విశ్వ మానవుడు అంబేద్కర్

Date:

రాజ్యాంగ నిర్మాతకు కె.సి.ఆర్. ఘన నివాళి
జయంతి నాడు 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 13 :
కష్టంతో కూడుకున్న ఎంతటి సుదీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవడం ఖాయమని, ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితమే నిదర్శనమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.

వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు డా. బిఆర్ అంబేద్కర్ అని సిఎం కొనియాడారు.
ఆత్మన్యూనతకు, దుర్భలత్వానికి గురయ్యే ఆలోచనల్లో కూరుకుపోకుండా, గొప్పగా ఆలోచిస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్ అని సిఎం అన్నారు. సమాజంలో నెలకొన్న అజ్జానాంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి డా. బిఆర్ అంబేద్కర్ అని సిఎం కేసీఆర్ అన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో వారు పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టిన అంబేద్కర్ .. ప్రజాస్వామ్యం, వర్ణ నిర్మూలన, అంటరానితనం, మతమార్పిడులు, స్త్రీల హక్కులు, మతం, ఆర్థిక సంస్కరణలు, చరిత్ర, ఆర్థికవ్యవస్థ తో పాటు అనేక అంశాలపై చేసిన రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపచేశాయని సీఎం అన్నారు.

అసమానతలు లేని, ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు, సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్ అని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చి, నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ తన మేధస్సుతో మదించి సమకూర్చినవేనని సీఎం పేర్కొన్నారు.

ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని వారి జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టించడం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ను పొందుపరిచిన తెలంగాణ బాంధవునికి తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళిగా సిఎం పేర్కొన్నారు.

అంబేద్కర్ ఆశయాల కొనసాగింపులో భాగంగా దేశంలోనే మరెక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి ‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’ అనే పేరు పెట్టి అంబేద్కర్ ను సమున్నతంగా గౌరవించుకున్నామని సీఎం తెలిపారు.

అన్ని పథకాలతో పాటు సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని సిఎం అన్నారు.

దళితుల కోసం గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతి నిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, దళితులను ఎంటర్ ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో టిఎస్ ప్రైడ్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. అన్ని వర్గాలకు అందుతున్న పథకాలతో పాటు, దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా, వారికోసం ప్రత్యేకంగా తెచ్చిన ‘తెలంగాణ దళితబంధు’ పథకం దేశ చరిత్రలోనే విప్లవాత్మక పథకంగా మారిందన్నారు.

తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ. 10 లక్షల మొత్తాన్ని అర్హులైన లబ్దిదారులకు దళితబంధు ద్వారా అందించడంతో పాటు, భవిష్యత్ లో వారు ఎంచుకున్న వ్యాపారంలో ఒడిదుడుకులు సంభవించి, ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఆదుకునేందుకు ‘రక్షణ నిధి’ ఏర్పాటు చేసి వారికి భరోసానందిస్తున్నామన్నారు.
దశాబ్దాలుగా ఆత్మన్యూనతతో అసంఘటితంగా వున్న ఎస్సీ కుల సమాజం..దళితబంధు పథకంతో సమిష్టిగా, సంఘటితమౌతూ, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని సిఎం అన్నారు. ఇప్పటికే దళితబంధు పథకం లబ్ధి దారులు వారి వ్యాపారాల్లో సాధిస్తున్న విజయగాథలను తెలుసుకుంటుంటే తనకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నదని సీఎం అన్నారు.

చేయూతనందిస్తే తాము సమాజంలో ఎవరికీ తీసిపోమనే విషయాన్ని వారి విజయాలు రుజువు చేస్తున్నాయని అన్నారు. వారి విజయాలతో తెలంగాణలోని దళిత సమాజం భారతదేశానికే ఆదర్శంగా నిలవబోతున్నారని సిఎం స్పష్టం చేశారు. అదే సందర్భంలో రాష్ట్రంలోని సబ్బండ కులాలకు, మహిళలు, పేద వర్గాలకు అవసరమైన అందరికీ అన్ని రకాలుగా ఆసరాను అందిస్తూ అంబేద్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో దేశంలో దళిత సకల జనుల సంక్షేమానికి తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సిఎం పునరుద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...