నిప్పచ్చరం – ఉషశ్రీ

Date:

(1977 నవంబరులో వచ్చిన తుఫానుకి స్పందిస్తూ రచించిన కథ. అది అప్పట్లో స్వాతి మాసపత్రికలో ప్రచురితం అయింది)
తెల్లవారుతోంది
నీలాకాశం నిర్మలంగా ఉంది.
తూర్పుదిక్కులో వెలుగురేకలు ఎరుపు విరిగి తెల్లబడుతున్నాయి.
గాలి చలచల్లగా మెలమెల్లగా కదులుతోంది.
సూర్యుడు నెమ్మదిగా పైకి లేస్తున్నాడు.


లంకలో విరగకాసిన జొన్న కంకెలు సూర్యకాంతి పడి తళతళ మెరుస్తున్నాయి.
గుబురుగా పెరుగుతూన్న ఉలవ తీగెలు పచ్చని తివాసీ పరిచినట్లున్నాయి.
ఏటిగట్టు వాలులో సాగుతూన్న గుమ్మడి పాదులు పసిపాపల్లా ఉయ్యాలలూగుతున్నాయి.
కాలవగట్టు పొడవునా పండిన వరిచేలు బంగారు రాసి పోసినట్లున్నాయి.
గట్ల మీద కందిమొక్కల గుబురుల్లో బంగారు పిచికలు కిచకిచలాడుతూ ఆడుకుంటున్నాయి.
మట్టిపిడతలో ఉన్న చోడి జావ మీది వేడి పొగలు ఊదుకుంటూ రెండు మూడు గుక్కలు మ్రింగి:
‘గంగీ, కోతలవగా పట్టం పోయి బిడ్డల్ని చూసి రావాలే’ అన్నాడు.


‘మనసు బిడ్డల మీదికి పోయిందేం మావా!’
‘ఏమోనే, మనం యింకా ఎన్నాళ్లుంటాం’
‘దేవుడి పిలుపు వచ్చేదాకా’
‘ఆ పిలుపొచ్చినాక యింకేం చూస్తామే’
‘నీకింకా దేవుడి పిలుపు రావాలని లేదు!’
‘ఉంటే మాత్రం వస్తదా! ఆయనకు కరుణ రావాలి. పరంధావయ్యగారేవన్నారు. మనల్ని క్రిందికి పంపేటప్పుడే దేవుడు రాసి పడేస్తాడు, ఎప్పుడు తిరిగి రావాలో. అంతే! అది తెలవక కొట్టుకుంటాం!’
‘మరయితే మూడేళ్లయి పట్టంలో కొలువు చేసుకుంటూ సుకంగా వున్నారు గందా బిడ్డలు. ఇప్పుడు మనసు అటెందుకు మళ్లిందీ అని’
‘నీకు మాత్రం లేదేటి’
‘నాకెప్పుడూ లేదు. దేవుడు ఆళ్లను పంపుతూ గంగి కడుపున పడండర్రా అన్నాడు. పడ్డారు. పట్నం పోయి కొలువు చేసుకు బతకమన్నాడు. పోయి బతుకుతున్నారు. మనిద్దరినీ ఈ లంక మీద ఆగమన్నాడు. ఆగినాం. ఎప్పుడో కేకేస్తాడు. ఆ యేళకి మనం యిక్కడ లేకుంటే…’’
అని నవ్వింది.


‘‘ఓసి ఎర్రిబాగుల్దానా! దేవుడికి మనం ఎక్కడుంటామో తెలీదా!’’
అని జావ పూర్తిగా త్రాగి చుట్ట ముట్టించాడు. ఆ సమయానికే కృష్ణలో స్నానం చేసి, తిరిగి వస్తూన్న పరంధామయ్యగారు:
‘‘బాగున్నావా రంగయ్యా!’’ అన్నారు.
‘‘తమ దయ బాబయ్యా, ఈ చేను పంటకొచ్చినట్టు దేవుడు మరిచిపోయాడు బాబయ్యా, కోతకు రావడం లేదాయన’’
‘‘వెర్రివాడా! చేలో నారూ నీరూ పోసిన రైతు పంట కోసుకోకుండా ఉంటాడా! పద్నాలుగు లోకాల పంట కాపు, ఒక్క చేతి మీద చేస్తున్నాడు వ్యవసాయం’’
‘‘ఏం కోత బాబూ! రెండేళ్లుగా గాలివాన పాల పడుతున్నాం కదా. అలానే ఆయన పంట కూడా గాలివానైపోతే ఏం మిగులుతుంది’’
‘‘అన్నట్టు రంగన్నా, రేడియోలో చెబుతున్నారటరా, మళ్లీ తుపాను వస్తున్నదని’’
‘‘పోనీండి బాబయ్యా, నేననుకుంటూనే ఉన్నా. ఇంత పంట చూస్తే ప్రకృతికి కన్ను కుడుతుందని. ఎత్తుకు పొమ్మనండి. పంటతో పాటు పండించేవాణ్ని కూడా ఎత్తుకుపోయి సముద్రంలో పారేయమనండి’’ అని కూలబడ్డాడు.


