Saturday, December 2, 2023
Homeటాప్ స్టోరీస్గోల్‌మాల్ చేసి మోడీ ప్ర‌ధాని అయ్యాడు

గోల్‌మాల్ చేసి మోడీ ప్ర‌ధాని అయ్యాడు

తేదీ చెప్పండి ముంద‌స్తుకు వెడ‌దాం
బీజేపీకి తొడ‌గొట్టి స‌వాలు చేసిన కేసీఆర్
బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ఆ ధైర్యం ఉందా!
నిల‌దీసిన తెలంగాణ సీఎం
హైద‌రాబాద్‌, జూలై 10:
కొద్దికాలంగా సైలెంట్‌గా ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు మ‌రోసారి త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. దెబ్బ‌తిన్న బెబ్బులిలా గ‌ర్జించారు. బీజేపీపై బీభ‌త్సంగా విరుచుకుప‌డ్డారు. ప‌దునైన విమ‌ర్శ‌నాస్త్రాల‌తో, త‌న‌కే సొంత‌మైన ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు కుప్పించారు. రెండు గంట‌ల 22 నిముషాల పాటు సుదీర్ఘంగా సాగిన విలేక‌రుల స‌మావేశంలో బీజేపీని అన్ని రంగాల్లో తూర్పార ప‌ట్టారు.
కేంద్రంలోని బీజేపీ విధానాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో విపక్షాలకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? అంటూ సవాల్‌ విసిరారు. తేదీని ఖరారు చేస్తే అసెంబ్లీని రద్దు చేసి ముందుకెళ్దాం అని వ్యాఖ్యానించారు. దేశంలో గుణాత్మ‌క మార్పు రావాల‌ని, అవ‌స‌ర‌మైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టంచేశారు. దేశం ప్ర‌మాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోమ‌న్నారు. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాల‌న్నారు. జాతీయ రాజ‌కీయ స‌ర‌ళిలోనూ గుణాత్మ‌క మార్పురావాల‌న్నారు. అగ్నిప‌థ్‌ అనే స్కీం తెచ్చి బీజేపీ స‌ర్కారు దేశ యువ‌త భ‌విష్య‌త్‌తోపాటు దేశాన్ని ప్ర‌మాదంలో నెడుతున్న‌ద‌న్నారు. దేశం మీద ప్రేమ రావాలంటే సైన్యంలో క‌నీసం ఆరేళ్లైనా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. మ‌నది ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద‌ ఆర్మీ అని, అలాంటి సైన్యంతో బీజేపీ స‌ర్కారు ఆట‌లాడుతోంద‌ని మండిప‌డ్డారు. ఇండో చైనా బోర్డ‌ర్ ప్ర‌యోగ‌శాల కాద‌ని, దానితో దేశానికే ముప్పు అని త‌న‌కు మాజీ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్స్ చెప్పార‌న్నారు. ఇలాంటివి ఆలోచించ‌కుండా న‌రేంద్ర మోదీ స‌ర్కారు అగ్నిప‌థ్ అనే దిక్కుమాలిన స్కీం తెచ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు.


ఎనిమిదేళ్ళ‌లో ఒక్క హామీ నెర‌వేర్చారా!
ఎనిమిదేళ్ల‌లో బీజేపీ స‌ర్కారు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. తాము గెలిస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న‌ బ్లాక్‌మనీ మొత్తం వాప‌స్ తెస్తాన‌న్నార‌ని, ఇప్పుడు అది డ‌బుల్ అయ్యింద‌ని తెలిపారు. మోదీ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే విదేశీ బ్యాంకుల్లో మ‌న న‌ల్ల‌ధ‌నం రెట్టింపైంద‌ని మండిప‌డ్డారు. ఈ దేశానికి మాట‌లు చెప్పే ఇంజిన్ వ‌ద్ద‌ని, ప‌నిచేసే ఇంజిన్ కావాల‌న్నారు. బీజేపీ స‌ర్కారు చెట్టుపేరు చెప్పి కాయ‌లు అమ్ముకునే ర‌క‌మ‌ని విమ‌ర్శించారు. వీళ్లు హిందుత్వం పేరు చెప్పి రాజ‌కీయ ల‌బ్ధిపొందుతున్నార‌ని, వీరి గురించి కార్‌పాత్ర మ‌హారాజ్ అనే గురువు బుక్‌కూడా రాశాడ‌ని చెప్పారు.


