Thursday, September 28, 2023
HomeArchieveబ్రాహ్మణుల గుఱించి ఇంతకంటే వివరంగా చెప్పటం సాధ్యపడదు!

బ్రాహ్మణుల గుఱించి ఇంతకంటే వివరంగా చెప్పటం సాధ్యపడదు!

గౌరవించకపోయినా ఆదరించడం కనీస సామాజిక ధర్మం
డాక్ట‌ర్ పాల‌కోడేటి సంక్షిప్త బ్రాహ్మ‌ణ చ‌రిత్ర విమ‌ర్శ‌కుల‌కు స‌మాధానం
(వనం జ్వాలా నరసింహారావు, 8008137012)

నువ్వెవరివి? అని అడిగితే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని దీనస్థితిలో వున్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది
తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. తమ గురించి తాము చెప్పుకోలేని పరిస్థితి బ్రాహ్మణులకు కలిగింది. ఈ నేపథ్యంలో పాత్రికేయులు డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు రాసిన “సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర” బ్రాహ్మణేతర విమర్శకులకు
అసలు-సిసలైన సమాధానం అనాలి.
ఇది చదివిన వారు-ముఖ్యంగా బ్రాహ్మణ విమర్శకులు, “ఓహో…బ్రాహ్మణులంటే ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?” అన్న ఆలోచన చేయక మానరు.

Book Author Sri Palakodety Satyanarayana


సామూహిక జ‌న జీవ‌న వ్య‌వ‌స్థే స‌మాజం
సామూహిక జన జీవన వ్యవస్థే సమాజం అంటూ ప్రారంభించి, అనేకానేక విషయాలను, సంక్షిప్తంగా అంటూనే, వివరంగా తెలియచేసే ప్రయత్నంలో పాలకోడేటి సఫలమయ్యారనడంలో సందేహం లేదు. వివరాలలోకి పోతే…. ప్రపంచంలో ఎన్ని మతాలున్నా హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. మరో వాదన ప్రకారం, ఆర్యులు ఆంధ్ర దేశం రాక ముందు, చాతుర్వర్ణ పద్ధతి లేదు. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. లోతుగా పోతే, బ్రాహ్మణులని పిలిపించుకోవాలంటే, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం తప్పని సరి. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! ఇలాంటి వ్యవస్థ ప్రాచీన కాలం నాటి ఈజిప్ట్, బాబిలోనియాలతో సహా, చైనా దేశంలోనూ వుండేదట. అక్కడి వాడుక ప్రకారం వారిని పూజారులుగా, పాలకులుగా, వృత్తి దారులుగా, బానిసలుగా విభజించారు. అలానే ప్రాచీన ఇరాన్‌లో “పిస్త్రీ” అనే నాలుగు వర్ణాలుండేవి.
కులం అంటే ఏమిటి?
ఇక “కులం” అంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే “నివాసం”. వర్ణాలు వేరు, జాతులు వేరు. వర్ణం అనే మాట “వర్గం” ను సూచిస్తే, జాతి అనేది “కులం” ను సూచిస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే “క్లాస్”, “కాస్ట్” అన్న మాట. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక విషయం మాత్రం వాస్తవం. అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే “పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు కారకులు కాదు. వారు కుల వ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ.


