Thursday, November 30, 2023
Homeటాప్ స్టోరీస్కాంగ్రెస్, బిజెపి పాలనలో మార్పే లేదు: కేసీఆర్

కాంగ్రెస్, బిజెపి పాలనలో మార్పే లేదు: కేసీఆర్

నాందేడ్, మార్చి 26 : భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ విజయవంతమైంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహ లో ఆదివారం జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సభా స్థలి జనసంద్రాన్ని తలపించింది. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహ పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను.. అక్కడి వారి మరాఠా భాషలో వీడియో డాక్యుమెంటరీల రూపంలో చూసి, సభకు హాజరైన ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు.


సిఎం కేసీఆర్ కు మరాఠా ప్రజల నీరాజనం : దేశ ప్రధాని కావాలని నినాదాలు
బిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంధార్ లోహ ప్రాంత ప్రజలు నీరాజనాలు పలికారు. హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణానికి వెలుతున్న సిఎం కాన్వాయ్ కి మూడు కిలోమీటర్లు ప్రజలు భారీ సంఖ్యలో దారి పొడవునా నిలబడి అభివాదం చేస్తూ కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ఉన్న బస్ , కాన్వాయ్ పై దారి పొడవునా గులాబీ రంగు పేపర్లు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ సెల్ ఫోన్లలో కేసీఆర్ గారిని వీడియో తీసుకోవడానికి పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బస్ లో నుండి ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అభివాదం చేస్తూ వెళ్ళారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సభా స్థలిలో ప్రజలు లేచి నిలబడి అభివాదం చేశారు. ‘దేశ్ కీ నేతా కేసీఆర్ , అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో సభాస్థలి మార్మోగిపోయింది.
‘‘దేశ్ కీ నేతా కైసే హోగా … సిఎం కేసీఆర్ జైసే హోగా’’…అంటూ ఈ దేశానికి సిఎం కేసీఆర్ ప్రధాని కావాలని ముక్త కంఠంతో మరాఠా ప్రజలు నినదించారు.


రైతుల ప్రస్తావనపై విశేష స్పందన
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల గురించి మాట్లాడినప్పుడు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. జై బిఆర్ఎస్ – జై కిసాన్ నినాదాలతో సభా స్థలి ప్రతిధ్వనించింది. రైతన్నలు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో హోరెత్తిస్తూ… బిఆర్ఎస్ తోనే ‘రైతు రాజ్యం’ సాధ్యమంటూ ముక్తకంఠంతో నినదించారు. కేసీఆర్ సారథ్యంలోని బిఆర్ఎస్ పార్టీ దేశపాలన పగ్గాలను చేపట్టాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు. తెలంగాణ ప్రజలకు అందుతున్నట్టే తమకూ ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, తాగునీరు రావాలంటే..తమకూ బిఆర్ఎస్ ప్రభుత్వం కావాల్సిందేననే భావన అక్కడి ప్రజల్లో ఈ సందర్భంగా వ్యక్తమైంది.


మరాఠా మహనీయులకు ఘన నివాళి
సభా వేదికకు చేరుకున్న సీఎం కేసీఆర్, వేదికమీద ఏర్పాటు చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అన్నా బాహు సాతే, మహాత్మా ఫూలే, అహిల్యాబాయి హోల్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.


బహిరంగ సభలో.. ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీలు, మధుసూదన చారి, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, షకీల్ అహ్మద్, బిఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్, బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హిమాంశు తివారి, ఒడిషా బిఆర్ఎస్ నాయకుడు అక్షయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దీపక్ అథ్రమ్, మాజీ ఎంపి హరిబన్ రాథోడ్, టిఎస్ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు అమృత్ లాల్ చౌహాన్, భాస్కర్ గుడాల, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రసంగంలోనే ముఖ్యాంశాలు
• ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన ఈ పవిత్రభూమకి నేను నమస్కరిస్తున్నాను
• వేదికను అలంకరించిన నాయకులు, తెలంగాణ నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాందేడ్ నలువైపుల నుంచి వచ్చిన ప్రజలకు నా వినమ్రపూర్వక నమస్కారాలు.
• నిన్న కొందరు వ్యక్తులు పశ్చిమ మహారాష్ట్ర నుంచి వచ్చారు. ‘‘మీరు పలుమార్లు నాందేడ్ వెళ్తున్నారు..కానీ, షోలాపూర్ కు రారా’’ అని నన్ను అడిగారు. నేను తప్పకుండా వస్తానని చెప్పాను.


