ఉత్తమ గురుశిష్యత్వానికి ప్రతీక

Date:

రామానుజ వైభ‌వం – 9
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
భగవద్రామానుజులు గురుభక్తికి, శిష్యవాత్సల్యానికి ప్రతీక. శిష్యుడిగా, గురువుగా ఎలా ఆదర్శంగా వెలుగొందారో తెలిపేందుకు ఆయన జీవిత ప్రస్థానంలో అనేక సంఘటన‌లు రుజువుగా నిలుస్తాయి. ‘శుశ్రుషా…ప్రణితపతన పరత్త్వం’….అంటే సేవ చేయడం, గురువు చెప్పేది శ్రద్ధగా వినడం, గురువుకు ఎల్లప్పుడు నమస్కరించేందుకు సిద్ధంగా ఉండడం శిష్యునికి ఉండవలసిన నిజమైన లక్షణాలుగా చెబుతారు. రామానుజ యతీంద్రులు ఏకకాలంలో ఇటు శిష్యునిగా, అటు గురువుగా ఎలాంటి తేడాలు లేకుండా ఆదర్శంగా నిలిచారు. గురుసేవలో తరిస్తూనే శిష్యులకు శిక్షణ ఇస్తూ ఆచార్యోపాసన, శిష్య వాత్సల్యాన్ని ప్రదర్శించారు. గురువు (ఆచార్యుడు) అంటే వ్యక్తిగత స్వార్థానికి అతీతంగా సర్వజన హితం కోసం పాటుపడేవాడని చెబుతారు. కొందరు అందుకు భిన్నంగా ఉండవచ్చేమో కానీ శంకర భగవత్పాదులు, భగద్రామానుజులు వంటి మహనీయులు సమాజం కోసం జీవితాలను అంకితం చేశారు. గీతాచార్యుడు చెప్పినట్లు ధర్మానికి హాని జరిగే సమయంలో ఇలాంటి మహనీయులు పుడుతూనే ఉంటారు.


ఉత్తమ శిష్యుడు
శిష్యరికం అంటే కేవలం గురువు చెప్పేది వినడమే కాదు సందేహాలు కలిగితే నివృత్తి చేసుకోవ‌టం కూడా. ‘ప్రమాదో ధీమతా మపి’ అని పెద్ద‌లు (ఆచార్యులు) చెప్పిన‌ట్లుగా… ఒకవేళ పొరపాటు జ‌రిగినా దానిని సరిచేయడానికి ప్రయత్నించాలి. అయితే అది మహనీయులను తప్పు పట్టేదిగా కాకుండా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో కూడినదై ఉండాలి. వేద వాక్యాలను విపరీతార్థంలో వ్యాఖ్యానించిన గురువు యాదవ ప్రకాశకులతోనే విభేదించారు రామానుజ. సత్యం ఎప్పుడూ కఠినంగా, కర్కశంగానే ఉంటుందని, అది తెలుసుకొనేందుకు ప్రయత్నించకుండా సర్దుబాటు ధోరణిని అనుసరించడం ఆత్మ వంచనే అవుతుందనే పెద్దల మాటల‌ను అక్షరాలా పాటించారంటారు. అందుకు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నవారే ముందుకు వెళతారు.
పంచ సంస్కారం గురువైన పెరియనంబి వారి ఆదేశం మేరకు చరమ శ్లోకార్థ రహస్య జ్ఞానం కోసం రామానుజులు తిరుక్కోటియూర్ లోని గోష్ఠిపూర్ణులను ఆశ్రయించారు. దానిని బోధించేందుకు ఆయన 18 సార్లు తిప్పుకున్నాఆయన ఎలాంటి కోపతాపాలు, నిరాసక్తి ప్రదర్శించలేదు (మంత్రార్థ అభ్యాసనకు తన ఆసక్తి, శక్తి సామర్థ్యాల పరిశీలనకే ఆచార్యుల వారు అలా వ్యవహరించి ఉంటారని ఆయన సానుకూల కోణంలో భావించవచ్చు).
పెరియనంబి వారి ఆజ్ఞను శిరసావహించినట్లే ‘తిప్పుకుంటున్న ఆచార్యుల ఆదేశాలనూ మన్నించారు. దీంతో గుర్వాజ్ఞను అతిక్రమించకూడదన్న‌ రామానుజల విధానం స్పష్టమవుతోంది. అది ఉత్తమ శిష్యులకు ఉండవలసిన లక్షణంగా చెబుతారు.


