పార్టీ పేరు షర్మిలకు లాభిస్తుందా?

0

రాజ‌కీయంగా ప్ర‌జామోదం సాధ్య‌మా!
ట్రంప్ కార్డ్‌లాంటి పేరును ఇలాగా ఉప‌యోగించాల్సింది
(ఆదిభ‌ట్ల రామ్‌ప్ర‌సాద్‌, 93480 06669)

ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ పేరు పార్టీ ఎదుగులలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పార్టీ పేరు ప్రజల ఆమోదాన్ని పొందటంలో కూడా ఎంతో కొంత సహాయ పడవచ్చు. బలమైన సెంటిమెంట్ తో పార్టీ పేరు ఉంటే మంచిది. ప్రజల మనోభావాలకు భావావేశాలకు అనుగుణంగా పార్టీ పేరు ఉండాలి. అప్పుడది పార్టీకి కలిసొచ్చే అంశం. పార్టీ కలకాలం నిలబడేందుకు ఊతమిస్తుంది. కీ.శే ఎన్టీఆర్ 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, యిదేం పేరని పెదవి విరిచిన వారు లేకపోలేదు. ప్రజల్లోకి పోయేలా పార్టీ పేరు లేదనే భాష్యాలు కూడా కొందరు చెప్పారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న తెలుగు ఆత్మగౌరవ నినాదంతో తెలుగు దేశం ఎవరి అంచనాలకూ అందనంతలా, బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ పేరు అయింది. 9 నెలల కాలంలో కనీవినీ ఎరుగని రీతిన ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టడానికి తేదేపా పేరు కొంతమేర తోడ్పడింది. చరిత్ర సృష్టించేందుకు సహాయ పడింది. అంటే సిద్ధాంతాలు,‌ ప్రణాళిక లు, లక్ష్యాలు గమ్యాలు చేపట్టేందుకు / ఏర్పరచుకునేందుకు పార్టీ పేరు కూడా ఎంతో కొంత స్పేస్ కల్పించాలి.


పార్టీ పేరు ఎలా ఉండాలి?
జెండా, ఎజెండా, ఎత్తుగడలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, విధానాలకు అనుగుణంగా పార్టీపేరు ఉంటే, పార్టీకి పార్టీ పేరు ఎసెట్ అవుతుంది. పార్టీ విజయానికి పార్టీ పేరు పరోక్షంగా దోహద పడుతుంది.
అందుకు భిన్నంగా విరుద్ధం గా ఉంటే ప్రతికూల ప్రభావం కూడా పార్టీ మనుగడ మీద భారీగానే ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి తనయ వై.యస్. షర్మిల, తెలంగాణా లో స్థాపించిన పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ. పొట్టిగా…. వైఎస్సార్ టిపి. పార్టీ ఎదగడానికి ఈ పేరు అనుకూలంగా ఉంటుందా? దోహదం చేస్తుందా? వైఎస్సార్ టీపీ అనే పేరు షర్మిల రాజకీయ జీవితానికి లాభం చేకూర్చే అంశం అవుతుందా? అని ప్రశ్నించుకుంటే, సమాధానాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి..


వైయ‌స్ఆర్ స‌మైక్య‌వాది
సహజంగా వైఎస్సార్ సమైక్య‌వాది. వైఎస్సార్ బ్రతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు అనేది అందరూ ఔననే నిజం. రెండు తెలుగు రాష్ట్రాల లోను మెజారిటీ ప్రజల భావన సుమారుగా ఇదే. తేడా ఏంటంటే ఓ రాష్ట్రంలో ఈ అభిప్రాయం పాజిటివ్ గా ఉఉటే , రెండో రాష్ట్రంలో ఈ భావం నెగిటివ్ గా ప్రజలలో పాతుకు పోయింది. నిజానికి రాష్ట్ర విభజనను వైఎస్సార్ గట్టిగా వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణను ఏ సందర్భంలోను ఏ విధంగాను సమర్ధించ లేదు వైఎస్సార్. అందుకే కొందరు తెలంగాణ వాదులు వైఎస్సార్ ను తెలంగాణ ద్రోహి అనడం యిప్పుడూ మనం వింటున్నాం. వైఎస్సార్ ను తెలంగాణకు కలిపి వైఎస్సార్ తెలంగాణ అనడం ఏమాత్రం ఔచిత్యం ? వైఎస్సార్ తెలంగాణ అనగానే వైఎస్సార్ ఆంధ్రా అనేది స్ఫురించదా? ఫలితంగా ఆంధ్రా భావజాల పార్టీగా తెలంగాణ సమాజం వైఎస్సార్ టీపీ ని చూసే అవకాశం ఉంది.
వైయ‌స్ఆర్‌ను వైయ‌స్సార్‌లానే చూడాలి
వైఎస్సార్ ను వైఎస్సార్ గా చూడాలి. చూడ గలగాలి. ప్రజలు వైఎస్సార్ ను వైఎస్సార్ గా చూసేలా పార్టీ ఉండాలి. అప్పుడు వైఎస్సార్ ఓ మహా శిఖర సమానంగా ప్రజలకు కనిపిస్తారు. ఓ మహోన్నత మూర్తిత్వంలా ఎంతో ఎత్తున వైఎస్సార్ అగుపిస్తారు. మహానేతను మహోన్నత స్థాయిలో చూడమనేలా, షర్మిల పార్టీ పేరు ఉంటే బాగుండేది. అప్పుడు పార్టీ పేరు షర్మిలకు ఏడెడ్ అనుకూలాంశం అయ్యేది. వైఎస్సార్ ఆశయాలను ఆయన విధానాలను ఓన్ చేసుకొన్న పార్టీగా షర్మిల పార్టీ ప్రజలకు అనిపించేది. కనిపించేది. ప్రజల మెప్పు పొంద గలిగేందుకు అవకాశం ఉండేది.


