కుల వృత్తులపై కృత్రిమ మేధస్సు పడగ

Date:

బడా వ్యాపారవేత్తల దగ్గర కులవృత్తుల నిపుణులు
(వనం జ్వాలా నరసింహారావు)
హైదరాబాద్ నగరంలో, ఆమాటకొస్తే చిన్నా, చితకా పట్టణాలతో సహా అనేక నగరాలలో, పట్టణాలలో లెక్కకు మించి బంగారు, వెండి దుకాణాలున్నాయి. చాలామందికి తెలిసీ-తెలియని విషయం ఈ దుకాణాలను ఏర్పాటు చేసి నడుపుతున్నదీ, అమ్మకాల ద్వారా లాభాలను ఆర్జిస్తున్నదీ, అనాదిగా కులవృత్తులను నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్న ‘కంసాలులు’ కాదనీ, బడా వ్యాపారవేత్తల దగ్గర వారిలో చాలామంది ప్రత్యక్షంగా-పరోక్షంగా పనిచేస్తుంటారనీ, వారి చేతుల్లో కులవృత్తులు బందీ అయ్యాయనేది. అక్కడక్కడా ఒకరిద్దరో కంసాలులు స్వయంగా వెండి, బంగారు నగల తయారీమీద ఆధారపడి జీవనం వెళ్లదీస్తున్నప్పటికీ, సంపాదన అంతంత మాత్రమేననీ, ఇలాంటివారు ఎంతమంది వున్నారో లెక్కలు లేవని చెప్పవచ్చు. ఆ ప్రయత్నం జరుగుతే మంచిదేమో!
60-70 సంవత్సరాల క్రితంనాటి మాచిన్నతనంలో, ప్రతిగ్రామంలో, కంసాలి, వడ్రంగి, వ్యాపారం చేసుకునే (కోమటి కొట్టు) వైశ్యుడు, వెనుకబడిన వర్గాలతో సహా వ్యవసాయం చేసుకునే వివిధ కులాల వారు, పూజారి, సాలె, కమ్మరి, కుమ్మరి, మోచీ, గాజులు అమ్మేవారు, ఇలా ఎందరో వారివారి కులవృత్తులమీద ఆధారపడి జీవించేవారు. గ్రామీణుల అవసరాలను వారే తీర్చేవారు. కాలానుగుణంగా వస్తున్న శీఘ్ర మార్పుల ప్రభావం వీరిమీద తీవ్రంగా పడడంతో, (తెలంగాణ) ప్రభుత్వం ఏర్పడిననాటి నుండి, ఎంతగా, ఎన్నిరకాల ఆర్ధిక సహాయం, ఇతర రకాల సహాయం అందిస్తున్నప్పటికీ, వీరిలో ఎక్కువ శాతం మంది వారసత్వంగా లభించిన కులవృత్తుల మీద ఆధారపడి పల్లెల్లో నివసిస్తూ జీవనం సాగించలేక నగరాలకు, పట్టణాలకు వలసపోతున్నారు. తప్పు మార్పుదా? పోటీ ప్రపంచానిదా? కులవృత్తుల మీద ఆసక్తి తగ్గిందా? శ్రద్ధపెట్టి అధ్యయనం చేయాల్సిన అంశం.
ఇలా రాయడానికి సందర్భం వున్నది. హిందూ వివాహ సంప్రదాయంలో, ముహుర్తానికి ముందు పెళ్ళి కుమార్తె కాళ్ల బొటన వ్రేలి పక్కనున్న వ్రేళ్ళకు మట్టెలు లేక మెట్టెలు (వెండి రింగ్) తొడుగుతారు. పెళ్లైన అమ్మాయిలు మెళ్లో మంగళసూత్రం, కాలికి మెట్టెలు నిరంతరం ధరించే సంప్రదాయ బద్ధమైన ఆచారాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పాటించకపోవడం జరుగుతుంది. ఉదాహరణకు, శస్త్రచికిత్స చేయించుకునే ముందర, లేదా ఎక్స్ రే తీసే ముందర వీటిని కొంతకాలం తీసేయాల్సిన అవసరం తప్పనిసరి అవుతుంది. ఇలాంటి అవసరం మా శ్రీమతికి కలగడంతో, తీసిన మెట్టెలు, పాదాల వెండిపట్టీలు మెరుగుపెట్టించి తిరిగి ధరించడానికి హైదరాబాద్ అమీర్ పేటలోని ఒక వెండి షాపుకు ఇటీవల ఒకనాడు వెళ్లాం. షాపు యజమాని తన షాపు ముందర, చిన్న సొరుగుల బల్లలో సామాగ్రిని పెట్టుకుని, పనిచేసుకుంటున్న ఒక వ్యక్తికి ఆ పని అప్పచెప్పాడు. కేవలం రు. 150 లకే అతడు ఆపనిని పూర్తిచేసి, అవి ధరించడానికి సహాయం చేసి, తాను ‘కంసాలిని’ అని, సగర్వంగా, సంతోషంగా చెప్పాడు.


