అంద‌రి క‌ళ్ళూ భ‌వానీపూర్‌పైనే…

0

మమత గెలుపును బీజేపీ ఆపగలదా?
దీదీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే
భ‌వానీపూర్‌పై రాజ‌కీయుల‌కు ఆస‌క్తి అంతంతే
(రమాప్రసాద్ ఆదిభట్ల, 93480 06669)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( దీదీ) భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తృణమూల్ ఎమ్మెల్యే సువేన్దేవ్ ఛటోపాధ్యాయ్ తన పదవికి రాజీనామా చేసిన కారణంగా భవానీ పూర్ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది . ఈనెల పదో తేదీ శుక్రవారం ఆలీపూర్ లోని సర్వే భవన్ లో దీదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 30 న భవానీపూర్ లో పోలింగ్ జరుగుతుంది. అదే రోజే పశ్చిమ బెంగాల్ లో మరో రెండు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అవి ప్రస్తుత సభ్యులు మరణీంచిన కారణంగా ఖాళీ ఏర్పడిన షంషేర్ గంజ్, ఘంజీపూర్ నియోజకవర్గాలు.
ప్ర‌త్య‌ర్థి ప్రియాంక టిబ్రూవాల్‌
దీదీ ప్రత్యర్ధిగా బాజాపా యువమోర్చా రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు, సుప్రీం కోర్టు న్యాయవాది ప్రియాంక టిబ్రూవాల్ బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. ఈమె 2014 లో భాజపాలో చేరారు. 2015 లో కోల్కతా మునిపల్ ఎన్నికలలో తృణమూల్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణ కమల సాహా చే్తిలో సుమారు 58,000 ఓట్ల తేడాలో ఓడిపోయారు. కోల్కతా హైకోర్టు లో దాఖలైన ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కేసు పిటీషన్ వేసిన వారిలో ప్రియాంక ఒకరు. ఆ కేసుని హైకోర్టు సీబీఐ కు అప్ప చెప్పింది. రాక్షస తృణమూల్ రాజ్యాన్ని అంత మొందిస్తానని, అప్రజాస్వామిక దీదీ పాలనను అంతమొందిస్తానని ప్రియాంక ప్రకటించారు కూడా .


అంచ‌నాల‌కు భిన్నంగా బీజేపీ ఎంపిక‌
అయితే గత ఎన్నికల్లో భవానీ పూర్ లో రెండో స్థానంలో ఉన్న రుద్రాణి ఘోష్ ను ఈ ఉప ఎన్నికలో భాజపా నిలబెడుతుందని పరిశీలకులు, రాష్ట్ర నేతలు భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా రుద్రాణి ఘోష్ ను భాజపా ఎందుకు పక్కన పెట్టిందో , ప్రియాంక కు ఎందుకు టికెట్ యిచ్చిందో కారణాలు యింకా తెలియాల్సి ఉంది.
దీదీ కంచుకోట భ‌వానీపూర్‌
దీదీ భవానీపూర్ నుంచి 2011 లో సుమారు 50 వేల మెజారిటీతో విజయం సాధించారు. 2016 లో
25 వేల మెజారిటీతో గెలుపొందారు. ఓ రకంగా భవానీపూర్ దీదీకి కంచుకోట అనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె భవానీపూర్ నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. ఎన్నికల ముందు తనతో విభేదించి, ప్రత్యర్ధి శిబిరం భాజపాలో చేరిన, ఒకప్పటి దీదీ సహచరుడు, నమ్మకస్తుడు సువేందు అధికారితో, అమీతుమీ తేల్చుకోవాలనే ఉద్దేశంతో, దీదీ నందిగ్రామ్ నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీదీ వ్యక్తి గతంగా ఓడిపోయినా, దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అందరి అంచనాలను తలదన్నుతూ, 294 స్ధానాలకు 213 స్థానాలు గెలిచి భారీ విజయాన్ని (హేట్రిక్) సాధించింది. 6 నెలల లోపు ఎన్నిక కావచ్చుననే ధీమాతో మూడోసారి ముఖ్యమంత్రిగా గత మే 5న ప్రమాణం చేసేరు దీదీ. అందుకే దీదీ యిప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
భవానీపూర్ లో పోటీ ప్రధానంగా దీదీ, ప్రియాంకల మధ్యనే ఉంటుంది. 3 వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్ని కలలో తృణమూల్ కు అనుకూలంగా పోటీ నుంచి తప్పుకుంది. ఇది దీదీకి అనుకూలాంశమే. గత ఎన్నికల్లో కాంగ్రెసు , సీపీఎమ్ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెసు బరి నుంచి తప్పుకోవటంతో లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా శ్రీజిబ్ బిస్వాస్ పోటీ చేస్తున్నారు. లెఫ్ట్ కూడా ఒంటరిగా పోటీ చేయడం వలన, దీదీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి, దీదీకే లాభం అవవచ్చు.


