Sunday, December 10, 2023
HomeArchieveబుజ్జాయి…చ‌ద‌వ‌క‌పోయినా చ‌దివింప‌చేశారు

బుజ్జాయి…చ‌ద‌వ‌క‌పోయినా చ‌దివింప‌చేశారు

బాల సాహిత్యంపై అద్వితీయ ముద్ర‌
స్క్రిప్ట్ కార్టూన్ల‌కు ఆద్యుడు
ఇల‌స్ట్రేటెడ్ వీక్లీలో బొమ్మ‌లు వేసిన తొలి ఇండియ‌న్‌
డిటెక్టివ్ న‌వ‌ల‌లు, క‌విత‌లు, కార్టూన్లు…ఎన్నెన్నో
(వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)
బుజ్జాయి ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, డిటెక్టివ్ న‌వ‌లా ర‌చ‌యిత‌, అంత‌కు మించి బాల‌ల కామిక్ రైట‌ర్‌, డుంబు పేరుతో ఓ పాత్ర‌నే సృష్టించారు. స్ట్రిప్ కార్టూన్ల‌కు ఆద్యుడు. అంత‌కు మించి ఆయ‌న దేవుల‌ప‌ల్లి కృష్ణ శాస్త్రి త‌న‌యుడు. గురువారం రాత్రి 10.30గంట‌ల ప్రాంతంలో క‌న్నుమూశారు. ఆయన వ‌యసు 91. కొంత‌కాలం క్రితం చెన్నైలో ఆయ‌న‌తో ముచ్చ‌టించే అవ‌కాశం చిక్కింది. ఆ ముఖాముఖిని బుజ్జాయి అస్త‌మ‌యం సంద‌ర్భంగా వ్యూస్ పాఠ‌కుల‌కు అందిస్తున్నాం.

పెద్ద చెట్టు కింద మరో పెద్ద చెట్టు
పెద్ద చెట్టు కింద మరో పెద్ద చెట్టు
ఒక మహావృక్షం నీడలో మరో మహావృక్షం పెరగదంటారు. కాని బుజ్జాయి విషయంలో అది నూరు శాతం తప్పు. మర్రిచెట్టులాంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి నీడలో బుజ్జాయి అనే మరో మహావృక్షం విస్తారంగా వ్యాపించి నీడలో కూడా వృక్షం పెరుగుతుందని నిరూపించారు. కృష్ణశాస్త్రి గారి అబ్బాయిగా కాకుండా బుజ్జాయిగా, కామిక్‌ పితామహునిగా, పంచతంత్ర బొమ్మల సృష్టికర్తగా తన ప్రత్యేకతను నిలుపుకున్న మరో వృక్షం. సుమారు అరవై సంవత్సరాలుగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషలలో కొన్ని వేల కామిక్స్‌ వేసి నేటికీ పుట్టబోయెడి బుల్లి బుజ్జాయిలకు కూడా బుజ్జాయిగానే తెలుగునాట నిలిచిపోయారు.
ప్ర‌. మీ ఇంట్లో సాహిత్య వాతావరణం ఎలా ఉండేది?
బుజ్జాయి:
నాన్నగారు (దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, చలం, నండూరి, నార్ల… (వీరంతా వెంకటరత్నంనాయుడుగారి శిష్యులే) మా ఇంటికి వస్తుండేవారు. అందువల్ల గొప్పవారితో, సమకాలికులతో కలిసి తిరిగాను. విశ్వనాథ, రాయప్రోలు, నండూరి, కాటూరి (బావగారూ అని పిలిచేవారు) వీరంతా నన్ను అతి గారాబంగా చూసేవారు. అడవి బాపిరాజుగారు నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని బొమ్మలు వేసేవారు. అందువల్ల ఆయన ప్రభావం కొంత ఉందేమో తెలీదు. నాన్నగారి స్నేహితుడు జగన్నాథరావుగారు సుద్దతో బొమ్మలు వేసేవారు. ఆయన ప్రభావం కూడా నా మీద ఉంది. వారిని చూసిన తరవాత నాకు ఏదో ఒక కళలో స్థిరపడాలనే ఆలోచన వచ్చి ఉంటుంది.