‘‘ఏం మాటల్రా అవి. ఇంకా మనవలు పుట్టాలి. వాళ్లని భుజం మీద ఎత్తుకుని ఆడించాలి. అదీ కాక – మొన్ననే కదరా నీకు డెబ్బై దాటాయి. ఇంకా మూడు పదులు దాటాలి’’
‘‘దాటాలి బాబయ్యా, మూడు పదులేంటి ముప్పై పదులు దాటాలి. కాని ఎందుకు బాబయ్యా, మూడు పదులు దాటకుండా మీ తాతగారి చలవ వల్ల ఈ దిబ్బ మీద చేరినాం, ఎనమండుగురు బిడ్డల్ని కన్నది, ఈ గంగి. ఆరుగుర్ని వెనక్కి రమ్మని పిలిచాడు దేవుడు, మిగిలిన ఇద్దరికీ చదువులు చెప్పించి పట్నం తోలించారు మీరు’’
‘‘నేనెవర్నిరా! అదీ ఆ దేవుడే చేశాడు’’


‘‘అంతేలెండి. మూడేళ్లయ్యింది, వాళ్లిద్దరూ పట్నం పోయి. నేను, గంగి కూడా వెళ్లకుండానే ఆళ్లు పెళ్లి చేసేసుకున్నారు. ఈ ఎర్రిమొద్దుకి కోడళ్లని చూడాలనీ లేదు. ఆ కొడుకులకి ఓ పాలి మమ్మల్ని చూసి పోదామనీ లేదు’’
‘‘వింతగా వుంది రంగయ్యా, ఎప్పుడూ నీ కడుపులో ఇంత బెంగ ఉందని ఎరగను, అసలిది మన కాలం కాదు రంగన్నా. గంగిని కూడా తీసుకుని ఊళ్లో రామాలయం దగ్గరికి వచ్చై. మొండిగా ఇక్కడే పడి ఉండకు’’
‘‘ఏంటి బాబయ్యా! ఎన్ని గాలివానలు చూడలేదు. ఈ మట్టి మీద పుట్టి, ఈ మట్టిలో పండించుకు తిన్నాం. కలిసిపోతే ఈ మట్టిలోనే కలిసిపోవాలి. అంతే! కదలడం వుండదు బాబయ్యా. భూదేవికి బరువవుతామా!’’
‘‘నీ పట్టు నీదే, అయినా ముంపు వస్తే అంతా కలిసే మునుగుదాం’’