సమర్థులైన, విజ్ఞానవంతులైన శిష్యులను తమంతటి వారిగా, తమ కంటే ఉన్నతులుగా భావించే గురువులున్నట్లే, తాము ఎంత ఎదిగినా గురువుల ముందు చిన్నవారమనే భావన గల శిష్యగణం గల సంస్కృతి మనది. రామానుజులు గోష్ఠి నిర్వహించినప్పుడు తమ ఆచార్యులు స్వామి పెరియనంబి సాష్టాంగ నమస్కారం చేయడమే మొదటి విధానానికి నిదర్శనం. ‘శ్రీరామశ్రీకృష్ణులకు విశ్వామిత్రసాందీపుల మాదిరిగా నేను రామానుజులకు ఆచార్యుడనే. కానీ వారికి తెలియక నాకు శిష్యుడు కాలేదు. నాకు అంతా తెలిసినా ఆయనకు నేను ఆచార్యుడను కాలేదు’ అన్న మాటలలో శిష్యుడి ఉన్నతి, గురువు సంస్కారం వ్యక్తమవుతుంది. అనంతాచార్యులు తదితర విద్వన్మ‌ణుల కోరిక మేరకు తిరుమల పర్వతారోహణకు సిద్ధమైన రామానుజులకు గురువు శ్రీశైలపూర్ణులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకురాగా నొచ్చుకున్న ఆయన ‘గురూత్తమా!శ్రమపడి ప్రసాదం మీరు తీసుకురావడమా? ఎంత అపచారం? ఎవరైనా పిన్నలతో పంపి ఉండవచ్చు కదా?’ అని ప్రశ్నించగా, ‘అక్కడ ఉన్నవారిలో నేనే చిన్నవాడిని’ అని బదులిచ్చారట శ్రీశైలపూర్ణులు. అది గురువు తనను తక్కువ చేసుకోవడం కాదని, శిష్యుడి ప్రతిభాపాటవాలను మెచ్చడమేనని చెబుతారు.
ఇచ్చినమాట తప్పి మంత్రరాజాన్ని బహిరంగ పరిచినందుకు ఆగ్రహించిన గోష్ఠీపూర్ణులు అంతలోనే రామానుజుల నిస్వార్థబుద్ధికి, దయార్ద్ర హృదయానికి కరిగిపోతూ, అక్కున చేర్చుకున్నారు. ‘గురువాక్యాన్ని అతిక్రమించినప్పటికీ కారుణ్యభావనతో మన్నించారు. ఇలాంటి గురువు నాకు లభించినందుకు దేవతలూ ఈర్ష్యపడతారు. అపరాధం చేసిన నన్ను మన్నించి, పుత్రునిలా చేరదీసిన మీకు అనంత వందనాలు’ అంటూ రామానుజులు గురు పాదాలను ఆశ్రయించడం రెండవ కోవకు ఉదాహరణ.


ఆదర్శాచార్యులు
మంచి శిష్యుడిగా పేరు గడించిన వారు ఉత్తమ గురువుగా ఆవిష్కృతులవుతారనే నానుడి రామానుజుల విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. గురువుల పట్ల గౌరవభావం, శిష్యుల పట్ల వాత్సల్యం రామానుజుల జీవిత నాణేనికి బొమ్మ‌బొరుసు లాంటివి. జ్ఞానార్జనలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ఇబ్బందులు ఎవరి విషయంలో పునరావృతం కాకూడదనుకున్నారు కాబోలు, ఎందరో శిష్యులను తీర్చిదిద్ది ‘ఆదర్శ ఆచార్యులు’గా మన్ననలు అందుకున్నారు. శ్రీరంగనాథుడు ప్రసాదించిన అభయంతో రామానుజులే అందరికీ మోక్షం చూపగలరని భావించే సందర్భంలో, తనకు శిష్య సంబంధం వల్ల మోక్షం ఉందని కాషాయ వస్త్రాన్ని ఎగురువేసి ఆనందాన్ని వ్యక్తీకరించిన ‘శిష్య పక్షపాతి’. ఏడు వందల మంది జీయర్లు, 12 వేల మంది భాగవతోత్తములు, వేలాదిగా మహిళలు ఆయనను ఆశ్రయించి శిష్యులయ్యారని చరిత్ర చెబుతోంది.


