాలి.
చేసిన మంచిని గుర్తు చేస్తాం
ఈ మూడేళ్ళ‌లో చేసిన మంచిని గుర్తు చేస్తామ‌నీ, దీంతోపాటు మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలు, ఏవి అమలు చేశాం, ఏ స్థాయిలో అమలు చేశామన్న వివరాలతో మూడు కరపత్రాలు ఇస్తామ‌నీ చెప్పారు. మేనిఫెస్టో, అందులో పేర్కొన్న అంశాల ఎంతవరకూ అమలు చేశాం, అలాగే నాడు నేడు కింద గత ప్రభుత్వం ఏం చేసిందీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది.. అన్నది కూడా మరో కరపత్రం ఇస్తాం. దీనిమీద వారే టిక్కులు పెట్టొచ్చు.
ఈ సమావేశంలో ఉన్నవారికి ఇవన్నీ అదనపు బాధ్యతలు. మీ గ్రాఫ్‌ను పెంచుకోవడంమే కాదు, మీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌నూ పెంచుకోవాలి. మీరు సమర్థులని భావిస్తున్నాను కాబ్టటి…. మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నాను. సచివాలయాల్లో ఎమ్మెల్యేలు తిరిగినప్పుడు… గడపగడపకూ తిరగడమే కాకుండా, క్యాడర్‌ను ఏకం చేయాలి. సచివాలయంలో 2 రోజుల పర్యటన అయిన తర్వాత వెంటనే బూత్‌కమిటీలు ఏర్పాటు కావాలి. బూత్ కమిటీలకు శిక్షణ కూడా అత్యంత ముఖ్యమైనది. కమిటీల ఏర్పాటు తర్వాత శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతాయి. బూత్‌కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండాలి, కనీసం 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలి. ఆ గ్రామంలో ఉన్న ప్రతి కమ్యూనిటీని గుర్తుపెట్టుకోవాలి, ఎవరినీ విస్మరించవద్దు, వాళ్లకు కూడా ప్రాతినిధ్యం కల్పించండి. కనీసంగా బూత్‌కమిటీలో 10 మంది ఉండాలి, అవసరం మేరకు దీన్ని పెంచుకోవాలి. జనాభాలో 50శాతం మహిళలు ఉన్నారు, బూత్‌కమిటీల్లో మహిళలను పెట్టుకోవాలి.


మ‌హిళ‌ల‌కే ఎందుకు ఇస్తున్నామంటే…
90శాతం పథకాలు అన్నీకూడా మహిళలకే ఇస్తున్నాం. మహిళలకిస్తే డబ్బులు డైవర్ట్‌ కావనే వారికిస్తున్నాం. మహిళలకు పూర్తిగా ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాం. కుటుంబాలు బాగుండాలనే మనం వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
వీళ్ల అజెండా వేరు
ఈరోజు మనం యుద్ధం ఒక్క చంద్రబాబుతోనే కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 లాంటి చెడిపోయిన వ్యవస్థలతో మనం యుద్ధంచేస్తున్నాం. వీళ్ల అజెండా వేరు. మనం దిగిపోయి, చంద్రబాబు అధికారంలోకి రావాలన్నది వారి అజెండా. దీన్ని కౌంటర్‌ చేయాలంటే…, ప్రజలకు నిజాలేంటో చెప్పాలి.
స్థిరంగా ఇది కొనసాగాలి. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. రాబోయే రోజుల్లో ఎల్లో . ప్రతి ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుంటుంది. వాళ్లే కట్టుకథలు అల్లి.. దుష్టచతుష్టయం మాదిరిగా విష ప్రచారం చేస్తారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరంతా దుష్టచతుష్టయం. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. అది జరగకముందే గ్రామాల్లోని మన క్యాడర్‌కు సరైన సమాచారాన్ని చేరవేయాలి.


తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
ఈరోజు నుంచీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే తీరును పెంచుకోవాలి. ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రజలకు సుపరిచితులే. ఎల్లోమీడియా ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు తప్పనిసరిగా మనమంతా దాన్ని ఖండించాలి. సోషల్‌మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలి. గ్రామాల స్థాయిలో కూడా మనకు సోషల్‌మీడియా వారియర్స్‌ ఉండాలి.
గడపగడపకూ పూర్తయ్యే సరికి ప్రతి గ్రామంలో కూడా సోషల్ మీడియా వారియర్స్‌ ఉండాలి.
ఇందులో క్యాడర్‌ కూడా ఇన్వాల్వ్‌ కావాలి.
జులై 8న ప్లీనరీ నిర్వహిస్తున్నాం
ఈలోగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, 50శాతం మహిళలకు ఇవ్వాలి. ఎమ్మెల్యేల దగ్గరనుంచి మండల కమిటీ హెడ్స్‌ను తీసుకోవాలి. గ్రామ కమిటీల హెడ్స్‌ను కూడా తీసుకోవాలి. తర్వాత రీజనల్‌ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు వారి సహాయంతో మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాల గురించి నిరంతర అనుసంధానం కోసమే ఈ ఏర్పాటు. కమిటీల ఏర్పాటులో తప్పులు లేకుండా, అలసత్వం లేకుండా చూసుకోవాలి. ఎమ్మెల్యేలను బలపరచడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. క్రియాశీలకంగా కమిటీలు పనిచేయడానికే ఈ విధానం. ప్లీనరీ నాటికి కమిటీలు ఏర్పాటు కావాలి. గడపగడపకూ పూర్తయ్యే నాటికి అంటే 8 నెలల పూర్తయ్యే సరికి, బూత్‌కమిటీలు ఏర్పాటు కావాలి. సచివాలయాల విధుల పరంగా తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులపై కూడా ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వాలి. వాటిని పరిశీలించి… తగిన మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సచివాలయాల సమర్థత మరింత పెరుగుతుంది.


