ప్ర‌భుత్వ వ్య‌తిరేకుల‌కు ఫేర్‌వెల్ బ‌డ్జెట్‌: జ‌గ‌న్‌

Date:

ఇది ప్ర‌జ‌ల బ‌డ్జెట్‌
శాస‌న స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
క‌డుపు మంట చూపిస్తున్న ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టివి 5
ప్ర‌జ‌ల‌కు సంక్షేమ క్యాలెండ‌ర్‌…వారికి ఫేర్‌వెల్ క్యాలెండ‌ర్‌
ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ‌లో ముఖ్యమంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం
అమ‌రావ‌తి, మార్చి 25:
ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు అంద‌రి మ‌దినీ దోచుకుంటున్నాయ‌నీ, ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో ఢ‌మ‌రుకాలు మోగిస్తున్నాయ‌నీ ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి కోసం మేం ప్ర‌వేశ పెడుతున్న బ‌డ్జెట్ ఒక డాక్యుమెంట‌నీ, మూడేళ్ళుగా మా బ‌డ్జెట్ ఆచ‌ర‌ణే మా్టాడుతోంద‌నీ తెలిపారు. ద్ర‌వ్య‌ వినిమయ బిల్లుపై అసెంబ్లీలో శుక్ర‌వారం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్ ఏమ‌న్నారంటే:
మేనిఫెస్టోను ప్రతిబింబిస్తూ..:
మరో రెండు నెలల్లో మూడు సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఈ బడ్జెట్‌ కూడా మన మేనిఫెస్టోను పూర్తిగా ప్రతిబింబిస్తూ.. ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావిస్తూ.. బడ్జెట్‌లోకి పూర్తిగా తీసుకుని వచ్చాం. సంక్షేమం, అభివృద్ధి కోసం మనం ప్రతిపాదిస్తున్న ఆదాయం, వ్యయం.. దీనికి సంబంధించిన ప్రణాళికకు ఈ రోజు ఈ బడ్జెట్‌ ఒక డాక్యుమెంట్‌. ఇది ప్రజల బడ్జెట్‌. ఇది రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌. గతంలో బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టినా.. బడ్జెట్‌ అంటే అంకెల గారడీ అని ప్రతిపక్షాలు విమర్శించడం చూశాం. కానీ ఈ 3 సంవత్సరాల మన పరిపాలన, మన బడ్జెట్‌ ఏ ఒక్కరు చూసినా.. మూడేళ్లుగా మన ఆచరణే మాట్లాడుతుంది.
అందుకే ఆదరిస్తున్నారు:
మనం ఏమిటి అన్న దానికి మన పని తీరే నిదర్శనం. ప్రజలంతా జరుగుతున్న మంచిని గమనించారు కాబట్టే.. 2019 తర్వాత కూడా ప్రతి ఎన్నికల్లోనూ మన ప్రభుత్వాన్ని మరింత అక్కున చేర్చుకుని తమ ఆశీస్సులతో మరింత బలపర్చారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారు ఇప్పుడు చాలా మంది మన వెంటే ఉన్నారన్న సంగతి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను.
విపక్షం.. ఉనికి కోసం ఆరాటం:
అందుకనే ప్రతిపక్షం తన ఉనికి కోసం, లేని సమస్యలు ఉన్నట్లుగా చిత్రీకరించి, వక్రీకరించి రోజూ డ్రామాలు, కథలు చేస్తోంది. వాళ్లకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లు కూడా ప్రతి సందర్భంలోనూ తమ కడుపు మంట చూపిస్తున్నారు. మూడేళ్ళ‌లో అక్షరాలా 95 శాతం వాగ్ధానాలు అమలుతో పాటు మనం చెప్పిన నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యం ఇస్తూ మన మూడేళ్ల పరిపాలన సాగింది.
ఆదాయాలు త‌గ్గిన చెద‌ర‌ని సంక‌ల్పం
కరోనా వచ్చి ఆదాయాలు తగ్గినా కూడా మన సంకల్పం ఎక్కడా చెదరలేదు, మన దీక్ష ఎక్కడా కూడా మారలేదు. ప్రజలకు చేస్తున్న మంచి ఎక్కడా తగ్గనూ లేదు. ప్ర‌జలకు ఏమీ చేయడం లేదని, ఏదీ అందడం లేదని విమర్శించే ఏ అవకాశం కూడా మనం ఈ రోజు ప్రతిపక్షానికి ఇవ్వడం లేదు. చంద్రబాబునాయుడుగారు వారి పాలనలో ఫలానాది బాగుందని చెప్పే సాహసం చేయలేడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగానూ, 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఈ మనిషికి ఏ కోశానా కూడా ఎక్కడా కూడా ఆ ధైర్యం లేదు.
