దివికేగిన గాత్రరత్నం

2

(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
మధురగాయకుడు ఘంటసాల గారి కుమారుడు,రచయిత, డబ్బింగ్ కళాకారుడు రత్నకుమార్ (65)ఇకలేరు. ఈ ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల కోవిడ్ బారినపడి కోలుకున్న ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చింది. రత్నకుమార్ తెలుగు సహా తమిళ, మలయాళ, హిందీ, సంస్కృతం భాషల్లో సుమారు 1200 చిత్రాలకు గాత్రదానం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనువాద (డబ్బింగ్) కళాకారులకు ప్రవేశపెట్టిన నంది పురస్కారాన్ని తొలిసారిగా (సురేష్ మూవీస్ తాతామనవడు) అందుకున్నారు.జాగ్రఫీ డిస్కవరీ ఛానల్ కు ఏకధాటిగా ఎనిమిదిన్నర గంటలు డబ్బింగ్ చెప్పి (హైదరాబాద్) ఎమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, కెక్కారు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యారు. ఆయన కుమార్తె వీణ నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. డబ్బింగ్ కళాకారుడిగా.... చిన్నతనం నుంచే ఆకాశవాణి బాలల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ తరువాత అక్కడే కేంద్రంలో తాత్కాలిక ప్రాతిపదికపై అనౌన్సర్, ప్రొడక్షన్ సహాయకుడిగా పనిచేశారు. ఘంటసాల గారికీ ఆకాశవాణితో విడదీయలేని అనుబంధం ఉంది. 1940 దశకం ఆరంభంలో బాలాంత్రపు రజనీ కాంతరావు సహకారంతో ఘంటసాల ఆకాశవాణికి పరియమైన సంగతి తెలిసిందే. తనకూ ఆ వారసత్వం లభించిందని, ఎందరో మహానుభావుల పరిచయమై, ఎంతో నేర్చుకున్నానని చెప్పేవారు.తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న తనకు కోమలి కృష్ణారావు అనే కళాకారుడి ద్వారా డబ్బింగ్ అవకాశం కలిగిందని (1979) చెప్పేవారు.మొదటి చిత్రం కంచికామాక్షి వందరోజుల చిత్రం.అందులో తమిళనడుటు శ్రీకాంత్ కు డబ్బింగ్ చెప్పారు.

జీవీ అయ్యర్ నిర్మించిన శంకరాచార్య, రామానుజాచార్య, భగవద్గీత చిత్రాలకు గాత్రాన్నిచ్చారు. వాటికి తెలుగులోనూ డబ్బింగ్ చెప్పారు. శంకరాచార్య, రామానుజా చార్య పాత్రలకు,గీతలో శ్రీకృష్ణుని పాత్రకు గాత్రదానం చేశారు.అంబేద్కర్ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టిందని, తనకూ తృప్తినిచ్చిందని చెప్పేవారు. అయితే సినిమా విజయవంతంకాకపోవడం వల్ల ఆశించినంత గుర్తింపు రాలేదు.దూరదర్శన్ పౌరాణిక ధారావాహికలు రామాయణం, మహాభారతం, విశ్వామిత్ర (దాసరి నారాయణరావు) లలో ప్రధానపాత్రలకు తెలుగు, తమిళ భాషల్లో గాత్రదానం చేశారు. దాదాపు పదివేల భాగాలకు (ఎపిసోడ్స్)కు డబ్బింగ్ చెప్పారు. దేశవిదేశాలలో సంగీత విభా వరులు నిర్వహించారు.నేపథ్యగాయకుడు కావాలనుకున్నా అవకాశాలు రాలేదు. అంది వచ్చిన డబ్బింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

కొన్ని చిత్రాలలో నటించారు. డబ్బింగ్ కళాకారుడిగా తీరికలేని సమయంలో నటనకు అవకాశాలు వచ్చినా చేయలేకపోయారు. దర్శకుడు కావాలని ఉన్నప్పటికీ చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని నిజాయతీగా ఒప్పుకునేవారు. చేదు అనుభవం వందేమాతరం(టి.కృష్ణ) చిత్రంలో కథానాయకుడి పాత్రకు డబ్బింగ్ దాదాపు పూర్తయిన తరువాత తప్పించడం చేదు అనుభవం.నా గాత్రాన్ని అన్ని విధాలా పరీక్షించి, పరిశీలించిన తరువాతే డబ్బింగ్ కు పిలిచారు. చివరిలో ఎందుకు తప్పించారో తెలియదు.నేనూ కారణం అడగలేదు.వారూ చెప్పలేదు.అవకాశం తప్పిపోయిందనో, అవమానంగానో భావించలేదు. నా విలువైన సమయం వృథా చేసినందుకే బాధనిపించింది.ఆ తరువాత ఆ దర్శకుడు మరోసారి పిలిచినా సున్నితంగా నిరాకరించాను. ఆ సంస్థ నిర్మించిన ఏ చిత్రానికీ పనిచేయలేదు. జడ్జిమెంట్ లేని వారి దగ్గర,సమయం విలువ తెలియని వారితో పని చేయడం కష్టం. పనిచేయలేం అని చెప్పేవారు.

నాయ‌న‌మ్మ‌గారి పేరు
ఘంటసాల గారు తమ తల్లి రత్న‌మ్మ‌గారి పేరు రెండవ కుమారుడికి (రత్నకుమార్) పెట్టారు. వాస్తవానికి ఆయన పెద్ద కుమారుడికి (విజయకుమార్) ఆ పేరు పెట్టవలసి ఉందట. ఘంటసాల గారికి విజయా సంస్థతో ఉన్నఅనుబంధం కొద్దీ , సంస్థ పట్ల కృతజ్ఞ‌తతో ఆ పేరు పెట్టారని, తరువాతి సంతానమైన తనకు నాయ‌న‌మ్మ‌గారి పెట్టారని రత్నకుమార్ చెప్పేవారు. విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి నిర్మించిన షావుకారుచిత్రానికి సముద్రాల రాఘవాచార్యుల వారి సిఫార్సు మేరకు ఘంటసాల గారికి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.

(Author is a senior Journalist and good friend of Ghantasala Ratnakumar)

Dr Aravalli Jagannadha swamy

2 COMMENTS

  1. అయ్యో, ఘంటసాల రత్న కుమార్ లేరంటే క న్నీళ్ళు వస్తున్నాయి.వారి ఆత్మకు శాంతి కలగాలని
    ఆ భగవంతుని కి ప్రార్ధన
    యు.వి.రత్నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here