Friday, September 22, 2023
HomeCinemaటాలీవుడ్‌లో తిరుగులేని ప్ర‌భంజ‌నం

టాలీవుడ్‌లో తిరుగులేని ప్ర‌భంజ‌నం

ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ మూర్తి
నిర్మాత‌ల క‌థానాయ‌కుడు
(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
పౌరాణికం నుంచి జానపదం వరకు, చారిత్రక చిత్రాల నుంచి సాంఘిక సినిమాల వరకు ఆయన టచ్ చేయని అంశం లేదు. వెండి తెరకు సరికొత్త వెలుగులు అద్దిన నటుడు కృష్ణ. సినీ వినీలాకాశంలోంచి ధృవతార రాలిపోయింది. సాహసం ఊపిరి నిలిచిపోయింది. ఆయన పిలుపు ప్రభంజనమైంది. సినీమా చరిత్రలో ఆయన ప్రతి ఘట్టం సంచలనమే. తెలుగు సినిమాలో నట సింహాసనం అధిష్టించిన నటశేఖరుడు కళాపిపాసి సాహసం ఆయన పధం అదో రగులుతున్న వినూత్న ప్రయోగాల అగ్ని పర్వతం. అతడు నంబర్ వన్. నటన దర్శక ప్రతిభ కలిగిన టూఇన్ వన్ కొత్తదనాన్ని వైవిధ్యాన్ని శోధించి సాధించే గూఢచారి.
కొన్ని ద‌శాబ్దాల కింద‌టే కృష్ణ దూకుడు..
మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకెళ్తా అని మహేష్ బాబు డైలాగ్ చెప్పగానే ఈలలు వేశాం కాని ఆ దూకుడుని కొన్ని దశాబ్దాల కిందటే కొనసాగించారు కృష్ణ. కృష్ణ సుదీర్ఘ ప్రయాణంలో ఆడుగడుగునా సాహసం కనిపిస్తుంది. చిత్ర సీమ ప్రతి మలుపులోనూ ఆయన పేరు వినిపిస్తుంది. పరిస్దితులతో పోటీపడ్డారు. అసాధ్యం అన్న దాన్ని సుసాధ్యం చేశారు. తన పేరిట ఒక చరిత్ర ను లిఖించారు. తెలుగు సినిమా జేమ్స్ బాండ్ ఆయనే, కౌబాయ్ ఆయనే, సాంకేతి కపరంగా తెలుగు చిత్ర సీమను ఎన్ని మెట్లు ఎక్కించారో లెక్కలేదు. సినిమా స్కోప్ 70MM, స్ట్రిరియో ఫోనిక్ శబ్దాలు ఇనన్నీ కూడ కృష్ణ పరిచయం చేసినవే. మెక్కవోని ధైర్యంతో ముందడుగు వేసి ఆఖండ విజయాన్ని నిర్మల హృదయంతో సొంత చేసుకున్నారు. కొత్తదనం అది ఘట్టమనేని కృష్ణ నుంచే రావాలి. ప్రయోగం కృష్ణ సాహసంచేస్తేనే. చలన చిత్ర రంగంలో అతడొక ప్రభంజనం అతడొక అసాధ్యుడు., సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా, నమ్మి అంచెలంచెలుగా ఎదిగిన ఘట్టమనేని కృష్ణని అభిమానులు సూపర్‌స్టార్‌ గా భావించి హృదయ సింహాసనంఫై అధిష్టింప జేసుకున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టి, సినిమాలు నిర్మించి పడిలేచిన కెరటంలా విజృంభించి నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో మకుటంలేని మహారాజుగా చిత్ర పరిశ్రమను ఏలిన నటశేఖరుడు.