‘‘పట్టు కాదు బాబయ్యా! మునిగిపొయ్యే వాన పడితే ఇంక పంట మిగులుతుందంటారా! అది లేకుంటే ఇక బతికేదేంటి!’’
‘‘అంత భయం లేదులే. ఓ ఘడియ వుండి గంగిని పంపించు, అమ్మగారు పచ్చడి పెడతానన్నారు’’
‘‘అలాగే బాబయ్యా’’ అన్నాడు రంగన్న.
పరంధామయ్యగారు ముందడుగు వేశారు. గంగన్న లేచి ఆవును లంకలో దుబ్బుల వైపు తోలుకెళ్లాడు. గంగమ్మ గుడిసెలోకి వెళ్లింది.
పొయ్యిలో పిడకలు వేసి పిడతలో బియ్యం పోసి దాక మూత పెట్టి, బైటకొచ్చి ఆవుని కట్టిన చోట పరిశుభ్రంగా తుడిచి దూరంగా వున్న గోతిలో పోసింది.
చేతులు కడగడానికి పంట కాలవ దగ్గరకు వెళ్లింది. చేతులు కడిగి పురిసెడు నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించబోయింది. నీరు ఉప్ప ఉప్పగా ఉంది. గుండె గతుక్కుమంది. కాలవ నీరు ఉప్పగా ఉండడటం ఎరగదు గంగి. మరో మారు దోసెడు నీళ్లు నోట్లో పోసుకుంది. ఉప్పగానే తగిలింది. మరొక్కమారు… ఇంకోమారు… ఉప్పదనం ఎక్కువవుతున్నది. సముద్రం వైపు తూర్పుగా పోయే పంట కాలువకు నీరు ఎదురెక్కుతున్నది. పల్లానికి పోవలసిన నీరు మెరకకు వస్తున్నది. నిలబడిపోయింది. సముద్రం మామూలుగానే కనిపించింది. ప్రాణం పోయే ముందు శ్వాస ఎగదన్నుతుంది. అలానే ఉప్పెన రాబోయే ముందు నీరు మెరకకు ఎక్కుతుంది – అని గంగికి చిన్ననాడు తాత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.


వెనుదిరిగింది.
నాలిక మీద ఉప్పదనం తగ్గలేదు.
గుడిసె దగ్గరకు వచ్చి కూర్చుంది.
మామూలుగా అయితే గంగి కూడా రంగన్నతో లంకలోకి పోయి పరంధామయ్యగారి మిరపతోటలో కలుపు పీకడమో, పొగాకు విరవడమో చేసేది. ఈ మధ్య ఆరు మాసాల క్రితం ఆవు పాలు పిండుతుండగా వెన్ను పూస కలుక్కుమంది. అది మొదలు నడ్డి వంచి పని చేసే శక్తి పోయింది.
పట్నం పోయి కొడుకు దగ్గరుండి వైద్యం చేయించుకోవచ్చునని పరంధామయ్యగారు చెప్పారు.
కాని అరవయ్యేళ్లు జంటగా వున్న రంగన్నని విడిచి పోలేనంది. ఇద్దరినీ కలిసి వెళ్లమంటే:
బాబయ్యా, యిన్నేళ్లు ఈ కృష్ణమ్మ నీళ్లు తాగి బతికాం. ఇప్పుడు ఈ గడ్డ విడిచిపొమ్మంటారా! అయినా పట్టంలో మందులూ, మాకులూ మాకెందుకు బాబయ్యా. నాలుగు రోజులు మన ఎరకల మంగి చేత నూనె రాయించి తోమించి పారేస్తే అదే సర్దుకుంటుంది. అదీ కాక–చదువుకున్న కొడుకూ, కోడలూ మాకు సేవ చేస్తారా! చేసినా చేయించుకోగలమా, ఆ కుర్రకుంకల చేత.
ఇన్నాళ్లు ఒకరి మీద ఆధారపడకుండా బ్రతికాం. ఇంకెన్నాళ్లుంటా.
అని వేదాంతం చెప్పాడు.


గంగి గుడిసె గుమ్మంలోకి వచ్చి, లోపలకు చూసింది. అన్నం ఉడుకుతూ పొంగుతోంది.
గుడిసెవార వేప చెట్టు క్రింద నులక మంచం మీద నడ్డి వాల్చింది.
రెండు క్షణాలు కళ్లు మూసింది.
ఎదురుగా సముద్రం – తాడెత్తు కెరటాలతో లేచింది. కళ్లు నులుముకు చూసింది. సముద్రం మామూలుగానే ఉంది. మళ్లీ కళ్లు మూసింది. తాడెత్తు లేచిన కెరటం బుసలు కొడుతూ వచ్చే త్రాచు పడగ విప్పినట్లు తన గుడిసె మీద వాలుతున్నది.
కళ్లు తెరిచింది.


మామూలుగానే ఉంది సముద్రం.
ఆకాశంలోకి చూసింది.
అంతవరకు నిర్మలంగా ఉన్న ఆకాశం మీదికి అన్ని పక్కల నుంచీ మబ్బులు చేరుతున్నాయి.
క్షణాల వ్యవధిలో ఆ మబ్బులు కారు మేఘాలవుతున్నాయి. అన్నీ చేతులు కలుపుకుని చెట్టపట్టాలు వేసుకున్నాయి.
మెలమెల్లగా వీచేగాలి క్రమక్రమంగా పెరిగింది.
పెరిగిపెరిగి సుడి తిరిగి మబ్బుల్ని పిండింది.