• నాందేడ్ ప్రజల ప్రేమ నన్ను ప్రతీసారి ఇక్కడికి వచ్చేలా చేస్తున్నది. మీరు కనబరుస్తున్న ప్రేమ కారణంగానే నేను మరోసారి ఇక్కడికి వచ్చాను.
• ఈ సభకు వచ్చే ప్రజలను నిరోధించేందుకు… మేకలను కోస్తూ దావత్ లు ఇస్తూ కుట్రలు చేస్తున్నారు. ప్రజలను ఈ సభకు రాకుండా నిరోధిస్తున్నారు.
• రైతులు తుఫాన్ లా విజృంభించినప్పుడు, ఇలాంటి కుట్రలు పనిచేయవు
• గతంలో నేను నాందేడ్ కు వచ్చినప్పుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు..‘‘ మీరు తెలంగాణలో పనిచేయండి. ఇక్కడ మీకేం పని’’ అని నన్ను అన్నారు.
• నేను భారత పౌరుణ్ణి. భారతదేశంలోని ప్రతీ రాష్ట్రంలో నాకు పనుంది అని చెప్పదలుచుకున్నాను
• ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు స్పష్టం చేయ దలుచుకున్నాను.
• ఒకటి…తెలంగాణ మోడల్ ప్రకారం రైతులకు ప్రతి ఎకరానికి రూ. 10,000 లు పంట పెట్టుబడిగా అందించాలి.


• రెండు… రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత్ విద్యుత్ ను అందించాలి
• మూడు… రైతులకు తెలంగాణలో ఇచ్చినట్టు ఉచితంగా సాగునీరు అందించాలి
• నాలుగు… రైతులు ఏదైనా కారణంతో మరణిస్తే రూ. 5 లక్షల బీమా పరిహారం అందించాలి
• ఐదు.. రైతులు పండించిన పంటలను తెలంగాణలో ఒక్కో గింజను కొన్నట్లుగా ప్రభుత్వమే కొనాలి.
• దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ పనులు చేస్తానని హామీ ఇస్తే.. నేను మహారాష్ట్రకు రావడం మానేస్తాను. వీటిని అమలు చేయండి చాలు. లేకపోతే ఇక్కడికి వస్తూనే ఉంటాను. రైతులతో కలిసి వారి హక్కుల కోసం పోరాటం చేస్తాను.
• దళితులు, గిరిజనులను వారి సమస్యలకు వాళ్ళను ఇంకెన్నాళ్ళు వదిలేస్తాం ?


• దళితుల ఉద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం తెచ్చింది. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్నది. వారి ఇష్టానుసారం పనులు చేసుకోవచ్చు.
• మహానీయుడైన అంబేద్కర్ పుట్టిన గడ్డ మహారాష్ట్ర . మీరు ఇక్కడ దళితబంధు పథకాన్ని అమలు చేస్తే నేను మహారాష్ట్ర పర్యటనకు మళ్ళీ రాను. ఈ పథకాన్ని అమలు చేసే వరకు నేను వస్తూనే ఉంటాను.
• నేను ఈ విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞతకే వదిలేస్తున్నాను. వారు ఏం చేయగలరో, ఏం చేయలేరో నేను తర్వాత చూస్తాను.
• కొన్ని విషయాలు మీకు వివరిద్దామని నేను వచ్చాను


• దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఎన్నో పార్టీలు మారినయ్. ఎన్నో ప్రసంగాలు విన్నం. ఎందరో ముఖ్యమంత్రులయ్యారు. ఎందరో ప్రధానులయ్యారు. ఎందరో ఎమ్మెల్యేలయ్యారు. ఎందరో ఎంపీలయ్యారు.
• కొందరు గెలుస్తారు. కొందరు ఓడుతారు. మొఖాలు మారుతున్నయ్. పార్టీలు మారుతున్నయ్. కానీ మన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదు.
• నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
• గతంలో జరిగిన నాందేడ్ సభలోనూ నేను ఇదే విషయాన్ని చెప్పాను. మీరు నా మాటలను ఇక్కడే వదిలి వెళ్ళకండి. నేను చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని మీ మీ ఊళ్ళకు వెళ్ళాక చర్చించండి. ముఖ్యంగా మేధావులు, చదువుకున్నవారు, యువత, అమ్మలు, అక్కలు ఈ విషయం పై చర్చిచండి. చర్చించాక మీరు నిర్ణయం తీసుకోండి.