కాశీలో రాజ‌కీయ క్రీడా..
కాశీ..హిందువుల‌కు ప‌విత్ర‌స్థ‌ల‌మ‌ని, త‌మ చివ‌రిద‌శ‌లో అక్క‌డే గ‌డ‌పాల‌ని అంతా అనుకుంటార‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. అలాంటి ప‌విత్ర స్థలాన్ని కూడా మోదీ త‌న రాజ‌కీయం కోసం వాడుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. న‌ట్టుబోల్టుల‌తో కాశీలో ఘాట్లు నిర్మించార‌ని, మ‌ధ్య‌గోపురం మెయిన్ పిల్ల‌ర్ ప‌డిపోయింద‌ని చెప్పారు. ఇదే విష‌యంపై ఉత్త‌ర భార‌త‌దేశంలో లొల్లి న‌డుస్తున్న‌ద‌న్నారు. న‌రేంద్ర మోదీజీ హిందూ సంస్కృతిని గౌర‌వించే విధానం ఇదేనా? అని ప్ర‌శ్నించారు. ఓట్ల కోసం చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.


క‌శ్మీర్ ఫైల్స్‌తో గోల్‌మాల్ రాజ‌కీయం
మొన్న‌టిదాకా క‌శ్మీర్‌ఫైల్స్ అనే సినిమాతో గోల్‌మాల్ రాజ‌కీయాలు చేశార‌ని, ఇప్పుడు క‌శ్మీరీ పండిట్లు రోజూ ధ‌ర్నా చేస్తుంటే కనిపించ‌డం లేదా? అని బీజేపీ స‌ర్కారును సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. మీ రాజ‌కీయ వికృత‌క్రీడ‌కోసం వారిని బ‌లితీసుకుంటారా అని ప్ర‌శ్నించారు. దేశ ఆర్థిక ప్ర‌గ‌తికి ప్ర‌ధానే గొడ్డ‌లిపెట్టు అయిత‌డా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రాల ప్ర‌గ‌తిని అడ్డుకుంట‌డా? అని నిల‌దీశారు. డ‌బుల్ ఇంజిన్ ఎందుకు సావ‌నీకా? గంగ‌లో పోనీకా? అని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ దేశానికి న‌రేంద్ర మోదీ ఒక్క మంచి ప‌న‌న్నా చేశారా? అని ప్ర‌శ్నించారు. జీడీపీ పోయింది.. రూపాయి ప‌డిపోయింది..నిరుద్యోగం పెరిగింది.. ఇవి వాస్త‌వాలు కాదా? అని అడిగారు. ఇంకా సిగ్గులేకుండా ఏక్‌నాథ్ శిందేల‌ను తెస్తామంటారా? అని మండిప‌డ్డారు. దేశప్ర‌జ‌లంతా దీన్ని వ్య‌తిరేకించాల‌ని పిలుపునిచ్చారు.


ప్ర‌మాదంలో దేశం
బీజేపీ పాల‌న‌లో దేశం ప్ర‌మాదంలో ఉంద‌ని, దీని ఆపాల్సిన బాధ్య‌త యువ‌త‌, మేధావులు, ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల‌దేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ రాజ‌కీయాల‌నుంచి బీజేపీని త‌న్ని త‌రిమేయాల‌ని పిలుపునిచ్చారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. తాను అడిగిన ఏ ఒక్క ప్ర‌శ్న‌కూ మోదీ వ‌ద్ద స‌మాధానం లేద‌న్నారు. మోదీ నుంచి స‌మాధానం రాద‌ని, ఎందుకంటే ఆయ‌న ద‌గ్గ‌ర స‌మాధానాలే లేవ‌ని య‌శ్వంత్ సిన్హా అన్నార‌ని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం మేధావిత‌త్వ‌మా? అని ప్ర‌శ్నించారు. రేపు మోదీ ప్ర‌భుత్వాన్ని మారుస్తామ‌ని, ఎల్ఐసీని అమ్మనివ్వ‌మ‌ని పేర్కొన్నారు. గుజ‌రాత్ మోడ‌ల్ డూప్లికేట్ అని, గోల్‌మాల్ చేసి మోదీ ప్ర‌ధాని అయ్యాడ‌ని చెప్పారు.


