సాహితీ విపంచి ‘చేంబోలు’

Date:

(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి)
ఉత్తమ సాహితీ విలువలు, అద్భుత పద విన్యాసం, అపురూప భావుకతతో కలకాలం నిలిచే పాటలు అల్లిన కలం కరిగిపోయింది. దారిమళ్లుతుందను కుంటున్న తెలుగు సినీగీతాన్ని తనదైన శైలిలో నడిపి మూడున్నర దశాబ్దా లలో మూడు వేలకు పైగా పాటలు అల్లిన పాళీ ఆగిపోయింది. సాహితీ విలువల కవి శిఖరం ఒరిగిపోయింది. ఆరున్నర పదుల ఒక్క సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లోని ‘శివిని’లో జన్మించి అనకాపల్లిలో పెరిగి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ పూదోటలో ‘సిరివెన్నెల’లు విరబూయించిన చేంబోలు సీతారామశాస్త్రి సెలవంటూ తరలిపోయారు.
ఏ పూర్వజన్మ పుణ్యంతోనో గీత రచయితగా నిలవగలిగాను తప్ప తన ఆలోచనలకు పాటలుగా అక్షర రూపం ఇవ్వాలనుకోలేదని చెప్పినా, తెలుగు సినీ పాటకు పర్యాయపదంగా నిలిచారన్నది సర్వజనాభిప్రాయం. సినీగేయ కర్తలకు సంబంధించినంత వరకు సినిమా పేరునే (సిరివెన్నెల) ఇంటిపేరుగా ప్రాచుర్యం పొందిన ‘ఆదికవి’గా నిలిచారు. @sirivennelaseetaramasastry


బతుకుతెరువు కోసమో, సరదా కోసం కవిత్వం రాసినా కవికి సామాజిక స్పృహ అసరమని, సామాజిక అంశాలను నిజాయతీతో ఆలోచించా లన్నది సీతారామశాస్త్రి భావన. సందర్భం, సన్నివేశానికి అనుగుణంగా గీతాలు రాయడమే కాదు వాటిలో సాధ్యమైనంత వరకు సామాజిక స్పృహను చొప్పించా లనుకునే అరుదైన కవులలో ఆయన ముందువరుసలో ఉంటారు. ‘సూపర్ హీరోలా పదిమందిని తన్ని అన్యాయాన్ని ఎదిరించలేకపోవచ్చు కానీ ఆ అన్యాయాన్ని అన్యాయం అనగలనను కదా?’ అని అంటుండేవారు. ఎవరికి వారు అలాంటి ఆలోచన, అవగాహన, బాధ్యత కలిగి ఉంటే మార్పునకు అవకాశం ఉంటుందనేవారు. ఆ కోణంలోనే, చుట్టూ జరుగుతున్న సంఘటనలపై స్పందనగా ‘గాయం, సిందూరం’ లాంటి చిత్రాలలోని పాటలు పుట్టాయి. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని/. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని’ (గాయం), ‘సురాజ్య మవలేని స్వరాజ్యమెందుకని/సుఖాల మనలేని వికాసమెందుకని/సుమాల బలికోరే సమాజమెందుకని? / (గాయం), ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? /స్వర్ణోత్సవాలు చేద్దామా? /అత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా?/ దానికి సలాము చేద్దామా? (సిందూరం) అని నిలదీశారు. సురాజ్యం కాని స్వరాజ్యం ఎందుకని ప్రశ్నిస్తూ శాస్త్రి గారు ఎన్నడో రాసి పెట్టుకున్న పాట కోసం దర్శకుడు రామ్ గోపాల వర్మ ఏకంగా చిత్రమే నిర్మించారంటారు డాక్టర్ పైడిపాల. @telugubreakingnews


తాత్త్వికత
తార్కికత, తాత్త్వికత, భావుకతతో కూడిన అభివ్యక్తి కవిత్వానికి మూల సిద్ధాంతంగా భావించిన సీతారామశాస్త్రి చిత్ర గీతాల్లోనూ అవి తొంగిచూచేవి. అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని గీతాలలో పొందుపరిచే వారు. ‘జగమంత కుటుంబం నాది’ (చక్రం) లాంటి గీతాలు అందుకు మచ్చు తునకలు. ఈ పాటనే ఉదాహరణగా తీసుకుంటే అత్యధికులు దీనిని శోకగీతం అనుకుంటారనీ, కాస్త శ్రద్ధగా ఆలోచిస్తే సానుకూలభావనతో పాటు తాత్త్వికత బోధ పడుతుందనీ ఒక సందర్భంలో చెప్పారు. @telugulatestnews


తానే పాత్రలుగా మారి….
భారతీయ దృక్కోణం నిబిడీకృతమైన కవి సిరివెన్నెల. అందుకే పాత్రలకు రాసే పాటలకు అనుకూలంగా పరకాయ ప్రవేశం చేసేవారు.‘శృంగార, ప్రేమ గీతాలు రాయవలసి వస్తే అక్కడి పాత్రలోకి ప్రవేశిస్తా. స్త్రీ పాత్ర భావ వ్యక్తీకరణను రాసేటప్పుడు ఆ స్త్రీలా మారతా’అని చెప్పేవారు. ‘మనకు జన్మనిచ్చేది స్త్రీ. మన మనుగడకు కారణభూతం స్త్రీ కనుక ఆమె పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. పవిత్రంగా చూడాలి’ అనేవారు. ముఖ్యంగా పాటను ఆడపిల్లగా భావించేవారు. పాట కూతురులా అపురూపమైనదే కాక, అమ్మాయిని చేపట్టే వాడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడని భారతీయ సంప్రదాయం చెబుతోంది కనుక, ఎన్ని పాటలు రాయగలిగితే అన్నిసార్లు నారాయణమూర్తి అల్లుడిగా వస్తాడని చమత్కరించేవారు. @Etvnews


