చదువులలో మర్మమెల్ల “మరచితి” తండ్రీ

0

తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం
హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఇక ప్రత్యక్ష పాఠాలతో పాటు ఆన్లైన్ తరగతులు!
కరోనా థర్డ్ వేవ్ ముంగిట్లో తప్పదా ముప్పు
సమస్యల సుడిగుండంలో కరోనా చదువులు
(బండారు రామ్మోహనరావు, 98660 74027)

ప్రపంచవ్యాప్తంగా గత 20 నెలలుగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేసిందన్న సంగతి మరిచిపోయేలా మళ్లీ మార్కెట్ అంతా కళకళలాడుతుంది. సినిమా థియేటర్లతో సహా అన్ని కార్యకలాపాలు యధాలాపంగా సాగుతున్నాయి. ఈ స్థితిలో నేను ఈ మధ్య ఒక ఫంక్షన్ కు హాజరయ్యాను. జనం అప్పటికే మాస్కులు ధరించడం మర్చిపోతున్నారు. మాస్కు పెట్టుకున్నవాళ్లను విచిత్రంగా చూసే పరిస్థితి. ఎంతటి గాయం అయినా కాలమే మాన్పుతుందనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ ఫంక్షన్ లో తెలిసినవారు నన్ను పలకరించే క్రమంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుటుంబం నాకు ఎదురు పడి పలకరించింది. వాళ్ల ఇద్దరు చిన్నారులతో కలిసి నాకు ఎదురుపడ్డారు. తాతయ్యకు నమస్కారం చేయమని తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్పారు. పిల్లలు నమస్కారం చేసినప్పుడు వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేయడం మనకు అలవాటే కదా!. మొదటిగా నీ పేరు ఏమిటని ఆ పిల్ల వాడిని అడిగాను. ఆ పిల్లవాడు చెప్పిన పేరు నాకు వెంటనే అర్థం కాలేదు. మళ్లీ రెండోసారి అడిగాను. అప్పుడు కూడా ఆ అబ్బాయి చెప్పిన పేరు నాకు అర్థం కాలేదు. అప్పుడు తండ్రి జోక్యం చేసుకొని వాడి పేరు “సాయి శ్రేయాన్” అని స్పష్టంగా చెప్పారు. అప్పుడు నాకు చిన్నప్పుడు తెలుగు మాస్టారు చెప్పిన విష్వ‌క్సేనుడు” అనే మాట గుర్తుకు వచ్చింది. విష్వ‌క్సేనుడు అనడం, రాయడం అనేది మాకు అప్పటి పెద్ద పరీక్ష. విష్వ‌క్సేనుడు అనే పదాన్ని రాయడంతో పాటు పలకడం వస్తే తెలుగులో ఉత్తీర్ణులు అయినట్లే లెక్క. ఆ తర్వాత ఆ పిల్లవాడిని ఏం చదువుతున్నావని మరొక ప్రశ్న వేశాను.

ఆ పిల్లవాడు వెంటనే ఫస్ట్ క్లాస్ అని చెబుతూనే సెకండ్ క్లాస్ అని మాట మారుస్తూనే మళ్లీ గుర్తుకు వచ్చినట్టు కాదు కాదు ఇప్పుడు థర్డ్ క్లాస్ అన్నాడు. ఆ పిల్లవాడి జవాబు విని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెట్టున నవ్వారు. ఆ పిల్లవాడు సిగ్గుపడి షేమ్ గా ఫీల్ అవుతుంటే ఆ పిల్లవాడి తండ్రి నాకు ఇలా సర్ది చెప్పారు. కరోనా మహమ్మారి పద ఘట్టనల లో మా అబ్బాయి చదువు రెండేళ్లు నాశనమైపోయింది. అందుకే వాడు 20 నెలల క్రితం ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు ఆ తర్వాత రెండవ తరగతి మొత్తం స్కూలుకు పోలేదు. ఇక మూడవ తరగతి లోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు స్కూల్ మొహం చూడలేదు. కనుక వాడు గత జ్ఞాపకాలలో ఉన్నాడు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యాడని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన కరోనా చదువులకు ఇది ఒక మంచి ఉదాహరణ. పిల్ల వాళ్లను తాము ఏ క్లాసులో ఉన్నారో కూడా మరిచిపోయేలా ఈ కరోనా కష్ట కాలం గడిచిపోయింది.