కార్పొరేట్ల‌కే లాభం
న‌రేంద్ర మోదీ పాల‌న‌లో కార్పొరేట్ల‌కు మాత్ర‌మే లాభం జ‌రిగింద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. మోదీ ఒత్తిడి వ‌ల్లే అత‌డి స్నేహితుడికి ప‌వ‌ర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చిన‌ట్లు శ్రీలంక ఎల‌క్ట్రిసిటీ బోర్డు అధ్య‌క్షుడే చెప్పార‌ని, ఇదే విష‌యంపై శ్రీలంక‌లో ప్ర‌స్తుతం అగ్గి ర‌గులుతోంద‌న్నారు. శ్రీలంక‌లో దేశం ఇజ్జ‌త్ పోతున్న‌ద‌ని మండిప‌డ్డారు. భార‌త ప్ర‌ధానిస్థాయి దిగ‌జారింద‌ని విమ‌ర్శించారు. దీనిపై ప్ర‌ధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడో చెప్పాల‌ని నిల‌దీశారు. ఈ అరాచ‌కాల‌ను, దుర్మార్గాల‌ను ఇంకా భ‌రిస్తే దేశం స‌ర్వ‌నాశ‌న‌మైత‌ద‌న్నారు. చెడ‌గొట్ట‌డం.. కూల‌గొట‌ట్డం ఈజీ అని, పున‌ర్మిర్మాణం క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు.


దేశంలో కొత్త పార్టీ రావొద్దా?
టీఆర్ఎస్ జాతీయ‌పార్టీగా మారితే త‌ప్పేముంది?.. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. టీఆర్ ఎస్ పెట్టిన‌ప్పుడు విమ‌ర్శించినోళ్లు ఇప్పుడేడున్న‌రు? అని అడిగారు. దేశ‌మేమ‌న్నా బీజేపీ నాయ‌బీజేపీ ఎవరిని ఉద్దరించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట్‌కు. కనీసం ఇవ్వాలన్న ఆలోచన వస్తదా? బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడన్న. రైతు చనిపోతే పది రూపాయలు ఇస్తరా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తిన్నది అరగక చస్తున్నరు అంటరు మీ ముఖ్యమంత్రులు. రైతులు ధర్నా చేస్తే జీబులు ఎక్కించి తొక్కి చంపుతున్నరు.. అహంకారమా? రైతులు 13 నెలల పాటు ఢిల్లీ రాజధాని బార్డర్‌లో ధర్నా చేస్తే ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు అంటరు మీరు. మీది పరిపాలనా? మీది ప్రభుత్వమా? ఎన్నికలు రాగానే మళ్లీ తలవంచి మాఫీ చాతాహు అని క్షమాపణ వేడుకుంటరు. ఉగ్రవాదులైతే ఎందుకు క్షమించమని అడిగారు? ప్రజలకు సమాధానం చెప్పాలి’ అంటూ మండిపడ్డారు.


మీరంటే ఎవరికి భయం..?
‘ఎవరు భయపడుతరు మీకు? మీతోటి ఏమైతది? మన్ను కూడా కాదు.. దొంగలకు భయం. తప్పులు చేసినోళ్లకు భయం. ఎవరిని భయపట్టిస్తరు? అధికారి ఎవరికి కావాలి? కేసీఆర్‌కా ఇసిరి పారేస్తాం. అంతులేని అహంకారం.. న్యాయ వ్యవస్థను సహించరు. ప్రజాస్వామికంగా గెలిచే వారిని సహించరు. ఎవరిని సహిస్తరు మీరు. ఏం చేద్దామనుకుంటున్నరు ఈ దేశాన్ని. అన్నింటా వైఫల్యమే కాదా? ఉద్యోగ కల్పన లేదు. నిరుద్యోగం పెరుగుతుంది. ధరలు పెరుగుతున్నయ్‌. గ్యాస్‌ 170శాతం పెరుగుతుంది. ఏ ప్రధాని సమయంలో లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగతయ్‌. ఉప్పులు పెరుగుతయ్‌.. పప్పులు పెరుగుతయ్‌. విదేశీ మారక నిల్వలు తరిగిపోతయ్‌. ఏది సక్కగనున్నది. జీడీపీ క్రాష్‌ అవుతది. ఏం ఉద్దరించారు ఈ దేశాన్ని. ఈ దేశానికి చేశామని ఏదో ఒకటి చెప్పండి’ అంటూ నిలదీశారు.