• దేశానికి స్వాతంత్య్రం వచ్చాక గత 75 సంవత్సరాల కాలంలో …. విపి సింగ్, చరణ్ సింగ్, మోరార్జీదేశయ్, దేవెగౌడ తప్పించి.. మిగతా 70 సంవత్సరాల కాలంలో 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 16 సంవత్సరాలు బిజెపి పార్టీ పాలన చేపట్టాయి.
• ఈ పార్టీల పాలన కాలంలో మీకు ఏమైనా మార్పు కనిపించిందా.?
• ఆయా పార్టీలు, పార్టీ నాయకుల్లో మార్పులు నమోదయ్యాయి కానీ ప్రజల జీవితాల్లో మార్పు కనిపిపించిందా?
• దయచేసి ఆలోచించండి .. నేను రాజకీయాలు మాట్లాడటం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు నిజమా కాదా గుండెపై చేయి వేసుకొని ఆలోచించండి.


• కాంగ్రెస్, బిజెపి పార్టీల పాలనలో ఏదైనా తేడా కనిపించిందా? ఏం తేడా లేదు.
• వాళ్ళను గెలిపించండి.. వీళ్ళను ఓడించండి … .అంటూ అనుకుంటే ఏం లాభం ? తాళం చెవి ఎక్కడ ఉంది. ఓటు రూపంలో మన చేతుల్లోనే ఉంది కదా.. చూపిద్దాం మన శక్తి ఏంటో..
• మరో రెండు విషయాలు చెప్తాను.
• అమెరికా, చైనాతో పాటు ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం భూ విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలు, ఇందులో 41 కోట్ల ఎకరాలు వ్యవసాయయోగ్య భూమి ఉంది.
• భారతదేశం అదృష్టం బాగుంది. ఇక్కడ కావాల్సినంత ఎండ ఉంటుంది. కావాల్సినంత వర్షం కురుస్తుంది.వాతావరణం బాగుంటుంది. ఇక్కడ మామిడి పంట పండుతుంది. ఆపిల్ పంట కూడా పండుతుంది.


• భారతదేశానికి సమృద్ధిగా మానవ వనరులున్నాయి. భారతదేశ జనాభా 140 కోట్లు.
• మన పిల్లలు చూస్తూ చూస్తూ బర్గర్లు తింటున్నారు. విదేశీ కంపెనీల షాపులకెళ్లి బ్రెడ్డు తింటున్నారు. వ్యవసాయ దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకుంది ?
• నేను హైదరాబాద్ నుండి వచ్చేప్పుడు, నాందేడ్ లో దిగి హెలికాప్టర్ లో వచ్చేప్పుడు చూస్తే కింద నేలంతా ఎండిపోయి కనిపిస్తున్నది. ఎందుకు ? మనకు తగినన్ని నీళ్ళు లేవా ?
• మంచినీళ్ళ కు సంబంధించి విషయాలను ప్రతీ వ్యక్తి, రైతు, రైతునేత మనస్సులో పెట్టుకోవాలి.


• భారతదేశంలోని 41 కోట్ల ఎకరాల భూమికి సాగునీటిని అందించేందుకు అవసరమైన నీళ్ళు ఈ దేశంలో అందుబాటులో ఉన్నాయి.
• దేశంలోని నదుల్లో 75 వేల టిఎంసిల నీరు ప్రహహిస్తున్నది. ఇందులో కేవలం 19 వేల టిఎంసిల నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. మిగతా 50 వేల టిఎంసిల నీరు మన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల అందరి కళ్ల ముందు ప్రవహిస్తూ సముద్రాల్లో కలుస్తున్నది.
• మహారాష్ట్రలోని ఎన్నో ప్రాంతాల్లో త్రాగేందుకు నీరు లభించదు. సాగునీరు లభించదు. మరింకేం లభిస్తుంది?
• నీటి కోసం అమెరికాను అడగాల్సిన అవసరం లేదు. రష్యాను ప్రాధేయపడాల్సిన పని లేదు. చైనా దేశం కడుపులో తలపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేదు.