1964 లో ప్రముఖ దర్శక. నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె.విశ్వనాథ్‌ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్‌ డ్యాన్సు చెయడంలో శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం ‘తేనె మనసులు’ కృష్ణని హీరో చేసి నిలబెట్టింది. ‘కన్నెమనసులు’ జులై 22, 1966న విడుదలైతే, ‘గూఢచారి116’ ఆగస్టు 11, 1966న విడుదలైన‌ తొలి స్పై పిక్చర్‌. ‘అల్లూరి సీతారామరాజు’ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్వాతంత్య్ర సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహంగా, విప్లవాగ్నులు మండించిన స్వేచ్ఛా సమరశంఖమై, బ్రిటీషు సింహాసనపు పునాదులనే గజగజలాడించిన విప్లవ వీరునిగా సీతారామరాజుని ఈ సినిమాస్కోప్‌ చిత్రంలో తీర్చిదిద్దారు. కృష్ణ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ సినిమా తెలుగులో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా చరిత్ర పుటలకెక్కింది. బప్పిలహరిని తెలుగులో సంగీత దర్శకునిగా పరిచయం చేసిన ఘనత కృష్ణదే! తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్‌ల్లో ‘సాక్షి’ సినిమా ప్రదర్శిత‌మైంది. కృష్ణ నట జీవితంలో మొత్తం 80 మంది హీరోయిన్ల సరసన నటించారు. అందులో 47 సినిమాల్లో విజయనిర్మలే హీరోయిన్‌. జయప్రద 42 చిత్రాల్లో, శ్రీదేవి 31 చిత్రాల్లో నటించి, అందమైన జోడీలుగా గుర్తింపు పొందారు. నటునిగా, నిర్మాతగా, చిత్ర సంస్ద ఆధినేతగా ప్రజా ప్రతినిధిగా సేవలు ఆందించదం తన బహుముఖ ప్రజ్ఞ కు తార్కాణం . అనేక విపత్కర పరిస్దితులలో ప్రజల సహాయార్దం విరాళమిచ్చి ఆదుకున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికై అనేక సూచనలు సలహాలు ఇచ్చి పరిశ్రమ ఆభివృద్ధికి తోట్పాటుని ఆందించారు. 2009లో భారత ప్రభుత్వం కృష్ణను ‘పద్మభూషణ్‌’ బిరుదుతో సత్కరించింది. కృష్ణ ఆంటే సినిమా పరంగా మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా భిన్నమైనదే.

మాట తీరు కుండబద్దలు కొట్టినట్లు ఉంటుంది. ఆయన ఆంచనా లెక్క తప్పదు జయాపజయాలు అయన లెక్కలోకే రావు అన్నింటిని సమానంగా స్వీకరించే గుణాన్ని అలవర్చుకున్నారు భావి తరాలకి స్పూర్తి. సమయపాలన కఠోర పరిశ్రమ అనే వజ్రాయుద్దంతో అపజయాన్ని విజయాన్ని సొంతంచేసుకుని మల్టీస్టార్ సినిమాల్లో నటించి కొత్త ఒరవడిని సృష్టించి నటనని దైవంగా భావించి బేషజాలకు పోకుండా సినీవిమర్శకుల నుంచి సైతం శహభాష్ అనిపించుకున్న సూపర్ స్టార్ బుర్రిపాలెంబుల్లోడు, ఘట్టమనేని కృష్ణ
1942 మే31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. ఏలూరులో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం.


తేనె మనసులు’ సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం
ఘట్టమనేని కృష్ణ.. ‘తేనె మనసులు’ సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా అడుగు పెట్టారు. ఆ తర్వాత నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా మారారు. నిర్మాతల మేలు కోరే హీరోగా నిలిచిపోయాడు. ఆయనతో సినిమా చేస్తే తమకు ఎలాంటి ఢోకా ఉండదని భావించేవారు నాటి నిర్మాతలు. ఏదైనా పొరపాటు జరిగి సినిమా ఫ్లాప్ అయినా, తర్వాత సినిమాను ఉచితంగా చేసిన గొప్ప మనసున్న నటుడు కృష్ణ. ప్రస్తుతం వినిపిస్తున్న పాన్ ఇండియా సినిమాలను అర్థ శతాబ్దం కిందటే తెరకెక్కించి చూపించిన వ్యక్తి కృష్ణ. ఆయన నటించిన సినిమాలు అప్పట్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి. వసూళ్ల వర్షం కురిపించాయి.


కొత్త టెక్నాలిజీలను ప‌రిచ‌యం చేసిన న‌ట‌శేఖ‌రుడు
ఘట్టమనేని కృష్ణ.. జేమ్స్ బాండ్, కౌబాయ్, 70 ఎంఎం, ఈస్టమన్ కలర్ మొదలుకొని అత్యాధునిక సినిమాల వరకు ఆయన అన్ని రకాల టెక్నాలజీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. పద్మాలయ స్టూడియోన్ బ్యానర్ నిర్మించి ఎన్నో అద్భుత సినిమాలను తెరకెక్కించాడు. తన సొంత బ్యానర్ లో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా తీసి సంచనల విషయాన్ని అందుకున్నాడు. ఇప్పటికీ ఆ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దేశ చరిత్రలోనే తొలి యాక్షన్ కౌబాయ్ సినిమాగా ఈ చిత్రం నలిచింది. 1971లోనే ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలై అన్ని చోట్లా అద్భుత విజయాన్ని అందుకుంది. 70 MM సినిమాను పరిచయం చేసిన నటుడు కూడా కష్ణ కావడం విశేషం. ‘సింహాసనం’ సినిమాతో ఆయన ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. 1964 నుంచి 1995 వరకు.. ఏడాదికి 10 సినిమాలు చేసి ఏకంగా 300 సినిమాలు కంప్లీట్ చేశారు. 1972 కృష్ణ కెరీర్ లో ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఆయన నటించి 17 సినిమాలు విడుదలై రికార్డు సృష్టించాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ నటుడు ఏడాదిలో ఇన్ని సినిమాలు చేయలేదు
కృష్ణ సినిమా పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఆయన రాజకీయాల్లో కొంత కాలమే ఉన్నప్పటికి చాలా మందికి సన్నిహితుడిగా మారారు.


