సంక్షేమంలో ఏపీ కొత్త చ‌రిత్ర‌

Date:

వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ప్రారంభం
పేద‌లైన అగ్ర‌వ‌ర్ణ మ‌హిళ‌ల‌కు వ‌ర్తింపు
ఒక్క క్లిక్‌తో రూ. 589 కోట్లు ఖాతాల‌లో జ‌మ‌
కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
అమరావతి, జ‌న‌వ‌రి 25:
ఆంధ్ర ప్ర‌దేశ్ సంక్షేమ కార్య‌క్ర‌మాల చ‌రిత్ర‌లో స‌రికొత్త ప‌థ‌కం ప్రారంభ‌మైంది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరిట ఈ ప‌థ‌కాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. క్యాపు కార్యాల‌యంలో ఏర్పాటైన ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న కంప్యూట‌ర్‌లో బ‌ట‌న్ నొక్కి అర్హులైన 3.93 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు 15వేల రూపాయ‌ల చొప్పున మొత్తం 589 కోట్ల రూపాయ‌ల‌ను వారి ఖాతాల్లో జ‌మ‌చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడారు. ఆయ‌న ప్ర‌సంగం య‌థాత‌థంగా..


అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగస్పూర్తికి కొన‌సాగింపు..
రిపబ్లిక్‌డేకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన దేశాన్ని మన రాజ్యాంగం ప్రకారమే మనల్ని మనం పాలించుకునే రోజు రిపబ్లిక్‌డే రోజున ప్రారంభమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇప్పటికి 72 సంవత్సరాలు పూర్తయి.. రేపు 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనస్సుతో నివాళులు అర్పిస్తున్నాం. అందులోని ఆశయాలకు అద్దం పడుతూ.. వాటిని నెరవేరుస్తూ అడుగులు ముందుకేస్తున్నాం. రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రతి అడుగూ అంబేద్కర్‌ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అడుగులు ముందుకేస్తున్నాం.ఈ రోజు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని అమలును ప్రారంభిస్తున్నాం.
అగ్రవర్ణాల పేదల కోసం..
అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు. వారికి మంచి చేసేందుకు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించాం. దాదాపుగా 3.93 లక్షల మంది మహిళలకు ఇవాళ రూ.589 కోట్ల రూపాయలు నేరుగా వారి అక్కౌంట్లోకి జమచేశాం.


ఎవ‌రికి ఈబీసీ నేస్తం అమ‌లు?
వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45–60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాల్లోకి అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ ఈకార్యక్రమం.
ప్రతి ఏటా రూ.15వేల చొప్పున 3 ఏళ్లలో రూ.45వేలు అదే అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. ఇది మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్న సంకల్పంతోనే వైయస్సార్‌ ఈబీసీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.


ఎన్నికల వాగ్దానం కాదు…
ఇది ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం కాదు. మేనిఫెస్టోలో కూడా చెప్పలేదు. అయినా కూడా ఈబీసీ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, పేదవాళ్లు అక్కడ కూడా ఉన్నారని, పేదవాడు ఎక్కడున్నా.. పేదవాడే…, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆర్ధికంగా, రాజకీయంగా, విద్యా, సాధికారతకు మద్ధతు పలుకుతూ.. వారికి ఒక మంచి అన్నగా, తమ్ముడిగా… వారికీ మంచి చేయాలనే ఈ బాధ్యత తీసుకుంటున్నాను.
ఇప్ప‌టికే వైయస్సార్ చేయూత ద్వారా
ఇప్పటికే వైయస్సార్‌చేయూత ద్వారా 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన దాదాపు 25లక్షల మందికి ప్రతిఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలు ఇస్తున్నాం. దీంతో పాటు అమూల్, రిలయన్స్, ఐటీసీ, పీఅండ్‌ జీ, అల్లానా, మహింద్రా, యూనీలీవర్‌ వంటి ప్రఖ్యాత కంపెనీలతో టైఅప్‌ చేసి, బ్యాంకులను కూడా వారికి అనుసంధానం చేసి వారికి అండగా నిలబడి అడుగులు వేశాం.


కాపు నేస్తం…
వైయస్సార్‌కాపు నేస్తం ద్వారా 45–60 సంవత్సరాల వయస్సు కలిగిన కాపు, బలిజ, ఒంటరి మహిళలకు 3.27లక్షల మందికి ప్రతిఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్లపాటు ఇస్తూ… వారి ఆర్ధిక స్వావలంబనకు తోడుగా ఉన్న ప్రభుత్వం కూడా మనదే.
ఇప్పుడు ఈబీసీ పథకం ద్వారా పేదరికంలో ఉన్న దాదాపు 4లక్షలమందికి ప్రతిఏటా రూ.15వేలు ఇస్తాం. 60 యేళ్లు పైబడిన వాళ్లకు వైయస్సార్‌ పెన్షన్‌ కానుక అమల్లో ఉంది. దానివల్ల ప్రతినెలా రూ.2500 సంవత్సరానికి రూ.30 వేలు లబ్ధి జరుగుతుంది.