ఎందుకో ఆ మధ్యన చదివిన శ్రీమద్భాగవతం గుర్తుకొచ్చింది. విరాట్పురుషుడి సృష్టి రహస్యం కూడా జ్ఞప్తికివచ్చింది. స్వర్గం, భూమి, ఆకాశం ఎలా ఏర్పడ్డాయో, వేదాలు ఎలా పుట్టాయో లాంటి విషయాలు స్ఫురణకు వచ్చాయి. అది సబబో, కాదో, చెప్పడం లేదుకాని, వేదకాలంనాడు చేసిన విభజన గుర్తుకొచ్చింది. వేదాధ్యయనం చేయడానికి బ్రాహ్మణులని, రక్షణ కొరకు క్షత్రియులని, వ్యవసాయం, గోపరిరక్షణ, వ్యాపారం చేయడానికి వైశ్యులని, శూద్రులుగా ఒకనాడు పిలువబడిన కులవృత్తులు చేసుకునే వెనుకబడిన వర్గాల వారని చేసిన విభజన గుర్తుకొచ్చింది. ఆ విభజనలోని హేతుబద్ధత చర్చనీయాంశమే. దీన్నే శ్రీకృష్ణ భగవానుడి (భగవద్గీత) మాటల్లో చెప్పుకోవాలంటే, ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ; తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్’. (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్ణాలవారు గుణకర్మల విభాగాన్ని అనుసరించి ‘నా చేత సృష్టించబడ్డారు’).
అయితే, ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, ఎందుకో కాని, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. చాతుర్వర్ణ వ్యవస్థను, అది వేదకాలం నాడో, మరెప్పుడో, ఎవరు, ఎప్పుడు, ఏకారణాన సృష్టించినప్పటికీ, ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను మాత్రం నిర్విఘ్నంగా నిర్వహించింది. ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని గర్వ పడాల్సిన, లేదా, బాధ పడాల్సిన అవసరం లేకుండా చేసింది. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ కలగలేదు.
కాలం మారింది. ఇప్పుడు వేదాధ్యయనం ఒక కులం స్వంతం ఏమాత్రం కాదు. అర్హత, సామర్థ్యం వున్నవారెవరైనా నేర్చుకోవచ్చు, నేర్పనూవచ్చు. వేదాలమీద భాష్యం రాసినవారిలో బ్రాహ్మణేతర ప్రముఖులు కూడా వున్నారు. రక్షణ సేవల్లో చేరడానికి క్షత్రియ కులంవారే కావాలని నిబంధన లేదు. క్షత్రియేతరులు ఎందరో ఉన్నత రక్షణ స్థానాల్లో పనిచేశారు, చేస్తున్నారు. వ్యవసాయం, గోపరిరక్షణ, వ్యాపారం లాంటివి చేయడానికి అందరూ అర్హులే. వీటి లాభనష్టాలు ఏమిటో కాని, కులవృత్తులు చేసుకునే సర్వ సాధారణంగా వెనుకబడిన వర్గాల వారిమీద ఈ ప్రభావం బాగా పడింది. ప్రభుత్వం ఎన్నివిదాలుగా, ఎంత సహకారం చేసినా, పోటీకి తట్టుకుని నిలబడే పరిస్థితి లేదు. దీన్ని అధ్యయనం చేసి మెరుగుపర్చాలి.
ఒకానొక రోజుల్లో ఇన్ని వెండి-బంగారం దుకాణాలు వుండేవి కావు. వెండి, బంగారం వస్తువులు తయారుచేసే కంసాలితో పెళ్ళి ఆభరణాలన్నీ తయారు చేయించేవారు. ప్రతి గ్రామంలో, నగరం, పట్టణంలో వున్న కంసాలీలతోనే వెండి, బంగారం ఆభరణాలన్నీ తయారు చేయించేవారు. నగరాలలో ఒక అర డజన్ వెండి బంగారు దుకాణాలు వున్నప్పటికీ అవన్నీ కంసాలివారివే. కావాల్సిన వస్తువులన్నీ వారే నైపుణ్యంతో (కల్తీ లేకుండా) తయారు చేసి ఇచ్చేవారు. అప్పట్లో ‘మంగళ సూత్రం’, ‘మెట్టెలు’ కంసాలి తయారు చేసి తనదగ్గరే వుంచుకుని, నమ్మకంగా వివాహానికి కొన్ని గంటల ముందర తెచ్చి ఇచ్చేవాడు. పెళ్లికి ముందర పెళ్లివారి ఇంట్లో ఒక రాత్రి వుండ కూడదనేది ఒక ఆచారం. ఇప్పుడు అంతా యాంత్రీకమై, అసలు వెండి, బంగారు ఆభరణాలు కంసాలులే చేస్తున్నారా? మరెవరైనానా? ఎక్కడ? పోనీ ఆ ప్రదేశంలో కంసాలులకు ఉపాధి వున్నదా లేదా? సంపాదన ఎంత? తెలీదు. లెక్కలు లేవు.