ప్ర‌. ఏ వయసులో రంగులతో బొమ్మలు వేయడం మొదలుపెట్టారు?
బుజ్జాయి:
పదేళ్లు రాకుండానే వాటర్‌ కలర్స్‌తో బొమ్మలు వేశాను. నాకు అప్పట్లో రైలు ఇంజన్‌ డ్రైవర్‌ అవ్వాలనిపించేది. అది కూడా స్టీమ్‌ ఇంజన్‌ను నడపాలనేది నాకోరిక. మానాన్న నాకు బుక్, పెన్సిల్‌ ఇస్తే నేను స్టీమ్‌ ఇంజన్‌ బొమ్మే వేశాను.
కొన్నాళ్ల తరవాత లైన్‌ డ్రాయింగ్‌ వేయడం మొదలుపెట్టాను. మా బావ వింజమూరి ప్రభాకరం నాలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. నేను వేసిన వాటిలో నాకు న చ్చినవి వారపత్రికలకి పంపాను.
ప్ర‌. మొట్టమొదటిది ఎప్పుడు ప్రచురణకు నోచుకుంది?
బుజ్జాయి:
దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ స్థాపించిన ‘ఆంధ్రమహిళ’లో నా మొట్టమొదటి బొమ్మ ప్రచురితమయ్యింది. పాతిక రూపాయలు రెమ్యునరేషన్‌ ఇచ్చారు.1943 – 44 ప్రాంతంలో అది చాలా పెద్ద మొత్తం. ఆంధ్రపత్రిక వారు వ్యాసానికి రెండు మూడు రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అటువంటిది నా బొమ్మకు అంత రావడమంటే విశేషమే.


ప్ర‌. మీ జీవితంలో మలుపు ఎప్పుడు వచ్చింది?
బుజ్జాయి:
మేము కాకినాడ వాస్తవ్యులం. ఒకసారి పని ఉండి 1941 లో మద్రాసు వచ్చాం. అక్కడ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ జరుగుతోంది. మా మిత్రుల ప్రోద్బలంతో నా దగ్గరున్న బొమ్మలు అందులో పెట్టాను. నా చిత్రాలకి మూడు బహుమతులు వచ్చాయి. 1946లో మద్రాసుకి మకాం మార్చాం. అదే నా జీవితంలో పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. అప్పుడు నాకు పదిహేను ఏళ్లు . ఇంకా చదవడం రాదు. అప్పుడు ప్రతి పత్రికలోనూ ఎవరెవరివో కామిక్స్‌ వచ్చేవి. బొమ్మలు చూసేవాడిని. ఫ్రీ ఇండియా అనే వీక్లీలో ‘టార్జాన్‌’ కామిక్‌ చూసిన నాలో చెప్పలేని అనుభూతి. ఆ బొమ్మలు సినిమా చూస్తున్న అనుభూతి కలిగించాయి. వెంటనే ఒక కథ తీసుకుని నాకు నచ్చినట్టుగా బొమ్మలు వేసేశాను. ఎప్పటికయినా టార్జాన్‌ లాంటిది వేయాలనే ఒక కోరిక నా మనసులో బలంగా నాటుకుపోయింది.
ప్ర‌. కామిక్‌లు వేయడానికి ఏం చేసేవారు?
బుజ్జాయి:
నేను మా మేనమామ గాడేపల్లి సత్యప్రకాష్‌గారు ఇద్దరం కలిసి కౌబాయ్‌ సినిమాలు చూసేవాళ్లం. వాటి ప్రభావంతో కౌబాయ్‌ కథ సొంతంగా అల్లుకునేవాళ్లం. ఆయన క్యాప్షన్‌ రాస్తే, నేను బొమ్మలు వేసేవాడిని. అలా మేమిద్దరం కలిసి కామిక్‌లు మొదలుపెట్టాం.