దీదీ సొంత ఇల్లు అక్క‌డే…
దీదీ ఇల్లు భవానీ పూర్ నియోజకవర్గం కాళీఘాట్ లో ఉంది. ఆ కారణంగా స్థానిక సమీకరణం కూడా దీదీకి కలిసి వస్తుంది. తృణమూల్ ను మూడోసారి అధికారం లోనికి రాకుండా చేయడానికి, గత ఎన్నికల్లో బాజపా ఎన్ని చేయగలదో అన్ని ప్రయత్నాలూ చేసింది. అయినా తృణమూల్ గెలుపుని బాజాపా ఆపలేక పోయింది. దీదీని ఓడించేందుకు యిప్పుడూ సర్వ శక్తులూ బాజపా ఒడ్డుతుంది . 6 నెలల లోపు ఎమ్మెల్యే గా ఎన్నిక కాకపోతే ముఖ్యమంత్రి పీఠం దీదీ వదలు కోవాలి. కాబట్టి దీదీ కూడా ఈ ఎన్నికను ఆషామాషీగా తీసుకోరు. పైగా దెబ్బతిన్న పులి కాబట్టి యీ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా దీదీ తీసుకుంటారు
కోల్‌క‌తా బీజేపీ వ‌శ‌మైనా….
మోడీ ఉధృతి ఎక్కువగా కనిపించిన 2019 పార్లమెంటు ఎన్నికల్లో, దక్షిణ కోల్కతా పార్లమెంటు స్థానాన్ని బాజపా గెలిచుకుంది. ఆ పార్లమెంటు పరిధి లోని భవానీ పూర్ అసెంబ్లీ సిగ్మెంట్ లో మాత్రం తృణమూల్ కే సుమారు 3 వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ భవానీపూర్ అసెంబ్లీ తృణమూల్ చేజిక్కించుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బాజపాకి 5 వేల ఓట్లు, 2014 లో 42 వేల ఓట్లు మాత్రమే భవానీపూర్ లో రావడాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఈ అంశాలన్నీ దీదీ కి కలిసి వచ్చేవే .
పైగా దీదీ మంత్రివర్గంలోని ముస్లిం మైనార్టీ మంత్రి ఫిరహాద్ హకీం , భవానీ పూర్ స్థానానికి రాజీనామా చేసిన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే సువేన్దేవ్ ఛటర్జీ , స్థానిక నాయకులు భవానీ పూర్ లో దీదీ తరపున ప్రచారం మొదలు పెట్టిన చాన్నాళ్ల వరకూ, భాజపా తన అభ్యర్థిని ప్రకటించక పోవడం కూడా దీదీకి అనుకూల అంశమే. ముఖ్యమంత్రే స్వయంగా అసెంబ్లీలో తమ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారనే సెంటిమెంటల్ పాయింట్ కూడా దీదీకి కలిసి వస్తుంది.


పెరిగిన బీజేపీ స్థానాలు
2016 ఎన్నికలతో పోలిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో సంఖ్య బాగా పెరిగి 77 స్థానాలు భాజపా గెలుచుకుంది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో, భాజపాకు వచ్చిన పార్లమెంటు స్థానాల నిష్పత్తి లెక్కన (ఒక పార్లమెంటు స్థానానికి ఏడు అసెంబ్లీ స్థానాలు) సరిపోయే సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు బాజపాకు రాలేదు. ఈ లెక్కన చూస్తే 2019 పార్లమెంటు ఎన్నికల కన్నా బాజపా బలం తగ్గిందనే వాదనా ఉంది.
భాజాపా అభ్యర్థి ప్రియాంక టిబ్రూవాల్ కు ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కేసులో, దీదీని ఎదుర్కొన్న ఇమేజ్ ఉంది . కేంద్ర‌ మంత్రి బాబుల్ సుప్రియోకి లీగల్ సలహాదారుగా చేసిన పేరు ఉంది. ఉన్నత విద్యా వంతురాలు. గత 6 ఏళ్ళు గా భాజపాలో వివిధ హోదాల్లో పనిచేసేరు. కేంద్రం కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా , దీదీని కట్టడి చేయడానికి పరోక్షంగా ప్రియాంకకు సహకారం అందిస్తుంది. ఇవీ భాజపా అభ్యర్థి ప్రియాంక అనుకూల అంశాలు.‌
పోటీ ఆస‌క్తిక‌ర‌మే
రాజకీయాల్లో డక్కాముక్కీలు తిని, హేమాహేమీలను సైతం మట్టి కరిపించిన, రాజకీయ ఫైర్ బ్రాండ్ దీదీని తట్టుకుని ప్రియాంక నిలదొక్కుకో గలరా? దీదీపై గెలవ గలరా ? భవానీ పూర్ గత ఎన్నికల ఫలితాల సరళి/ దీదీ అప్రతిహత విజయాల తీరూ…. పరిశీలిస్తే కష్టమే అని చెప్పక తప్పదు.
పైగా తృణమూల్ నాయకుడు, అధికార ప్రతినిధి తపన్ రాయ్ ఇలా వ్యాఖ్యానించేరు. భాజపా కేంద్ర నాయకులందరినీ యిక్కడకు రమ్మన మనండి. వాళ్ళలో ఎవరో ఒకరిని భవానీ పూర్ నుంచి పోటీ చేయమనండి. ఫలితాల రోజున వాళ్ళు (బాజపా వాళ్ళు) రికార్డు మెజారిటీతో
ఓడిపోవడం ఖాయం‌ అని అన్నారు. తపన్ రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దీదీ గెలుపు మీద తృణమూల్ కి ఉన్న ధీమాని చాటుతున్నాయి.
ఏతావాతా భవానీ పూర్ లో దీదీ గెలుపు నల్లేరు మీద నడకేనని, మెజారిటీ ఎంత అనేదే తేలాల్సిన విషయమని పరిశీలకులు అంటున్నారు.
అయితే అక్టోబర్ 3న భవానీ పూర్ కౌంటింగ్ జరుగుతుంది . సాధికారిక ఫలితం కోసం మనం అక్టోబర్ 3 వరకు ఆగాల్సిందే. (వ్యాస ర‌చ‌యిత విశాఖ యూజీసీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ రిటైర్డ్ డైరెక్ట‌ర్‌)

Adibhatla Ramaprasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here