ప‌టాపంచ‌ల‌వుతున్న పుస్త‌క ప్ర‌పంచం

0

క‌రోనా క్ర‌మంలో మాయ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు
(నాగ‌సూరి వేణుగోపాల్‌, 94407 32392
సంవత్సరం ముగుస్తుండగా భాగ్యనగరంలో పుస్తక ప్రపంచం ప్రదర్శనగా విచ్చుకుంటుంది. ఇది ముప్ఫయి మూడేళ్ళుగా క్రమం తప్పకుండా సాగుతూ జనాలకు జ్ఞానాన్ని పంచుతోంది. ఈ పుస్తకాలతోపాటు నగరం విస్తృతమైంది. టెక్నాలజి ఊతంతో ప్రపంచీకరణ వెల్లువయ్యింది. బుల్లితెర తెలుగు మాటలతో లెక్కలేనన్ని హొయలు పోతూ నర్తించడం మొదలుపెట్టింది. టెలిఫోన్ ఇంట్లో బల్ల మీదనో, మరో చోటనో కాకుండా జేబులోకి దూరిపోయింది. ఇంటర్ నెట్ కంప్యూటర్ దాటి అరచేతిలోకి వచ్చింది. ఇవి చాలక సోషల్ మీడియా మనసులను, మొదళ్ళను కొల్లగొట్టడం ప్రారంభించింది – ముప్ఫయి మూడేళ్ళ కాలంలో ఇన్ని మార్పు హైదరాబాదులోనే కాదు చిన్న పల్లెలో కూడా సంభవించాయి. హైదరాబాదు పుస్తక ప్రదర్శన 1986లో మొదలైనప్పటి నుంచి ఇన్ని పరిణామాలు స్పష్టంగా కన్నులకట్టుతున్నాయి. అశోక్ నగర్ సిటీ లైబ్రరీలో మొదలై నిజాం కాలేజి గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కేశవ మెమోరియల్ హైస్కూలు గ్రౌండ్స్, నెక్లెస్ రోడ్ పిమ్మట ఎన్ టి ఆర్ స్టేడియం లేదా తెలంగాణ కళాభారతిలో కుదురుకుంది.
పుస్త‌కం అంటే భ‌విష్య సాధ‌న‌
పుస్తక ప్రదర్శన సమయంలో ఇంతస్థాయి చర్చ అవసరం ఏమిటని కొందరికి అనిపించవచ్చు. పుస్తకం అంటే జ్ఞానం; పుస్తకం అంటే భావప్రసారం; పుస్తకం అంటే సమానత్వ సాధన; పుస్తకం అంటే దిశా నిర్దేశనం; పుస్తకం అంటే భవిష్యత్ సాధన! వెరసి పుస్తకం అంటే జీవితానికి ఓ పెద్ద ఊతం!! నేటికీ ఇంటర్ నెట్ లేదా వికీపీడియా సమాచారం ప్రామాణికంగా తీసుకోలేకపోతున్నాం. అది పుస్తకంగా వుంటేనే ఆ స్థాయి గౌరవం ఉండటానికి కారణం ఏమిటంటే గోడౌన్ లాంటి ఇంటర్ నెట్ లో ఎవరు ఎలాగైనా జోక్యం చేసుకోవచ్చు. కనుకనే పుస్తకం హస్తభూషణం, మస్తక కిరీటం!
తొలుత అక్ష‌రాలు దిద్దింది సుమేరియ‌న్లు
ఒక్కసారి ఎలా పుస్తకం క్రమంగా దారి చూపే ధ్రువతారగా ఎలా మారిందో గమనించడం ఆసక్తిగా ఉంటుంది. సుమేరియన్లు తొలుత అక్షరాలు దిద్దారని చెబుతారు. అంతకుముందు ఆలోచన గలిగి ఉండటమే మనిషిని జంతు ప్రపంచం నుంచి వేరు చేసింది. ఆలోచనే వ్యక్తీకరణ చేయాలనే ప్రయత్నానికి ఊపిరి పోసింది. తత్ఫలితంగా భావ ప్రసారం లేదా కమ్యూనికేషన్ అనే ప్రక్రియ మొదలైంది. తొలుత అతి ప్రాథమికంగా ఉండవచ్చు.
