బాపు చిత్రాలు సినీ యవనికపై సాల‌భంజిక‌లు

Date:

తెలుగు చ‌ల‌న‌..చిత్ర‌..కారుడు
బాపురే అనిపించిన అద్వితీయ ప్ర‌తిభ‌
(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
బాపూ! నీ బొమ్మలు తలలూపు గులాబీ కొమ్మలు
బాపూ! నీ రేఖలు మునిమాపు శకుంతల లేఖలు
బాపూ! నీ లేఖిని దరిదాపు సుధారసవాహిని
బాపూ! నీ భావమ వగబాపు కళకు నవజీవము…
అని తన లలిత పదాలతో బాపు సుగుణాన్ని కొనియాడారు – జంధ్యాల పాపయ్యశాస్త్రి. తేటగీతి పద్యం ఎంత హృద్యంగా సాహిత్యాభిమానులను అలరిస్తుందో బాపు చేతి తేట గీత పండిత పామరులను సైతం అలరిస్తుంది. ఆ గీత పండితులకు ఆలోచన కలిగింపజేస్తుంది. పామరులచే ఆరాధింపబడుతోంది.. బాపు గీతకు బాగ తెలుసు ఎంత ఒద్దికగా ఒదిగి పోవాలో, వాలుజడ వయ్యారపు మెరుపులు, రాధాకృష్ణుల తన్మయత్వపు చూపులు బుడుగ్గాడి ఆడుగులు ఆకుంచె నుంచి జాలువారిన రంగుల మెరుపులు. మసక మసక వెలుతురు మనల్ని తాకితే మది గూటి పడవగా మారుతుంది. భావాల బుట్టలో బాపు బొమ్మ కొత్త పెళ్ళికూతురులా అందంగా ఒదిగి కూర్చుంది. గోదారిలో పడవ తెరచాపల రెపరెపల మెరుపులతో తెలుగు చిత్ర సీమ ముంగిట్లో ముత్యాల ముగ్గు వేసి సీతాకల్యాణం చేసి మిస్టర్ పెళ్ళంలా తెలుగు అతివను అందంగా గీసి, కనువిందు చేసి, కళాహృదయులకు అభిరుచిని రంగరించి కల్యాణ తాంబూలం అందించి, పొగడ్తలను పండించుకున్న పదహారణాల తెలుగు మహామనీషి. ఈ బొమ్మల ఋషి బాపు.


చెంగావి చీర క‌ట్టిన బాపు బొమ్మ‌
బాపు గీచిన బొమ్మ చుట్టూ చెంగావి చీర కట్టుకుంది. తెలుపు నలుపులను బొట్టు కాటుకగా పెట్టుకుంది. గోరింటాకు గోరంత దీపమై కొండంత వెలుగును పంచుతుంది. జగదానందకారకమై నిలుస్తోంది. ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో బాపు బహుముఖుడు. బాపు గీతకారుడుగా, సంగీతకారుడుగా, కార్టూనిస్టుగా, చిత్ర దర్శకునిగా ప్రజ్ఞతకు మరోరూపు. అన్ని రంగాల్లో ఆయన శైలి ప్రత్యేకం.
న‌ర‌సాపురంలో జ‌న‌నం
సత్తిరాజు లక్ష్మీనారాయణ(బాపు )1933 డిసెంబర్ 15 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ముందు అడ్వర్టైజింగ్ రంగంలో, ఆ పై పత్రికా రంగంలో పనిచేసి, అక్కడ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆయన సినిమాలు చేస్తూనే, చిత్రకళ, కార్టూన్ కళ రెండింటినీ సమానంగా సుసంపన్నం చేశారు. సినిమాలపై ఎలాంటి అవగాహన లేకుండానే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తొలి చిత్రం ‘సాక్షి’తోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా చేసిన ప్రతిభాశాలి. ఓ దృశ్యాన్ని తెరకెక్కించాలంటే కార్టూన్ రూపంలో గీసి ఆ తర్వాత షూట్ చేయడం ఆయన ప్రత్యేకత. తనదైన శైలిలో సినిమాలు తీయడమే కాకుండా, తీసిన వాటన్నింటిలో తనదైన ముద్రను స్పష్టంగా కనబర్చారు బాపు. ధనం సంపాదించుకోలేని బంగారు పిచ్చుక అభిమాన ధనం సంపాదించుకున్న రమ్య గీత ప్రచ్యోదక. తెలుగుదనాన్ని ఇనుమడింపజేసే చిత్రాలు అందించిన అరుదైన దర్శకుల్లో బాపు ఒకరు.