ప్ర‌. మీరు వేసిన బొమ్మలను పత్రికలకు ఇవ్వడానికి నాన్నగారు సహకరించేవారా?
బుజ్జాయి:
బొమ్మలు బావున్నాయని అందరూ అనడం వల్ల ఏదయినా పత్రికకు ఇవ్వమని నాన్నగారిని అడిగాను. నాన్నగారు పీకల మీదకు వచ్చేవరకు ఏ పనీ చెయ్యరు. ఒకసారి ‘నవోదయ’’ ఎడిటర్‌ నీలంరాజు వెంకటశేషయ్య (తరవాత ఆంధ్రప్రభలో పనిచేశారు) గారికి నేనే స్వయంగా చూపించాను. ఆయనకు నేను వేసిన విధానం బాగా నచ్చి, ‘‘ఇది చాలా బావుంది. కథ మన దేశానికి సంబంధించినది వేస్తే మరింత బావుంటుంది, ’’ అన్నారు. ఆయన బావున్నాయని చెప్పినా కూడా మన దేశం కథ వెయ్యమనేసరికి కొంత నిరుత్సాహ పడ్డాను. ఈ లోపుగా పొలిటికల్‌ కార్టూన్స్‌ వేస్తే వాటిని ప్రతివారం పబ్లిష్‌ చేస్తానన్నారు. మా బావ సూచనలతో వేయడం ప్రారంభించాను. స్వతంత్ర (ఇంగ్లీషు వీక్లీ) లో కామిక్స్‌ చూసి కాపీ చేసి, బిఫోర్‌ ఇండిపెండెన్స్‌ నెహ్రూ, జిన్నా ఎలా ఉండేవారో ఊహించి ఆ చిత్రాలు వేశాను. అవి ఆయనకు బాగా నచ్చి వెంటనే ప్రచురించారు.
ప్ర‌. అప్పటికి మీ కోరిక నెరవేరిందనుకున్నారా?
బుజ్జాయి:
పొలిటికల్‌ కార్టూన్స్‌ వేస్తూ మరో సంవత్సరం గడిపాను. ఎలాగయినా సరే బొమ్మల కథ వెయ్యాలనే పట్టుదల నాలో బాగా పెరిగింది. ఇంతలో ఒక తెలుగాయన మద్రాసులో పుస్తకాల షాప్‌ పెట్టారు. వాళ్లబ్బాయి మా ఇంట్లోనే ఉండేవారు. ఆయన నన్ను ‘‘ఏం చేస్తుంటావు?’’ అని అడిగారు. ‘‘బొమ్మల కథలు వేయాలనే కోరికతో ఉన్నాను. వాటిని అచ్చు వేసే వాళ్లు లేక ఊరుకున్నాను’’ అని నా మనసులో ఉన్న విషయాన్ని ఆయన దగ్గర వ్యక్తపరిచాను. అచ్చు వేయడానికి ఆయన అంగీకరించారు. నెల రోజుల పాటు కదలకుండా కూర్చుని బొమ్మలు పూర్తిచేశాను.


ప్ర‌. కామిక్స్‌ వేయడంలో మీమీద ఎవరి ప్రభావమయినా ఉందా?
బుజ్జాయి:
నా మీద టార్జాన్, అరేబియన్‌ నైట్స్‌ ప్రభావం చాలా ఉంది. ‘బానిస పిల్ల’ కామిక్‌ వాటి ఇన్‌స్పిరేషన్‌తోనే వేశాను. నేను, మా మేనమామ 30 పేజీల పుస్తకం తయారుచేశాం. మూడు వేల కాపీలు వేశాం. అన్నీ త్వరత్వరగా అమ్ముడయిపోయాయి. అప్పటికి కూడా నాకు అక్షరాలు రాయడం చేతకాదు. నాన్నగారు మాత్రం ఏమీ మాట్లాడలేదు. కాని ఆయనతో స్నేహితులంతా ‘నీ కొడుకు నయం, పుస్తకం వేసేశాడు’ అని నన్ను ప్రశంసించారు.