జ్ఞాప‌క‌శ‌క్తే గ‌తంలో ఆధారం
అక్షరాలు, రాత వగైరా రాకముందు అంతే వాక్ ఆధారమే! జ్ఞానాన్ని దాచుకోవడానికి జ్ఞాపకశక్తి తప్పా మరో సాధనం లేదు. వ్యక్తీకరణకు నోరు తప్పా మరో ఊతం లేదు. నేటి పుస్తకం, ఈ-పుస్తకం దాకా వ్యక్తీకరణ ప్రయాణాన్ని గమనిస్తే ఇందులో ఎంతటి టెక్నాలజీ ఉందో బోధపడుతుంది. ఇసుకలో వేలితో అక్షరాలు దిద్దడం మనకు నేడు చాలా సరళంగా అనిపించవచ్చు. కానీ ఈ ఆలోచన రావడానికి ఎంతకాలం పట్టి ఉంటుంది. తాళపత్రాలు రాక మాత్రం చిన్న విషయమా? పత్రాలలో తాళపత్రాలు రాయడానికి అనుకూలంగా మాత్రమే కాక దీర్ఘకాలికంగా మన్నుతాయని గమనించడం వృక్షశాస్త్ర అంశమే! దానికి తగిన కలాన్ని రూపొందించుకోవడం టెక్నాలజీ కాగా; అలా వినియోగించుకోవాలనే ఆలోచన సైన్సు! తాళపత్రం రాకముందు జ్ఞానం అంటే గురుముఖంగా నేర్చుకున్నదే! గుర్తు పెట్టుకోవడానికి సౌలభ్యంగా దారులు ఏర్పడ్డాయి, స్థిరపడ్డాయి. ఛందస్సు అలా ఏర్పడి, మనం గుర్తుపెట్టుకోవడానికీ; మననం చేసుకోవడానికీ దోహదపడిందే!
టెక్నాల‌జీ ఫ‌లితాలు అనంతం
కాగితం తయారు చేసుకోవడం, పెన్నుల తయారి, ఇంకు తయారి – ఇవన్నీ టెక్నాలజి ఫలితాలే! తాళపత్రాలు దాటి అచ్చుకాగితాలు రావడంతో పుస్తకాలు రావడం మొదలైంది. అచ్చుపని మెరుగవడంతో పుస్తకాలనుంచి పత్రికలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామం దినపత్రిక రాకతో తారస్థాయిని అందుకుంది. ఈ దినపత్రికల పంపిణి కూడా సైకిల్ ఆవిష్కరణ, అది మెరుగవడంతో మరింత వేగాన్ని సాధించింది.
మాట పుస్త‌కంగా ప‌రిణామం
మాట పుస్తకంగా పరిణమించి సాగిపోవడం ఒక దారి కాగా; మాట మాటగా చేరడం మరో టెక్నాలజి పథం. టెలిఫోన్, రేడియో, సినిమా, టెలివిజన్, ఇంటర్ నెట్ – వీటి మధ్య ధ్వని ముద్రణా సౌలభ్యాలు – ఇది మరో గమనం. ప్రస్తుతం మనం జ్ఞానం, పాండిత్యం, ప్రతిభ ఈ దారులలోనో లేదా ఆ దారిలో కాసేపు, ఈ దారిలో కాసేపో సాగడంగా మారిపోయింది. ఏది ఏ మోతాదులో వినియోగించుకోవడం దానికి ఎంతో కొంత ఈస్థటిక్‌ పరిమళాలు అద్దడం అదనపు కళా, పరమార్థం!