చినుకులు ఆరంభమయ్యాయి.
సముద్రం ఘోషిస్తున్నది.
చినుకులు ముదిరాయి.
గాలి ప్రచండంగా రేగింది.
చెట్టుకొమ్మల చివరలు మెలిపెట్టిన గాలి, పెద్ద పెద్ద కొమ్మల్ని ఉయ్యాలలూపుతున్నది.
వాన ఆగడం లేదు.
చినుకులు ఆరంభం కాగానే నులక మంచం ఎత్తుకుని గుడిసెలోకి పోయి అక్కడ వాల్చుకు కూర్చుని చూస్తున్నది గంగమ్మ.
గుడిసె చిల్లులలోంచి పడుతున్న వానకు లోపల పొయ్యిలో నిప్పు చుయ్‌చుయ్‌మని ఏడుస్తూ ఆరిపోయింది.
కుండలోంచి వచ్చే ఆవిరి కుండలోనే కునుకు తీసింది.
మంచం మీద నడుం వాల్చి తడక తలుపులోంచి వెలుపలకు చూస్తున్నది గంగమ్మ.


గాలి చెడుగుడు ఆడుతున్నది.
వాన చిందులు తొక్కుతున్నది.
సముద్రం రోదిస్తున్నది.
గాలి ఈలలు వేస్తున్నది.
సముద్రం ఘోషించడం ఆరంభించింది.
వాన ముదిరి కుండపోత పోస్తున్నది.
గాలి పెరిగి చేటలతో విసరింది.
సముద్రం పొంగి లంకల మీదికి వస్తున్నది.
వాన విసురుతున్నది.


గాలి కురుస్తున్నది.
గాలి వాన ఘోషిస్తున్నది.
సముద్రం పొంగుతున్నది.
గుడిసెలో మంచం మీది గంగమ్మకు కళ్లు తెరిచినా ఏం కనపడడం లేదు.
చెవులు రిక్కించినా ఏమీ వినపడడం లేదు.
మావ తొరగా వస్తే బావుండును –
అనుకుంటూ గాలిదేవుడికీ, వాన దేవతకీ మనసులో మొక్కుకుంది.


అంత గాఢంగా మబ్బులు కమ్మినా, కుంభవృష్టి పడుతున్నా మెరుపు లేదు, పిడుగు లేదు.
మెరుపు మెరిసి పిడుగు పడితే సముద్రం చల్లబడిపోతుంది. ఎంత ఎత్తు కెరటం లేచినా చర్రున వెనక్కు తగ్గుతుంది. పిడుగు సోకితే సముద్రం చప్పగా వెనక్కు పోవాలి – అని తాతయ్య చెప్పాడు గంగికి. అది గుర్తుకొచ్చింది.
ఉరువు లేకుండానే సముద్రం లోపల పెద్ద మెరుపు కనిపించింది. ఆ మెరుపు అలాగే ఉండిపోయింది. మెరుపు మబ్బులోంచి రాకుండా సముద్రంలోంచి లేచి మబ్బులలోకి పోతున్నది.
చూసింది గంగమ్మ.


మెరుపు మేఘాలలో పుట్టకుండా నీటిలో పుడితే ఉప్పెన – అని గుర్తు. నిప్పులోంచి నీరు పుట్టింది. నీటిలోంచి భూమి పుట్టింది.
భూమిలోంచి నీరు ఎగదన్నితే ముంచెత్తుతుంది, భూమినే. నీటిలోంచి నిప్పు పుడితే సముద్రం పొంగి భూమిని తుడిచిపెట్టుకుపోతుంది. అది జలప్రళయం.
సముద్రంలో లేచిన మంట సుడి తిరిగి తాడెత్తు లేచింది.
ఆ వెలుగులో బైటికి చూసింది గంగమ్మ.
లంక చుట్టూ తోటలా వున్న చింత, సీమచింత చెట్టు లుంగలు చుట్టుకు నేల మీద పడి గిలగిల కొట్టుకుంటున్నాయి. వాటి మీద తాడిచెట్లు పడి ఆడుకుంటున్నాయి.
రంగమ్మ కళ్లు మూసుకుని కనిపించని దేవుడికి నమస్కరించింది – నా మావ సుఖంగా రావాలి – అనుకుంటూ.
’ ’ ’ ’


