విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధం

Date:

అధికారుల‌కు తెలంగాణ సీఎం ఆదేశం
ఉద్ధృతంగా గోదావ‌రి ప్ర‌వాహం
ప్ర‌భుత్వ యంత్రాంగానికి ప‌రీక్షా కాలం
ప్ర‌జా ప్ర‌తినిధులూ పారా హుషార్‌
హైద‌రాబాద్‌, జూలై 23:
నిరంతరాయంగా రెండువారాల పైనుంచి కురుస్తున్న భారీ వానల వల్ల ఇప్పటికే రాష్ట్రమంతా జలమయమైన నేపథ్యంలో ఇకనుంచి పడ్డ చుక్క పడ్డట్టే, వాగులు వంకలు దాటి, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటాయని, మరో రెండు రోజుల్లో భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవలికంటే భారీగా వరదలు సంభవించే ప్రమాదం కూడా ఉన్నదని, ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్దంగా వున్నదని అందుకు అనుగుణంగా సమాయత్తమై వుండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అనవసర ప్రయాణాలు మాని,స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సిఎం కెసిఆర్ కోరారు.


గోదావరి నది తన జన్మస్థానమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి నదీ సంగమ బంగాళాఖాతం వరకు సందులేకుండా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నదని, గోదావరి ఉప నదుల్లో కూడా భారీ వరద పోటెత్తుతున్నదని, ప్రకృతి విపత్తు కష్టకాలంలో, రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా కాలమని, ముఖ్యమంత్రి అన్నారు. వొక్క ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్తమై ఇటీవలి వరదల సందర్భంగా వున్నట్టే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా వుంటుందని సిఎం స్పష్టం చేశారు.


ఉద్యోగులు హెడ్ క్వార్టర్లు విడిచి వెళ్ళ‌కూడదు
ఎమర్జెన్సీ సేవలందించే శాఖలతో పాటు, వానలు వరదల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అన్నిశాఖల అధికారులు వారి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సిఎం అన్నారు. ఈ మేరకు ఆదేశాలతో తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.


రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై .. ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు టి.హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనా చారి, దండే విఠల్, శంభీపూర్ రాజు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీలు శేషాద్రి, స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవరావు, హెల్త్ సెక్రటరీ రిజ్వి, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎం.డి.దానకిషోర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ హరిరాం, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, రవాణా శాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, , లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


రేపటికే తిరిగి గోదావ‌రి ఉద్ధృతం
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇపుడు కురిసే వానలతో గోదావరి నది రేపు మధ్యాహ్నం నుంచే ఉధృతంగా మారే వరద ప్రమాదముందని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్నిశాఖల సిబ్బంది, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అప్రమత్తమై వుండాలన్నారు. ఇప్పటికే తాను అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చినట్లు సిఎం తెలిపారు. ఈ భారీ వానలు అగస్టు మొదటివారం దాకాకొనసాగే సూచనలున్నయన్నారు. ముంపునకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా వున్న రామన్నగూడెం ఏటూరునాగారం తదితర భధ్రాచలం పరిసర ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిఎం అన్నారు.


రెండు హెలికాప్టర్లను సిద్దం చేయండి
రాష్ట్ర రాజధానిలో అప్రమత్తంగా ఉండే హెలికాప్టర్ కు అధనంగా మరో రెండు హెలికాప్టర్లను రప్పించి , ములుగు లో కొత్తగూడెం లో సిద్దంగా ఉంచాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. ఖమ్మం కొత్తగూడెం లలో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారుఎన్డీఆరెఫ్ సహా వరద సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలని తక్షణ రక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను సిఎం ఆదేశించారు.


వచ్చిన వరదను వచ్చినట్టే వదలాలె
ఎగువ గోదావరి నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే ప్రాజెక్టుల గేట్లను ఎత్తి కిందికి విడుదల చేయాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ‘‘ఇన్ ఫ్లో ఎంత వస్తున్నదో అంతనీటిని అవుట్ ఫ్లో ద్వారా విడుదల చేయాలి,,ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఆపకూడదు ఈ మేరకు అన్ని ప్రాజెక్టు ఉన్నతాధికారులకు తక్షణ ఆదేశాలు జారీచేయండి..’’అని రజత్ కుమార్ ను సిఎం ఆదేశించారు.
తాగునీరు కలుషితం కాకుండా
మిషన్ భగీరథ తాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలని అందుకు తగు చర్యలు చేపట్టాలని కృపాకర్ రెడ్డిని సిఎం ఆదేశించారు. గేట్లు లేకుండా మత్తల్లు దునికి ప్రవహించే డిండి పాకాల, వైరా పాలేరు రిజర్వాయర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.


ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్దం
ఈ నేపథ్యంలో.. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు ఎటువంటి పరిస్తితులనైనా ఎదుర్కునేందుకు సంసిద్దంగా ఉండాలని సిఎం సూచించారు. ఎస్.ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.


వరదల పరిస్థితిని ముందస్తు అంచనాకు సాప్ట్ వేర్
భారీ వర్షాలకు నేపథ్యంలో వరదలను ముందస్తుగా అంచనావేసేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘‘ ఫ్లడ్ ఫోర్ కాస్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ’ అనే సాంకేతిక పరిజ్జానాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పరిశీలించారు. ఈమేరకు, కురిసే వానలకు అనుగుణంగా హెచ్చుతూ తగ్గుతూ హద్దులు దాటి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసి విశ్లేషించే విధానాన్ని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్.. సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ సాంకేతిక పరిజ్జానాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ దేశంలోనే మొదటిసారి అభివృద్ధి చేస్తున్నదని రజత్ కుమార్ సిఎం కు వివరించారు. అందుకు సిఎం అభినందించారు.
వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేయగలుగుతున్నా వరద అంచనాను వేయలేకపోతున్న సమస్యలను ఈ సాప్ట్ వేర్ తొలగిస్తుందన్నారు. ముంపుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.


హైద్రాబాద్ పరిస్థితిపై ఆరా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద నీటి కాల్వల పరిస్థితిని, జల్ పెల్లి, ఫీర్జాదీగూడ వంటి వరదలకు ఉప్పొంగే హైద్రాబాద్ లోని చెరువుల పరిస్థితిని, వరద సమయాల్లో విద్యుత్ వ్యవస్థ గురించి ఎంఏయూడి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, తదితర శాఖల ఉన్నతాధికారులనుంచి సిఎం ఆరా తీసారు.


అంటు వ్యాధులు ప్రబలకుండా చ‌ర్య‌లు
ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు తలెత్తే అసౌకర్యాలను వీలయినంతగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రభుత్వ యంత్రాంగ ప్రతిభ ఇమిడివున్నదని సిఎం అన్నారు. గత పదిహేనురోజులుగా కొనసాగుతున్న కృషిని మరింత పట్టుదలతో రేపటెల్లుండి కురువనున్నాయని అంటున్న వానల నేపథ్యంలో కూడా కొనసాగించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని సిఎం కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉన్నదా? అందుకు అధికారులు తీసుకున్న చర్యలేమిటి? అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, అధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వరదల సందర్భంగా కన్నా, వరదలు ఆగినంక ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని , అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని సిఎం అన్నారు.


సిబ్బంది పనితీరు భేష్
భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఆరోగ్యశాఖ డైరక్టర్ సహా అధికారులను సిఎం అభినందించారు. డెంగ్యూ ప్రతి ఐదేండ్లకోసారి సైకిల్ గా వస్తోందని, ఇలాంటి వ్యాధులను ముందస్తుగానే గుర్తించి, తగు చర్యలు తీసుకొని అరికట్టాలని మంత్రిని, వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీఓలు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు, ఈ రెండు రోజులు సెలవులు అని అలసత్వంగా వ్యవహరించవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు.


రోడ్లు రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు పునరుద్దించాలి
వానలు వరదల కారణంగా కొట్టుకపోతున్న రోడ్లను రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు పునరుద్దరించాలని ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సిఎం ఆదేశించారు. రాష్ట్రం వ్యాప్తంగా, హైదరాబాద్ పరిధిలో రోడ్ల పరిస్థితి గురించి సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న నేషనల్ హైవే రోడ్లను పునరుద్దరిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు సిఎం కెసిఆర్ కు వివరించారు.


సబ్ స్టేషన్లను మునగకుండా చూసుకోవాలి
ఈ వరదల ద్వారా వచ్చిన అనుభవంతో సబ్ స్టేషన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వరద పుంపుకు లోనుకాకుండా రాష్ట్రంలోని సబ్ స్టేషన్ల కాంటూర్ లెవల్స్ ను రికార్డు చేసుకుని ఉంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారి రఘమారెడ్డిని సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 కెవి సబ్ స్టేషన్లు ఏ విధంగా నియంత్రణలో ఉన్నాయనే సమాచారాన్ని సేకరించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...