టికెట్ ధ‌ర‌ల‌పై మెగాస్టార్ పెద్ద‌రికం

Date:

సీఎం జ‌గ‌న్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం
సినీ పెద్ద‌ల‌తో మాట్లాడి మ‌రోసారి భేటీ అవుతానంటున్న చిరంజీవి
భేటీ సారాంశం ఏమైనా…రాజ‌కీయ మ‌సాలాయే ఎక్కువ‌
(సుబ్ర‌హ్మ‌ణ్యం వి.ఎస్. కూచిమంచి)

మొత్తం మీద ఇండ‌స్ట్రీ స‌మ‌స్య ఒక కొలిక్కి వ‌స్తున్న‌ట్లేనా! ఆ అదే మెగాస్టార్ చిరంజీవిగారు అదే చెబుతున్నారు. టికెట్ల వ్య‌వ‌హారంపై ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో 35 స్థానంలో కొత్త జీవో వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని మెగాస్టార్ వ్య‌క్తం చేయ‌డం చూస్తే అంతా స‌జావుగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కింద‌ట స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌ధ్య ట్వీట్వాదాలు వారి భేటీకి దారితీశాయి. అనంత‌రం, ఆర్జీవీని పేర్ని నాని ఆహ్వానించ‌డం…ఇద్ద‌రూ ఇండస్ట్రీ స‌మ‌స్య‌ల్ని చ‌ర్చించుకోవ‌డ‌మూ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. తాజాగా ఉన్న‌ట్లుండి మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జ‌గ‌న్ లంచ్‌కి ఆహ్వానించారు. ప్ర‌త్యేక విమానంలో మెగాస్టార్ వెళ్ళారు. చిరంజీవి చెప్పిన ప్ర‌కారం సీఎం స‌తీమ‌ణి భార‌తి ఆప్యాయంగా వ‌డ్డించిన ప‌దార్థాలు తింటూ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధానంగా టికెట్ల ధ‌రలు, ఐదో ఆట గురించి జ‌గ‌న్‌తో మాట్లాడారు. ఇండ‌స్ట్రీ పైకి క‌నిపించినంత గ్లామ‌ర్‌గా లేద‌నీ, ఎంతోమంది దీనిపై ఆధార‌ప‌డి ఉన్నార‌నీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ సీఎంకు చెప్పాన‌న్నారు. త్వ‌ర‌లోనే….అతి త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌కు ముగింపు ఉంటుంద‌నీ, అంద‌రికీ ఆమోద యోగ్య‌మైన ప‌రిష్కారం ల‌భిస్తుంద‌నీ చిరంజీవి మీడియాకు చెప్ప‌డం చూస్తే ప‌రిస్థితి ఆశాజ‌నకంగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఇంత‌కీ అస‌లు స‌మ‌స్య ఏమిటో సీఎంకు చెప్పారో లేదో చిరంజీవి తెలుప‌లేదు. అవ‌స‌ర‌మైతే మ‌రో లంచ్ మీటింగ్‌కు వెడ‌తాన‌న్నారు మెగాస్టార్‌. మీరు మా ఇంటి మ‌నిషి ఎప్పుడైనా రావ‌చ్చ‌న్నారంటూ చెప్పారు మెగాస్టార్‌. చిరంజీవి చెప్పిన అంశాలు చూస్తే ఇద్ద‌రి మ‌ధ్య చ‌క్క‌ని వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు సాగిన‌ట్లే క‌నిపిస్తోంది. రాజకీయాల‌కు మించి కూడా మాట్లాడుకున్నార‌నిపిస్తోంది.
ఇక్క‌డ అంద‌రికీ ఓ సందేహం రాక మాన‌దు. టికెట్ల గురించి ఇంత హ‌డావుడి జ‌రుగుతుంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఏంచేస్తోంది? న‌టుల‌కు ఆధారం నిర్మాత‌లే కదా. వారు క‌ష్టాల‌లో ఉంటే మా ఏం చేస్తోంది? ఆలోచ‌న చేసిన‌ట్లుకూడా క‌నిపించ‌డం లేదు. ఆర్జీవీ లీడ్ తీసుకున్నారు. ఆపై చిరంజీవి మ‌రో పావు క‌దిపారు. రాజ‌కీయ అవ‌స‌రాల దృష్ట్యా జ‌గ‌న్‌కు ఈ స‌మ‌స్య త‌న‌కు అనుకూలంగా స‌త్వ‌రం ప‌రిష్కారం కావ‌డం ముఖ్యం.

అందుకే ఆయ‌న కూడా లీడ్ తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. లేక‌పోతే చొర‌వ చేసి, చిరంజీవిని పిలిచేవారు కాదు. త‌న మాట పోకూడ‌దు. చిత్ర ప‌రిశ్ర‌మ న‌ష్ట‌పోకూడ‌దు. ల‌క్ష‌లాదిమంది భ‌వితపై సీఎం తీసుకోబోయే నిర్ణ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. సీఎం ద‌గ్గ‌ర‌కు ఎవ‌రు వ‌చ్చినా స్వ‌లాభ‌మూ ఉంటుంది. చూసుకుంటారు కూడా. కొన్నేళ్లుగా చిరంజీవి రాజ‌కీయంగా అస్థిర‌త్వంలో ఉన్నారు. బ‌ల‌హీన‌త‌ల‌తో ఆడుకోవ‌డం అంద‌రి నైజం. రాజ‌కీయాల్లో ఇది మ‌రింత ఎక్కువ‌. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నిర్ణయాలకు దారితీసే రాజకీయ ప్రక్రియలో డిమాండు నెరవేర్చుకోవడానికి లాబీయింగ్, మధ్యవర్తిత్వం వుండేవి. ఇప్పుడ‌ది మారింది. అధికారంతో ఎదుటివారి ఆయువుపట్టుని బిగించి దగ్గరకు రప్పించుకునే ధోరణి ప్ర‌బ‌లింది. చిరంజీవి జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం వెనుక ఈ అంశ‌మూ ఉంద‌ని అంటున్నారు. చిరంజీవి భేటీతో సినిమా టికెట్ ధ‌ర‌ల కంటే ఆయ‌న సామాజిక వ‌ర్గ ఓట్లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.
ఏ ఇద్ద‌రు హేమాహేమీలు క‌లిసినా ప‌ర‌స్ప‌ర పొగ‌డ్త‌లుంటాయి. ఇక్క‌డ చిరంజీవి సీఎం జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. సినిమా రంగాన్ని శాసిస్తున్న కొంద‌రు వ్య‌క్తుల‌కు ఒక సందేశాన్ని పంపిన‌ట్లే భావిస్తున్నారు. అంద‌రితో మాట్లాడి మ‌రోసారి సీఎంను క‌లుస్తాన‌ని చిరంజీవి అన‌డం దీనికి సంకేత‌మే! ఏది ఎలా ఉన్నా.. స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే చాలు అన్న‌ది ఎక్కువ‌మంది అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...