గాలి సుడి తిరిగినా –
వాన కుండ పోతపోసినా –
సముద్రం పొంగుతున్నా –
భయపడలేదు రంగన్న.
ఇలాటి గాలివానలు చాలా చూసింది రంగన్న జీవితం.
ఇప్పుడంటే వయసు మళ్లింది కనక చీకటి పడేవేళకు గుడిసెకు చేరుతున్నాడు కానీ, పదేళ్ల క్రితం వరకూ సముద్రంలో వేటకు పోయి మూడు నాలుగు రోజులు ఏటి మధ్యలో ఉండేవాడే! ఆ రోజుల్లో గాలివానలు వస్తే నిర్భయంగా ఏదో ఓ యిసక తిప్ప చేరి రెండు మూడు రోజులు గడిపినవాడే, తిండీ తిప్పలూ లేకుండా.
ఒక్కసారి మాత్రం పడవ తలక్రిందులయ్యింది. అప్పుడు గాలివానకు విశాఖపట్నం దరిదాపుల దాకా పోయి ఒడ్డుకు చేరి, వారానికి తిరిగి వచ్చాడు.


సముద్రం సంగతి బాగా తెలుసు రంగన్నకు. అది తనలో మానవప్రాణిని నిలవనివ్వ‌దు. ఏదో గట్టుకు గెంటేస్తుంది. దేవుడు ఆయుర్దాయం యిచ్చాడా – బతికి బయటపడతాం.
లేదూ – చ‌చ్చి ఒడ్డు చేరతాం. మరీ నడి సముద్రంలో అయితే పెద్ద చేపలు తినేస్తాయి. అంతే!
అటువంటి అనుభవాలెన్నో ఉన్నాయి రంగన్నకు. ఏటిగట్టు మీద కుక్కలు మొరుగుతున్నాయి, ఏడుస్తూ. అది విన్నాడు రంగన్న.
సముద్రం వైపు చూశాడు.
తాడెత్తున లేచింది కెరటం.
వెనుదిరిగి చూశాడు.
పల్లెలో పెద్దకాపు మేడ కనిపించింది.
రెండంతస్తుల మేడ.
కెరటం ఎత్తు కొలిచాడు.


ఆ ఎత్తులో సముద్రం వస్తే రెండంతస్తుల మేడ కనిపించదు, తన కామందు పరంధామయ్యగారి యిల్లు మిగలదు. నవ్వొచ్చింది రంగన్నకు.
మనిషి ఎంత మూర్ఖుడు.
అంత ఎత్తు కట్టుకుంటే ఉప్పెన ముంచదనుకున్నాడు పెద్దకాపు. గుట్టుగా బతకడానికి గుడిసె చాలన్నారు పరంధామయ్యగారు.
సముద్రానికి కోపం వస్తే యింకో అంత మేడను మింగగలదు.
బండి చక్రం అంత వెడల్పు మాను కట్టిన మద్దిచెట్టు కింద చేరి, ఆవు మెడకు కట్టిన తాడు విప్పేశాడు. దాని కళ్లు నీళ్లతో కనిపించాయి.
అది రంగన్న వయిపు జాలిగా చూసి, సముద్రం వైపు భయపడుతూ చూసింది.
రంగన్న దాని ముట్టె నిమురుతూ:


‘‘నీక్కూడా భయంగా ఉందా బిడ్డా! ఏం చేస్తామే. ఇన్నాళ్లూ మనకు చల్లగాలిచ్చి, మంచి చేపల భోజనం పెట్టిన యజమాని సముద్రం గారికి కోపం వచ్చిందే. మనం ఏం తప్పు చేశామో – ఆయనకు కోపం రావడానికి. యజమానికి కోపం వస్తే శిక్ష వెయ్యడా! తిండిపెట్టిన మా రాజు కొరడా తీస్తే పడొద్దా…. అంటూ దాని మెడ కౌగిలించుకున్నాడు.
అప్పుడు సముద్రంలోంచి గుప్పున లేచిన మంట కనిపించింది. నీటిలో నిప్పు చూసి ఆవు బెంబేలుపడి మోకాళ్ల మీద నేలవాలింది.
రంగన్న చేతులు రెండూ జోడించి: గాలిదేవుడికీ వానదేవుడికీ సాయం వచ్చావా బాబూ. చాలు… మీ ముగ్గురూ కలిసి ముల్లోకాలూ ముంచేసి, విసిరేసి, కాల్చేయండి – అని వెర్రిగా నవ్వాడు. ఆవు లేవడానికి ప్రయత్నించింది. అంతే తాడెత్తు లేచిన కెరటం ఆవునీ, రంగన్ననూ కలిపి ముందుకు తోసేసింది.
వెర్రి నవ్వు నవ్వాడు రంగన్న.


