Tuesday, March 28, 2023
Homeటాప్ స్టోరీస్ఔషధ రంగంలో పేటెంట్ల రారాజు

ఔషధ రంగంలో పేటెంట్ల రారాజు

రివెర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో జనరిక్ రూపాల సృష్టి
ఎన్ఎస్ఈలో నమోదైన తోలి ఆసియా కంపెనీ
ఔషధ రంగంలో పెను సంచలనాల రెడ్డి
(డాక్టర్ ఏ. శ్రీనివాస్, అమరావతి)
ప్రముఖ వ్యాపారవేత్త, ఔషధ రంగంలో దిగ్గజం అంతర్జాతీయంగా పేరుగాంచిన రెడ్డి ల్యాబ్స్ సంస్థాపకుడు కె.అంజిరెడ్డి సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. కళ్ళం అంజిరెడ్డి, రసాయన శాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించి, ఐడిపిఎల్ లో ఉద్యోగంతో మొదలు పెట్టిన ఆయన వృత్తిరేఖ అంచెలంచలుగా ముందుకు సాగింది.
అందులో పెద్ద మలుపు 25 లక్షల రూపాయల పెట్టుబడితో 1984 లో ఆయన స్థాపించిన రెడ్డి ల్యాబ్స్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది. అనేకమందికి ఉపాధి కల్పించటమే కాకుండా భారతావనికి జీవనదాతగా రూపొందింది.
రెడ్డీస్ లాబ్స్ స్థాపన
ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన డా. రెడ్డీస్ ల్యాబ్స్ అంచెలంచెలుగా భారత దేశంలోనే రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.
ప్రాణాలను నిలిపే ఖరీదైన ఔషధాలను భారత్ లోనే తయారుచెయ్యటం కోసం నిరంతర పరిశోధనతో రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతిలో జెనెరిక్ రూపాలను రూపొందించి అనేక ఔషధాలకు (బల్క్ డ్రగ్స్ కి) పేటెంట్లను సంపాదించారు. భారతదేశ వాసులకు జీవన ప్రదాత అయ్యారు అంజిరెడ్డి. వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కి చేరుకున్న రెడ్డి ల్యాబ్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదైన మొదటి ఆసియా కంపెనీగా ఖ్యాతిగాంచింది.


పసుపు రైతు కుటుంబంలో జననం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో పసుపు రైతు కుటుంబంలో ఫిబ్రవరి 1 న జన్మించిన అంజిరెడ్డి వీధిబడిలో చదువుకుని, ప్రపంచ ఖ్యాతిని గడించే బహుళ జాతి సంస్థను స్థాపించే స్థితికి ఎదిగారంటే దీని వెనుక ఆయన దూరదృష్టి, కృషి, పట్టుదల ఎంత ఉన్నాయో ఊహించుకోవచ్చు.
ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్‌కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం… అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు చేయటం భారతదేశం నుంచి ఏ పారిశ్రామికవేత్తకైనా సాధ్యపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం డాక్టర్‌ కల్లం అంజిరెడ్డి. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు. ఒక మధ్యతరగతి పసుపు రైతు కుటుంబంలో జన్మించి, వీధి బళ్లో అక్షరాలు దిద్దిన ఆయన ఔషధ ప్రపంచాన్ని శాశించే స్థాయికి ఎదుగుతారని ఎవరూ ఊహించి ఉండరు. పరిశోధననే ప్రాణపదంగా ఎంచుకొని అవిశ్రాంతంగా శ్రమించి ప్రపంచానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ రూపంలో ఒక అరుదైన సంస్థను అందించిన డాక్టర్‌ అంజిరెడ్డి.
అమోఘమైన జ్ఞాపక శక్తి
చిన్నతనంలో పుస్తకాల పురుగుకాదు. ఆటపాటల్లోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు. కాకపోతే అమోఘమైన జ్ఞాపకశక్తి ఆయనకు ఉండేది. ఒక్కసారి చూసిన, విన్న విషయాన్ని మరచిపోయేవారు కాదు. అందుకే తన తోటి విద్యార్థులు పరీక్షల్లో తప్పితే, తాను మాత్రం మంచి మార్కులు కొట్టేసేవారు. ఉన్నత విద్యాభ్యాసం 1958లో గుంటూరు ఏసీ కాలేజీలో సాగింది. అక్కడి నుంచి ఫార్మాసూటికల్స్‌ కెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్య కోసం బాంబే విశ్వవిద్యాలయానికి వెళ్లారు. తర్వాత పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబరేటరీలో పీహెచ్‌డీ చేశారు. ఔషధ శాస్త్రవేత్తగా ఆయన రూపుదిద్దుకుంది అక్కడే. తర్వాత ఐడీపీఎల్‌లో పూర్తిస్థాయి ఔషధ నిపుణుడిగా తయారయ్యారు.