చదువులలో మర్మమెల్ల మరచితి తండ్రీ
నాకు ఎదురయిన ఈ అనుభవంతో పురాణాల్లోని ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుత్ర వాత్సల్యంతో తన తొడ మీద కూర్చుండబెట్టుకొని “ఏమి చదివావురా తండ్రి” అని అడిగితే “చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ” అని ప్రహ్లాదుడు రాగయుక్తంగా సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు విష్ణు నామ స్మరణ చేయడం దాంతో హిరణ్యకశ్యపుడికి కొడుకు మీద కోపం రావడం అది వేరే సంగతి.కానీ నేటి ఆధునిక తల్లిదండ్రులు తమ పిల్లలను కూర్చుండబెట్టుకొని “ఏమి చదివావు రా తండ్రి” అని అడిగితే “చదువులలో మర్మమెల్ల “మరచితి” తండ్రీ” అని సమాధానం ఇస్తున్నారు. ఇది కొంచెం కఠినంగానే ఉన్నాకూడా జరుగుతున్నది వాస్తవం.


కరోనా ధృతరాష్ట్ర కౌగిలిలో నాశనమైన రెండేళ్ల చదువులు
2020 మార్చి 22 తర్వాత రెండు విద్యా సంవత్సరాలు నాశనమై పోయి ఇక ముచ్చటగా మూడో విద్యాసంవత్సరం లో మూడు నెలలు కూడా ఆవిరైపోయింది. సరిగ్గా 16 నెలల తర్వాత 2021 సెప్టెంబర్ 1 నుండి తెలుగు రాష్ట్రాలలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి జూనియర్ డిగ్రీ కళాశాలలు కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విధించిన ఆంక్షలను అమలు చేస్తూ ప్రారంభమయ్యాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ తోపాటు హాస్టల్స్ తెరుచుకోలేదు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందనుకుంటున్న తరుణంలో ఇలా పాఠశాలలు తెరవడం ప్రమాదకరమని కొందరు అంటున్నారు. ఎన్ని రోజులని ఇలా పిల్లలను స్కూలుకు పంపకుండా ఊరుకుంటామని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే పిల్లల చదువులు “కరోనా చదువులు” గా మారాయని ఇంకొందరు ఎద్దేవా చేస్తున్నారు. స్కూల్స్ ప్రారంభించడం అవసరమా?, కాదా? అనే చర్చ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఇందులో రెండు పక్కల కత్తికి పదును ఉన్నట్లు రెండు వాదనల లో కూడా వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ నెల పూర్తిగా వర్షాకాలం. సీజనల్ వ్యాధులు ముదిరే కాలం కూడా ఇదే గనుక స్కూళ్లు ప్రారంభించడం సరైంది కాదని తల్లిదండ్రులు అంటున్నారు.

అదీకాక వినాయక చవితి నుండి మొదలుకొని అక్టోబర్ లో వచ్చే దసరా, దీపావళి పండుగల సీజన్లో పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుందని అందరికీ తెలిసిందే. దీంతో కరోనా మూడవ దశ విజృంభిస్తుందని కూడా మరికొందరు అంటున్నారు. అదే కాకుండా సెప్టెంబర్ నెల లో గణేష్, నవరాత్రులు, అక్టోబర్ నెలలో దసరా నవరాత్రుల తో పాటు తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా ఉండడం వల్ల సెప్టెంబరు అక్టోబరు నెలలు పూర్తిగా జనసమ్మర్థం ఒక్క దగ్గర చేరుతారని దాంతో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభించే వీలు ఉందని కూడా ప్రజలు భావిస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి తన రూపాలు మార్చుకుంటూ బ్లాక్ ఫంగస్ నుండి మొదలుకొని కొత్తగా C.1, C.2 వేరియంట్లుగా మారి మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు చెబుతున్నారు. ఈ స్థితిలో పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి బడులకు పంపడం అవసరమా అని కూడా మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.