విరామం లేకుండా న‌టించిన ఏకైక న‌టుడు
సుమారు 45 సంవత్సరాలు, 1965 నుంచి 2009 వరకూ ఏ సంవత్సరమూ విరామం రాకుండా నటించిన ఏకైక హీరో కృష్ణ.
సుమారు 350 పైగా సినిమాలలో నటించిన మొదటి కథానాయకుడు కృష్ణ.
ఒకే నగరంలో ఒకే ఏడాది ఆరు శతదినోత్సవ చిత్రాలు అందుకున్న రికార్డు కృష్ణ పేరిట ఉంది. విజయవాడలో 1983లో ఆయన నటించిన ఆరు సినిమాలు వంద రోజులు ఆడాయి. ఇండియాలో మరే ఇతర హీరోకూ ఇటువంటి రికార్డు లేదు.
ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు విడుదల చేసిన కథానాయకుడిగా కూడా కృష్ణ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. 1972లో ఆయన నటించిన సినిమాలు 18 విడుదల అయ్యాయి.
ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో కూడా కృష్ణే. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్స్ చేశారు.
ఒకే దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేసిన రికార్డు తెలుగులో బహుశా కృష్ణదే అయ్యి ఉండొచ్చు. కె.యస్‌.ఆర్‌. దాసు దర్శకతంలో ఆయన 31 సినిమాలు చేశారు.
హీరోగా కృష్ణ 44 ఏళ్ళ పాటు సినిమాలు చేస్తే… అందులో 30 ఏళ్ళు సంక్రాంతికి ఆయన సినిమాలు విడుదల అయ్యాయి. కృష్ణను సంక్రాంతి కథానాయకుడు అనేవారు.
కెరీర్ మొత్తంలో వందకు పైగా దర్శకులతో కృష్ణ పని చేశారు. ఆయన 105 మంది దర్శకులతో సినిమాలు చేశారు.
కృష్ణతో పని చేసిన సంగీత దర్శకుల సంఖ్య 52!
విజ‌య‌నిర్మ‌ల‌తో 50 సినిమాలు
సతీమణి విజయనిర్మల కాంబినేషన్‌లో కృష్ణ 50 సినిమాలు చేశారు. ఆ తర్వాత జయప్రదతో ఎక్కువ సినిమాలు చేశారు. ఆమెతో 43 సినిమాల్లో నటించారు. అతిలోక సుందరి శ్రీదేవితో 31 సినిమాలు చేశారు.
లాస్ట్, బట్ నాట్ లీస్ట్… తెలుగు ప్రజలకు కృష్ణ అంటే ఎంతో అభిమానం. ఆయన పేరు మీద 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి. అదీ కృష్ణ రేంజ్.
సినిమాలు – వివ‌రాలు
తొలి సినిమా స్కోప్‌ సినిమా – అల్లూరి సీతారామరాజు
తొలి సినిమా స్కోప్‌ సాంఘిక సినిమా దేవదాసు
తొలి సినిమా స్కోప్‌ పౌరాణిక సినిమా కురుక్షేత్రం
తొలి సినిమా స్కోప్‌ జేమ్స్ బాండ్‌ మూవీ ఏజెంట్‌ గోపి
తొలి సినిమా స్కోప్‌ కౌబాయ్‌ సినిమా దొంగలదోపిడి
తొలి ఈస్ట్ మాన్‌ కలర్‌ సినిమా – ఈనాడు
తొలి 70 ఎంఎం సినిమా – సింహాసనం
తొలి డీటీయస్‌ సినిమా – తెలుగు వీర లేవరా
1972లో జైఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చాడు
984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్ళాడు. అదే సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ, కృష్ణ కలిశారు.1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