• మనకు దేవుడు, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సంపద ఉన్నది.
• అవసరానికి మించి నీళ్ళున్నా కూడా మన దేశ రైతు సాగునీటి కోసం ఎందుకు తహతహలాడుతున్నాడు. ఈ ఒక్క విషయం గురించి ఆలోచించండి చాలు. మిగతా విషయమంతా మీకు అర్థమైపోతుంది.
• నీళ్ళు లేకుంటే వేరు. వాళ్ళను అడుక్కుంటే అది వేరే విషయం. కానీ నీరు అవసరానికి మించి ఉన్నా ఈ అగత్యం ఎందుకు ?
• సముద్రాల్లో కలుస్తున్న నీటిని నివారించి మన దేశాన్ని పచ్చగా చేసుకోవాల్సిన అవసరం ఉందా లేక మన జీవితాలు ఇలాగే ఉండాలా ?
• మీకు నీళ్ళు కావాలా వద్దా ? పక్కాగా మీకు నీళ్ళు కావాలా ?


• నీళ్ళు ఇస్తలేరు గానీ ప్రసంగాలు ఇస్తున్నారు. ప్రసంగాలు ఇస్తే మైకులు పేలిపోతాయ్. విని విని మనం చక్కరొచ్చి పడిపోతాం.
• ఎన్ని జెండాలు… ఎంతమంది నాయకులు… ఓట్ల సమయంలో ఎలాంటి విన్యాసాలు…. ?
• కరెంటును ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ?
• నీరు అవసరానికి మించి ఉందా లేదా అనే విషయం తెలుసుకోండి.
• ఒకవేళ ఉందని మీరు అవగాహనకు వస్తే మీరంతా కలిసి నాతో ఉద్యమించండి. మొత్తం నీళ్ళన్నీ భూమి పైకి వస్తాయ్. ప్రతీ ఎకరానికి నీళ్ళందించే బాధ్యత నాది.


• ఎంత కావాలంటే అంత విద్యుత్ ను అందించేందుకు మహారాష్ట్ర సహా దేశమంతా ప్రకృతి ప్రసాదించిన 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. వీటి ద్వారా దేశమంతటికి 125 ఏళ్ళు … 24 గంటల పాటు విద్యుత్ అందించవచ్చును. విద్యుత్ ను ఎందుకు అందించలేకపోతున్నారు. ?
• ప్రభుత్వాన్ని మనం చందమామనో, నక్షత్రాలనో, బంగారు ముక్కలనో అడగటం లేదు కదా ?
• దేవుడు నీళ్ళను ప్రసాదించాడు గానీ మధ్యలో మనిషి ప్రతిబంధకంగా మారాడు. దేవుడు బొగ్గు వనరులను ప్రసాదించాండు గానీ మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ప్రజలు ఆ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రతిబంధకాలుగా మారారు. ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోండి చాలు.
• గతంలో ఒక్కసారే నేను నాందేడ్ కు వచ్చాను. నేను వచ్చీపోగానే రైతుల అకౌంట్లలోకి ఆరు వేల రూపాయలు వచ్చిపడ్డాయి. గులాబి జెండా శక్తిని మీరు అర్థం చేసుకోండి. అంతకుముందు ఆ సొమ్ము మీకు ఎందుకు రాలేదు. ఏదో నిప్పు మీద నీళ్ళు జల్లినట్టు ఆ ఆరు వేల రూపాయలు మనకెందుకు ? అవసరం లేదు. మనకు ఎకరానికి రూ. 10 వేలు పంట పెట్టుబడిగా కావాలి. కావాలా … వద్దా ?
• లోహ.. సభ వేదికగా నేను రైతన్నలకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను.