అక్కడ గుడిసె మీద నాలుగాకులెగిరి గంగి మీద వాన పడుతున్నది. గాలికి కొట్టుకుని తడక తలుపు ఎగిరిపోయింది.
ఏమీ తెలీదు గంగికి.
తన మావ రావాలి. అంతే!
ఒక్క క్షణం కొడుకులిద్దరూ కళ్లల్లో మెదిలారు.
అమాయకురాలు – తల్లి పేగు సుడి తిరిగి, గుండె కలుక్కుమనగా, రెండు చేతులూ పైకెత్తి ఆశీర్వదించింది.
గుడిసె మీది కప్పు రంగులరాట్నంలా తిరుగుతూ వెళ్లిపోయింది.
అయిదడుగుల దిమ్మ మీదికి సముద్రం పొడుచుకు వస్తున్నదో, వాన కురిసి నీరు ముంచుతున్నదో తెలీదు గంగికి.
మంచం ఉయ్యాలలూగుతున్నది.
‘మావా’ అని అరిచింది.
అరిచాననుకున్నది.


చెవులు వినపడడం లేదు.
కన్ను తెరిచినా మూసినా ఒకలానే ఉంది.
పెనుగాలి యీల వేస్తున్నదో, సుడిగాలి కూత కూస్తున్నదో, వీటితో కలిసి సముద్రం ఘోషిస్తున్నదో తెలీదు.
ఒకటే యీల…
నిర్విరామ ఘోష…


’ ’ ’ ’
సాయంకాలం నాలుగింటి వరకూ గాలీ – వానా ఆగకుండా విసిరి విసిరి, కురిసి కురిసి కొంచెం ఊపిరి పీల్చుకునే వేళ వరకూ వీధి వైపు కిటికీ దగ్గర కూర్చుని రామనామం జపిస్తూ, తులసి పూసల మాల తిప్పుతూన్న పరంధామయ్యగారు లేచారు.
ఆయన పక్కనే కూర్చున్న పార్వతమ్మగారు సీతారాములను స్మరిస్తూ కళ్లు మూసుకు కూర్చునే ఉన్నారు.
‘‘సముద్రం వెనక్కి తగ్గినట్టుంది. రంగన్న ఏమయాడో చూసి వస్తా’’
అంటూ ఆయన వీధిలో అడుగుపెట్టారు.
నిర్మానుష్యంగా ఉన్నాయి వీధులు.
పిట్ట కనపడలేదు చెట్టు మీద కూడా.
అడుగులు జోరుగా వేస్తున్నారు.
వీధి తలుపు తీసి వున్నట్టు కూడా తెలీదు పార్వతమ్మగారికి.
ధ్యానసమాధిలోనే ఉంది.
పరంధామయ్యగారి అడుగుల వేగం హెచ్చింది.
మేడ రెండో అంతస్థు మీంచి చూశాడు పెద్ద కాపు.


అరిచాడు:
‘‘పంతులూ ఉప్పెనొస్తోంది. సముద్రం పొంగుతోంది. వెన‌క్కిరా, వెనక్కిరా…’’
పరంధామయ్యకి వినపడలేదు.
రామనామ ఝంకారంతో వెడుతున్నాడు.
ఊరు చివరదాకా నడిచేసరికి ఒళ్లంతా వాననీటితో తడిసింది.


