క‌న్నీటెన‌క బ‌డ‌బాగ్ని వ‌ర్ణించిన క‌వి

0

మ‌న‌సుక‌వి మ‌న‌సులో లోతైన భావ‌న‌లు
(శ్రీధర్ వాడవల్లి -9989855445)
సమయానికి పాటలు రాయక దర్శక నిర్మాతలని ఏడిపించి . పాటలు వ్రాసి ప్రేక్షకులని ఏడిపించి మనస్సు కవి మన సుకవి ఆత్రేయ. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏకన్నీటి వెనక దాగివున్న బడబాగ్ని వేడిని వాడైన పదాలతో చెప్పిన తాత్వికుడు పూలదండ‌లో దారం దాగివున్న చందంగా లోతైన భావనలు ఆ పాటలో దాగివున్నాయి. చిటపట చినుకులు పడినప్పుడల్లా కవిత్వం గుబాళింపు మట్టి వాసనతో మిళితమౌతుంది. మనస్సుని మురిపెంగా తాకుతుంది. కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ మనిషిపోతే మాత్రమేమి మనసు ఉంటది మనసుతోటి మనసెపుడో కలసిపొతదీ.. చావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ..జనమజనమకది మరీ గట్టిపడతదీ మనసు మీద మనసు పడ్డ మనసున్న మనిషాయన. మనసు పడే వేదన అక్షరరూపం పొందితే ఆయన రూపమే దాలుస్తుంది. ఆయనకీ మనసుకు అంత దగ్గర సంబంధం వుంది. ఆయనే కిళాంబి వెంకట నరసింహాచార్యులు.
రాత్రేయ నుంచి ఆత్రేయ వ‌ర‌కూ…
కొందరాయన్ను రాత్రేయన్నారు. అందరూ నిండు మనసుతో ఆత్రేయ అని పిలుచుకున్నారు. మనిషి, మనసు, మమత, దేవుడు, విధి, ప్రేమ, విరహం ఇవి ఆత్రేయ కవితా వస్తువులు. వాటితోనే మనసును తాకే పాటలు రాశారు. విచిత్రమేమిటో కానీ ఆత్రేయ వాక్యం రాస్తే అది పాటయ్యేది. మామూలు పదాలు రాసినా పదికాలాల పాటు నిలిచే గీతమయ్యేది. అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. పేరు చివరిభాగాన్ని ముందుకు తీసుకొచ్చి దానికి గోత్రనామాన్ని తగిలించేసుకుని ఆచార్య ఆత్రేయ అయ్యారు. నెల్లూరు జిల్లా సూళ్లురుపేట తాలూకా ఉచ్చూరుకు దగ్గరగా ఉన్న మంగళంపాడులో మే 7, 1921న సీతమ్మ, కృష్ణాచార్యుల దంపతులకు జన్మించారు. మేనమామ వదదాచార్యలు దగ్గర తెలుగు సాహిత్యాన్ని నేర్చుకున్నారు. రచయితను బట్టి సినిమాకు ప్రేక్షకులు వెళ్లడం అనేది మొదలయ్యిందే ఆత్రేయ నుంచి! చిన్న చిన్న పదాలతో బరువైన భావాలను పలికించడం ఆత్రేయకే సాధ్యం. సినిమా పాటకు రంగు, రుచి, వాసన కలిగించింది ఆత్రేయనే! సినిమా పాటకు సరికొత్తఊపిరి పోసి, దానికి సరికొత్త ఒరవడిని దిద్దింది కూడా ఆయనే! కే.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన దీక్షతో ఆయన సినిమారంగంలో అడుగుపెట్టారు. మొదటి పాట పోరా బాబు పో, పోయి చూడు లోకం పోకడ అన్న పాటతోనే పాపులరయ్యారు. ఆత్రేయ మనసుకవి. మనసు గురించి ఎంతగా మనసు పెట్టి రాస్తారో వయసు గురించి, ఆ వయసు పులకరింతల గురించీ, ఆ వయసు చేసే తుంటరిపనుల గురించీ అంతే గడుసుతనంగా రాస్తాడు. మరో చరిత్రలోని పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు పాట వింటే అర్థమవుతుంది. ఆ వేదనలోంచి వచ్చిన పాటలన్నీ చిరస్మరణీయాలయ్యాయి…దు:ఖం కమ్మేసినప్పుడు ఓదార్పు కావాలి. కంటి నిండా నిదురరావాలి. అప్పుడే కాస్త తేరుకోగలం. మూగమనసులు సినిమాలో పాడుతా తీయగ చల్లగా అనే ఒక్క పాటలో ఆత్రేయ మొత్తం సారమంతా చెప్పేశారు. ఆత్రేయలో శ్రీశ్రీ పరకాయప్రవేశం చేసి రాస్తే ఎలా వుంటుంది? అచ్చంగా తోడికోడళ్లు సినిమాలో కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పాటలా ఉంటుంది. సోషలిస్ట్ భావాలతో కూడిన అద్భుతమైన పాట అది. అందుకే ఇప్పటికీ నిలిచిపోయింది. చిలిపిపాటలు రాశారు. వలపు పాటలూ రాశారు.