పీయూష్‌ గోయల్‌ కాదు.. గోల్‌మాల్‌..
‘కేంద్రంలో ఓ మంత్రి ఉన్నడు పీయూష్‌ గోల్‌మాల్‌. గోయల్‌ కాదు.. గోల్‌మాల్‌.. ఆయనో నెత్తిలేని సన్యాసి. ఎంత దరిద్రంగా మాట్లాడుతడంటే.. తెలంగాణ చమత్కారం చేసిందా? ఎలా సాధ్యమైంది అంటడు? పంట దాచిపెడుతారా? ఎన్ని ఎకరాల్లో ఉన్నదో తెలియదా? నేను చెప్పిన హెలికాప్టర్‌లో తిప్పి అధికారులు చూపిస్తరు. రైతులను అవమానించి మాట్లాడుతున్నరు. యాసంగి పంటలో మా దగ్గర టెంపరేచర్‌ ఎక్కువైతది జర నూకలు ఎక్కువైతయ్‌ అంటే.. మీరు నూకలు తినుంన్రి అంటడు. మీరు నూకలు తినాల్న తెలంగాణలో.. ఇంత అహంకారమా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది కేంద్రమంత్రి మాట్లాడే పద్ధతేనా? ప్రజలను అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. ‘మీరేమైనా పర్మినెంటా? ఎంత మంది రాలేదు.. ఎంత మంది పోలేదు. రావణాసురుడు పోయిండు.. దుర్యోధనుడు పోయిండు.. కంసుడు పోయిండు. నరకాసురుడు పోయిండు. అంతకన్న గొప్పొల్లా’ అంటూ ధ్వజమెత్తారు.


కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదని బీజేపీ కిసాన్‌ మోర్చానే చెప్పింది..!
‘నిన్నగాక మొన్న రాయ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ కిసాన్‌ మోర్చా సమావేశం పెట్టింది. మా కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు. రెండు మంత్రిత్వ శాఖలు వాణిజ్య శాఖ, వ్యవసాయశాఖకు అసలు సమన్వయమే లేదు. ఎప్పుడు ఎక్స్‌పోర్ట్స్‌ బ్యాన్‌ చేయాలో తెలియడం లేదు. ఎప్పుడు ఇంపోర్ట్‌ బంద్‌ చేయాలో తెలుస్త లేదు. తద్వారా రైతులను ముంచుతున్నరు. దేశాన్ని నాశనం చేస్తున్నరు అని చెప్పారు. ఇంకా తమాషా అంటే ఏమిటంటే.. హిందూ ఎన్‌. రామ్‌, ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌ ఎక్కడో ఊటిలో సమావేశం పెడితే వారిని నక్సలైట్లు అంటూ ఫొటోలు పెట్టారు.. ఇదెక్కడి అన్యాయం. మీరు ఎవరినీ వదలరా? జర్నలిస్టులు సైతం మీకు నక్సలైట్లు లాగా కనిపిస్తున్నారా? ఎక్కడి అన్యాయం ఇది.


ఇది ప్ర‌జాస్వామ్యాన‌కిఇ అలంకార‌మా!
మీకు కండ్లు ఎంత నెత్తికి వస్తున్నయ్‌ మీకు. బాహాటంగా చెప్పుకుంటడగా ఎవరైనా.. ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని.. మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏక్‌నాథ్‌ షిండేలు వస్తారని మాట్లాడుతారా? ఇది ప్రజాస్వామ్యానికి అలంకారమా? భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇంత ఘోరంగా హత్య చేస్తారా? మీరు ప్రజాస్వామ్య హంతకులుకారా? ఇదేం అన్యాయం. మీ ఉన్మాదం, పిచ్చి ఎక్కడి వరకు వెళ్తది. దేనికైనా ఒక లిమిట్‌ ఉంటది కదా? ఇంత అన్‌లిమిటెడ్‌గా.. ఇంత దుర్మార్గంగా సుప్రీం కోర్టు అంటే లక్ష్మం లేదు. జర్నలిస్టులంటే లక్ష్యం లేదు.. హైకోర్టు అంటే లక్ష్యం లేదు.. మెజారిటీతో గెలిచే గవర్నమెంట్‌ అంటే గౌరవం లేదు. మీకు ఎవరంటే గౌరవం ఉంది. మీరు ఏమైనా గొప్ప పని చేశారా? అంటే అది లేదు’ అంటూ సీఎం కేసీఆర్‌ బీజేపీ తీరును దుయ్యబట్టారు.


