కేంద్ర పాలితంగా గ్రేటర్?

0

అసదుద్దీన్ మాటలలో అంతరార్థమేమిటి?
గ‌తంలో అన్న మాట‌లు మ‌రిచారా ఓవైసీ గారు?
(బండారు రామ్మోహన రావు, 98660 74027)

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్ మహా నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం గా మార్చే ప్రమాదం ఉందని లోక్ సభలో ఎంఐఎం అధినేత పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జమ్మూకాశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై లోక్ సభలో ఇటీవలి చర్చలో ఆయన కేంద్రంపై ఈ ఆరోపణలు చేశారు. చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో తదితర పట్టణాలతో సహా హైదరాబాద్ నగరాన్ని మోడీ ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ఏనాడో ఒకనాడు ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దానికి కాశ్మీర్ ఉదంతాన్ని ఒక ఉదాహ‌ర‌ణ‌గా చూపించారు. సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కొన్ని పార్టీలు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని వారి వారి రాష్ట్రాల రాజధానులను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చినప్పుడు వారికి ఎన్ డి ఏ అసలు స్వరూపం అర్థమవుతుందని అసదుద్దీన్ అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించినట్లుగా ఏనాడో ఒక నాడు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా అనే అనుమానం వస్తుంది. అసదుద్దీన్ మాటల్లో ఆంతర్యం ఏమిటని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు.


గురివింద గింజ అసదుద్దీన్
గురివింద గింజ తన నలుపు ఎరగదన్నట్లు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ గురించి గతంలో అన్న మాటలను మర్చిపోయారు. ఎంఐఎం పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించింది. దానికి అనుగుణంగా ఆనాడు యూపీఏ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీకి రిపోర్టు ఇచ్చింది. తెలంగాణ ఇస్తే గిస్తే రాయల తెలంగాణ ఇవ్వాలని ఎంఐఎం పార్టీ ప్రతిపాదించింది. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు నాలుగు జిల్లాలను కలపడం ఇష్టం లేకపోతే కనీసం కర్నూలు, అనంతపురం జిల్లాలనైనా తెలంగాణలో కలుపుతూ రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కేంద్రాన్ని ఎంఐఎం కోరింది. హైదరాబాద్ నగరంతో పాటు రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండడమే ఈ ప్రతిపాదనకు అసలు కారణమన్నది జగద్విదితమే. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని కూడా అన్యాపదేశంగా ఆనాడే ఎంఐఎం కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదంతా తన రాజకీయ క్రీడలో భాగంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఐఎం నాటకమాడింది. అది మరచి ఇప్పుడు బీజేపీ పై ఆరోపణలు చేసే క్రమంలో చూస్తుంటే దొంగే దొంగా దొంగా అని అన్నట్లు ఎంఐఎం ప్రవర్తన ఉంది.


బిజెపి ఆలోచన ఏమిటి?
అలాగని బిజెపి ఆలోచన చాలా సక్రమంగా ఉందని కూడా మనం చెప్పలేము. మొదటి నుంచి బీజేపీ పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది.దానికి సిద్ధాంతపరమైన కారణం ఏమిటంటే బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచన బీజేపీకి ఉంది. దానికి తోడు వివిధ రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను నయానో భయానో ఒప్పించి తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఇప్పటికే బిజెపి చేస్తుంది. చేసింది కూడా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు చెప్పుకోలేనంత అన్యాయం జరిగినా కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్క మాట కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం పోవడానికి కారణం దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హోం మంత్రి సహా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత రెండు రోజుల తేడాలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అలా ఢిల్లీ వెళ్లి వచ్చారో లేదో తమ పవర్ “స్విచ్ ఆఫ్”అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల గురించి విమర్శించిన కేసీఆర్ ఢిల్లీ నుండి రాగానే పులి కాస్త పిల్లి గా మారిపోయింది. కేసీఆర్ ఒక్కసారిగా మాట మార్చి వాటికి అనుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. వ్యవసాయ చట్టాలు వచ్చిన కొత్తలో జిహెచ్ఎంసి ఎన్నికల కన్నా ముందు ఆ మూడు వ్యవసాయ చట్టాలు తేనె పూసిన కత్తులనీ దుర్మార్గంగా ఉన్నాయని వర్ణించిన కేసీఆర్ లో ఇంతలోనే ఇంత మార్పు చూసి ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. పవర్ ఫుల్ ముఖ్యమంత్రులు అన్న పేరు ఉన్న వారిని కూడా వారి అవినీతి సామ్రాజ్యాలను బట్టబయలు చేస్తామని ముఖ్యమంత్రులను బ్లాక్ మెయిల్ చేసి కేంద్ర ప్రభుత్వంలో అధికార పార్టీ బిజెపి తన బుట్టలో వేసుకుంది అనే ఆరోపణ బహిరంగ రహస్యమే.


ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న ప్రతిసారి ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు పార్టీల అధినేతల తో సహా చాలామంది ఆంధ్ర మేధావులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకదశలో తెలంగాణ రాష్ట్రం రావడం అనివార్యం అని తేలిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని కేంద్ర ప్రాంత ప్రాంతం చేయడంతోపాటు నగరం నుండి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిలో తెలంగాణ ప్రాంతం ఉన్నంతవరకు, కర్నూలు మీదుగా కన్యాకుమారి వరకు వెళ్లే 44వ నెంబర్ జాతీయ రహదారిని తుంగభద్రా నది దాటేంత వరకు తెలంగాణ ప్రాంతంలో విభజించి రహదారి ఇటుపక్క, అటుపక్క ఉన్న ఊళ్ళను కలుపుకొని కేంద్ర పాలిత ప్రాంతం ప్రాంతంగా మార్చాలనే ప్రతిపాదన కూడా తీసుకువచ్చారు. అంటే విభజన అనివార్యమైతే అడ్డగోలుగా విభజన జరగాలని వారు కోరుకున్నారు. మళ్లీ అలాంటి ప్రతిపాదనే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నోటివెంట వచ్చింది. కాశ్మీర్ విభజన సాకుగా చూపిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ హైదరాబాదు నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం గురించి మాత్రమే మాట్లాడకుండా హైదరాబాద్ తో పాటు మిగతా నగరాల గురించి మాట్లాడడం గమనిస్తే ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అనిపిస్తుంది. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఓటర్ల పోలరైజేషన్ కోసం ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చెన్నై నుంచి మొదలుకొని రేపు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అహ్మదాబాద్ లక్నో నగరాల ప్రజలను కూడా రెచ్చగొట్టే విధంగా అసదుద్దీన్ ఓవైసీ ఒక పథకం ప్రకారం మాట్లాడారనిపిస్తుంది.ఇప్పటికే ఓటు బ్యాంకు మత పోలరైజేషన్ రాజకీయాలు చేయడం వల్ల బీహార్లో ఎంఐఎం లబ్ధి పొందింది. బీహార్ లో ఇటు బిజెపి కూడా ఎంఐఎం కంటే పది రెట్లు లబ్ధి పొందింది. అందుకు అనుగుణంగానే బీజేపీ అప్పటిదాకా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు సంపాదించి సింగిల్ మెజార్టీ పార్టీగా అవతరించింది.


శరీరం తెలంగాణలో! ఆత్మ ఆంధ్ర లోనా!
అసదుద్దీన్ ఓవైసీ ప్రకటనపై పైకి ఎలా స్పందిస్తున్నాకూడా కొందరు ఆంధ్ర ప్రాంతంలోని నాయకులు పార్టీలు లో లోపట సంతోషిస్తున్నాయని అనిపించవచ్చు. రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా మంది నాయకులు గత అరవై సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని ఆలంబనగా చేసుకొని తమ వ్యాపార వాణిజ్య రంగాలలో విస్తరించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు పార్టీల అధ్యక్షుల ఆస్తిపాస్తులు ఇళ్ళు ముంగిళ్ళు హైదరాబాదులో ఉన్నాయి. చాలామంది ఆంధ్ర ప్రాంతంలోని పెద్దలకు హైదరాబాదుతో వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇది తప్పు కాదు కానీ రాజకీయ అధికారంలో పాలు పంచుకోకుండా హైదరాబాదులో అనామకులుగా బతకడం వారికి ఇష్టం లేదు. రాజకీయ మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వ్యాపార సంబంధాలు తెలంగాణలో ఉండడం వల్ల హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఆలోచన సహజంగానే వీరు స్వాగతిస్తారు. శరీరం తెలంగాణలో ఆత్మ ఆంధ్రా లో ఉండడం వల్ల ఇది జరుగుతుంది.


దిల్ కా ధడ్కన్. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్
నాలుగువందల సంవత్సరాల కు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ. తెలంగాణ రాష్ట్ర సగటు ఆదాయం లో నూటికి 70 శాతం హైదరాబాదు మహా నగర ప్రజల పన్నుల నుండి వసూలు అవుతుంది. తెలంగాణ ధనిక రాష్ట్రం కావడానికి హైదరాబాద్ ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. ఈ స్థితిలో హైదరాబాదు లేని తెలంగాణ రాకపోయినా పర్వాలేదు కానీ హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణ సాధించాలనే పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర సాధన రెండు మూడు సంవత్సరాల పాటు ఆలస్యం అయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించిన ఏడేళ్ల తర్వాత కూడా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేద్దామనే ఆలోచన మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉందా అనే అనుమానం ప్రజలకు వస్తుంది.

రాష్ట్రం వచ్చిన కొత్తలోనే ఒక్క కలం పోటుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ధారాదత్తం చేసిన ఘన చరిత్ర నేటి బిజెపి ప్రభుత్వానికే ఉంది. అందుకే అసదుద్దీన్ లేవనెత్తిన అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని హైదరాబాద్ నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబోమని ప్రకటించారు. ఆ ప్రకటన మీద ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి కేంద్ర హోంమంత్రితో పాటు ప్రధానమంత్రి కూడా అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణల్లో నిజం లేదని ప్రకటించాలి. అప్పుడే తెలంగాణ ప్రజలు తమ గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్ర పోతారు. లేకపోతే తెలంగాణ లో హైదరాబాద్ గురించి మరో మహోద్యమం సునామీలా ఎగసి పడుతుంది.తస్మాత్ జాగ్రత్త. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కుడు)

Bandaru Ramamohanarao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here