తిరుమల రేడుకే ఆచార్యులు రామానుజాచార్యుడు

Date:

రామానుజ వైభ‌వం-8
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
శ్రీపెరుంబూదూరులో జన్మించిన రామానుజులకు కాంచీపురం, శ్రీరంగం తరువాత తిరుపతి, తిరుమలతో గల ఆధ్యాత్మిక అనుబంధం ప్రత్యేకమైనది. రామానుజులు అన్ని దివ్యదేశాలు సందర్శించినప్పటికీ తిరుమలేశునితో గల బాంధవ్యం విశిష్టమైనది. కంచి వరదరాజ పెరుమాళ్లు సన్నిధిలో పెరిగి పెద్దయి సన్యసించగా, శ్రీనివాస పెరుమాళ్లకు శంఖుచక్రాలు అనుగ్రహించి గురుస్థానం పొందారు. గురువులకు గురువు అనిపించుకున్న ఆయన దేవదేవుడికే గురువనిపించుకున్నారు. శ్రీశైలపూర్ణులు (తిరుమలనంబి), భగవద్రామానుజులు, అనంతాచార్యులు (అనంతసూరి) త్రయం పవిత్ర నామాలు తిరుమల ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తిరుమల ప్రథమ పౌరుడిగా పరిగణించే మేనమామ తిరుమలనంబి వద్ద రామాయణ విశేషార్థాలు తెలుసుకున్నారు. శ్రీనివాస భగవానుడి అర్చనలు, సేవలకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే రామానుజులు అవతరించారా? అనేలా వ్యవస్థను రూపొందించారు. తిరుమలగిరులలో నందనవనం నిర్మించి స్వామి వారికి నిత్య పుష్ప కైంకర్యానికి ఎవరు సంసిద్ధులని శ్రీరంగంలోని గోష్ఠిలో ప్రశ్నించినప్పుడు అనంతాళ్వార్ (తిరుమల ద్వితీయ పౌరుడు) ఒక్కరే ముందుకు వచ్చారు.


రామానుజ తీర్పు
శంఖుచక్రాల రహితంగా కనిపిస్తున్న స్వామి వారి ఉనికిపైనే సందేహాలు తలెత్తిన సందర్భంలో తమ వైదుష్యంతో సమస్యను సానుకూలంగా పరిష్కరించారు. వేంకటేశ్వరుని మామగారు ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి ఒక యుద్ధం సందర్భంగా స్వామి వారి ఆయుధాలు తీసుకు వెళ్లి తిరిగి ఇవ్వలేదట (ఇవ్వబోయినా ఈ కలియుగంలో వాటిని ధరించనంటూ స్వామి స్వీకరించలేదని మరో కథనం). అదే సమయంలో స్వామి వారి అర్చామూర్తిని చూసేవారి మనస్సును బట్టి శ్రీమహావిష్ణువుగా, శివుడు, షణ్ముఖుడు, శక్తి స్వరూపిణిగా, భైరవుడు…ఇలా ఎవరికి తోచినట్లు వారు భావిస్తూ వస్తున్నారు. రామానుజులు మాత్రం ఆయన సాక్షాత్తు లక్ష్మీపతే అని రూఢీగా చెప్పారు. సప్తగిరీశుడు వైకుంఠవాసే అంటూ యాదవ రాయల పండిత సభలో వివిధ పురాణాలను సోదాహరణగా చూపారు. అయినా ఎదురు పక్షం వారు విశ్వసించలేదు. శ్రీకూర్మంలో చేసిన ప్రతిపాదనలానే ‘గర్భాలయంలో వివిధ దేవతల సంబంధిత అలంకరణలు, ఆయుధాలు ఉంచుదాం. మరునాడు ఉదయానికి స్వామి స్వీకరించే వాటిని బట్టి స్వామి అవతారాంశాన్ని నిర్ణయించుదాం’ అన్న ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. రామానుజులకు పరమాత్మపై గల అచంచల విశ్వాసం వమ్ముకాలేదు. మరునాడు సుప్రభాత సేవ సమయానికి శ్రీనివాసమూర్తి శంఖు చక్రధారిగా దర్శనమిచ్చారు. అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి.