ఇప్పుడు వరిని ప్రోత్సహించమంటున్నడు..
‘ఇటు నీళ్లు ఇవ్వ చేత కాదు.. కరెంటివ్వ చేత కాదు.. పండించిన పంట కొనుమంటే చేత కాదు. మూడు నెలల కిందటనే కదా మేము పోయి ఢిల్లీలో ధర్నా చేశాం. ఎందుకు ధర్నా చేశాం? మా రైతులు వడ్లు పండించారు.. ఇది కొనుమంటే తప్పా? యాడ పెట్టుకోవాలే.. అంటడు ఈ పీయూష్‌ గోల్‌మాల్‌. ఇప్పుడేమంటడు వరిని ప్రోత్సహించండి, ధాన్యం తక్కువైంది అంటండు. మీకేమైనా తెలివుందా? మీకు గవర్నమెంట్‌కు పాలసీ ఉందా? ఓ మాటమీద ఉండే నిలకడ ఉందా? మీకో విజన్‌ ఉన్నదా? జాతీయ- అంతర్జాతీయ మార్కెట్‌పై అవగాహన ఉందా? ఏం జరుగుతున్నదో అంచనాలున్నాయా? ఏం లేదు అంతా
వట్టిదే డొల్ల. ఇవన్నీ కఠోరమైన సత్యాలు. చానా నీతి ఆయోగ్‌ మీటింగ్‌లలో స్పష్టం చెప్పాను. ఎవరైనా అద్భుతమైన ఫర్ఫామెన్స్‌ ఇచ్చే రాష్ట్రాలు ఉన్నయో.. వాటి ప్రగతిని ఆపకండి.. అది దేశ ప్రగతిని ఆపడమైతది’ అని చెప్పాను’ అంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కుల‌కు రాసిచ్చామా? అని ప్ర‌శ్నించారు. వీళ్లు దేశానికి చేసిందేంట‌ని నిల‌దీశారు. భార‌త‌దేశంలో కురిసే వ‌ర్ష‌పాతం ల‌క్షా 40వేల టీఎంసీల‌ని, న‌దుల‌నుంచి 70వేల టీఎంసీలు మ‌నం తీసుకోవ‌చ్చ‌న్నారు. ప్ర‌స్తుతం దేశం ఎత్తుకున్న‌ది 22వేల టీఎంసీలు మాత్ర‌మేన‌ని, మిగ‌తాదంతా స‌ముద్రంపాలే అవుతున్న‌ది సీఎం కేసీఆర్ వివ‌రించారు. ఇంత పెద్ద దేశంలో భారీ ప్రాజెక్టులు అవ‌స‌రం లేదా? అని ప్ర‌శ్నించారు.


జింబాబ్వే పాటి చేయ‌లేదా
జింబాజ్వేకు 6,500 టీఎంసీల రిజ‌ర్వాయ‌ర్ ఉన్న‌ప్పుడు మ‌న‌కు ఉండొద్దా? అని సీఎం కేసీఆర్‌ అడిగారు. ఎప్పుడూ ఏదో మూల క‌రువు వ‌స్త‌ది.. పిచ్చోళ్ల‌లాగా ఎర్రిమొహాలు వేసుకుని చూద్దామా? అని ప్ర‌శ్నించారు. భార‌త‌దేశ విస్తీర్ణం 83 కోట్ల ఎక‌రాల‌ని, 50శాతం అంటే 40 కోట్ల ఎక‌రాల వ్య‌వ‌సాయ అనుకూల భూమి ఉంద‌న్నారు. మ‌రి ఇక్క‌డ ప్ర‌పంచంలోనే ఉజ్వ‌ల‌మైన వ్య‌వ‌సాయం ఉండాలి క‌దా? అని అడిగారు. టీఆర్ఎస్ లాంటి స‌ర్కారు దేశంలో ఉంటే ప్ర‌తి ఎక‌రానికి నీళ్లు ఇవ్వొచ్చ‌న్నారు. ఇందుకోస‌మే కేసీఆర్ త‌ప‌న‌ప‌డుతుండు అని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికీ చేతులెత్తి మొక్కుతున్నా.. చెడుపై పోరాటం చేయండి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.


‘ఈ దేశాన్ని ఓ జలగలాగా పట్టిపీడిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. క్రియాహీనమైనటువంటి. నిష్క్రియాపరమైనటువంటి, అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోదీ ఆయన ప్రభుత్వం వారి జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలు అని హైదరాబాద్‌లో పెట్టారు. ఏమిరా ఏంటే ఏమీ లేదు. ఓ జాతీయ పార్టీ, దేశాన్ని పాలించే పార్టీ కార్యవర్గ సమావేశాలు పెడితే.. దేశమంతా ఎక్స్‌పెక్ట్‌ చేస్తది. హైదరాబాద్‌లో మనం కాదు.. ఎంటైర్‌ కంట్రీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తది. గతంలో వాళ్లు సాధించిన విషయాలు ఏకరువు పెట్టి చెబుతరు.


