ఇంట్లో ఇంటి మ‌నిషి…బ‌య‌ట ప్ర‌జ‌ల మ‌నిషి

Date:

ఎంత కోపం వచ్చినా మౌనమే…
కొణిజేటి రోశ‌య్య స‌తీమ‌ణి శివ‌ల‌క్ష్మి చెప్పిన ముచ్చ‌ట్లు
(వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)
రోశ‌య్య అన‌గానే గుర్తొచ్చేది… ఆజానుబాహు విగ్ర‌హం. చ‌మ‌త్కార బాణాలు విసిరే వ్య‌క్తిత్వం. విధి నిర్వ‌హ‌ణ‌లో సూటైన త‌త్వం. అపార‌మైన అనుభ‌వం. వెర‌సి కొణిజేటి రోశ‌య్య‌. 88వ ఏట ప‌ర‌మ‌ప‌దించిన రోశ‌య్య గారిని గుర్తు చేసుకోవ‌డం కోస‌మే ఈ వ్యాసం. రోశ‌య్య త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో 2015లో చెన్నైలోని రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న స‌తీమ‌ణిని క‌లిశాను. అనేక విష‌యాల‌ను తెలుసుకున్నాను. రోశ‌య్య‌గారి స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి శివ‌ల‌క్ష్మితో సాగిన సంభాష‌ణ ఇది..
గవర్నరు గారి సతీమణితో సంభాషించడానికి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ఛాంబర్‌లోకి అడుగుపెట్టగానే ఆయన ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. చెక్కుచెదరని చిరునవ్వుతో, మడత నలగని తెల్లటి పంచెతో, ఏదో దీర్ఘాలోచనలో ఉన్న భంగిమలో ఠీవిగా కూర్చున్నారు తమిళనాడు గవర్నర్‌ అయిన మన తెలుగు తేజం గౌరవనీయులు కొణిజేటి రోశయ్య. వారి సతీమణితో ముచ్చటించడానికి వచ్చామని చెప్పగా, ఆమెకు కబురు పంపారు. రెండే నిమిషాలలో ఆవిడ రావడం ఆశ్చర్యం కలిగించింది. ఎంతో సామాన్యంగా, ఏ మాత్రం భేషజం లేకుండా, నిక్కచ్చితనంతో ఉన్న వదనంతో రోశయ్య గారి సతీమణి శ్రీమతి శివలక్ష్మి వచ్చారు. ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతాననగానే మౌనంగానే అంగీకరించారు మితభాషి అయిన శివలక్ష్మి.
ప్ర‌. మీది చుట్టరికమా, లేక బయటి సంబంధమా…
జ. మాది దూరపు చుట్టరికం. ఆయన నాకు మామయ్య వరస అవుతారు.
ప్ర‌. మీ వైవాహిక జీవితం సుమారు 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా? ఇన్ని సంవత్సరాలలో మీ జీవితం ఎలా ఉంది?
జ. పెళ్లయిన కొత్తల్లో మా అత్తగారు మాతోనే ఉండటం వల్ల అన్నీ ఆవిడతో సంప్రదించి చేస్తుండేదాన్ని. అందువల్ల నాకు పెద్దగా ఇబ్బంది అనేది ఏమీ తెలియలేదు. తరవాత పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఇక అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు.


ప్ర‌. ఆయన పెద్ద రాజకీయ సెలబ్రిటీ కదా! మరి ఇంట్లో ఆయన ఎలా ఉంటారు?
జ. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు రాజకీయాలకు సంబంధమే ఉండదు. ఒక ఇంటి పెద్దగా సాధారణంగా ఉంటారు. బయట మాత్రమే రాజకీయాలు. అందువల్ల మేం ఎప్పుడూ ఏదో రాజకీయనాయకుడి ఇంట్లో ఉంటున్నాం అనే భావనే కలగలేదు. గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెడితే ఆయన ఇంటి మనిషి. గడప దాటి బయటకు అడుగు పెడితే ఆయన రాజకీయనాయకుడు. ఆ విధంగా ఆయన బ్యాలెన్స్‌ చేస్తున్నారు.
ప్ర‌. తమిళనాడు గవర్నరుగా చెన్నైకి వచ్చి ఐదు సంవత్సరాలు కాబోతోంది. ఇక్కడ ఉగాది ఎలా ఉంది? పండుగలు కోల్పోయామన్న బాధ ఎప్పుడైనా కలిగిందా?
జ. ఇంతవరకూ ఎన్నడూ ఉగాది పండుగ మిస్‌ కాలేదు. పండగనాటికి పిల్లలు రావడమో, మేము అక్కడకు వెళ్తుండటమో ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఇక్కడ చెన్నైలో కూడా తెలుగు వారు ఉన్నారు కనుక, వారి మధ్య కూడా పండుగ ఆనందంగా జరుపుకుంటాం. ఇంతవర కూ పండుగలు కోల్పోయామన్న బాధ కలగలేదు.
ప్ర‌. ఆయనకు ఇష్టమైన వంటకాలు ఏంటి? మీరే స్వయంగా వండిపెడతారా?
జ. ఆయన పూర్తిగా శాకాహారి. నాలుగు ప్రదేశాలకూ తిరిగేవాళ్లు అన్నిరకాల వంటకాలకూ అలవాటు పడతారు. అందువల్ల ఏ వంట ఎలా ఉన్నా ఏమీ మాట్లాడరు. అదీకాక, ఏదో ఒక ఊరగాయ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఏ వంటకం ఎలా ఉన్నా అన్నీ ఆ నంజుడులో కలిసిపోతాయి.ప్ర‌. మీ వంట ఎప్పుడైనా నచ్చలేదంటే మీకు ఎలా అనిపిస్తుంది… అలాగే మెచ్చుకుంటే ఎలా అనిపిస్తుంది…