తెలుగు సంస్కృతిలో భాగ‌మైన గీత‌, రాత‌
బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు జయంతి సందర్భంగా ఆయన శైలిని గుర్తు చేసుకుందాం. అరవై అయిదేళ్ల చిత్రకారుడు, యాభై ఏళ్ల చలనచిత్రకారుడు బాపులో ఉన్నారు. ‘బాపు బొమ్మ’ అనే మాట ఈరోజూ చిత్రశైలికీ వాడుతారు. అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. తెలుగు సంస్కృతికీ సంప్రదాయాలకూ అందచందాలకు బాపు గీసిన.. తీసిన బొమ్మలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆయన గీత తెలుగు జాతి సంపద. బాపు గీత గోడ మీద అందమైన బొమ్మ అయినట్లే, ఆయనా ఇప్పుడు తెలుగువారి మనసుల్లో అందమైన జ్ఞాపకంగా మిగిలారు. ముళ్ళపూడి భాషలో చెప్పాలంటే, పుంజిడు సినిమాలే తీసినా, మంచి సినిమాలే తీశాడు. బాపు సినిమాల గురించి రాయడానికి కుదరదు. అవి చూడాలంతే. ఆయన ఏ సినిమా తీసినా, అదొక కాన్వాస్‌పై గీసిన చిత్రాల సమాహారంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక ఆల్బమ్ చూసినట్లే ఉంటుంది. చిత్రకారులెవరైనా కుంచెతో బొమ్మలు వేస్తారు. ఆయన అదే కుంచెతో వెండితెరపై బొమ్మలు గీశారు. ఆ బొమ్మలన్నీ కదిలి ఒయ్యారాలు పోయి, గిలిగింతలు పెట్టి ప్రేక్షకుల గుండెల్లో అపురూప చిత్రాలుగా కొలువుండిపోయాయి. అందుకే ఆయన చలన ‘చిత్ర’కారుడు! సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే బాపు అభిమానుల మాటల్లో చెప్పాలంటే… ‘ఆయన ఓ గొప్ప దర్శకుడు’ అంతే.అభిమానుల దృష్టిలో బాపు… ‘భలే బొమ్మలేస్తాడు! భలేగా బొమ్మలు తీస్తాడు’ అంతే. ఆ అభిమానమే ఆయనకు అన్ని పురస్కారాల కన్నా ఎక్కువ. అంతకన్నా బాపు గురించి ఎక్కువ చెప్పలేం. ఎందుకంటే ఆయన వేసిన బొమ్మలు, తీసిన బొమ్మలు అంతకంటే చాలా ఎక్కువే చెబుతాయి.


అంద‌మైన అమ్మాయికి మారుపేరు బాపు బొమ్మ‌
అందమైన అమ్మాయికి మారుపేరు ‘బాపు బొమ్మ’ కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన ‘సాక్షి’ (1967) చిత్రంతో బాపు దర్శకుడిగా సరికొత్త బాధ్యతలు చేపట్టారు. బాపు దర్శకుడిగా మారటానికి ఆప్తమిత్రుడు రమణే కారణమని బాపు పలు సందర్భాల్లో చెప్పారు. తొలి చిత్రం ‘సాక్షి’ ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది బాపుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో ఆయన మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక రంగంలో సృజనాత్మకంగా అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన ఈ ఇద్దరు 66 ఏళ్ళకు పైగా ఏ గొడవా లేకుండా కలిసి బతికారు, కలిసి నడిచారు. కలసికట్టుగా తమ రంగంలో విశేష కృషి చేశారని చెబితే.. ఇక వాళ్ళ స్నేహం గురించి మనం ప్రత్యేకించి ఏమీ చెప్పక్కర్లేదు. బాపు దర్శకత్వం వహించిన చిత్రాల సరళి చూస్తే వేటికవే వైవిధ్యంగా ఉంటూ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఎటువంటి కథలోనైనా గ్రామీణ నేపథ్యాన్ని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు బాపు పెద్ద పీట వేస్తారని ఆయా చిత్రాలు చెప్పకనే చెప్పాయి షాట్ కంపోజింగ్, మేకింగ్, విజువలైజేషన్, నేపథ్య సంగీతం.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందించారని సినీ విమర్శకులు సైతం అభినందించిన సందర్భాలెన్నో ఉన్నాయి.


