మోడీ-స్టాలిన్ న‌డుమ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం?

0

కొవిడ్ స‌మీక్షలో ఆస‌క్తిక‌ర ఘ‌ట్టం
ప్రాంతీయ భాషాభిమానాన్ని చాటుకున్న త‌మిళ‌నాడు సీఎం
స్టాలిన్ వైఖ‌రిని త‌ప్పుప‌డుతున్న విశ్లేష‌కులు
ఇదెటు దారితీస్తుందోన‌ని చ‌ర్చ‌
(సుబ్ర‌హ్మ‌ణ్యం వి.ఎస్. కూచిమంచి)

త‌మిళుల ప్రాంతీయ, భాషాభిమానాలు మ‌రోసారి వెల్ల‌డ‌య్యాయి. అదీ మామూలు వేదిక‌మీద కాదు. సాక్షాత్తూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన కొవిడ్ స‌మీక్ష కార్య‌క్ర‌మంలో. దేశవ్యాప్తంగా కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌లు, తాజా ప‌రిస్థితులు, తీసుకోవాల్సిన మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు అంశంపై మోడీ సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కొంద‌రు ముఖ్య‌మంత్రుల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌గా, త‌మిళ‌నాడు మ‌ద్ద‌తు ప‌లికే ముఖ్య‌మంత్రులు ఆనంద‌ప‌డ్డారు. దీనికి సంబంధించిన ఒక పోస్టింగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


ప్ర‌ధాని మోడీ, త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో య‌ధాలాపంగా హిందీలో త‌న సంభాష‌ణ ప్రారంభించారు. ప్ర‌ధాని సంభాష‌ణ‌కు స్టాలిన్ త‌మిళంలో బ‌దులిచ్చారు. ఈ క్ర‌మంలో అప్ర‌మ‌త్త‌మైన మోడీ వెంట‌నే ఇంగ్లీషులో స్టాలిన్‌తో మాట్లాడారు. స్టాలిన్ త‌ద‌నుగుణంగా ఇంగ్లీషులో స‌మాధానం చెప్పారు. ఇక్క‌డ అంశం స్టాలిన్‌కు హిందీ వ‌చ్చా రాదా అనో లేదా మోడీ కావాల‌నే స్టాలిన్‌తో హిందీలో మాట్లాడారా అనో కాదు. సాధార‌ణంగా ప్ర‌ధాని హిందీలోనే ప్ర‌సంగిస్తారు. మాట్లాడేట‌ప్పుడూ హిందీలోనే మాట్లాడ‌తారు. అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో తాను మాట్లాడే వారికి అర్థ‌మ‌య్యే భాష‌లో మాట్లాడ‌తారు. మోడీ-స్టాలిన్ మ‌ద్య జ‌రిగిన భాష సంభాష‌ణ కొంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచింది.

మోడీ వ్య‌తిరేకుల‌కు ఆనంద‌ప‌రిచింది. ఇదిగో ఇలాంటి వారే ఆ అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని మోడీ ఏదో కంగుతిన్న‌ట్లు మార్చేశారు. స్టాలిన్ జ‌య‌కేత‌నం ఎగురేసిన‌ట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడేట‌ప్పుడు ఆయ‌న హిందీలో మాట్లాడి ఉండ‌వ‌చ్చు. అందులో త‌ప్పు లేదు. దానిని ఆధారంగా చేసుకుని స్టాలిన్ ప్ర‌ధానిని ఇరుకున పెట్టారంటూ వ్యాఖ్య‌లు పోస్టింగులు చేయ‌డం త‌ప్పు. ఈ విష‌యంలో ఎవ‌రూ స్టాలిన్‌ను సంప్ర‌తించిన‌ట్లు లేదు. ఉండుంటే ఆయ‌న స‌మాధానం మాత్రం చాలా హుందాగానే ఉండిఉండేద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు.


ఇటీవ‌లి కాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకుని మోడీ-స్టాలిన్ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతోంద‌ని ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఇవ‌న్నీ అవాంఛ‌నీయ‌, అవ‌మాన‌క‌ర పోక‌డ‌లు. త‌మిళుల‌కు భాషాభిమానం మెండు.. ఈ విష‌యం అంద‌రికీ తెలుసు. దానిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని విప‌రీతార్థాలు తీయ‌డం త‌గ‌దు. రాజ‌కీయాలంటేనే అంత అని స‌రిపెట్టుకుందామా! లేక మున్ముందు ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని అనుకుందామా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here