Author Vijayanthi Puranapanda with Sri Rosaiah and Sivalaxmi

ప్ర‌ . మీ వంట ఎప్పుడైనా నచ్చలేదంటే మీకు ఎలా అనిపిస్తుంది… అలాగే మెచ్చుకుంటే ఎలా అనిపిస్తుంది…
జ. భోజనం ఎలా పెట్టినా తినేస్తారు. కనుక మెచ్చుకోవడాలు, నొచ్చుకోవడాలనే ప్రసక్తే లేదు…
ప్ర‌. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చేటప్పుడు మీ కోసం ప్రత్యేకంగా ఏమైనా కొని తీసుకువచ్చేవారా…
జ. (రోశయ్య) పెళ్లయిన కొత్తలో అంటే 1960 – 70 ప్రాంతంలో పిల్లల చంటప్పుడు ఎప్పుడైనా వాళ్లకు బొమ్మలు తెచ్చేవాడిని. ఇక బట్టల విషయంలో… మా అమ్మగారు ఉన్నంతకాలం ఆవిడే కొనేవారు. ఆవిడ గతించాక మా పిల్లలు పెద్దవాళ్లు కావడంతో వాళ్లే చూసుకుంటున్నారు.
శివలక్ష్మి: ముఖ్యంగా మా కోడళ్లే నా బట్టల విషయం చూసుకుంటారు. నాకు వెళ్లి తెచ్చుకోవలసిన అవసరం ఇంతవరకూ కలగలేదు. ఇక నగల విషయం అంటారా, మా నాన్నగారే చూసుకుంటారు.
ప్ర‌. రోశయ్యగారికి కోపం ఎక్కువ అంటారు. ఆ కోపాన్ని ఎప్పుడైనా రుచి చూశారా?
జ. ఆయనకు ఎంత కోపం వచ్చినా మౌనంగా ఉంటారు. ఎంత పలరించినా పలకరు. ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పరు. అంతకు మించి ఆయన కోపాన్ని వేరేలా ఎన్నడూ ప్రదర్శించలేదు.
ప్ర‌. రాజకీయాల్లో ఆయన మీద నిందలు వేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?
జ. వాళ్ల మాటకు ఆయన కూడా పొడిచినట్లే సమాధానమిస్తారు. ఇంక మనం ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకు? ఆయనకు ఏ ఇబ్బంది రాదనే నమ్మకం నాకుంది. అవసరమరైతే గట్టిగా మాట్లాడకుండా పోవడమే. ఆ నేర్పరితనం ఆయనకు ఉన్నందున వేరే అనుకోవడం ఎందుకు?
ప్ర‌. ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండటం వల్ల మీరు ఏమైనా కోల్పోయారనిపిస్తుందా మీకు?
జ. ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారనే భావనే కలగదు నాకు. ఆయన ఇంట్లో అడుగు పెట్టేసరికి అన్నీ మర్చిపోయేదాన్ని. ఆయన ఒక బాధ్యత తీసుకున్నాక సరిగా నిర్వహిస్తున్నారా లేదా అనే అనుకుంటాను.
ప్ర‌. ముఖ్యమంత్రిగా, మంత్రిగా… ఆయన ప్రవర్తనలో ఏదైనా తేడా కనిపించిందా మీకు?
జ. ఎప్పుడూ నాకు ఏ తేడాలూ అనిపించలేదు. నిరంతరం ఆయనతో కలిసి ఉంటాను కనుక నాకు ఆయన ఎప్పుడూ ఒకేలా అనిపిస్తారు.
ప్ర‌. గవర్నర్‌గా …
జ. గవర్నర్‌గా కంటె ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడైతే ఎంతో పని. ఎన్నో లెక్కలు వేయాలి. అప్పుడే ఆయన చేతి నిండా పని ఉన్నట్లు అనిపిస్తుంది నాకు.
ప్ర‌. ఆయన రాష్ట్ర బడ్జెట్‌ 17 సార్లు వేసి రికార్డు సృష్టించారు? మీరు ఇంటి బడ్జెట్‌ ఎలా ప్లాన్‌ చేస్తారు? మీరు?
జ. నేను ప్రత్యేకంగా బడ్జెట్‌ అంటూ ఏమీ వేయను. ఇంట్లో మనుషుల్ని బట్టి అర్థమైపోతుంది. అందువల్ల బడ్జెట్‌ వేయాల్సిన అవసరం లేదు.
ప్ర‌. పిల్లల చదువు విషయం…
జ. తెనాలిలోఉన్నప్పుడే పెద్దబ్బాయిది, పెద్దమ్మాయిది చదువులు చదువులు పూర్తయిపోయాయి. ఇంక రెండవ అబ్బాయి టైమ్‌కి ఆలోచించక్కర్లేకుండా అయిపోయింది. అలా మా పిల్లల చదువుల గురించి నేనేమీ పట్టించుకోవక్కర్లేకుండా అయిపోయింది?
సొంతవూరిలో ఇల్లు కట్టుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా?
సొంత వూరిలో ఇల్లు ఉండాలన్నది నా ఆకాంక్ష. వీలు దొరికి నప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటే తృప్తిగా ఉంటుంది. నేను ఏ పదవిలో ఉన్నా, ఏ బాధ్యతలో ఉన్నా, అప్పుడప్పుడూ ఊరు వెళ్లి అక్కడ ఉండి వస్తుంటాను. (ఆంధ్ర ప్ర‌భ సౌజ‌న్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...

Fulfil drinking water needs of Hyderabad: CM

Revanth warns Millers and Traders of cancelling license  Hyderabad:  Chief...

“Who killed the rule of law?”: Highlighting Points

Book Written by Justice R.C. Chavan, Former Judge Bombay...