అంత‌ర్జాతీయ ఫిల్మ్ మేక‌ర్‌గా పేరు
తెలుగు గడ్డకే పరిమితమై పోయిన అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్‌గా బాపుకి మంచి పేరు కూడా ఉంది. ఓ కథతో కథా నాయకుడ్ని ఎంతగా ఎలివేట్ చేయగలరో అదే స్థాయిలో ప్రతినాయ కుడిని కూడా ఎలివేట్ చేయొచ్చని ‘ముత్యాల ముగ్గు’లోని రావుగోపాల రావు పాత్ర ద్వారా బాపు నిరూపించారు. తన నాయికల్లో సహజత్వానికంటే స్త్రీత్వానికే పట్టం కడతాడు బాపు. అమ్మాయికి కాటుకా, బొట్టూ పెట్టి, వాలు జడలో పూలు తురిమి, పాదాలకు పట్టీలు పెట్టి, చక్కని చీర కట్టి ముస్తాబు చేసి, వయ్యారపు నడక నేర్పి, ఇక చూడండని మనల్ని మురిపిస్తాడు. ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ప్రతీ మగవాడూ కలలు కనేటట్టు చేసేస్తాడు. బాపు కెమెరా కాటుక కళ్ళనీ, నల్లని పొడుగాటి వాలు జడనీ, వింత భంగిమల్లో నడుము వంపునీ చూడకుండా వదలదు. వాలు జడ అంటే, దాని మీద పాట రాయించుకుని చిత్రీకరించేంత ఇష్టం బాపుకి (రాధా గోపాళం). కొంటె కెమెరా కూడా సభ్యత గీత దాటిన సందర్భాలు తక్కువే. ముత్యాల ముగ్గు’, ‘మిస్టర్ పెళ్ళాం’ చిత్రాలకుగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డుల్ని సైతం సొంతం చేసుకున్నారు. ‘బాలరాజు కథ’, ‘అందాల రాముడు’, ‘ముత్యాలముగ్గు’, ‘పెళ్లి పుస్తకం’, ‘మిస్టర్ పెళ్ళాం’, ‘శ్రీరామ రాజ్యం’ చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఏడు రాష్ట్ర నంది అవార్డుల్ని అందుకున్నారు. 1986లో అత్యంత ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుని పొందారు.