ప్ర‌. మీకు మీ బొమ్మల విషయంలో ఎటువంటి కోరిక ఉండేది?
బుజ్జాయి:
బొమ్మల కథలు వారపత్రికలో చూసుకోలనేది నా బలమైన కోరిక. 1948లో అల్లాద్దీన్‌ వేసి, నాన్నగారికి చూపించాను. అది చూసి ఆయన సంతోషంగా, ‘ఇవి ఎవరికైనా చూపిసే,్త కిందపడిపోయి దొర్లి తీసేస్కుంటారు’ అన్నారు. నా అంతట నేను ఎవ్వరినీ అడగలేను. వాళ్లు కాదంటే నా మనసు కష్ట పెట్టుకుంటుంది. కాని అప్పుడు మాత్రం నేను బొమ్మలు పట్టుకొని నార్ల వెంకటేశ్వరరావుగారి దగ్గరకు వెళ్లాను. అప్పటికే నా పుస్తకానికి సంబంధించి హిందూ తదితర పత్రికలలో ‘ఇదో కొత్తప్రయోగం’ అని మంచి మంచి రివ్యూలు వచ్చాయి. ఇంక నన్ను నేను పరిచయం చేసుకోనక్కరలేదు. ఆ ధైర్యంతోనే నేను ఆయన దగ్గరకు వెళ్లాను. బొమ్మలు చూసిన వెంటనే చాలా బావున్నాయని మెచ్చుకున్నారు.
ప్ర‌. ఆయన ప్రచురించడానికి అంగీకరించారా?
బుజ్జాయి:
అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం పూర్తి అయింది. న్యూస్‌ ప్రింట్‌ చాలా కాస్ట్‌లీగా ఉండేది. నాలుగు పేజీలు వేసేవారు. మధ్యది ఎర్ర పేజీ. అందులో ప్రచురించడానికి నాకు చోటు లేదు. నా బొమ్మలు బాగా నచ్చి ఉండటం చేత నార్ల వారు, ‘పేపర్‌ దొరికితే త్వరలో మేం వీక్లీ పెడతాం. అప్పుడు తప్పనిసరిగా నీ బొమ్మలు ప్రచురిస్తాం’ అని మాట ఇచ్చారు. ఈలోపుగా దినమణి (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్, మూడున్నర లక్షలతో లార్జెస్ట్‌ సర్క్యులేటెడ్‌ డైలీ)కి వెళ్లమని సలహా ఇచ్చారు. ఏ పరిచయం లేకుండా వెళ్లడానికి మొహమాటం వేసింది. అందుకని నార్లవారే ఎడిటర్‌కి నా గురించి చెప్పిన తరవాత బొమ్మలన్నీ పుచ్చుకుని ఆయన దగ్గరకు వెళ్లాను. నన్ను ఎగాదిగా చూశారు. ‘మేం పబ్లిష్‌ చేస్తే మీకు రెమ్యునరేషన్‌ ఎంత కావాలి?’ అని ప్రశ్నించారు. ఎంత అడగాలో తెలీదు. ఎక్కువ అడిగితే ఆఫర్‌ పోతుంది, తక్కువ అడిగితే చులకనయిపోతాను, అని మనసులో అనుకుంటూ… ‘‘నార్ల గారు ఏది చెబితే అదే నాకు సమ్మతం’’ అన్నాను.
ప్ర‌. మీ మాటతీరును నార్ల వారు ఏమన్నారు?
బుజ్జాయి:
ఆయన చాలా సంతోషంగా, ‘నువ్వు బాగా ప్రవర్తించావు’ అని నన్ను ప్రశంసించారు. వెంటనే ఆ ఎడిటర్‌కి ఫోన్‌ చేసి, ‘పే స్టాండర్డ్‌ ప్రైస్‌’ అని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది.