• 75 సంవత్సరాలుగా నిరంతరంగా రైతన్నలు చేస్తున్న పోరాటం ఇంకా కొనసాగుతునే వున్నది.
• హర్యానా భూమి పుత్రుడు చోటురామ్ గారి కాలం నుండి, మహేంద్ర సింగ్ టికాయత్ గారి కాలం నుండి, బెంగుళూరుకు చెందిన ప్రొఫెసర్ నంజుండ స్వామి కాలం నుండి, ఇక్కడ శరత్ జోషి కాలం నుండి మనం ఎన్ని పోరాటాలు చేశాం ?
• అశోక్ నవ్లే గారి నేతృత్వంలో రైతులు నాసిన్ నుండి ముంబాయి వరకు పది వేల మంది పాదయాత్ర చేపట్టారు.
• అహ్మద్ నగర్ కు చెందిన దశరథ్ సావంత్ కాకా 84 సంవత్సరాల వయస్సులోనూ ఇంకా పోరాడుతూ ఉన్నారు.
• ఉల్లిగడ్డకు మద్దతు ధర గురించి, చెరుకు పంటకు మద్దతు ధర గురించి, ఇతర పంటల మద్దతు ధరల గురించి ప్రతీ యేడు మనం ఎందుకు పోరాటం చేయాల్సి వస్తోంది ?
• ప్రతీ సంవత్సరం మనం రోడ్లపైకి ఎందుకు రావాల్సి వస్తోంది ?
• ఈ ఒక్క విషయం గురించి మీరు ఆలోచించండి చాలు.
• రైతన్నలు రోడ్డెక్కుతుంటే… మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎక్కడ పడుకుంటున్నారు?
• నాది ఒక్కటే విన్నపం… మీరు జీవితకాలం పోరాడుతూనే ఉంటారా ?
• పోరాడేందుకే మనం పుట్టామా… ఎందాకా పోరాడుతాం ?
• భారత రాష్ట్ర సమితి కిసాన్ సెల్ అధ్యక్షుడు, హర్యానా కురుక్షేత్రకు చెందిన గుర్నామ్ సింగ్ చడూని గారి పై వంద కేసులు పెట్టారు. రైతులు నిరంతరంగా 13 నెలలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా 750 మంది రైతులు మరణించారు.
• ఈ రోజు నా హృదయంలో ఉన్నది మీరు మీ హృదయంలోకి స్వాగతిస్తే దేశానికి సందేశం వెళ్తుంది.
• నేను ఏ బాధతో చెప్తున్నానో, అదే బాధ మీ మనస్సులో పుడితే మన లక్ష్యం నెరవేరుతుంది. మన రైతులకు మేలు జరగాలని నేను భావిస్తున్నాను.
• 750 మంది రైతులు మరణిస్తే దేశ ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదు.
• కానీ ఎన్నికలు వస్తే మాత్రం కథ వేరుగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో ఎన్నికలు వస్తే తీయ తీయటి మాటలతో రైతులకు క్షమాపణ చెప్పాడు మన ప్రధాని. మనం పిచ్చివాళ్ళం. అబద్దపు కథలు విని తిరిగి ఓట్లు వేశాం. ఏమైనా ఫలితం వచ్చిందా ?
• మనం ఏకమైనప్పుడు, మన లక్ష్యం కోసం ఉద్యమించినప్పుడు, మనం బలం చూపినప్పుడు నిప్పు మీద నీళ్ళు జల్లినట్టుగా డ్రామాలు ఆడుతుంటారు.
• రైతులు, కార్మికులు, దళిత బిడ్డలుకు నేను ఒక్కటే విషయం చెప్తున్నాను. మనం ఎవరిని ప్రాధేయపడాల్సిన అవసరం లేదు.
• మనం ఎవరికో ఓటు వేసి.. దరఖాస్తులు పట్టుకొని బిచ్చగాళ్ళలా వారి వెంట పడడమెందుకు ?
• మనమే స్వయంగా ఎమ్మెల్యేలమవుదాం. ఎంపీలమవుదాం. మనలో ఆ బలం లేదా ? వేరే ఎవరినో గెలిపించి వారి వెంట తిరగడమెందుకు. ఇదే మన చేతిలో ఉన్న ఓటు అనే తాళం చెవి
• ఈ దేశంలో మనం కులం, మతం పేరు మీద విభజింపబడి పాలింపబడతామో అప్పటిదాకా మనం ఇలాగే మదనపడాల్సి వస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది.
• మనం ఏకమైనప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడండి
• రైతుల ఐకమత్యమే.. రైతుల దుస్థితికి విరుగుడు.
• ఎంతవరకు మనం ఏకమవుతామనే విషయం పైనే… ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
• 75 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం మన వైపు తిరిగి ఎందుకు చూడటం లేదు.?
• రైతుల ఎవరికో ఒకరికి వేటు వేస్తారు కదా అనే ధీమాతో దేశంలోని రాజకీయ పార్టీలున్నాయి.
• నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నదేంటంటే…
ప్రతీ ఎకరానికి సరిపడా సాగునీరు, 24 గంటల కరెంటు కావాలంటే మీరు మీ ప్రతాపాన్ని చూపండి.