అవార్డులు…రివార్డులతో గౌర‌వం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టునిస్ట్స్ 2001లో లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. తిరుపతి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారు రాష్ట్రపతి అవార్డుతో గౌరవించారు. వీటితోపాటు మరెన్నో అవార్డుల్ని, పురస్కారాల్ని బాపు సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలో బాపు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సముచితంగా గౌరవించింది. తెలుగులో తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలను హిందీలోనూ తెరకెక్కించారు బాపు. అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ నటులను హీరోగా పరిచయం చేసిన ఘనత బాపుదే. ఇక.. బాపు గురించి మాట్లాడుకునేటప్పుడు రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వీరిద్దరూ ఒకే ఆత్మకు రెండు రూపాల వంటి వారు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం… అయితే రమణ దాని పలుకు. ముళ్లపూడి వెంకటరమణ గురించి లేకుండా బాపు జీవితం పరిపూర్ణం కాదు. ఇద్దరూ స్నేహానికి నిర్వచననంగా తెలుగునాట నిలిచారు. తూరుపు వెళ్ళె రైలు ప్రయాణంలో గీతాక్షర గవాక్ష వీక్షణం చెస్తే ప్రతి క్షణం ప్రకృతి సంతరించుకొనే నూతన ఆకృతి హృదయ యవనికపై బాపు చిత్రమై ప్రతిబింబిస్తుంది. నవ్య గీత చిత్ర వీచికై అహ్లాదాన్ని పంచుతుంది. కోన సీమ వాసులకు కొబ్బరి చెట్టు కల్పవృక్షం తెలుగు ప్రజల ముంగిట నిలచిన కళాకల్పవృక్షం. బాపు. ఆ గీతకు అంత శక్తిని ప్రసాదించాడేమో బ్రహ్మ. అందుకే సినిమావిపై చిగురింపజేసిన మీ ప్రతి చిత్రం దృశ్య కావ్యానికి నిలువెత్తు దర్పణం. తెలుగింటికి దక్కిన అరుదైన గౌరవం తెలుగు జాతికి దక్కిన వరం. బాపు కుంచె వంచితే బాపురే అని అచ్చెరువొందెను మనస్సు. బొమ్మలతో పులకింపజేసె అనిర్వచనీయ అనుభూతికి సాక్షి. ఆ కళల కలనేతకి పదవెన్నెల సిరి జ్యోత ~ సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు ) జయంతి సందర్బంగా అక్షర నివాళి. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు)
బాపు చిత్రాలు..
క్రమ సంఖ్య చిత్రం పేరు భాష సంవత్సరం
1 సాక్షి తెలుగు 1967
2 బంగారు పిచిక తెలుగు 1968
3 బుద్ధిమంతుడు తెలుగు 1968
4 ఇంటి గౌరవం తెలుగు 1969
5 సంపూర్ణ రామాయణం తెలుగు 1970
6 బాలరాజు కథ తెలుగు 1970
7 అందాల రాముడు తెలుగు 1973
8 శ్రీ రామాంజనేయ యుద్ధం తెలుగు 1973
9 ముత్యాల ముగ్గు తెలుగు 1974
10 సీతాకల్యాణం తెలుగు 1975
11 స్నేహం తెలుగు 1976
12 భక్త కన్నప్ప తెలుగు 1976
13 సీతాస్వయంవర్ హిందీ 1976
14 శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ తెలుగు 1976
15 గోరంత దీపం తెలుగు 1977
16 తూర్పు వెళ్ళే రైలు తెలుగు 1978
17 మనవూరి పాండవులు తెలుగు 1978
18 అనోఖా శివభక్త్ హిందీ 1978
19 రాజాధిరాజు తెలుగు 1979
20 త్యాగయ్య తెలుగు 1980
21 హమ్ పాంచ్ హిందీ 1980
22 వంశవృక్షం తెలుగు 1980
23 కలియుగ రావణాసురుడు తెలుగు 1980
24 పండంటి జీవితం తెలుగు 1980
25 పెళ్ళీడు పిల్లలు తెలుగు 1981
26 బేజుబాన్ హిందీ 1981
27 రాధా కళ్యాణం తెలుగు 1981
28 వోహ్ సాత్ దిన హిందీ 1982
29 ఏది ధర్మం ఏది న్యాయం తెలుగు 1982
30 కృష్ణావతారం తెలుగు 1982
31 నీతిదేవన్ మయగుగిరన్ తమిళం 1982
32 సీతమ్మ పెళ్ళి తెలుగు 1983
33 మంత్రిగారి వియ్యంకుడు తెలుగు 1983
34 మొహబ్బత్ హిందీ 1984
35 మేరా ధరమ్ హిందీ 1985
36 ప్యారీ బెహనా హిందీ 1985
37 బుల్లెట్ తెలుగు 1985
38 జాకీ తెలుగు 1985
39 దిల్ జలా హిందీ 1986
40 ప్యార్ కా సిందూర్ హిందీ 1986
41 కళ్యాణ తాంబూలం తెలుగు 1986
42 ప్రేమ్ ప్రతిజ్ఞా హిందీ 1987
43 పెళ్ళి పుస్తకం తెలుగు 1989
44 మిష్టర్ పెళ్ళాం తెలుగు 1991
45 పరమాత్మా హిందీ 1993
46 శ్రీనాథ కవిసార్వభౌమ తెలుగు 1993
47 రాంబంటు తెలుగు 1994
48 పెళ్ళికొడుకు తెలుగు 1994
49 రాధా గోపాళం, తెలుగు 2005
50 సుందరకాండ తెలుగు 2008
51 శ్రీరామరాజ్యం తెలుగు 2011

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Telangana a critical election battle ground 

(Dr Pentapati Pullarao) Every national election has different critical states....

మనవడితో రేవంత్ హోలీ

మనవడు అంటే ఎవరికీ ముద్దుగా ఉండదు చెప్పండి. పండుగల్లో తాతయ్యలు వారితో...

Andhra BJP facing problems

(Dr Pentapati Pullarao) Recently, media reported that sad Andhra BJP...

భోజనానంతరం కునుకు ఒక కిక్

శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం(డా.ఎన్. కలీల్) నిదురపో… నిదురపో… నిదురపోనిదురపోరా తమ్ముడానిదురలోన గతమునంతానిముషమైనా...