శంఖు చ‌క్రాల‌ను అమ‌ర్చిన రామానుజులు
రామానుజులు హర్షాతిరేకాలతో స్వామివారికి వేదోక్తంగా శంఖుచక్రాలు అమర్చి తిరునామం దిద్దారు. వెంకట రమణుడి వక్షస్థలంలో అంతకు ముందు లక్ష్మీదేవి వేంచేసి ఉండగా, ఉత్తర ఫల్గుణీ నక్ష్రత్రయుక్త శుక్ల పక్ష ద్వాదశి, రత్నమాలికా యోగంలో వ్యూహలక్ష్మిని ఏర్పాటు చేశారని చరిత్ర చెబుతోంది. వక్షఃస్థల లక్ష్మితో కూడిన శ్రీనివాసునికి శుక్రవారం మాత్రమే అభిషేకం నిర్వహించాలని కట్టుదిట్టం చేశారు.


దేవదేవుడికే ఆచార్యుడు
శంఖుచక్రాలు అనుగ్రహించే అర్హత గురువుకే ఉంటుంది కనుక, విష్ణువుకే వైష్ణవ దీక్ష ప్రసాదించి రామానుజ దేవుడికే ఆచార్యుడయ్యారన్నది భక్తజన స్తుతి కాదు….శ్రీనివాసుడే ప్రకటించుకున్నారు. అందరికి సర్వస్వం భగవంతుడు. భగవంతుడికి మాత్రమే గురువే శిరోధార్యం. అందుకు ‘తిరుమల రేడు-యతిరాజ’ మధ్య గల బాంధవ్యమే నిదర్శనం. ‘గురువు పాదాలు శిష్యుడి హృదయాన్ని తాకాలి. ఆనంద నిలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించే విగ్రహం పాదాలు నా హృదయాన్ని తాకేంత ఎత్తులో ఉండాలి..’ అని వేంకటేశ్వరుడే సూచించారట. రామానుజులు శ్రీరంగం వెళుతున్నప్పుడు వియోగాన్ని భరించలేకపోతున్న అనంతాచార్యులకు ఆయన వద్ద ఉన్న తమ విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని తమ తేజస్సును అందులో ప్రవేశపెట్టారు. ఆ విగ్రహమే రామానుజుల నిర్యాణం తరువాత శ్రీనివాసుని మందిరం ‘ఆనంద నిలయం’లో ఈశాన్యమూలన ప్రతిష్టితమైంది. ఇతర చోట్ల మాదిరిగా కాకుండా ఈ విగ్రహం ఉపదేశ ముద్రలో దర్శనమిస్తుంది.
శ్రీవారి పూజావిశేషాల గురించి పలు భాష్యాలను (వ్యాఖ్యలు) అందచేసినందుకు ఆయన ఆలయాన్ని ‘భాష్యకార్ల సన్నిధి’ అంటారు. శ్రీవారి నివేదన జరిగిన ప్రతిసారి సన్నిధి భాష్యకారులకు నివేదన జరుగుతుంది.