బ్ర‌హ్మ‌న్ నుంచి వ‌చ్చిందే బ్రాహ్మ‌ణులు
“బ్రాహ్మణులు” అనే మాట “బ్రహ్మన్” అనే పదం నుంచి వచ్చింది. బ్రహ్మన్ అంటే “యజ్ఞం’ అనే అర్థం కూడా వుంది. అంటే యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే “బ్రహ్మ” అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. అంటే వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. ఒకానొక రోజుల్లో బ్రాహ్మణులకు బ్రహ్మ-క్షత్రియ గుణాలుండేవి. కాని, ఆ తరువాత, వారు తమ క్షత్రియ గుణాలను పూర్తిగా వదిలి, పాలన, మంత్రాంగం, పురహితాల వైపు దృష్టి మరల్చారు. బ్రాహ్మణులకు అనాది నుంచీ, సమాజంలోని ఇతరుల నుంచి ఎంతో గౌరవ ప్రపత్తులు లభించేవి. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు పనిచేసే “పంచ ప్రధానుల” లో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఐంది. సుమతి శతకం ప్రకారం, ఒక ప్రదేశం గ్రామం అనిపించుకోవాలంటే, దానికి వుండాల్సిన ప్రాధమిక లక్ష్యాలలో వూళ్లో బ్రాహ్మణుడు వుండడం కూడా ఒకటి. సమాజాన్ని మార్క్సిస్టు కోణంలో నిశితంగా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రంధంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమ వాసుల పునఃకలయికవల్ల ఏర్పడిన కులంగా బ్రాహ్మణులను అభివర్ణించి, ప్రాచీన పవిత్ర గ్రంథాలలో లభ్యమైన వాటిని భద్ర పరిచింది వారేనని, దాని విలువ అపారమని పేర్కొన్నారు.
అంద‌రూ బ్రాహ్మ‌ణులు కాలేరు
బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని “మాత్రులు” అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని “బ్రాహ్మణులు” అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని “శ్రోత్రియులు” అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను “అనూచానులు” అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న వారిని “భ్రూణులు” అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని “ఋషికల్పులు” అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని “ఋషులు” అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని “మునులు” అని అంటారు.
భార‌త్‌లో అన్ని ప్రాంతాల్లో బ్రాహ్మ‌ణులు
అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో “బహున్” లుగా, మయన్మార్‍లో “పొన్న” లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణ కమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.


ప్ర‌జా సేవ‌కు అంకిత‌మైన వారు వైదికులు
వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని “వైదికులు” అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.
నియోగుల‌లో అనేక ఉప శాఖ‌లు
వైదికులనుండి విడిపోయి, ప్రత్యేకశాఖగా ఏర్పడిన వారు “నియోగులు”. వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని రకరకాల ఉప శాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన వారని. నియోగులు సంప్రదాయ బ్రాహ్మణులు కారనే వాదన కూడా వుంది. కొందరి దృష్టిలో సంప్రదాయ బ్రాహ్మణులంటే వైదిక కార్యాలు చేసే వైదికులు మాత్రమేనని. పౌరోహిత్యం వృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు.
ఆరు వేల నియోగుల‌కు ఆ పేరెలా వ‌చ్చిందంటే…?
శతాబ్దాల క్రితం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజులు పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు. వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.


వేలెత్తి చూప‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు?
వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?
ఒకనాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. క్రిస్టియన్ మిషనరీల రాకతో, అంతకు ముందు ముస్లింల పాలనలో, ప్రారంభమైన బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు చేరుకుంది. దశాబ్దం క్రితం మండల కమీషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా జరిగిందేమీకాదు. భారత దేశ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బ తీయాలని భావించింది. అలనాడు ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన, భారతదేశంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం వుందని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించడం వారి అనుమానాన్ని మరింత దృఢ పరిచింది.
బ్రాహ్మ‌ణులంటే…
అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం కలవారని. అదొక సామాజిక వర్గం. హైందవ మతంలో, ఆచారంలో, ఒక భాగం. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు వైదిక కాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది. భారతీయ మనుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అనే నాలుగు “వర్ణాలు” లేదా తరగతులు ఉన్నాయి. నాలుగు వర్ణాలుగా అనాది నుంచీ విభజన జరిగిన వాటిలో మొదటిది బ్రాహ్మణులు కాగా, మిగిలిన మూడింటిని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులనీ పిలవడం మొదలెట్టారు.