ప్ర‌. దానికి ప్రచారం ఎలా ఇచ్చారు?
బుజ్జాయి:
కామిక్స్‌ రావడానికి ముందే సిలోన్‌ రేడియోలో, ‘ఇండియన్‌ నాలుగు రంగులలో వేసిన కార్టూన్స్‌ అతి త్వరలో’ అని అనౌన్స్‌మెంట్స్‌ ఇచ్చారు. ప్రచురించిన మొదటి వారాలలోనే అది బాగా పాపులర్‌ అయింది. స్నేహితులంతా పొగిడారు. సుమారు 14 వారాల పాటు నాపేరు వచ్చింది. ఇంక రెండు మూడు వారాలు ఉందనగా ఆ ఎడిటర్‌ ‘ఇంకేదయినా బొమ్మల కథ సిద్ధంగా ఉందా?’ అని కుతూహలంగా అడిగారు. ‘లేదు’ అన్నాను. ‘అలా అంటే ఎలా? వెంటనే కావాలి’ అని కొంచెం గట్టిగా అడిగారు. నాకు పట్టరాని ఆనందం, ఒకింత గర్వం కూడా అనిపించింది.
అలాద్దీన్‌ టైప్‌లో ‘రంజీత్‌’ అని పేరు పెట్టి వేసి ఇచ్చాను. అలా వారికి రకరకాల కామిక్స్‌ సుమారు 10 సంవత్సరాలు వేశాను. ఒక్క వారం కూడా నా బొమ్మ లేకుండా దినమణి లేదు.
ప్ర‌. నార్ల వారు మాట నిలబెట్టుకున్నారా?
బుజ్జాయి:
ఇచ్చిన మాట నిటబెట్టుకోవడంలో ఆయన తరవాతే ఎవరయినా అనిపించింది. ఎందుకంటే ఆయన ఒకరోజున ఫోన్‌ చేసి, ‘తరవాతి సంవత్సరం ఆంధ్రప్రభ వీక్లీ ప్రారంభిస్తున్నాం’ అని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మర్చిపోకుండా ప్రారంభానికి ఒక సంవత్సరం ముందుగానే నాకు ఫోన్‌ చేసి చెప్పడం ఆయనలోని సంస్కారమే అనిపించింది. అందులో కూడా సుమారు 10 సంవత్సరాల పాటు వేశాను. చాలా సీరియల్స్‌ కూడా వేశాను.


ప్ర‌. మీ ‘డుంబు’ గురించి…
బుజ్జాయి:
నాకు బాగా పేరు తెచ్చినది ‘డుంబు’. చాలామంది ఇళ్లలో వాళ్ల పిల్లలకి ఆ పేరు పెట్టుకున్నారు. అది బాగా పాపులర్‌ అవ్వడంతో డుంబు హిందీ భాషలో కూడా రావడం మొదలయ్యింది. ప్రతివారం ఒక కథ అయ్యేటప్పటికి తరవాతి వారం ఏ కథ వేయడం అనేది సమస్యగా అయిపోయింది? అలా ఖాళీ లేకుండా ఎన్నో కామిక్స్‌ వేశాను.
ప్ర‌. మీరు ఇంగ్లీషు ఎలా నేర్చుకున్నారు?
బుజ్జాయి:
ఇంగ్లీషు సినిమాలు బాగా చూశాను. పోస్టర్లు చదువుతూ ఇంగ్లీషు నేర్చుకున్నాను. రాయడం కూడా అలాగే నేర్చుకున్నాను. ఎట్టకేలకు నా కథలకి కాప్షన్స్‌ నేనే రాసుకున్నాను.