కోటి మందికి లబ్ది
మన రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో గల ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేస్తూ… దాదాపు 32 నుంచి 33 లక్షల మంది మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నాం. అంటే దాదాపు కోటిమందికి లబ్ధి జరుగుతుంది. ఇది మాత్రమేకాకుండా అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మంది తల్లులకు, 85 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా ప్రతియేటా రూ. 6500 కోట్లు ఇస్తూ ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు దపాలుగా వారికి ఇప్పటికే రూ.13,023 కోట్లు అందజేశాం.
పెన్షన్ కానుక ద్వారా
వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా మొత్తంగా 61.73 లక్షల మంది పెన్షనర్లు ఉంటే వారిలో 36.70 లక్షల మంది అవ్వలు, అక్కలకు మంచి జరిగేలా నెల,నెలా వారికి రూ.2500 పించన్‌ ఇస్తూ ఏడాదికి రూ.30వేలు వాళ్ల చేతిలో పెడుతూ తోడుగా నిలబడగలిగాం. వైయస్సార్‌ఆసరా పథకం ద్వారా 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ల కాలంలో వాళ్లందరికీ కూడా గత ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి మోసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసిన పరిస్థితులు. 18.36 శాతంగా ఉన్న నాన్‌ ఫెర్ఫార్మింగ్‌ అసెట్స్‌ అవుట్‌ స్టాండింగ్‌ లోన్స్‌ కింద వాళ్లందరూ కూడా ఏ గ్రేడ్‌ నుంచి సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయిన పరిస్ధితుల్లో వాళ్లందరినీ చేయిపట్టకుని లేవనెత్తుతూ.. వారికి మంచి చేసే దిశగా వైయస్సార్‌ ఆసరా పథకం ద్వారా రూ.25,517 కోట్లను నాలుగు దఫాలుగా వాళ్లకిచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వాళ్లకి ఇప్పటికే రెండు దఫాలుగా ఇవ్వడం జరిగింది.ఈ రెండు విడతల్లో అక్షకారాల రూ.12,758 కోట్లు నేరుగా వాళ్ల చేతుల్లో పెట్టి… వాళ్ల ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌ అకౌంట్‌ కేవలం 0.73 శాతానికి మాత్రమే తగ్గి ఉన్నాయంటే మహిళల అభివృద్ధి జరిగిందనేదానికి నిదర్శనం ఇది.


జగనన్న కాలనీలు
వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. కోటి 25 లక్షలమందికి మేలు జరిగే గొప్ప కార్యక్రమం. రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి మేలు . ఇళ్ల స్థలాలు వారి చేతులకు ఇచ్చాం. ఇళ్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది.
ఈ ఇళ్లన్నీ పూర్తయితే 32 లక్షల జీవితాల్లో వెలుగులు వస్తాయి. ప్రతి ఒక్కరికీ రూ. 5 నుంచి 10 లక్షల రూపాయల మేలు జరుగుతుంది. రూ.2 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్టు అవుతుంది.
పొదుపు మహిళలు- సున్నా వడ్డీ
పొదుపు సంఘాల్లోని మహిళలకు సున్నావడ్డీ అమలు చేస్తున్నాం. దీనికోసం రూ.2354 కోట్లతో వారికి తోడుగా నిలబడగలిగాం.
విద్యా, వసతి దీవెనలు
జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లల చదువులకు అయ్యే ఫీజులను వారి ఖాతాల్లోనే వేస్తున్నాం. 18.81లక్షల మంది తల్లులకు ఈ రెండు సంవత్సరాలలోనే రూ.6258 కోట్లు అందించాం.
జగనన్న వసతి దీవెనకూడా ఇస్తున్నాం. దీనిద్వారా దాదాపు ఇంతేమంది తల్లులకు సంబంధించిన పిల్లలకు లాడ్జింగ్, బోర్డింగ్‌ ఖర్చులు ప్రతి ఒక్కరికీ అందాలి, అక్కచెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదని, పిల్లలు చదువులు మంచిగా కొనసాగాలని ఇంజనీరింగ్‌ చదువుతున్న పిల్లలకు రూ.20వేలు, పాలిటెక్నిక్‌ పిల్లలకు రూ.15వేలు, ఐటీఐ పిల్లలకు రూ.10వేలు, డిగ్రీ విద్యార్ధులకు రూ.20వేలు చొప్పూన ఈ రెండు సంవత్సరాలలో రూ.2267 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం.