1984 లో రెడ్డీస్ కంపెనీ స్థాపన :
పలు కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో 1984లో రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ను స్థాపించారు. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతుల ద్వారా బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాణాధార ఔషధాలకు జనెరిక్‌ రూపాలను రూపొందించి, తృతీయ ప్రపంచ దేశాలకు ఆపద్బాంధవుడు అయ్యారు. బడా కంపెనీలతో పోటీపడి అనేక మందులకు పేటెంట్లు సాధించారు. రు.25 లక్షల పెట్టుబడితో మొదలైన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రు.వేల కోట్ల టర్నోవర్‌తో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజిలో నమోదైన తొలి ఆసియా ఫార్మా కంపెనీ ఇదే.
బడా కంపెనీల ఆధిపత్యానికి సవాలు
ర్యాన్‌బ్యాక్సీ, సిప్లా వంటి కంపెనీల ఆధిపత్యాన్ని అతితక్కువ సమయంలోనే సవాలు చేసే స్థాయికి ఎదిగారు. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. బిలియన్‌ డాలర్ల కంపెనీ గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించటం, విజయవంతమైన వ్యాపరవేత్తగా ఎదగటం అంత సులువైన విషయం ఏమీ కాదు. అది కూడా ఒక తరంలోనే. ఏదో సాదాసీదా కంపెనీ అంటే సరేకానీ బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని (రూ. 5,000 కోట్లకు పైనే) సంపాదించే స్థితికి ఎదగటం కొంతమంది వల్లే అవుతుంది.
అరుదైన వ్యక్తిత్వం
అంజిరెడ్డికి ఆలకించే గుణం ఎక్కువ. ఎక్కువగా మాట్లాడడమన్నా, ఎక్కువగా మాట్లాడే వారన్నా ఆయనకు ఇష్టం ఉండదు. చెప్పదలచిన మాటలు సూటిగా, స్పష్టంగా, పదునుగా చెప్పటం ఆయనకు అలవాటు.
ఔషధ మార్కెట్లో ఏదైనా అరుదైన ఘనత సాధించినప్పుడు విజయ గర్వం ఆయన మొహంలో దరహాసమాడుతుంది కానీ బయటకు అంతగా కనిపించినివ్వరు. అదేవిధంగా ఏదైనా అపజయం ఎదురుపడినప్పుడు కుంగిపోవడం అనేదే ఉండదు. కొన్ని ఔషధాల విషయంలో వైఫల్యం ఎదురైనా, కొత్త ఔషధాలను ఆవిష్కరించి ప్రపంచానికి అందించాలనే ప్రయత్నంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలినా, తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చినా కంగారుపడలేదు. మొండిగా ముందుకు వెళ్లటమే ఆయన నైజం. ఏదైనా విషయాన్ని వెంటనే గ్రహిస్తారు.


సేవా కార్యక్రమాలు
గ్రామీణ నిరుపేద యువకుల ఉపాధి శిక్షణ కోసం ల్యాబ్స్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 1998లో ప్రారంభించిన రెడ్డీస్ సంస్థ మొదటగా నాంది పౌండేషన్ ప్రారంభించి కొన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తోంది. రెడ్డీస్ అనుబంధ సంస్థ హ్యూమన్ అండ్ సోషియల్ డెవలప్మెంట్ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అవార్డులు
1984, 1992 సర్, పి.సి. రాయ్ అవార్డు
998 ఫెడరల్ ఆఫ్ ఏషియన్ ఫార్మాసూటికల్ అసోషియేషన్ అవర్డు
2000 కెంటెక్ పౌండేషన్ అచీవర్ ఆఫ్ ద ఇయర్
2001 బిజినెస్ ఇండియా మ్యాగజైన్ నుండి బిజినెస్ మ్యాల్ ఆఫ్ ద ఇయర్
2011 పద్మశ్రీ
2005 హాల్ ఆఫ్ ఫేం
2011 పద్మభూషన్.
అంజి రెడ్డి మార్చి 15, 2013 న అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఔషధ రంగంలో పేటెంట్ల రారాజు, తెలుగు రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి కంపెనీ సృష్టి, ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం దక్కడంలో ప్రధాన పాత్ర పోషించారు. (వ్యాస రచయిత అమరావతి మండలం మునుగోడు జిల్లా పరిషత్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