ఆంజ‌నేయుడి పుట్టుక‌పై బ్ర‌హ్మానందం క్లారిటీ

0

దేవుడంటే ఎవ‌రో చెప్పిన బ్ర‌హ్మానందం
అదీ బాధ్య‌తంటే…
(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)

ఎవ‌రి పుర్రెలో పుట్టిన బుద్ధో కానీ కొంత‌కాలంగా ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌లంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగాయి. ఒకాయ‌న తిరుమ‌ల‌లోని అంజ‌నాద్రి అంటారు. మ‌రొకాయ‌న క‌ర్ణాట‌క‌లోని పంబా న‌దీ తీర‌మంటారు. మ‌రొకాయ‌న మ‌రోచోట అంటారు. దీనిమీద పండితులంతా ఒక‌చోట కూర్చుని అంజ‌నాద్రే అని తేల్చారు. దీనికి ముందే టీటీడీ వేద‌పండితులతో ఏర్పాటైన క‌మిటీ కూడా దీనినే ఖ‌రారు చేసింది. దీనిని అంగీక‌రించ‌ని గోవిందానంద స‌ర‌స్వ‌తి అనే స్వామీజీ ఎడ్డెమంటే తెడ్డెం అన్నారు. పండితుల చ‌ర్చ‌లో అంజ‌నాద్రిని ఆంజ‌నేయ స్వామి జ‌న్మ‌స్థ‌లంగా అంగీక‌రించార‌ని గోవిందానంద తాలూకు వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. అది ఎడిటెడ్ వీడియో అని తాజాగా ఆ స్వామి ఓ చానెల్‌కు ఎక్కారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను క‌న‌బ‌ర‌చ‌డంలో దిట్టఅయిన ఆ చానెల్ గోవిందానంద‌తో డిబేట్ పెట్టింది. ఇందులో గోవిందానంద కూజంతం రామ‌రామేతి అంటూ రామ స్తోత్రాలు చ‌దివి గొలుసుక‌ట్టుగా మాట్లాడుతూ టీటీడీ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టారు. అందులో తాను అంజ‌నాద్రిని హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లంగా అంగీక‌రించ‌లేద‌ని స్ప‌ష్టంచేశారు. స‌రిగ్గా ఇక్క‌డే ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది.
ప్ర‌ముఖ హాస్య న‌టుడు డాక్ట‌ర్ బ్ర‌హ్మానందం ఆ చానెల్‌కు ఫోన్ చేసి త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. గోవిందానంద పాద‌ప‌ద్మాల‌కు విన‌మ్ర న‌మ‌స్సుల‌తో తాను మాట్లాడుతున్నానంటూ చుర‌క‌లు అంటించారు.


