ముఖ్యమంత్రుల మార్పున‌కు బీజేపీ మొగ్గు

0

కాంగ్రెస్ దారిలో ప‌య‌నిస్తోందా?
విజ‌య్ రూపానీ రాజీనామా ఇస్తున్న సంకేతాలేమిటి!
(అశ్లేష)

రాష్రాల్లో పార్టీ వ్యవహారాలను భారతీయ జనతా పార్టీ పర్యవేక్షిస్తున్న తీరును చూసినప్పుడు గతంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు గుర్తు రాక మానదు. ఇందిర, రాజీవ్ గాంధీ హయాంలో చీటికి మాటికి ముఖ్యమంత్రులను మార్చేవారు. పరిశీలకుల పేరుతో దిల్లీ నుంచి వచ్చే అధిష్టానం తాబేదార్లు ముఖ్యమంత్రుల మెడలు వంచి రాజీనామాలు చేయించేవారు. చివరికి వారి చేతనే తమకు నచ్చిన నేతను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించే వారు. ఈ దుష్ట సంప్రదాయం వల్ల బలమైన నేతలు తెరమరుగయ్యే వారు. వారికి గవర్నర్ వంటి పదవులు ఇచ్చి అసమ్మతి ప్రబలకుండా చూసేవారు. బలహీనమైన నాయకులు చక్రం తిప్పేవారు. అంతిమం గా ఈ విధానం పార్టీకి చేటు చేసింది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో పార్టీ కనుమరుగైపోయింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రుల మార్పే విధానంగా పెట్టుకుని ముందుకు సాగు
తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి తొలగింపు చూసిన తరవాత ఈ అభిప్రాయం కలగక మానదు. అనూహ్యంగా రూపాణీ తొలగింపు, ఆయన స్థానంలో తొలిసారి శాసనసభ్యుడైన భూపేంద్ర పటేల్ ను ప్రతిష్ఠించడం గంటల వ్యవధిలో జరిగిపోయింది. పటేల్ కనీసం మంత్రి కూడా కాదు. ఈ సందర్భంగా 2011లో ఉమ్మడి ఏపీలో నాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్థానంలో అప్పటి స్పీకర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి హస్తం పార్టీ అధిష్టానం పట్టం కట్టిన తీరు గుర్తుకు వస్తుంది. అప్పటివరకు నల్లారి వారు కనీసం ఒక్కసారి కూడా మంత్రిగా పని చేయలేదు. అధిష్టానం దయతో నేరుగా ముఖ్యమంత్రే అయ్యారు. చివరకు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో పార్టీ కకావికలమైంది. కిరణ్ కుమార్ రెడ్డి సైతం రాజకీయంగా శంకరగిరిమాన్యాలు పట్టారు.


బీజేపీ సామాజిక కోణం బ‌ట్ట‌బ‌య‌లు
తాజాగా రూపాణీ తొలగింపునకు భాజపా సామాజిక కోణం చూపుతోంది. ఆయన జైనుడు. ఈ మతం వారి సంఖ్య గుజరాత్ లో రెండు శాతానికే పరిమితం. కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శక్తిమంతమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో వీరి జనాభా 12 శాతానికి పైగానే ఉంటుందని అంచనా. ఈ లెక్కలు, విశ్లేషణలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఆచరణలో ఎంతవరకు నిజమవుతాయన్నది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ఇటీవల కాలంలో భాజపా నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది. ముఖ్యమంత్రుల తొలగింపు, ఎంపికకూ సామాజిక కోణంపైనే ఆధార పడటం పార్టీ బలహీనతకు అద్దం పడుతోంది.

కర్ణాటకలో యడ్యూరప్ప స్థానంలో అదే సామాజిక వర్గానికి (లింగాయత్) చెందిన బసవరాజ్ బొమ్మై కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. లింగాయత్ లు ఆది నుంచీ భాజపా ఓటుబ్యాంకుగా ఉన్నారు. వారిని కాదనే సాహసం పార్టీకి లేదు. ఇక ఉత్తరాఖండ్ లోనూ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చింది కాషాయ పార్టీ. త్రివేంద్ర సింగ్ రావత్‌ను తొలగించి తీరథ్ సింగ్ రావత్ కు పట్టం గట్టింది. ఆయన పాలన పట్టుమని నాలుగు నెలలు కూడా సాగలేదు. అంతలోనే ఆయన పదవికి ఎసరు వచ్చింది. దీంతో ముచ్చటగా మూడో క్రిష్ణుడుగా ఫుష్కర్ సింగ్ థామీని పార్టీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ముగ్గురు నాయకులు త్రివేంద్ర సింగ్ రావత్, తీరథ్ సింగ్ రావత్, పుష్కర సింగ్ థామీ…ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ కొండ ప్రాంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నిక‌ల ముందు ఆద‌రాబాద‌రాగా…
ఎన్నికలకు ముందు ఆదరాబాదరగా ముఖ్యమంత్రులను మార్చడం వల్ల ప్రత్యేకంగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని గత అనుభవాలు చాటుతున్నాయి. 1978-83, 1989-94 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ముగ్గరేసి ముఖ్యమంత్రులను మార్చింది. అయినా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ విషయం కమలం పార్టీకి తెలియదని అనుకోలేం. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here