ఒలింపిక్స్ విజేతలకు కానుకల వెల్లువ

0

నీరజ్ చోప్రాకు వద్దంటే డబ్బు
కరోడ్ పతి మీరాబాయి చాను
సింధు అకాడమీకి విశాఖలో 2 ఎకరాలు
( కృష్ణారావు చొప్పరపు – 84668 64969 )

టోక్యో ఒలింపిక్స్ లో అసాధారణంగా రాణించి స్వదేశం చేరిన భారత అథ్లెట్లపై ప్రశంసల వెల్లువ మాత్రమే కాదు…నజరానాల వానా కురుస్తోంది. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గత శతాబ్దకాలంలో తొలి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా కానుకల జడివానలో తడసి ముద్దవుతున్నాడు.
భారత సైనిక దళాలలో నాయక్ సుబేదార్ గా పనిచేస్తున్న 23 సంవత్సరాల నీరజ్ కు 6 కోట్ల రూపాయల నగదు బహుమతితో పాటు తమ రాష్ట్రప్రభుత్వంలో గ్రూప్-1 అధికారి ఉద్యోగం ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అంతేకాదు…పొరుగునే ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి సైతం నీరజ్ చోప్రాకు 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మరోవైపు… భారత క్రికెట్ నియంత్రణమండలి ఒలింపిక్స్ పతక విజేతలందరికీ భారీగా నగదు బహుమతులు ప్రకటించింది.
బంగారు పతకం సాధించిన మొనగాడు నీరజ్ చోప్రాకు 2 కోట్ల రూపాయలు, రజత పతకాలు సాధించిన మీరాబాయి చాను, రవికుమార్ దహియాలకు 50 లక్షల రూపాయల చొప్పున, కాంస్య పతక గ్రహీతలు లవ్లీనా, సింధు, భజరంగ్ పూనియాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నారు.
41 సంవత్సరాల విరామం తర్వాత ఒలింపిక్స్ లో భారత్ కు కాంస్య పతకం అందించిన భారత పురుషుల హాకీ జట్టుకు కోటి 25 లక్షలు నజరానాగా ఇస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.


కంచు మోతతో కోట్ల వరద…
గత 41 సంవత్సరాలలో తొలిసారిగా ఒలింపిక్స్ హాకీలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు..ఒక్కొక్కరికీ 4కోట్ల రూపాయల చొప్పున నగదు పురస్కారం అందచేయనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకటించారు.
భారతజట్టులో పంజాబ్ కు చెందిన ఎనిమిదిమంది ఆటగాళ్లు కీలకసభ్యులుగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు సైతం తమ క్రీడాకారులను నగదుబహుమతులతో సముచితంగా సత్కరించనున్నాయి. క్రికెటర్లతో పోల్చితే సంపాదనలో అట్టడుగున ఉన్న హాకీ క్రీడాకారులు తమ జీవితంలో తొలిసారిగా భారీగా నగదు బహుమతులు అందుకోనున్నారు.
మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు బీసీసీఐ ఇప్పటికే కోటీ 25 లక్షల రూపాయలు బహుమతిగా ప్రకటించింది. కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ సైతం స్వర్ణ విజేతలకు 75 లక్షలు, రజత పతక గ్రహీతలకు 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు 25 లక్షల రూపాయల చొప్పున చెల్లించనుంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు హాకీ క్రీడాకారులకు ఆ రాష్ట్ర్ర ప్రభుత్వం కోటిరూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి గా ఇస్తామని తెలిపింది.
భారత జట్టు తరపున ఆడిన తొమ్మిది మంది హర్యానా రాష్ట్ర్ర క్రీడాకారులకు 50 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ట్వీట్‌ చేశారు.
మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు ప్లేయర్లకు కోటిరూపాయల చొప్పున నజరానాగా ఇస్తామని ఆ రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రకటించింది.
హర్యానా క్రీడాకారులకు తలో 10 లక్షలు..
ఒలింపిక్స్ లో తమ రాష్ట్ర్రానికి ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులందరకీ తలో 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి ప్రకటించారు. మహిళల హాకీలో నాలుగో స్థానం సాధించిన భారతజట్టులోని హర్యానా ప్లేయర్లకు తలో 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు.


మీరాబాయి చానుకు భారీ ప్రోత్సాహకాలు…
మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో రజతపతకం సాధించిన మీరాబాయి చానుకు మణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతితో పాటు…తమ పోలీసు శాఖలో ఏఎస్పీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలో ఈశాన్య రైల్వేలో ఉద్యోగిగా ఉన్న మీరాబాయికి 2 కోట్ల రూపాయల నజరానాతో పాటు ప్రమోషన్ ఇస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణ‌వ్‌ ప్రకటించారు. ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయికి ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (స్పోర్ట్స్‌)గా పదోన్నతి కల్పించినట్లు తెలిపారు.
ఒలింపిక్స్ లో పాల్గొన్న ఐదుగురు మణిపూర్ అథ్లెట్లకు తలో 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నిర్ణయించారు. బాక్సర్ మేరీ కోమ్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, జూడో ప్లేయర్ సుశీల లిక్మాబామ్, హాకీ ప్లేయర్లు సుశీల చాను, నీలకంఠ శర్మ మణిపూర్ కు చెందిన వారే కావడం విశేషం.


కాంస్యంతోనే సింధుకు కోట్లు….
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పీవీ సింధుకు బీసీసీఐ, కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ …చెరో 25 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వనున్నాయి. ఆంధ్రప్రదేశ్ …తమ రాష్ట్రంలో సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న సింధుకు విశాఖలో అకాడమీ ఏర్పాటు చేయటానికి వీలుగా 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు…తమ రాష్ట్ర క్రీడా విధానంలో భాగంగా 30 లక్షల రూపాయలు నజరానాగా ఇవ్వనున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొనటానికి ముందే…బ్యాడ్మింటన్ జోడీ రిత్విక్ సాయి రాజ్, సింధులతో పాటు మహిళా హాకీ ప్లేయర్ రజనీకి 5 లక్షల రూపాయల చొప్పున అందచేసింది.
టో్క్యో ఒలింపిక్స్‌లో భారత్ తరపున పతకాలు సాధించిన అథ్లెట్లు…నీరజ్ చోప్రా, రవికుమార్ దహియా, భజరంగ్ పూనియా హర్యానాకు చెందిన వారు కాగా..లవ్లీనా బోర్గెయిన్ అసోం, మీరాబాయి చాను మణిపూర్, పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారుగా ఉన్నారు.
పురుషుల హాకీలో కాంస్య విజేత భారతజట్టులో పంజాబ్ కు చెందిన ఎనిమిదిమంది ప్లేయర్లు ఉండటం విశేషం.
గత రెండేళ్లుగా తమతమ కుటుంబాలకు దూరంగా ఉంటూ…శిక్షణ శిబిరాలలో సాధన చే్స్తూ, సన్నాహాలలో భాగంగా వివిధ దేశాలలో పర్యటించడం ద్వారా..
ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులకు ఎన్ని రకాలుగా ప్రోత్సాహక బహుమతులు అందచేసినా…అవి చంద్రునికో నూలుపోగులాంటివే అన్నడంలే ఏమాత్రం సందేహం లేదు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ క్రీడా విశ్లేష‌కుడు)

Chopparapu Krishnarao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here