పార్టీ పేరులో భేదం

అందుకు భిన్నంగా ఆంధ్రా , తెలంగాణ అనే బేధం పార్టీ పేరులోనే, వైఎస్సార్ ను తెలంగాణకు ముడిపెట్టడం వలన అనవసర చర్చకు దారి తీస్తుంది. ప్రాంతాల వారీ భావనలకు వైఎస్సార్ ను ముడిపెట్టి, వైఎస్సార్ కీర్తి మసక పరిచేందుకు కారణమవుతుంది. వైఎస్సార్ ను సంకుచిత భావనలకు పరిమితం చేసినట్లు అవుతుంది. ఆదిలోనే అనవసర వాదాలకు వివాదాలకు, అనుమానాలకు, అవాంఛనీయ ధోరణులకు అవకాశం , పార్టీ పేరు ద్వారా షర్మిల తనే యిచ్చినట్టు అయ్యింది . సున్నితమైన ఆంధ్రా తెలంగాణ అనే ఇరుకిరుకు అంశాలను జోడించి వైఎస్సార్ ఇమేజ్ ను కుదించే ప్రయత్నానికి , షర్మిలే అంకురార్పణ చేసినట్టు అయ్యింది.


రాజ‌కీయంగా ప్ర‌జామోదం సాధ్య‌మా!
ఈస్థితిలో ఈ రకమైన భావనలు క్రమంగా పెరిగి పెద్దవైతే, షర్మిలకు రాజకీయంగా ప్రజామోదం లభిస్తుందా? ఫలాన రకమైన మైండ్ సెట్ ఉన్న పార్టీ అని వైఎస్సార్ టీపీ పార్టీ అనే బేడ్ ఇమేజ్ వచ్చే ఆస్కారం లేదా? సహజసిద్ధమైన తెలంగాణ సమాజం తాలూకా మనోభావాలు , విరుద్ధ భావనల మైండ్ సెట్ పార్టీ వైఎస్సార్ టీపీ అని భావిస్తే , పార్టీ భవిష్యత్తు ఏమిటి? ఫలితంగా పార్టీ పేరు షర్మిలకు రాజకీయంగా అవరోధంగా మారదా?
వైయస్ఆర్ పేరు ట్రంప్ కార్డే
నిజానికి షర్మిల తురుపు కార్డు అనుకుంటున్న వైఎస్సార్ కార్డు నిజంగా బలమైన ట్రంప్ కార్డే. అయితే వైఎస్సార్ అస్త్రం తాలూకా, వాడీ వేడీ పార్టీ పేరు తెచ్చే వ్యతిరేకత వలన సన్నగిల్లే అవకాశమూ ఉంటుంది. ఈ విషయం బాగా ఆలోచించాలి. పై అంశాలన్నిటినీ పరిశీలిస్తే, పార్టీ పేరు పెట్టడంలోనే, తెలీని ఏదో పొరపాటు షర్మిల చేసేరు ఏమో…. అనే భావన కలగటం సహజం. షర్మిల పార్టీ బలాలు, బలహీనతలు, భవిష్యత్తు ఇత్యాది విషయాలు మరోసారి మరో వ్యాసం లో.
ఏది ఏమైనా పార్టీ పేరు విషయంలో లోతైన అధ్యయనం షర్మిల చేసుంటే బాగుండేది. అయితే తెలంగాణ సమాజం ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనం యిప్పుడు చెప్పలేం . కాలమే చెప్పాలి. (వ్యాస ర‌చ‌యిత విశ్రాంత డైరెక్టర్, యూజీసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, విశాఖపట్నం)

Adibhatla Ramaprasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here