అర్చన విధానం, జీయర్ వ్యవస్థ
తిరుమల వేంకటాచల క్షేత్రంలో అర్చనాది కార్యక్రమాలు పటిష్ఠపరిచారు రామానుజ. వైకుంఠనాథుడే సాలగ్రామ శిలామూర్తిగా వెలిశాడని, ఆ స్వామే విఖనస మూర్తిగా అవతరించి అర్చనా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక వైఖానస ఆగమం ప్రకారమే అర్చనాదులు నిర్వహించాలని నిర్ణయించారు. లౌకిక వ్యవహారాలకు అతీతంగా, స్వామిసేవే పరమాధిగా జీవితాన్ని అంకితం చేసేవారితోనే ఆలయ నిర్వహణ సజావుగా సాగుతుందన్న భావనతో ఏర్పడిందే జీయర్ వ్యవస్థ. అప్పటి వరకు ఉన్న ‘ఏకాంగి’ సేవలకు అదనంగా రామానుజులు ఈ వ్యవస్థను నిర్ధరించారు. శ్రీ వైష్ణవ సన్యాసిని తమిళంలో ‘జీయర్’ అంటారు. కాషాయం, కమండలం, త్రిదండం జీయర్ల దీక్షలో భాగం కాగా, కాషాయం మాత్రమే స్వీకరించిన వారు ఏకాంగులు. స్వామికి సన్నిహితంగా ఉంటూ అర్చక ముఖంగా సేవలను జరిపించే ప్రధాన బాధ్యతలను జీయర్ వ్యవస్థకు అప్పగించారు. పుష్ప కైంకర్యపరుడు అనంతా చార్యులును తమ ప్రతినిధిగా నియమించారు. మొదట ఒక జీయర్‌నే నియమించారు. ఆ తర్వాత ఉత్తరాధికారిగా మరొకరిని నియమించే సంప్రదాయం నెలకొంది. జీయంగార్లంటే సన్యాసులు కారు. ఈ పదవికి వచ్చేంత వరకు సంసార సాగరాన్ని ఈదిన వారినే ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం తిరుమలలో పెద్ద,చిన్న జీయంగార్ల మఠాలు ఉన్నాయి.


మోకాళ్లపై కొండకు
తిరుమల సాక్షాత్తు ‘శ్రీనివాస పరబ్రహ్మ’ అని కీర్తించిన ఆళ్వార్లు తిరుపతి సందర్శించినా వారిలో కొందరు, నడిచి కొండను ఎక్కడం సరికాదని కొండ దిగువ నుంచే నమస్కరించేవారట. తిరుమల సందర్శించాలన్న ఆకాంక్షతో రామానుజులు మాత్రం మోకాళ్లపై దేకుతూ వెళ్లారు. అలా వెళుతూ ‘మోకాళ్ల మెట్టు’ వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అందుకు గుర్తుగా అనంతరం కాలంలో రామానుజ సన్నిధిని ఏర్పరిచారు. దానిని ‘త్రోవభాష్యకారులు’ అంటారు.


స‌ముద్రంలో ప‌డ‌వేసిన గోవింద‌రాజ‌స్వామి విగ్ర‌హం తిరుప‌తిలో ప్ర‌తిష్ఠ‌
చోళరాజు క్రిమికంఠ చోళుడు తూర్పు సముద్రంలో (బంగాళాఖాతం) పడవేయించిన చిదంబరంలోని గోవిందరాజ స్వామి విగ్రహాన్ని వెలికి తీయించి తిరపతికి తరలించి గోవిందరాజ ఆలయంతో పాటు తిరుపతి పట్టణాన్ని నిర్మింప చేశారని చరిత్ర చెబుతోంది. వైష్ణవ క్షేత్రాలలో విధిగా గోదాదేవి సన్నిధి ఉండాలనే ఆకాంక్ష మేరకు, గోవిందరాజ స్వామికి దక్షిణ దిక్కులో గోదాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం చుట్టూ నాలుగు విశాలమైన వీధులు నిర్మించి, ఎవరు ఎక్కడ నివసించాలో కూడా నిర్ధరించారు.


పంచమి తీర్థ సారె
తిరుచానూరులో అలమేల్మంగ అవతరించిన కార్తిక శుక్ల పంచమి తిథినాడు (‘తిరుచానూరు పంచమి’) తిరుమల శ్రీవారి పూలమాలలు, పసుపు, కుంకుమలతో అమ్మవారికి సారె పంపే సంప్రదాయాన్ని కూడా రామానుజులే ఏర్పాటు చేశారు.
తిరుమలలో రామానుజ గోష్ఠికి పాలు, పెరుగు సమర్పిస్తూ వచ్చిన యాదవ మహిళ ప్రతిఫలంగా మోక్షాన్ని అర్థించగా, ఆ సంగతిని శ్రీవారికి లేఖ ద్వారా విన్నవించారని, ఆచార్యుని మాట కాదనకుండా ఆమెకు మోక్షం ప్రసాదించారని ప్రతీతి. తిరుమల ఆలయానికి ఎదురుగా ‘గొల్లభామ’ మండపం నేటికీ దర్శనమిస్తుంది. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...