రామానుజులకు పంచగురువుల మాదిరిగానే గోవిందుడు, కూరేశుడు, ధనుర్దాసు, ఆంధ్రపూర్ణుడు, మార్నినినంబి లాంటి ప్రియశిష్యులున్నారు. గురుభక్తి, అద్భుత పాండిత్యం, ప్రపత్తి, శరణాగతి, ఉత్తమ వ్యక్త్తిత్వం గలవారిగా శిష్యులను తయారు చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. ఉదాహరణకు, కూరేశులు శ్రీభాష్య రచనలో సహకరించడంతో పాటు ఆయన ఏకసంధాగ్రహిత్వం పట్ల ముచ్చట పడ్డారు. శ్రీభాష్య రచనకు సంబంధించిన సంప్రదింపులు గ్రంథం కశ్మీరంలో దొరికినట్లే దొరికి చేజారిపోవడంతో రామానుజులు నిరాశపడగా, ‘శారదపీఠంలో ఆ గ్రంథాన్ని తిరగవేస్తూ ఒక్కసారి చూసిన దానిని గుర్తుంచుకున్న కూరేశుడు అపార జ్ఞాపకశక్తితో గ్రంథ రచనకు సహకరించారు. ఆయన చేసిన గొప్ప ఆచార్యసేవకు రామానుజులు అనుగ్రహంతో గాఢాలింగనం చేసుకుని ఆశీర్వదించారు. అలాంటి శిష్యులు దొరకడం భాగ్యంగా భావించారు. ఈ బృహత్ కార్యాన్నిఆచార్యుడు తన గొప్పతనంగా ప్రకటించు కోలేదు. శిష్యుడు (కూరేశుడు) తాను చేసిన సేవకు ‘అహంక’రించలేదు.పైగా ఆచార్య సేవ విధిగా, అదృష్టంగా భావించారు. తనను అనుక్షణం అనుసరిస్తూ, క్రిమికంఠుని వల్ల ఏర్పడిన ముప్పులో తన కోసం కళ్లనే త్యాగం చేసిన కూరేశుడు తన ముందే తరలిపోతుంటే కదలిపోయింది గురు హృదయం. తమ విశాల నేత్రాల నుంచి జాలువారుతున్న అశ్రువులను నిగ్రహించుకుంటూ, కూరేశుల కుమారులు పరాశర భట్టరును భావి వైష్ణవాచార్యులుగా ప్రకటించి ఆశీర్వదించారు
‘కేవలం జ్ఞానార్జనతోనే సరిపోదు. ధర్మానుష్ఠానంతోనే జ్ఞానం సార్థకమవుతుంది. సామాజిక బాధ్యతలు గుర్తెరిగి న్యాయదృష్టితో కర్మాచరణ చేయడంతోనే జీవితం సార్థకమవుతుంది’ అని ఉద్బోధించిన రామానుజులు, తాము ప్రారంభించిన ‘జ్ఞాన ఉద్యమం’ కొనసాగింపు బాధ్యతను 74 మంది శిష్యులకు అప్పగించారు. శిష్యప్రశిష్య పరంపరతో భగవద్రామానుజ ఆశయం కొనసాగుతూనే ఉంది, ఉంటుంది.
‘శ్రీ రామానుజ యతిభ్యో నమః’ (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అన్నమయ్యపై రెండు కీర్తనలు

(మాడభూషి శ్రీధర్)అన్నమయ్య రచించి, స్వర రచన చేసి, పాడిన అద్భుతమైన పాటలపై...

Golden Jubilee Marriage Celebration of a Vibrant Family

(Shankar Chatterjee) Marriage is a legal and socially sanctioned union,...

BJP’s problem is un-settled Maharashtra

(Dr Pentapati Pullarao) Maharashtra is one of the problem states...

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...