ఆయ‌న పాట‌-ఓ తేనె ఊట‌

0

ఆరు దశాబ్దాల సినారె సినిమా పాట
(జంధ్యాల శరత్ బాబు, 99483 45013)

చలనచిత్ర గీత రచనలో సినారె చరిత్ర సృష్టించి ఇప్పటికి దాదాపు అరవై సంవత్సరాలు. అన్ని పాటలూ రాయాలంటూ ఎన్టీఆర్ ఆహ్వానించగానే, గులేబకావళి కథ సినిమాలోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ…’ పాటతో ఆయన జైత్రయాత్ర మొదలైంది. అదే రచనలో ఒకచోట ‘ నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై/ వెలసినావు నాలో- నే కలసిపోదు నీలో’ అనిపించడం ఎంత గడుసుదనం! మరో గీతంలో ‘అత్తరులో మునిగొస్తేనేమి ఆటను గెల్చుట కల్ల, పోటీలో నువు ఢిల్లా/ అత్తరు కంటే మత్తును చూపే సత్తువ ఉందే పిల్లా/ నా చలాకి చక్కెరబిళ్లా’ అంటూ ఆటపట్టించడమంటే ఇంకెంత కవ్వింపుతనం!!
అలా కాలంతో దీటుగా పోటీపడుతూ, అటుతర్వాతా ఆ శబ్దశాసనుడు పలు రీతుల్లో రాసిన గీతాల సంఖ్య వేలల్లోనే.
సినీ గీత సర్వస్వం (ఒకటో సంపుటం) ప్రవేశికలో సంపాదకులన్నట్లు… సినారె సాహిత్య చరిత్రలో అది మరో అద్భుత ఘట్టం. అప్పటికే ఉన్న పరిణతితో తొలి చిత్ర గీతాలే ఆయనను అగ్రస్థానంలో నిలిపాయి. అదే రచనా యాత్ర చిరకాలం మహోన్నతంగా కొనసాగింది. ఎంతో సరళ సుందర, రసవత్తర పాటల పరంపర ఆ వేలి కొసల నుంచి అలవోకగా జాలువారింది. వాటిల్లో అనేకం వీక్షక ప్రేక్షక సమాదరణకు పాత్రమయ్యాయి. అన్నింటినీ ఐదు సంపుటాల సమగ్ర గ్రంధంగా వెలువరించి, నిరుడు ఆయన జన్మదినోత్సవ శుభ సందర్భంలో ఆవిష్కరించారు.
పలువురి నుంచి సమీకరించిన, అప్పటికే భద్రపరచిన, అలనాటి పాటల పుస్తకాల నుంచి తీసుకున్న, ఇంటర్ నెట్ లో వింటూ రాసుకున్న గీతాలే ఇవన్నీ. తొలి భాగంలో నాలుగు వందల పాటలను పొందుపరచారు. మొట్టమొదటి చిత్రం మొదలు “జరిగిన కథ” వరకు వీటిని చదివి, విని, బుల్లితెర మీద దృశ్యరూపంగా చూసి కూడా ఆయా రసానుభూతులను ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోవచ్చు. అన్ని రచనలకూ స్వరకర్తల, గాయకుల పేర్లను మొదట్లోనే ఉంచారు. చిత్రాల విడుదల సంవత్సరాలనూ తెలియజేయటం మరింత విశేషం.
ఇందులో ఉన్న మరికొన్ని పాటల్లో మేలిమి ముత్యాలు:

 • చిలిపి కనుల తీయని చెలికాడా/ నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ
  నీలి కురుల వన్నెల జవరాలా/ నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
 • సన్నిధి నీవుంటే కన్నులు నాకేలా/దాపున నీవుంటే దైవం వేరేలా
 • చల్లని గాలీ నీవైతే కమ్మని తావీ నేనౌతా/ కొమ్మవు నీవై రమ్మంటే కోకిల నేనై కూ అంటా
 • పిండి వెన్నెల నీ కోసం/పిల్ల తెమ్మర నా కోసం
  రెండు కలసిన నిండు పున్నమి/ రేయి మన కోసం
 • ఎదుట వెన్నెల పంట/ఎదలో తీయని మంట
  ఇక సైపలేను/నీవే నా ముద్దుల జంట
 • పువ్వునై కురులలో పొంచి యుందును /నవ్వునై పెదవిపై పవ్వళింతును
 • ముందు నీవు నిలుచుంటే నందనాలు కావాలా/ మనసులోన నీవుంటే మందిరాలు నాకేలా?
 • కత్తులు దూసీ జడిపించువాడు/మెత్తని ప్రేమను సాధించలేడు
  కన్నుల బాసలు తెలియనివాడు/ కన్నియ మనసును గెలువగలేడు
 • పరువము పొంగే వేళలో పరదాలవెందుకో
  చెంగున లేచీ చేతులు సాచీ/చెలియ నన్నందుకో
 • నాలోని రాగమీవె, నడయాడు తీగవీవె
  పవళించె లోన బంగారు వీణ/పలికించ నీవు రావె
 • పవళించు మేనిలోన/ రవళించె రాగ వీణ
  నీలాల నింగి లోలోన పొంగి/ కురిపించె పూల వాన
 • బెళుకు చూపుల నీ నయనాలు/ తళుకుమంటె అదే పదివేలు
  నిన్నుగని రివ్వుమని/ నింగికి పొంగెను పరువాలు
 • జగములనేలే సొగసే నీదని/ గగనములో దాగె నెలరేడు
  మనసును దోచే మరుడవు నీవని/కనుగొంటినిలే ఈనాడు
 • మదమరాళ గామిని/ మంజుల మధు యామిని
  ఝళం ఝళిత మణి నూపుర/లలిత లయ విలాసిని
  వచన కవితా నిధి కుందుర్తి నిగ్గుతేల్చినట్లు – సినారె కత్తి/ కలానికి రెండు వైపులా పదునే. అగ్నిధార రేపినా, అమృతవృష్టి కురిపించినా ఆయనే!
  ( పుస్తక విశ్లేషకుడు సీనియర్ జర్నలిస్ట్ )
  డాక్టర్ సి. నారాయణరెడ్డి సినీ గీత సర్వస్వం-1
  పుటలు: 453; వెల: రూ. 205
  సమర్పణ: వాఙ్మయి ప్రచురణలు-హైదరాబాదు
  సంపాదకులు: శ్రీమతి సి. గంగ, డా. జె. చెన్నయ్య
  ప్రతులకు : తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, హైదరాబాదు – 500 001
  ఫోన్: 96400 32000 ; 88852 45234

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here