అక్కడ ఉంచి మళ్లీ గాలి తిరగబడింది.
గిలగిల కొట్టుకుంటున్నాయి మహావృక్షాలు.
వీధిలో వేసి విద్యుద్దీప స్తంభాలు గాలి తాకిడికి ఆగలేక తలలు వంచుతున్నాయి.
పరంధామయ్యగారు తీవ్ర వేగంతో నడుస్తున్నారు. నడుస్తున్నాననుకుంటున్నారు. అడుగు ముందుకు వేస్తున్నట్టుందాయనకు. గాలి వెనక్కు నెట్టుతున్నది.
ఎగదన్ని వస్తున్న సముద్రపు నీరు ఆయన ప్రయత్నం లేకుండానే ఆయనను ఆడిస్తున్నది.
తేలుతున్నది ఆయన దేహం.
పోయిపోయి విరిగిపడ్డ చింతచెట్టు కొమ్మలలో చేరుకున్నారు.


గాలి ప్రచండంగా వస్తున్నది.
వాన చండ ప్రచండంగా కురుస్తున్నది.
సముద్రం మహోత్తుంగ తరంగాలతో తాడిచెట్టు మొవ్వు తాకుతూ యీ రెండిటితో చెలగాటాలాడుతున్నది.
మూడూ కలిసి రెండు మూడు గంటలపాటు చెడుగుడు ఆడి ఆడి అలసిపోయాయి.
సముద్రం తగ్గింది.


వాన జంకింది.
గాలి మాత్రం యింకా ఎగురుతూనే ఉంది., కొంత వేగం తగ్గినా.
కోడి కుయ్యలేదు.
కాకి అరుపులేదు.
లేగదూడ అంబారవం లేదు.
సూర్యుడు నిద్ర లేచాడు. ఏమీ జరగనట్టు మామూలుగా తన కిరణాలు సారించి భూదేవిని మేలుకొలుపుతున్నాడు. సముద్రం గుట్టుచుప్పడు కాకుండా తన హద్దులలో తను ఆడుకుంటున్నది, జరిగిన ఘోరానికి తన బాధ్యత లేనట్టు.
గాలి మామూలుగా చల్లగా వీస్తున్నది, ఆడుకోవడానికి చెట్టూ, చేమా లేకపోయినా!
మేడ పైభాగం పెంకులెగిరిపోగా, కుటుంబంతో సహా రామాల‌య కళ్యాణ మండపం మీద గుప్పిట ప్రాణాలు పట్టుకు కూర్చున్న పెద్ద కాపుకి గుడి గుమ్మం దగ్గర కనిపించాయి – ఆవుతో పాటు రంగన్న, గంగమ్మల కళేబరాలు.
ఆ వెనకే చింత కొమ్మలో పరంధామయ్యగారి దేహం. చూడలేక కళ్లు మూసుకున్నాడు, పెద్దకాపు.

1977 న‌వంబ‌రు 19 వ‌చ్చిన దివిసీమ ఉప్పెన సంఘ‌ట‌న‌కు స్పందించి ఉష‌శ్రీ ర‌చించిన ఈ నిప్ప‌చ్చ‌రం క‌థపై పూర్తి హ‌క్కులు ఉష‌శ్రీ కుటుంబంతో పాటు వ్యూస్.ఇన్ చాన‌ల్‌వి. ఇందులోని భాగాన్ని కానీ, మొత్తాన్ని కానీ, చిత్రాల‌ను కానీ ఏ రూపంలోనూ వినియోగించ‌కూడ‌దు. ఒక‌వేళ వినియోగించుకోవాల‌నుకుంటే [email protected] కు మెయిల్ పంపండి.

1 COMMENT

  1. చాలా చాలా మంచి పోస్టింగ్.. ఇంత చక్కటి పోస్టింగ్ ని ఇచ్చిన మీకు కృతజ్ఞతలు.
    ..శ్రీపాద శ్రీనివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Telangana a critical election battle ground 

(Dr Pentapati Pullarao) Every national election has different critical states....

మనవడితో రేవంత్ హోలీ

మనవడు అంటే ఎవరికీ ముద్దుగా ఉండదు చెప్పండి. పండుగల్లో తాతయ్యలు వారితో...

Andhra BJP facing problems

(Dr Pentapati Pullarao) Recently, media reported that sad Andhra BJP...

భోజనానంతరం కునుకు ఒక కిక్

శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం(డా.ఎన్. కలీల్) నిదురపో… నిదురపో… నిదురపోనిదురపోరా తమ్ముడానిదురలోన గతమునంతానిముషమైనా...