అవ‌తార పుర‌షుల‌కు జ‌న్మ‌దినాలు…జ‌న్మ‌స్థలాలు ఉండ‌వ‌నీ… వారిని ఒక ప్రాంతానికి ప‌రిమితం చేయ‌వ‌ద్ద‌నీ ఆయ‌న అన్నారు. ఎక్క‌డ పుడితేనేమిటి? మ‌న దేశంలో పుట్టార‌ని అనుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఆలోచించండని కోరారు. కోట్ల మంది దేవ‌త‌లు కొలువుతీరిన దేశంలో ఏ దేవుణ్ణి కొల‌వాలో అనే సందిగ్ధం ఎప్ప‌టికీ ఉంటుంద‌నీ, కానీ ఎవ‌రి న‌మ్మిక‌ను వారు గౌర‌వించాల‌నీ అన్నారు. ఉత్స‌వాలు ఇప్ప‌టికే స‌గం ఒక రోజునా.. స‌గం మ‌రో రోజునా చేసుకోవాల్సిన మీమాంస‌లు ఏర్ప‌డుతున్నాయ‌నీ, కొత్త‌గా సందేహాల‌ను త‌లెత్తేలా చేయ‌వ‌ద్ద‌నీ తెలిపారు. మ‌న‌మంతా హిందువులం.. భార‌త దేశం ఆధ్యాత్మిక ప్ర‌దేశం.. ఈ దేశంలో దేవుళ్ళూ-జ‌న్మ‌స్థ‌లాలు అనే పిత‌లాట‌కం వ‌ద్ద‌న్నారు. రాముడు ఎక్క‌డ పుట్టినా అంతా పూజిస్తున్నామా లేదా? అని ప్ర‌శ్నించారు. అలాగే..మిగిలిన దేవుళ్ళ‌కూ అన్వ‌యించుకోవాల‌న్నారు. ఇప్పుడు జ‌న్మ‌స్థలంపై వివాదం వ‌స్తుంది.. అది తేలింద‌ని అనుకున్న త‌ర‌వాత మ‌రొక‌డెవ‌డో వ‌చ్చి.. మా ఇంటి ప‌క్క‌నే పుట్టాడంటే… మ‌రొక‌డొచ్చి మా వార్డులో పుట్టాడంటాడు. దేవుళ్ళ‌కు ఇలాంటి అభిప్రాయాల‌ను అద్ద‌డం అవ‌స‌ర‌మా అనేది బ్ర‌హ్మానందం గారి ప్ర‌శ్న‌. ఆంజ‌నేయుడు అద్భుత‌మైన రూపం. ఆయ‌న పుట్ట‌డ‌మేమిటి? ఆయ‌న రాముడి రూపం. రాముడి నీడ ఆయ‌న‌. రాముడే ధ‌ర్మం ధ‌ర్మ‌మే దేముడు అని మ‌నం న‌మ్ముతున్నప్పుడు ఆయ‌న పుట్టారంటారేమిటి? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? భార‌త‌దేశాన్ని చీల్చుకుని పుట్టాడండీ.. అది క‌దా మ‌నం చెప్పుకుని బ‌త‌కాల్సింది… పొద్దున లేస్తే ఏ దేముణ్ణి పూజించాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్న మాకు కొత్త‌గా ఈ పిత‌లాట‌కం ఎందుకు? డిబేట్‌లో డాక్ట‌ర్ బ్ర‌హ్మానందంగారు సుతిమెత్త‌గా త‌న‌దైన మాట తీరుతో వివాదానికి ముగింపు ప‌ల‌కాలంటూ క‌ర్రు కాల్చి వాత పెట్టారు. ఇలాంటివి చేసుకుంటూ పోతే… కొంత‌కాలం త‌ర‌వాత వేమ‌న ఏ కులం అనే మీమాంస కూడా వ‌స్తుందన‌డంలో సందేహం లేదు. మ‌హానుభావుల‌కు ప్రాంతాల‌ను అంట‌గ‌ట్ట‌డం అసమంజ‌సం. శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా…ఇలాంటి మీమాంస‌ను సృష్టించ‌డం త‌న‌ను మాన‌సికంగా బాధ‌పెట్టింద‌నీ, అందుకే త‌న అభిప్రాయం చెప్పాన‌నీ ముగించారు.

Govindananda Saraswati


బ్ర‌హ్మానందంగారు వాస్త‌వాన్ని చాలా సూటిగానే చెప్పారు. నిజ‌మే ఆలోచించండి.. అనేక స‌మ‌స్య‌లు ఉండ‌గా ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థ‌లంపై వివాదం.. చ‌ర్చ‌లు..క‌మిటీలు.. అవ‌స‌ర‌మా… ఒక‌వేళ నిర్థార‌ణైతే వ‌చ్చేదేమిటి? ఆలోచించాల్సిందే. ఒక స‌మస్య‌ను సాగ‌దీయ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల‌కు బ్ర‌హ్మానందంగారు ఇలా అడ్డుక‌ట్ట‌వేశారు. ఆంజ‌నేయుడు భార‌త దేశంలో పుట్టాడ‌ని అనుకోండి. దీనివ‌ల్ల మ‌న‌కూ మ‌న‌శ్శాంతి.. దేవుళ్ళ‌కూ మ‌న‌శ్శాంతి. దేవుళ్ళు ఉన్నారో లేదో త‌న‌కు తెలీద‌నీ, ఒక‌వేళ ఉంటే ఆ మ‌హాపురుషుల అంశాల‌ను వివాదాస్ప‌దం చేయ‌వ‌ద్ద‌నీ డాక్ట‌ర్ బ్ర‌హ్మానందం చెప్పిన మాట‌లు స‌ర్వుల‌కూ ఆచ‌ర‌ణీయం. ముఖ్యంగా టెలివిజ‌న్ చానెళ్ళ‌కు ఇది వ‌ర్తిస్తుంది. చ‌ర్చ‌లో డాక్ట‌ర్ బ్ర‌హ్మానందం గారి మాట‌లు విన్న త‌ర‌వాత ఈ మాట‌లు రాయాల‌నిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here