ప్ర‌. మలుపు తిప్పిన సంఘటన…
బుజ్జాయి:
1949 –58 లో చాలా బొమ్మలు వేశాను. బుజ్జాయి పబ్లికేషన్‌ అని స్థాపించి ఒక మంచి పుస్తకం వెయ్యాలనే ఉద్దేశంతోనే వాటిని ప్రచురించాను. అంతవరకు అలాంటి పుస్తకం తెలుగులో లేదు. ప్రతిమనిషి జీవితంలో ఒక మంచి– ఒక చెడు… చెల్లెలు 20 సంవత్సరాల వయసులో 1958 మేలో హైదరాబాద్‌లో మరణించింది. దాంతో విరక్తి వచ్చి కొన్ని నెలలు బొమ్మలు వెయ్యలేదు. అందరూ దెబ్బలాడారు. నన్ను నేను సంభాళించుకుని జూన్‌ – జూలై లో ‘పిల్లలు – పువ్వులు’ పుస్తకం తయారు చేశాను. 24 పేజీలు రెండు కథలు. ఆస్కార్‌ వైల్డ్‌ ‘సెల్ఫిష్‌ జెయింట్‌’ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత చెడ్డవారయినా పిల్లలు మారగలరు అనేది ఆ పుస్తకంలో ఉంది. దానికి బొమ్మలు వేసి కథ ప్రింట్‌ చేయించాను. పత్రికల్లో పడిన బొమ్మలన్నీ కలిపి ఒక పుస్తకంగా చేశాను. ఇవన్నీ కూడా ఆ నిర్వేదంలో చేసినవే. ఒక ఇంటర్వ్యూ ఉండి ఆకాశవాణి కేంద్రానికి వెడితే అక్కడ వారు నా పుస్తకానికి అవార్డు వచ్చిందని అభినందనలు తెలిపారు. 1959 లో ‘ఎంకరేజ్‌మెంట్‌ ఫర్‌ చిల్డ్రన్స్‌ లిటరేచర్‌’ అవార్డు తెలుగులో నా పుస్తకానికి వచ్చింది. 1960లో డుంబుకి , 1961లో విస్సా అప్పారావు గారు పిల్లల కోసం రచించిన ‘ఆకాశం’ అనే పుస్తకానికి అవార్డు వచ్చింది. దానికి బొమ్మలు నాతో వేయించారు. అలా వరసగా మూడేళ్లు అవార్డులు వచ్చాయి.


ప్ర‌. మీ చిరకాల వాంఛ ఏమిటి?
బుజ్జాయి:
నా బొమ్మలు ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో రావాలనేది నా చిరకాల వాంఛ. అది హై ప్రొఫైల్‌ వీక్లీ. ఫోటో గ్రేవియర్‌ మీద ప్రింట్‌ చేసేవారు. ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ ఎడిటర్‌ ఎన్‌.రామన్‌ గారు (1963లో) ఆయన్ని కలవమని మా నాన్నగారితో చెప్పారు. ఆ మాట వినగానే ఎగిరి గంతేసినంత పనిచేశాను. ఆయనని కలిసి బొమ్మలు చూపించబోగా, ‘నీ బొమ్మ నేను చూడక్కర్లేదు, ఇంతకు ముందే చాలా పత్రికలలో చూశాను. మా దాంట్లో సగం పేజీ ఇస్తున్నాను, నువ్వు చక్కగా వేసి పంపు’ అని చెప్పారు. వెంటనే ‘ఎలాంటి కథ కావాల’ని అడిగాను. ‘కాశీమజిలీ’ లాంటివి అన్నారు. అప్పుడు కథ అల్లి బొమ్మలు వేసి పంపాను. వారాలు గడుస్తున్నాయే కాని నా బొమ్మలు అందులో రాకపోగా, రెండు మూడు నెలల తరవాత తిరిగి వచ్చాయి. నాకు కోపం, బాధ రెండూ వచ్చాయి. ‘వారంతట వారే వచ్చి రాయమని అడిగారు. ఎందుకు నచ్చలేదో? బొంబాయి వెళ్లి తేల్చుకోవాల’నుకునేంతలో ఆయన దగ్గర నుంచే ఫోన్‌ వచ్చింది. నాలో అప్పటికే పట్టరానంత కోపం ఉండటంతో ఫోన్‌లోనే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను. దానికి ఆయన కోపం తెచ్చుకోకపోగా, ‘‘బుజ్జాయిగారూ! ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో మొట్టమొదట ఇండియన్‌ని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలవారు చదువుతారు. సౌత్‌ ఇండియన్‌ కథలా ఉండకూడదు. కాబట్టి రామాయణం, భారతం, పంచతంత్రం…లాంటివి వేస్తే బావుంటుంద’’ని సలహా చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకున్నాను. చాలెంజ్‌గా తీసుకుని మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేసి ఇస్తానని చెప్పాను. రాజాజీ భారతం, ఆర్థర్‌ రైడర్‌ పంచతంత్రం రెండు మూడు చాప్టర్లు చదివి రెండు రెండు పేజీల చొప్పున భారతం చాలా డిటెయిల్‌డ్‌గా, పంచతంత్రం చాలా నిర్లక్ష్యంగా వేసి పంపాను.