అన్ని ప్ర‌సారాల‌కూ పుస్త‌కం పెద్ద‌న్న‌
ఒక రేడియో ప్రసంగం. ఒక టెలివిజన్ కార్యక్రమం. ఒక నాటకం. ఒక పాట, ఒక పుస్తకం – ఇలా ఏవైనా భావప్రసారానికి సహకరించేవి ఒక మౌలిక రూపానికి వేర్వేరు వ్యక్తీకరణలే! ఈ మౌలిక రూపమైంది రాత! అది మస్తిష్కంలోనా, లేదా అక్షరరూపంలోనా అనేది తర్వాతి స్థాయి. వీటన్నిటికీ నేడు పుస్తకం ఒక పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఆధునిక టెక్నాలజి ఆయుధంగా ఈ-పుస్తకంగా మారి – భౌతిక రూపం నుంచి అరూపంగా అందివచ్చింది. కేసెట్ రికార్డర్ వచ్చినపుడు రేడియోకు కాలం చెల్లింది అన్నారు; టెలివిజన్ పెద్ద స్థాయిలో ప్రవేశించినపుడు ఇక సినిమాకు చెల్లు చీటి అన్నారు; న్యూస్ ఛానళ్ళు వచ్చినపుడు దినపత్రికలకు తిలోదకాలు అన్నారు. ఇంటర్నెట్ విచ్చుకున్నపుడు పుస్తకాలకూ, లైబ్రరీలకూ అంతే సంగతులు అన్నారు. ఇందులో ఏదీ నిజం కాలేదు. పైపెచ్చు ఒక దానికొకటి దోహదపడటం పెరిగింది. టవీలో సినిమా చూసి తృప్తి పడక పెద్ద స్క్రీన్ అని థియేటర్ కి వెళ్ళాలనిపిస్తుంది. న్యూస్ ఛానళ్ళ వార్తల గందరగోళంతో దినపత్రికలలో సమాచారాన్ని సరి చూసుకోవాలనిపిస్తోంది.
మ‌రిన్ని ప‌రిణామాలు
పుస్తక ప్రపంచానికి సంబంధించి మరికొన్ని పరిణామాలున్నాయి. పుస్తకాల ధరలు పెరగడంతోపాటు రవాణా ఖర్చులు పెరిగాయి. పుస్తకాలు పత్రికలుగా మారి పాఠకులను చేరాయి. ‘చతుర’ మాసపత్రిక అలా మొదలైందే ఒకప్పుడు. పుస్తకాలకన్న పత్రికలకు పోస్టల్ ఖర్చు తక్కువ. మరోవైపు పట్టణం నగరంగా, మహానగరంగా మారిపోవడంతో షికారుగా వీధిలోకి రావడమే సమస్య అయిపోయింది. జీవితంలో వత్తిడి పెరిగిపోయింది. శ్రీమతితోపాటు నెలసరి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళే సదుపాయాన్ని ఒకవైపు టీవీ, మరోవైపు ట్రాఫిక్ అడ్డగించింది. లేకపోతే అన్ని వస్తువులతోపాటు పత్రికలు, పుస్తకాలు కొనే అలవాటు ఇప్పుడు మూడు ఇరవైల వయసుకు అటూ ఇటూ ఉన్న వారందరికీ గుర్తుండే ఉంటుంది. టీవీ రాకతో లెండింగ్ లైబ్రరీలు క్రమంగా మూతబడ్డాయి, పుస్తకాల కొట్లు పలచబడ్డాయి. ఇంటర్నెట్ లో పుస్తకాల సంత అమెజాన్ ద్వారానో, ఫ్లిప్ కార్ట్ ద్వారా సాగుతోంది. ఏదో పత్రికలో మంచి పుస్తకం గురించి చదివి నెట్ లో తెప్పించుకుందామని మరిచిపోయిన సందర్భాలు అందరికీ ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా పుస్తక ప్రదర్శనలు నేడు కీలకంగా మారాయి.
అన్నీ స‌వ్యంగా సాగితే 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన డిసెంబరు 23న ప్రారంభ‌మై ఉండేది. కానీ క‌రోనా ప‌రిస్థితుల క్ర‌మంలో సామూహాలు చేరే కార్య‌క్ర‌మాల‌న్నింటికీ అడ్డుక‌ట్ట ప‌డింది. అందులో పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న కూడా ఉంటుంద‌నడంలో సందేహం ఏముంది? (వ్యాస‌క‌ర్త ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, సామాజిక విశ్లేష‌కుడు, హైద‌రాబాద్ ఆకాశ‌వాణి కేంద్ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌)

Dr Nagasuri Venugopal

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here