నేటికీ అగ్ర‌వ‌ర్ణంగా హోదా
అగ్రకులంగా, అగ్రవర్ణంగా బ్రాహ్మణులకు దక్కిన ప్రత్యేకహోదా నాటి నుంచీ నేటి దాకా ఒక విధంగా కొనసాగుతూనే వుంది. వాళ్ల గొప్పతనానికి, ఆధిపత్యానికి, ఇప్పటికీ గౌరవం లభిస్తున్నప్పటికీ, అనాదిగా వారికి దక్కిన హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే జ్ఞాన సముపార్జన వాళ్లకే చాలా కాలం వరకూ పరిమితమై పోయింది.
కాలానుగుణంగా వస్తున్న మార్పులలో ఇతర వర్ణాల వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన విషయంలో వీరితో పోటీ పడి నెగ్గుకొస్తున్నప్పటికీ, సాంప్రదాయిక వైదిక విద్యా సముపార్జన మాత్రం ఇంకా వీరి అధీనంలోనే చాలా వరకు వుందనాలి. వాళ్లకు సంఘంలో వున్న గౌరవం వల్లనైతేనేమి, సాంప్రదాయకంగా వారికి లభిస్తున్న విద్య వల్ల నైతేనేమి, బ్రాహ్మణులు మత పరమైన వ్యవహారాలనే కాకుండా లౌకిక వ్యవహారాలను కూడా చక్కదిద్దే స్థాయికి ఎదిగారు.
ప్ర‌ధాన క‌ర్త‌వ్యం స‌మాజోన్న‌తి
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదాలలో ప్రావీణ్యం కల వారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తోంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై చక్కటి అవగాహన కలిగి ఉంటారు.
బ్రాహ్మణులను “విప్ర” (“ప్రేరణ”), లేదా “”ద్విజ”” (“రెండుసార్లు జన్మించిన”) అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ “బ్రాహ్మణులు” అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారాలు-వేద పాఠశాలల (శాఖలు) వలన వారు వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులు అయినప్పటికీ, అందరు బ్రాహ్మణులు అగ్ని (హోత్ర) పూజారులు కారు. ఇటీవలి కాలంలో కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రమే వేద విద్య నేర్చుకోవడం చేస్తున్నారు. మరి కొందరు పౌరోహిత్య విధులు నిర్వర్తిస్తున్నారు. పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తుల్లో, ఉద్యోగాలలో బ్రాహ్మణులు కూడా తమ అవకాశాలు వెతుక్కుంటున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు కూడా సాగుతున్నాయి.
వంచ‌న అనే దురాచారానికి దూరం
రామాయణ కాలం నాటి బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను, జయించారు. పరులను వంచించాలనే దురాచారానికి దూరంగా వుండేవారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుండేవారు. వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుండేవారు. ఆరంగాల (శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై మెలగుతుండేవారు. అలాంటి వారు ఇప్పటికీ పలువురు వున్నారు. కాకపోతే ఆధునిక రాజకీయ, సామాజిక మార్పులకు, ఆర్థిక ఇబ్బందులకు అనుగుణంగా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది.
బ్రాహ్మణులను ద్విజాతులని, వేదషడంగ పారగోత్తములని, అహితాగ్నులని, సహస్రదులని, మహామతులని, సత్యవచస్కులని, హిమకర మిత్ర తేజులని, ఋషులని ఆంధ్ర వాల్మీకి రామాయణ గ్రంధ కర్త శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు పోల్చారు. వారినే, హృష్ఠ మానసులని, శాస్త్ర చింతన పరాయణులని, స్వస్వతుష్టులని, త్యాగశీలురని, భూరి సంచయులని వర్ణించారు తన రామాయణంలో. తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో, అధ్యయనంలో ఉత్తములై , వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు.
అమాత్య హోదా బ్రాహ్మ‌ణుల‌దే
రాజకీయంగా అధికారం మరో అగ్ర వర్ణం వారైన క్షత్రియుల చేతుల్లో వున్నప్పటికీ, అమాత్యులుగా రాజులకు సలహాలనిచ్చే బాధ్యతను-హక్కును వారే కలిగి వుండడం కూడా అనాదిగా వస్తోంది. ఆంగ్లేయుల పాలనలో, బ్రాహ్మణులు, మేధ పరమైన తమ ఆధిపత్య నాయకత్వాన్ని పదిలంగా కాపాడుకున్నారు. వారి ఆ ఆధిపత్యం, తొలినాళ్లలో, ఆంగ్లేయుల ప్రభుత్వంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఉద్యోగాలలో పనిచేయడంతో ప్రారంభమై, జాతీయోద్యమంలో కీలక నాయకత్వం చేపట్టడం దాకా పోయింది. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత కూడా వారి ఆధిపత్యం కొనసాగింది చాలా రోజుల వరకు. అధికారంలో వున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు పొందడంలోను, కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించడంలోను బ్రాహ్మణులే ముందుండే వారు. వీరి ఈ ఎదుగుదలను సహించలేని కొన్ని రాష్ట్రాలలో-ముఖ్యంగా దక్షిణాదిలో, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. కాకపోతే, ఆ ఉద్యమాల ప్రభావం వారి హక్కులను హరించడం వరకే పరిమితమైనాయి తప్ప, పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో పెద్ద నష్టం జరగలేదు. వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ. క్రమేపీ, వీటికే పరిమితమై పోవడంతో, గతంలో మాదిరి రాజకీయంగా కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా కాని ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది చాలామందికి. దీనికి తోడు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి చేయసాగింది.
బ్రిటీష్ హయాంలో నిర్వీర్యం చేసే య‌త్నం
బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో, జాతీయోద్యమంలో కీలక పాత్ర వహించిన బ్రాహ్మణుల నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించడానికి, ఒక వైపున సైద్ధాంతికంగా వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ, మరో వైపున బ్రాహ్మణేతర అగ్ర కులాల వారిని, బ్రాహ్మణులతో సమానంగా పరిగణించబడాలన్న డిమాండుతో తెర పైకి తేవడం జరిగింది. ఆ తరువాత కాలంలో అదే పద్ధతిని ముస్లింల విషయంలో కూడా అవలంబించింది బ్రిటీష్ ప్రభుత్వం.
దుర్మార్గులుగా చిత్రించేందుకు కూడా ప్ర‌య‌త్నం
భారత దేశ చరిత్రను తిరగ రాసే ప్రయత్నంలో, బ్రాహ్మణులను, ఇతర వర్ణాల వారికి వ్యతిరేకులుగా, పీడించే వారిగా, దుర్మార్గులుగా చిత్రించే ప్రయత్నం కూడా చేసింది. భారత సమాజాన్ని అభివృద్ది పరచడంలో బ్రాహ్మణులు వహించిన పాత్రను తక్కువ చేసి చూపడం జరిగింది. ఇదంతా కావాలనే చేసింది నాటి ప్రభుత్వం. ఆ ప్రయత్నాలే ఆ తరువాత స్వతంత్ర భారత దేశంలో కూడా మరో రూపంలో కొనసాగాయనవచ్చు.
సమాజాన్ని ఐక్యంగా, సమైక్యంగా వుంచడానికి బ్రాహ్మణులు అనాదిగా చేసుకుంటూ వస్తున్న అవిరళ కృషిని, మరుగుపర్చి, బ్రాహ్మణ వ్యతిరేకతను ప్రోత్సహించింది నాటి బ్రిటీష్ ప్రభుత్వం. ఆ వ్యతిరేకతే దరిమిలా కొనసాగి, అరవై ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో మరింత బలపడి, చరిత్రలో కనీ-వినీ ఎరుగని రీతిలో, బ్రాహ్మణులను అణగ దొక్కే స్థాయికి తీసుకుపోయింది. వాస్తవానికి శతాబ్దాల కాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణే తరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుందిప్పుడు. ఈ మార్పుల వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా కులాల ప్రాధాన్యత వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాలలో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది.
ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మ‌ణులు
చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికిపోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్య్ర రేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు.
హేళ‌న‌కు గురిచేసిన ఆచారాలు
అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది. 5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!
ఉపాధికోసం వ‌ల‌స పోయే స్థితిగ‌తులు
కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చేశాయని కూడా జర్నల్ రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు.
ఈత‌రం వారికి ఇబ్బందులు
ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం! (వ్యాస ర‌చ‌యిత తెలంగాణ సీఎంకు సిపిఆర్ఓ)

Sri Vanam jwala Narasimharao
RELATED ARTICLES

1 COMMENT

  1. దేశంలో రెండు శాతం ఉన్నటువంటి బ్రాహ్మణులను మైనారిటీలుగా ప్రకటించాలని….నా అభిప్రాయం…. సర్వేజనా సుఖినోభవంతు అంటూ అందరి శ్రేయస్సును కోరే బ్రాహ్మణులను అత్యంత హీనంగా చూస్తున్నారు ఎవరో చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల అందరూ బ్రాహ్మణులే అనుభవించాల్సి వస్తోంది…. ఈ మధ్య మరీ హీనంగా చూస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