దేవులపల్లి బాటలో…
దర్శకనిర్మాతలు కొందరు ప్రేమకు, వాంఛకు తేడాను విస్మరించి పాటలను రాయించుకుంటున్నారని, కానీ శృంగారం ఒకింత సూచ్యం, వ్యంగ్యంగా ఉండాలన్న నాటి తరం కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అభిప్రాయాన్నే సీతారామ శాస్త్రీ పుణికిపుచ్చుకున్నట్లున్నారు. అసభ్య పదజాల ప్రయోగం లేకుండా, మహిళలను కించపరచకుండా రచనా వ్యాసంగం సాగించాలన్న తండ్రి సీవీ యోగి గారి సూచనతో పాటు తన నిబద్ధతను చివరిదాకా కొనసాగించారు. ఒక్క అశ్లీల గీతం కూడా రాయనని మడికట్టుకున్న దేవుల పల్లి వారినే అనుసరించారని పలువురు దర్శకులు, విశ్లేషకులు చెబుతారు. ఈ నియమం పాటలు తగ్గడానికి, తగ్గించుకోవడానికీ కారణంగానూ చెప్పవచ్చు. ఒక టీవీ ఛానల్ ముఖాముఖీలో ఆయనే దీనిని నిర్ధరించారు. గీతరచన ‘ఆర్ట్’ (కళ)కావచ్చు కానీ ‘హార్ట్’ (హృదయం)ను తట్టే పాటనే మనసుపెట్టి రాయగలం అనీ చెప్పారు.సినిమా పాట పట్ల చిన్నచూపు తగదని, ఏకాంతంలో అంతర్మథనంతోనే కవిత్వం లేదా గీత సృష్టి జరుగుతుందనీ గట్టిగా చెప్పేవారు. @NTVnews


ఆత్రేయ+సినారె+వేటూరి=సిరివెన్నెల
ఆత్రేయ+సినారె=వేటూరి అనుకుంటే, ఆత్రేయ+సినారె+వేటూరి=సిరివెన్నెల. ఇది చాలా మంది అభిప్రాయం.శ్రీశ్రీ తదితరులు ప్రభావం కూడా ఆ గీతాలలో కనిపిస్తుంది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్య నారాయణ తప్ప ప్రత్యేకించి అభిమాన కవులు లేరని చెప్పిన ఆయన పూర్వకవులలోని ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ప్రత్యేకతను ఒడిసి పట్టేందుకు ప్రయత్నించినట్లు చెప్పేవారు. ఉదాహరణకు, వేటూరి సుందరరామమూర్తి గారి చాలా పాటల్లో లోతైన భావాలు ఉంటాయని, ఆయన ఒక్కొక్క పాటకు ఒక్కొక్క పరిపూర్ణ కావ్యరూపం ఇచ్చారని, పాటల్లో ఉన్నతమైన భావన చెప్పాలనుకునే తనకు ఆయన శైలి బలం చేకూర్చిందనే వారు. తెలుగు పాటకు తొలినాళ్లలో తాత్విక కోణాన్నిఅందించిన ఘనత సముద్రాల రాఘవాచార్యుల వారిదైతే దానిని మరింత ముందుకు తీసుకువెళ్లిన సరళత పదాలతో ఘనమైన అర్థాలు అందించిన వారు వేటూరి సుందరరామమూర్తి, సీతారామశాస్త్రి. మల్లాది, దేవులపల్లి, సినారె తదితర పూర్వకవులను అటుంచితే వర్తమానంలో తెలుగు పాటకు సాహితీ గౌరవాన్ని తెచ్చిన తేజం, తెలుగు మాటకు ఉత్తేజం నిస్పందేహంగా ‘సిరివెన్నెల’.


‘తరలిరాదా తనే వసంతం….తన దరికి రాని వనాల కోసం..’అని తన పాటపల్లవిలో అన్నట్లు దివి భువికి రాకపోవడంతో ఎందరో మహనీయుల తరహాలో తానే దివికి చేరారు. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Telangana a critical election battle ground 

(Dr Pentapati Pullarao) Every national election has different critical states....

మనవడితో రేవంత్ హోలీ

మనవడు అంటే ఎవరికీ ముద్దుగా ఉండదు చెప్పండి. పండుగల్లో తాతయ్యలు వారితో...

Andhra BJP facing problems

(Dr Pentapati Pullarao) Recently, media reported that sad Andhra BJP...

భోజనానంతరం కునుకు ఒక కిక్

శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం(డా.ఎన్. కలీల్) నిదురపో… నిదురపో… నిదురపోనిదురపోరా తమ్ముడానిదురలోన గతమునంతానిముషమైనా...