వైయస్సార్ సంపూర్ణ పోషణ
వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షలమందికిపైగా బాలింతలు, గర్భిణీలు, 6 నుంచి 72 నెలలున్న చిన్నారుల వరకూ మంచి చేస్తున్నాం. వీరందరూ పౌష్టికాహారం బాగా తినగలిగితేనే మెదడు పెరగడం, జన్మనిచ్చిన తర్వాత ఇవ్వకముందు కూడా తల్లుల ఆరోగ్యాలను మనసులో పెట్టుకుని గతంలో రూ.600 కోట్లు ఇస్తే గొప్ప అనే పరిస్థితుల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో అయితే 77 చోట్ల ఇంకా ఎక్కువగా మంచి జరగాలని గిరిజన మహిళలకు సంపూర్ణ పోషణ ప్లస్‌ తీసుకొచ్చాం. ఇవి మనం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఇవి.
రాజకీయంగా మహిళా సాధికారిత
అవే కాకుండా మహిళా సాధికారితకు రాజకీయంగా కూడా పెద్ద ప్రామఖ్యత ఇచ్చాం.
శాసనమండలిలో తొలి మహిళా వైస్‌ ఛైర్మ న్‌గా సోదరి శ్రీమతి జకియా ఖానమ్‌ ఉంది. రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగాశ్రీమతి పాముల పుష్పశ్రీవాణి, మహిళా హోంమంత్రిగా శ్రీమతి మేకతోటి సుచరితమ్మ ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా చీఫ్‌ సెక్రటరీగా నీలం సాహ్నిని పెట్టాం. తొలి మహిళా ఎన్నికల అధికారిగా కూడా ఆమె ఉన్నారు. ఇవన్నీ మన ప్రభుత్వంలో మనం వేసిన ముందడుగులు.


నామినేటెడ్ పోస్టుల్లోనూ
నామినేటెడ్‌ పోస్టుల్లో మహిళలకు 51శాతం ఇచ్చాం. దీనికోసం ఏకంగా చట్టమే తీసుకు వచ్చాం. మొత్తంగా నియామకాలు జరిగిన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు 202 అయితే అందులో 102 మహిళలకే ఇచ్చాం. మొత్తంగా 1154 డైరెక్టర్‌ పదవులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తే.. అందులో అక్కచెల్లెమ్మలకు 586 అంటే మొత్తంగా కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లు రెండూ కలిపితే… 1356 పదవుల్లో 688 అక్కచెల్లెమ్మలకే ఇవ్వగలిగాం.
మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపాలకసంస్ధలకు సంబంధించిన ఎన్నికలు ఈమధ్య కాలంలోనే జరిగాయి. వీటికి సంబంధించి ఛైర్మన్, మేయర్ల పదవిలో సగభాగానికి పైగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం.
మనం చేసిన చట్టం ప్రకారం 42 పదవులు ఇవ్వాల్సిఉంటే అంతకంటే ఎక్కువగా 52 ఛైర్మన్ల పదవులు వారికిచ్చాం. అంటే 60.47 శాతం మంది అక్కచెల్లెమ్మలే మేయర్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, నగరపంచాయతీల్లోనూ ఉన్నారు.
202 వ్యవసాయమార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవులు ఉంటే అందులో 101 ఛైర్మన్‌ పదవుల్లో అక్కచెల్లెమ్మలే ఉన్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మక ఘటన జరిగింది. 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్లలో ఈరోజు 7 అధ్యక్షులు అక్కచెల్లెమ్మలే. జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవులుకు సంబంధించి 26 పోస్టులు ఉంటే అందులో 15 మంది మహిళలే.
మహిళరక్షణ కోసం- దిశ
ఇదొక్కటే కాదు దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, గ్రామస్ధాయిలోనే మహిళా పోలీసులు మొదలైనవి మహిళల రక్షణ కోసం దేశంలో ఏ ఇతర రాష్ట్రం కంటే కూడా అన్నిటికన్నా మిన్నగా మన ప్రభుత్వం, మన రాష్ట్రం ఉంది.
ఈ రోజు దిశ యాప్‌ డౌన్లోడ్‌ చేసినవాళ్లు 1,01,19,642 మంది ఫోన్లలో దిశ యాప్‌ ఉంది.ఈ అక్కచెల్లెమ్మలు ఎక్కడికైనా భయటకు వెళ్లి ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ అటూ ఇటూ ఊపితే నిమిషాల్లో పోలీసులు దగ్గరికి వచ్చి తోడుగా నిలబడతారు. అలాంటి గొప్ప వ్యవస్ధను మన రాష్ట్రంలో తీసుకుని రాగలిగాం.
బెల్ట్‌ షాపులు గతంలో గ్రామంలో గుడి పక్కన, బడి పక్కన పది కనిపించేవి. ఇవాళ అవి ఎక్కడా లేకుండా కట్టడి చేశాం. ఇదంతా మనసు పెట్టి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా ఆరాటపడుతూ చేశాం.


ప్రతి అక్కా,చెల్లెమ్మ జీవితచరిత్రా గొప్పవే
గొప్పవాళ్ల జీవితచరిత్రలు మాత్రమే గొప్పవి కావు.. ప్రతి అక్కా, చెల్లెమ్మ జీవిత చరిత్రలు కూడా గొప్పవి. ప్రతి అక్కా, చెల్లెమ్మా బాగుంటేనే ఇళ్లు బాగుంటుంది, వాళ్ల మొహంలో సంతోషం ఉంటేనే ఇంట్లో అందరికీ సంతోషం ఉంటుందని గట్టినా నమ్మే వ్యక్తిని.
దేవుడు దయతో ప్రజలందరి చల్లనిదీవెనలతో వీళ్లందరికీ ఇంకా మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.
అనంతరం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 3,92,674 మంది రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన పేద అక్క చెల్లెమ్మలకు రూ.589 కోట్ల అర్ధిక సాయాన్ని సీఎం జమ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...