ఇది ఒక్క కంసాలుల విషయంలోనే కాదు. గ్రామాలలో నివసించే ఒకరిద్దరు వడ్రంగి కులస్తులు వ్యవసాయ పనిముట్లయిన ‘అరకలు’, ‘నాగళ్లు’, ‘బురద నాగళ్లు’, ‘దంతెలు’, ‘బండి రోజాలు’ లాంటివి తయారు చేస్తుంటే బలే ముచ్చటగా వుండేది. బండి చక్రాలకు రోజాలను అమర్చడం కష్టతరమైన పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి ‘ఇరుసు’ తయారు చేసే విధానం కూడా చాలా కష్టమైంది. ఇప్పుడు వ్యవసాయం మొత్తం యాంత్రీకమైపోయింది. ట్రాక్టర్లు వచ్చిన కొత్తలో వింతగా వుండేది. సర్దుకునే లోపునే నాటు మిషన్లు, కోత మిషన్లు, తూర్పారబట్టే మిషన్లు, ఇలా ఎన్నో వచ్చాయి. వడ్రంగులకు ఉపాధి లేకుండా పోయింది. పల్లెలనుండి వలసపోయిన అలాంటివారు వేరే వృత్తుల్లో వున్నారా? లెక్కలు లేవు!!!
మా చిన్నతనంలో ప్రతి గ్రామంలో ‘సాలె’ వారని వుండేవారు. గ్రామస్తులకు అవసరమైన దుప్పట్లు లాంటివి వారే నేసి ఇచ్చేవారు. ‘ఏడు మూళ్ళ దుప్పట్లు’ అని మా చిన్నతనంలో దొరికేవి. అవి చలి కాలంలో, వేసవి కాలంలో కూడా ఉపయోగపడేవి. ఇప్పుడు చాలా గ్రామాలలో అవి లభ్యం కావడం లేదు. ప్రతిగ్రామంలో బట్టలు కుట్టే దర్జీ వారుండేవారు. రెడీమేడ్‌ బట్టలు విరివిగా రావడం వల్ల దర్జీల దగ్గర బట్టలు కుట్టించుకొనేవారు తక్కువయ్యారు. కుట్టడానికి అవసరమయ్యే సరంజామా ధరలు పెరగడం వారిని మరింత ఇబ్బందికి గురి చేసింది. దీనితో వీరి జీవన భృతికి ఆటంకం ఏర్పడి కుటుంబ పోషణ జరగడం కష్టంగా తయారైంది. ఇప్పుడు దుర్భిణీ వేసుకుని చూసినా దర్జీ కనపడడు. వీరి లెక్కలు కూడా లేవు!!
అలాగే గ్రామీణుల పాదరక్షల అవసరాలను తీర్చే మోచీలు కూడా తమ జీవనోపాధి కోల్పోవడానికి కారణం వారి వృత్తిని వ్యాపారులు తమ లాభార్జన కోసం చేపట్టి వీరిని పోటీలో నిలబడకుండా చేయడమే. ఒకప్పుడు కేవలం నాయీ బ్రాహ్మణులే (గ్రామాల్లో మంగలి అని పిల్చేవారు) చేసే పనిని, నగరాలలో పార్లర్లని, సెలూన్లని, మసాజ్ లని, రకరకాల పేర్లతో అనేకమంది వ్యాపార ధోరణితో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సహాయం వల్ల గ్రామాలలో కొందరు ఆ వృత్తిని వదలకపోయినప్పటికీ, పలువురు నగరాలకు, పట్టణాలకు వలసపోయారు. అభివృద్ధి వల్ల జరుగుతున్నది మంచా? చెడా? మంచీచెడూల మిశ్రమమా?
గోరేటి వెంకన్న గారి పాట ‘పల్లె కన్నీరు పెడుతుందో’ లోని అక్షరం, అక్షరం గుర్తుకొస్తున్నది. వన్నె తగ్గి, చిన్నబోయిన కంసాలి వీధులు; దుమ్ము పేరిన కమ్మరి కొలిమి, మొద్దు బారిన పెద్దబాడిస; సడుగులిరిగిన సాలెల మగ్గం; చేతులిరిగిపోయిన చేతివృత్తులు; పనులెతుక్కుంటూ పట్నంపోయిర విశ్వ కర్మలు; మూలపొయ్యి సిలువెక్కిపోయిన మేరోళ్ళ సేతులకత్తెర; సప్పుడాగిన కుట్టు మిషన్లు; ‘పల్లెకు వృత్తులు కూలె, ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె’ ….. ఇలా ఎన్నో గుర్తుకొచ్చాయి.
‘కృత్రిమ మేధస్సు’ చెప్పినట్లు నడుచుకోవడమే భవిష్యత్తులో మన కర్తవ్యం కానున్నదేమో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...