ప్ర‌. పంచతంత్రం అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు?
బుజ్జాయి:
అవి కేవలం నీతి చెప్పే చిన్న పిల్లల కథలనీ∙దాంట్లో ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ఉండదనే అపోహలో ఉండేవాడిని. అందుకే ఆ బొమ్మలు నిర్లక్ష్యంగా వేసి పంపాను. కాని ఆశ్చర్యం ఏంటంటే ఆయన పంచతంత్రం బొమ్మలే కావాలని ఫోన్‌ చేశారు. అంతేకాక ‘అక్కడ వాల్ట్‌ డిస్నీలా, ఇక్కడ బుజ్జాయి’ అని నాకో కాంప్లిమెంట్‌ ఇచ్చారు. వెంటనే బొమ్మలు వేసి వారికి పంపాను. ఎనిమిది వారాలపాటు దీని గురించి అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. 1963, ఆగస్టు 25న ప్రారంభం అయ్యింది. బాగా నేషనల్‌ ఫేమ్‌ వచ్చింది. పత్రిక సర్క్యులేషన్‌ పెరిగింది. ‘బ్లెసింగ్‌ ఇన్‌ డిస్గైజ్‌’ అంటే ఇదేనేమో అనుకున్నాను. పంచతంత్రం చదివే కొద్దీ ఇంత బావుంటుందా? అనిపించింది. అయిదు సంవత్సరాల పాటు నిరాఘాటంగా వేశాను.
ప్ర‌. మీరు సృష్టించిన క్యారెక్టర్స్‌ గురించి…
బుజ్జాయి:
నేను సృష్టించుకున్న నా క్యారెక్టర్స్‌ అన్నీ కల్లోకి వచ్చేవి. పంచతంత్రం అయిపోతోందంటే బాధ అనిపించింది. నా వాళ్లు నాకు దూరం అయిపోతున్నట్లు,చిన్నపిల్లాడిలా మూగగా రోదించాను. తరవాత 1986 – 90 మధ్యకాలంలో ఆంధ్రప్రభకి, దినమణికి,. 1991 – 97 మధ్యకాలంలో చందమామ ఇంగ్లీషు వెర్షన్‌కి పంచతంత్రం విడివిడిగా వేసి ఇచ్చాను. దీన్ని పుస్తకరూపంలో తేవాలనుకున్నాను. 250 పేజీలు కలర్స్‌లో వేయాలంటే బాగా ఖర్చు అవుతుంది. తరవాత వేయచ్చులే అని 35 ఏళ్లు కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టి ఉంచాను. అదృష్టవశాత్తూ మల్లాది సచ్చిదానందమూర్తి అనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌ 1998లో పంచతంత్రం 5 పుస్తకాలుగా వేశారు.