• మహారాష్ట్రలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని లోహలోని ఈ సభా వేదికగా ప్రకటిస్తున్నాను. వచ్చే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ప్రతీ జిల్లా పరిషత్ లో గులాబీ జెండా ఎగురుతుంది.
• అన్ని జిల్లా పరిషత్ లో పోటీచేస్తాం. మీరు ప్రతీ గ్రామంలో మీ బలాన్ని ప్రదర్శించండి. ఎవరెవరు పరుగెత్తుకుంటూ రారో నేను చూస్తాను. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరుగెత్తుకుంటూ వస్తాయి.
• ధర్మాబాద్ కు చెందిన బాపూరామ్ కదం, యువనాయకుడు గణేష్ కదం ఏళ్ళుగా ప్రజల కోసం పోరాడుతున్నారు. వీరు ధర్మాబాద్ లో 80 గ్రామాల సర్పంచ్ లు ఏకం చేసి తెలంగాణ మోడల్ ను తమ గ్రామాల్లో అమలు చేయాలని తీర్మానం చేసేలా చేశారు. ఈ చర్యతో మహారాష్ట్ర ప్రభుత్వం భయపడిపోయింది.
• తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది తొమ్మిదేండ్ల క్రితం ఇంతకన్నా దారుణమైన స్థితిలో ఉండేది. నేను రైతులను ఓదార్చేవాడిని. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం గొప్పగా ప్రగతి సాధించింది.
• అలాంటిది మహారాష్ట్ర వంటి శక్తివంతమైన రాష్ట్రం ఎందుకు పురోగతి సాధించలేదు ? ఆర్థికంగా శక్తివంతమైన మహారాష్ట్రను మార్చడానికి పది పదిహేను సంవత్సరాలేం పట్టదు. ఎంతో సంపద ఈ రాష్ట్రంలో ఉంది.
• నేను ఏం చెప్తున్నానో మనస్సు పెట్టి వినండి…ఇంటికి పోయి మీరు మీ కుటుంబ సభ్యులు మిత్రులతో చర్చించండి.
• నేను దేశం ముందుకు వెళ్తుందా.. వెనక్కా ?
• నేను ఫ్లైట్ దిగగానే అయిదున్నర గంటలకే వెనకకు మరలాలని అధికారులు చెప్పారు. 24 గంటలు నడిచే ఎయిర్ పోర్ట్ ను పగలు మాత్రమే నడిచే ఎయిర్ పోర్ట్ గా మార్చారు.
• నడిచే ఎయిర్ పోర్ట్ ను బంద్ చేస్తున్నారంటే దేశం ముందుకు వెళుతుందా… లేక వెనుకకు మరలుతోందా గమనించాలి. ఇలాంటి తమాషాలు నడుస్తున్నాయి.
• ఫసల్ బీమా యోజన కింద మనకు ఎప్పుడైన పైసలు అందాయా ? మన పైసలు బ్యాంకులకు వెళుతాయి. కానీ తిరిగి రావు. ఇలాంటి ఎన్నో తమాషాలు మనం చూస్తున్నాం. ఇవే కాక ఇంకా ఎన్నో విషయాలున్నాయి.
• జాతి వాదం, మత వాదాన్ని విడిచి రైతు వాదాన్ని చేపట్టాలి. అప్పుడు అన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
• ఇంతటి ఎండలో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను.
• చంద్రపూర్, షోలాపూర్, పశ్చిమ మహారాష్ర్ుకు, మరెన్నో చోట్లకు రావాలని నాకు వినతులు అందుతున్నాయి.
• నా అంచనా ప్రకారం మహారాష్ట్రలో త్వరలో విప్లవం వస్తుంది.
• భారత వీర పుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, సంస్కర్త సాహు మహారాజ్, జ్యోతి బా ఫూలే, సావిత్రీ బాయి ఫూలే పుట్టిన గడ్డ ఇది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పుట్టిన పవిత్ర భూమి ఇది. ఈ భూమి విప్లవానికి చిరునామా.
• భారతదేశంలో ఏ పార్టీ వచ్చినా ప్రజలకు న్యాయం జరగలేదు.
• రైతు సర్కార్ వచ్చినప్పుడే మన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
• తెలంగాణ ప్రగతి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు ? సాధ్యమవుతుంది.
• మహారాష్ట్రలోని అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ గ్రామ కమిటీలు ఏర్పడతాయి.
• బిఆర్ఎస్ రైతుల పార్టీ. బిఆర్ఎస్ ది రైతుల ఎజెండా. మీరు బిఆర్ఎస్ ను బలోపేతం చేయండి తద్వారా మీరు బలోపేతం అవుతారు.
• ఆత్మహత్యలు నివారించబడి, పంటలకు సరిపడా నీళ్ళు, సరిపడా కరెంటు లభించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు సమకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
• జై తెలంగాణ – జై మహారాష్ట్ర – జై భారత్
• అబ్ కి బార్ కిసాన్ సర్కార్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