మంచిచెడు సినిమాలోని రేపంటి రూపం కంటి పాటలో నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి వేయించి నన్నునేనే ఓడిపోమ్మంటి…నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిల్లు రోజు రానీ రమ్మంటి అంటారు. తేలికైన పదాలతో బరువైన భావాలను పలికించడంలో ఆత్రేయకు మించిన వారు లేరు. ఆయన కష్టపడి ఏనాడు రాసింది లేదు. పదాలే ఇష్టపడి ఆయన పాటయ్యాయి. రామపాదాలు సోకిన రాయి అహల్య అయినట్టు ఆయన రాసిన పాటల్లోని కొన్ని వాక్యాలు తెలుగునాట నానుడిగా మారాయంటే అది ఆ కలం బలం మహిమే! ఆత్రేయ పాటరాయడానికి చాలా టైమ్ తీసుకునేవారు. అనుకున్నటైమ్కి పాట ఎప్పుడూ నిర్మాతకి ఇచ్చేవారు కాదు. కానీ మంచి చమత్కారి. ఓ నిర్మాత ఆత్రేయకోసం చోళ హోటల్ బుక్ చేసి, అక్కడ ఉండి తన సినిమాకి పాటలు రాసిపెట్టమన్నాట్ట. ఎంత కాలమైనా ఒక్క పల్లవీ రాసి ఇవ్వలేదట ఆత్రేయ. ఏమని అడిగితే, ఇది చోళ హోటల్. ఇక్కడ పల్లవులు రావడం ఎలా సాధ్యం. ఆత్మబలం సినిమాలోని చిటపట చినుకులు పడుతూ వుంటే పాట అదే చెబుతుంది. జోల పాటలకి మన సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా తల్లి తన పాపాయికోసం పాడే ఈ పాటలు ఎంతో ప్రేమతో నిండి ఉంటాయి. మేనత్తపాడే పాటలు ఇంకానూ.. తోడు నీడ సినిమాలో ఆత్రేయ రాసిన అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా పాట వింటే మీకే తెలుస్తుంది. ఇందులో అమ్మలు కన్నుల్లు తమ్మి పువ్వుల్లు అని ఆత్రేయ చేసిన ప్రయోగం అద్భుతం. ఆత్రేయ కలం నుంచి భక్తి రసం తరాల కొద్దీ పాడుకునేలా సిరాల కొద్దీ ఒలికింది. కలియుగాంతం వరకు తిరుమలవాసుని భక్తులు పాడుకునే పాటలు చాలానే రాశారాయన! శ్రీవేంకటేశ్వర మహత్య్మంలోని శేష శైల వాసా శ్రీ వెంకటేశ పాట, . కలడందురు కలడు కలడను వాడు కలడో లేడో, గజేంద్రమోక్షంలో మకరి బారిన పడిన కరికొచ్చిన సందేహం. అచ్చంగా పోతనామాత్యుడిలాగే ఆత్రేయకూ వచ్చింది ఈ అనుమానం. అందుకే భక్తు తుకారం సినిమాలో ఉన్నావా అసలున్నావా అంటూ నిలదీస్తారు. స్వతంత్రదేశంలోని అసమానతలను. స్థితిగతులను ఆకలిరాజ్యం సినిమాలో సాపాటు ఎటూ లేదు అన్న పాటలో ఆత్రేయ విడమర్చి చెప్పారు. . ఆయన మనకు దూరమయ్యారు. కానీ పాటలతో మనకు రోజురోజుకీ దగ్గరవుతున్నారు. . అందరినీ ఏడిపించినా ఆనందబాష్పాలు కురిపిస్తున్నారు. ఆత్రేయ అన్నట్టుగా పోయినోళ్లందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు మనసుకవి ఆత్రేయ వర్థంతి సందర్భంగా నివాళి. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు)

Vadavalli Sridhar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here