ప్ర‌. నార్ల వారు ఏం చేశారు?
బుజ్జాయి:
ఈ లోపు ఆంధ్రప్రభ లాకౌట్‌ అయ్యింది. నార్లవారు ఆంధ్రజ్యోతికి వెళ్లడం, నాకు కబురు పెట్టడం, నేను ఆయన దగ్గరకు వెళ్లడం, ఆయన నా సహాయం కోరడం..అన్నీ వరసగా జరిగిపోయాయి. తెలుగు వారపత్రికలలో మొట్టమొదటిసారి స్క్రిప్ట్‌ కార్టూన్‌ పద్ధతి ప్రవేశపెట్టారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో 1950లో గరీబ్‌ – శామ్యూల్‌ లాంటిది చూసి నన్ను వెయ్యమన్నారు. వెంటనే ‘‘పెత్తనం లేని పెత్తందారు’’ అని శీర్షిక పేరు పెట్టి నిత్య జీవితం మీద కామెంట్స్‌ వెయ్యడం ప్రారంభించాను. వెంటనే కొన్ని తయారుచేసి వాటిని ఆయనకు పంపితే ‘ఎక్స్‌లెంట్‌’ అన్నారు. ఆ రోజు ప్రారంభం అయిన నా కార్టూన్లు ఎనిమిదేళ్ల పాటు నిరాఘాటంగా ఆ దినపత్రికకి వేశాను.
ప్ర‌. మీకు బుజ్జాయి అనే పేరు ఎలా వచ్చింది?
బుజ్జాయి:
నా అసలు పేరు దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. ఇంట్లో మాత్రం బుజ్జాయి అని పిలిచేవారు. చిన్నప్పుడు బొమ్మల మీద అదే సంతకం పెట్టేవాడిని. అదే నిలబడిపోయింది.
ప్ర‌. పిల్లల కోసం మీరేమయినా చేశారా?
బుజ్జాయి:
పిల్లల పుస్తకాలు ప్రచురించడం కోసం ఒక సంస్థ స్థాపించి సుమారు 50 పుస్తకాలు వేశాం. నా జీవితంలో సుమారు 60 సంవత్సరాలు పిల్లలకోసమే చేశాను.
ఫెయిరీ టేల్స్, హ్యూమర్, భైరవి (కుక్క క్యారెక్టర్‌), డుంబు, వీరేశలింగం, ప్రకాశం పంతులు (బయోగ్రఫీలు) ఆంధ్రప్రదేశ్‌ మ్యాగజైన్‌కి చేశాను.
డిటెక్టివ్‌ కథలు – 20 వరకు
ఆంధ్రప్రదేశ్‌ దినపత్రికకి డైలీ స్ట్రిప్, పాకెట్‌ కార్టూన్‌
ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రభ విజయనగరం ఎడిషన్‌కి కన్యాశుల్కం బొమ్మలకథ
హిస్టారికల్‌ – చిత్తూరు పద్మిని, రాణా
పురాణాలు – మహాభారతం (స్వరాజ్యలో మూడున్నర ఏళ్లు), పిల్లల పుస్తకంగా రామాయణం
వైవిధ్యం ఉన్న బొమ్మలు – వందకి పైగా
ఆనందవికటన్, దినమణి కి 40 ఏళ్లు
ప్రభ, జ్యోతి, ఉదయం, ధర్మయుగ్, బెర్లిన్, కార వాన్, ఉమన్స్‌ ఇరా, ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ, పిల్లల పత్రిక పరాగ్‌ .
హిందీలో రెండు పత్రికలు…వీటన్నీటిలో కామిక్స్‌ వచ్చాయి.
(ర‌చ‌యిత 2018లో బుజ్జాయిగారిని క‌లిసిన‌ప్పుడు చేసిన ఇంట‌ర్వ్యూ ఇది. బుజ్జాయి అస్త‌మ‌యం సంద‌ర్బంగా ప్ర‌చురిస్తున్నాం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