ఏమేం చేయాలంటే….
గ్రామాలకు వెళ్లినప్పుడు, ఇప్పటికే నాడు –నేడు తొలిదశ కింద పనులు పూర్తిచేసుకున్న వాటిని ప్రారంభించడం, మిగిలిన స్కూళ్లలో రెండోదశ పనులకు శంకుస్థాపన చేయాలి. పెద్ద వ్యవస్ధను సృష్టించాం. ఈ మూడు సంవత్సరాల్లో పెద్ద వ్యవస్థను సృష్టించాం. కార్పొరేషన్లు, అందులోని ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఇలా ప్రతి ఎన్నికల్లోనూ గెలుచుకుని పెద్ద నెట్‌వర్క్‌ సృష్టించుకున్నాం. వీరందర్నీ కూడా క్రియాశీలకంగా ఉంచాలి. వీరిని యాక్టివేట్‌చేయాలి. ఇది జిల్లా అధ్యక్షుల బాధ్యత. వీరందరి సేవలనూ మనం ఉపయోగించుకోవాలి. దీనిపై ప్రత్యేక కార్యాచరణ కూడా తయారు చేస్తున్నాం. జరిగిన మంచి గురించి ఎక్కువ మంది మాట్లాడేలా చేయగలగాలి. మనం చేసిన మంచి ప్రచారంలో ఉండాలి. దీనివల్ల పార్టీకి మంచి సానుకూల పవనాలు వీస్తాయి. పార్టీ పరంగా ఉన్న వివిధ విభాగాలను యాక్టివేట్ చేయాలి. మనం కలిసికట్టుగా పనిచేయాలి, మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం. మనం మంత్రులుగా ఉన్నాం కాబట్టి… , మనల్ని పెద్దగా సమాజం చూస్తుంది, మనం నాలుగు అడుగులు ముందుకేసి మన జిల్లా అధ్యక్షుల్ని, ప్రాంతీయ సమన్వయకర్తలను గౌరవించాలి. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం, వారికి కేబినెట్‌ హోదా ఇస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయి.
గేర్ మారుస్తున్నాం
మే నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నాం, దీనికి అందరూ సన్నద్ధంకావాలి. 151 సీట్లు గెలిచాం. దీనికి తగ్గకుండా మళ్లీ మనం గెలవాలి. మామూలుగా గెలవటం వేరు, బ్రహ్మాండంగా గెలవడం వేరు. 175 కి 175 ఎందుకు రాకూడదు. గతంలో కుప్పంలో మనం గెలవలేదు. కాని అక్కడ మున్సిపాల్టీ గెలిచాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించాం. అలాంటిది ఎందుకు గెలవలేము? చేయాల్సిన కార్యక్రమాలను సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే.. ఎందుకు గెలవలేం? చేతిలోని వేళ్లన్నీ కలిస్తేనే పిడికిలి అవుతుంది. ప్రజలకు ఇంత మంచి చేసి ఎందుకు గొప్పగెలుపును సాధించలేం?
– అర్హత ఉన్న వారు ఎవ్వరూ కూడా మిస్‌కాకూడదని చెప్పి.. మనం పథకాలు అమలు చేస్తున్నాం. వివిధ పథకాల ద్వారా ఇప్పటికే 1.37 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చాం, వచ్చే 2 ఏళ్లలో మరో 1.10లక్షల కోట్లు ఇస్తాం. దీంతో మనం ఐదేళ్లలో లబ్ధిదారులకు అందించిన మొత్తం రూ.2.5లక్షల కోట్లు అవుతుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా… మనంచేశాం. మనం ఒదిగి ఉండి.. ప్రజలకు చేసిన మంచిని చెప్పాలి. అందరికీ అభినందనలు. క్రమం తప్పకుండా మీతో సమావేశం అవుతాను… అంటూ జ‌గ‌న్ ప్ర‌సంగం ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...

Fulfil drinking water needs of Hyderabad: CM

Revanth warns Millers and Traders of cancelling license  Hyderabad:  Chief...

“Who killed the rule of law?”: Highlighting Points

Book Written by Justice R.C. Chavan, Former Judge Bombay...