అలా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే
ఈ సంవత్సరం దాదాపుగా 55 వేల కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ విధానంలో లబ్ధిదారుడికి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. పరోక్షంగా ఇచ్చేది కలుపుకుంటే అది మరో రూ.17,305 కోట్లు అదనం. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి డీబీటీని కానీ, పారదర్శక పాలన కానీ ఎక్కడా ఎవ్వరూ ఇవ్వడం లేదు. మనం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పుడు, ఏ నెలలో ఇస్తున్నాం అన్నది ఎలాంటి సందేహాలకు తావు లేకుండా లభ్ధిదారులు కూడా మెరుగ్గా వారి కుటుంబ అవసరాలను ప్లాన్‌ చేసుకునే వీలు కల్పిస్తున్నాం. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మేలు చేకూరేలా సామాజిక తనిఖీ చేయడంతో పాటు, ఎలాంటి లంచాలకు, వివక్షకు తావు లేకుండా ఏ నెలలో ఏ పథకం వస్తుందో కూడా చెబుతూ.. ఏకంగా కేలండర్‌నే విడుదల చేసి ఆ ప్రకారం క్రమం తప్పకుండా అమలు చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం మనది. ఈ పథకాల అమలులో, లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడా కులం, మతం, ప్రాంతం, చివరికి రాజకీయ పార్టీ కూడా చూడలేదు. అందరూ మన వాళ్లే, అందరూ నా వాళ్లే అని గట్టిగా నమ్మి ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.
నవరత్నాలు..అందరిలో సంతోషం
నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో ఒక మనిషి తనకు తాను ఒక కుటుంబం, ఒక సామాజిక వర్గం బాగుండేలా మన ప్రభుత్వంలో నవరత్నాల పేరిట పలు పథకాలను అమలు చేస్తున్నాం. ఈ పథకాల అమలు ఎలా జరుగుతుందో మన రాష్ట్రంలోని ప్రతి రైతన్నను అడిగినా చెప్తాడు. ప్రతి స్కూల్‌ పిల్లవాడు, ప్రతి పాప, ప్రతి అక్కచెల్లెమ్మను, ప్రతి అవ్వా తాతను అడిగినా కూడా చెప్తారు. సంతోషం వాళ్ల కళ్లలోనే కనిపిస్తుంది.
సంక్షేమ క్యాలెండర్ ప్ర‌క‌ట‌న‌
ఏప్రిల్‌ 2022 నుంచి మార్చి 2023 వరకు మనందరి ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఏ పధకం ఏ నెలలో అందించబోతోంది అన్నది వివరిస్తూ.. ఈ గౌరవ సభ సాక్షిగా ఈ సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటిస్తున్నాను.
ఏ నెలలో ఏ పథకం
ఏప్రిల్‌ నెలలో వసతి దీవెన, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నాం. మే నెలలో విద్యాదీవెన. విద్యా సంవత్సరంలో త్రైమాసికం పూర్తి కాగానే ఇఛ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించి మే లో విద్యాదీవెన ఉంటుంది.
ఖరీఫ్‌ 2021కు సంబంధించి అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఉపయోగపడే విధంగా మే మాసంలో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇదే మే మాసంలో రైతుభరోసా సొమ్మను రైతుకు పెట్టుబడి కోసం డబ్బులు పెట్టే విధంగా చేస్తున్నాం. మత్స్యకార భరోసాను కూడా ఆ నెలలోనే ఇస్తున్నాం.
జూన్‌లో అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. రూ.6500 కోట్లు ఈ ఒక్క పథకంలో ఇస్తున్నాం. జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడుతో పాటు, అర్హత ఉండీ పథకాలు అందని వారికి ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తాం.
ఆగష్టులో విద్యాదీవెన కార్యక్రమం, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెంటివ్‌లు ఇచ్చే కార్యక్రమం, నేతన్న నేస్తం జరుగుతాయి. సెప్టెంబరులో వైయస్సార్‌ చేయూత పథకం అమలు చేస్తాం. ఈ పథకం ద్వారా 25 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.4500 కోట్లు అందిస్తాం. అక్టోబరులో వసతి దీవెన, రైతు భరోసా రెండో విడత కూడా ఉంటుంది. నవంబరులో విద్యాదీవెన, వడ్డీలేని రుణాలు రైతులకు అందించే కార్యక్రమం ఉంటుంది. డిసెంబరులో ఈబీసీ నేస్తం, లా నేస్తంతో పాటు అర్హత ఉండి మిగిలిపోయిన వారికి ఆయా పథకాలు అందిస్తాం.
జనవరిలో రైతు భరోసా మూడో విడత, వైయస్సార్‌ ఆసరా ఉంటుంది. దాదాపుగా 79 లక్షల అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ.. దాదాపు రూ.6700 కోట్లు అందించే కార్యక్రమం. జనవరిలోనే జగనన్న తోడు కార్యక్రమం, పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.2750 పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పిబ్రవరిలో విద్యాదీవెన, జగనన్న చేదోడు కార్యక్రమం ఉంటుంది. మార్చిలో వసతి దీవెన కార్యక్రమం ఉంటుంది.
వారికి ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌:
ఇదీ సంక్షేమ క్యాలెండర్‌. ఇది రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు ఇతర మైనార్టీ వర్గాలకు సంక్షేమ క్యాలెండర్‌. కానీ చంద్రబాబుకు, తనకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5కు ఇది ఏమాత్రం రుచించని క్యాలెండర్‌. గుబులు పుట్టించే క్యాలెండర్‌. ఇది మన పేదలకు వెల్ఫేర్‌ క్యాలెండర్‌ అయితే చంద్రబాబునాయుడుకు మాత్రం ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌ అవుతుంది.
మంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మన ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానంటూ సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...