ఫలితాలు ఏంటీ ? దేశానికి కలిగిన ప్రయోజనాలు ఏంటీ ? భవిష్యత్‌లో విజన్‌ ఏంటీ ? ఏం చేయబోతున్నరు జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా సందేశం ఇస్తరు జాతికి. కానీ, అటువంటిది ఏమీ లేదు. సున్నా. జస్ట్‌ నథింగ్‌. ఆ ప్రధాని ఏం మాట్లాడిండో ఆ భగవంతునికి ఎరుక. ఆయనది ఆ కథ. ఆయనకు ముందు మాట్లాడిన మంత్రులు కేవలం కేసీఆర్‌ను తట్టి.. నోటిదూలను తీర్చుకొని పోయారు తప్ప.. ఏ విషయంలో ఏం చెప్పినట్లు లేదు. దాని తర్వాతనన్న ఏమైనా చెబుతున్నరా ? అని నాలుగు ఐదురోజులుగా చూస్తున్న’ అన్నారు.


భబ్రాజమానం.. భజగోవిందం..
‘రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యశ్వంత్‌ సిన్హా వచ్చారు. అనుకోకుండా కో ఇన్సిడెంట్‌గా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మా సమావేశం జరిగింది. నేను ప్రధానమంత్రిని కొన్ని ప్రశ్నలు అడిగా. స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా వీటికి సమాధానాలు చెప్పాలని అడిగా. ఆయన అవలంభిస్తున్న అవినీతి విధానాలు, దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు, బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రజలకు సంబంధించినటువంటి. వీటిపై అడిగినా ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మంత్రులు గానీ చెప్పలేదు. ఏం కారణం అనుకోవచ్చు మనం. అంటే ఏం లేదు. సరుకు లేదు.. సంగతి లేదు.. సబ్జెక్ట్‌ లేదు.. ఆబ్జెక్ట్‌ లేదు.. షుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు.. అంతా డబ్బా.. బబ్రాజమానం.. భజగోవిందం.


ఇంతకు మించి ఏమీ లేదు. చాలా మంది ఆశిస్తరు. ప్రజలందరినీ ఆశోపాతులను చేశారు. సరే తెలంగాణకు వారు చేసిందేమీ లేదు. వాళ్ల అయ్యేది ఏమీ లేదు. తెలంగాణ వచ్చిన నుంచి చేసింది ఏమీ లేదు. దేశానికి ఏం చేయాలే.. తెలంగాణకు ఆయింత ఏమీ చేయలేదు. కాబట్టి తెలంగాణకు గురించి చెప్పింది లేమీ లేదు. అంతా ఒకరకమైన బీటింగ్‌ అరౌండ్‌ బుష్‌ దాకా జరిగింది తప్పా. దేశ ప్రజల పక్షాన మేం లేవనెత్తిన ప్రశ్నలకు గానీ, సమాధానం చెప్పలేము.. మేం అశక్తులం అని వారొ డొల్ల తనాన్ని రుజువు చేసుకొని పోయారు. దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక అవగాహన వ్యూహం, ఓ దార్శనితక ఏం లేదని బీజేపీ రుజువు చేసుకున్నది.


రూపాయి ప‌త‌నానికి కార‌ణాల‌డిగాం…
అంతకు మించి ఏమీ లేదు. వాస్తవంగా సులభంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. నేను అడిగినా యశ్వంత్‌ సిన్హా సభలో.. ఏ దేశంలో పతనం కానీ రూపాయి.. భారత రూపాయి పతనమవుతుంది? కారణం ఏంటీ? నేను అడుగుతున్నా ఈ దేశంలో ఓ ముఖ్యమంత్రిగా’ అన్నారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పడిపోయింది. మోదీ హయాంలో ఇంత భారీగా పడిపోవడానికి గల కారణాలపై ప్రశ్నించామన్నారు. భారతదేశం రూపాయి విలువ ఇంత దరిద్రంగా రూపాయి విలువ పడిపోయిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది అవివేకమా? అసమర్థతనా? దీనికి దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?.. డబ్బాలో రాళ్లుపోసినట్లు అరచిపోతమంటే కుదరదు కదా?’ అంటూ మండిపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