ప్రైవేటు స్కూల్లో ఫీజులు వసూలుకేనా?
ఇదంతా ప్రైవేటు బళ్ల వారు పిల్లల తల్లిదండ్రుల ముక్కుపిండి వేల, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందనే మరొక విమర్శ కూడా ఉంది. ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలు లెక్కచేయకుండా తగిన ఏర్పాట్లు చేసి బడులు తెరవాలని ఆదేశించింది. ఇప్పటికీ గత 16 నెలలుగా మూసి ఉన్న పాఠశాలలను సరైన విధంగా శానిటేషన్ చేయలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒకవేళ ఒకరిద్దరికి కరోనా మహమ్మారి సోకినా కూడా పిల్లలందరికీ చుట్టుకునే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
సమస్యల లోగిళ్ళు పాఠశాలలు
గత 18 నెలలుగా మూసి ఉండడంతో పాఠశాలల ఆవరణలో పిచ్చి మొక్కలు మొలిచాయి. సెప్టెంబర్ నెలలో కురిసే వాన లతో పాఠశాల గదులు వర్షపు నీటితో తడుతున్నాయి. మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. పాఠశాలలో ఇప్పటికీ మరుగుదొడ్లు శుభ్రం చేసే స్కావెంజర్స్ కానీ కనీసం బడిగంట కొట్టడానికి అటెండర్స్ గాని లేకపోవడం పెద్ద లోటు. అలాగే పాఠశాలల ఆవరణ లతోపాటు తరగతి గదులను శుభ్రం చేసే పని పంచాయతీ, మున్సిపాలిటీ శాఖలకు అప్పజెప్పారు. దీని వల్ల ఇటు పాఠశాల విద్యాశాఖ కు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలకు మధ్య సమన్వయం లేకుండా పోయింది. స్కూల్స్ తెరవకపోతే పిల్లల చదువులు నాశనమవుతున్నాయి అన్నది మీరేనని ఇప్పుడు తెరిస్తే మళ్లీ అభ్యంతరాలు పెట్టేది మీరే అని ప్రభుత్వాలు ఆక్షేపిస్తున్నారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందాన ప్రభుత్వం ముందు ఈ సమస్య గత సంవత్సరం గా నలుగుతూనే ఉంది. ఏదేమైనా ప్రభుత్వం పాఠశాలలు తెరిచింది. పిల్లలను బడికి పంపించే తల్లిదండ్రులు ఎంతమంది అనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది.

తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు ఏమి రాకపోయినా సరే కానీ పిల్లల ప్రాణాలు మాత్రం పణంగా పెట్టబోమని అంటున్నారు. ఇప్పటికే పాఠశాలను తెరిచిన రాష్ట్రాలలో అటు పిల్లలను ఇటు టీచర్లకు కూడా కరోనా వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. అదీకాకుండా దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల వయసు దాటిన వారిలోనే సగం మందికి ఇంకా వాక్సినేషన్ కార్యక్రమం పూర్తి కాలేదు. జీరో నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం టీకా కనుక్కోవడం ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఈ స్థితిలో మళ్లీ కరోనా మూడవ దశ మొదలైతే కష్టకాలమే అని అని పరిశీలకులు అంటున్నారు. పిల్లల కూడా టీకాలు ఇచ్చేవరకు ఆగితే ఈ విద్యా సంవత్సరం కూడా వృధాగా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు.ఇలా ఆలోచిస్తూ ఏదీ చేయకుండా ఉండే కన్నా ప్రమాదమైన ఆహ్వానిస్తూనే తమదైన రీతిలో పరిష్కారం సాధించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏదేమైనా పాఠశాలలను తెరవడం అనేది సాహసోపేత నిర్ణయమని ఇది సక్సెస్ కావాలంటే తల్లిదండ్రుల అంగీకారం ఉండాలని తెలిసిందే. పండగలు పబ్బాలు సెలవులు అయిపోయిన తర్వాత నవంబర్ 1 దాకా ఆగి పాఠశాలలు తెరిస్తే బాగుండేదని మరొక అభిప్రాయం కూడా ఉంది. ఏదేమైనా ప్రయోగ దశలో ఫలితాలు ఉండవనే విధంగా కరోనా నోట్లో, రోట్లో తల పెట్టాల్సిందే అని మరికొందరు అంటున్నారు. ఎటొచ్చి పిల్లలకు తల్లిదండ్రులకు ప్రభుత్వానికి ఇది ఒక చిక్కు ప్రశ్నకు జవాబు లేని ధర్మ సంకటం గా మిగిలిపోయింది. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ విశ్లేష‌కుడు)

Bandaru Ramamohanarao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here