Friday, September 22, 2023
HomeArchieveపోల‌వ‌రం మా జీవ‌నాడి

పోల‌వ‌రం మా జీవ‌నాడి

అంచ‌నాల‌కు ఆమోదం అవ‌శ్యం
అప‌రిష్కృతంగానే తెలంగాణ డిస్కం బ‌కాయిలు
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ సానుకూల స్పంద‌న‌
ప్ర‌ధాన‌మంత్రితో ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ
గంట‌సేపు సుహృద్భావ వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు
స‌మ‌స్య‌లు ఓపిక‌గా విన్న దేశాధినేత‌
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5
రాష్ట్రానికి సంబంధించిన‌ వివిధ అంశాల‌పై ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి నివేదించారు. కీల‌క విష‌యాను చ‌ర్చించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాలు, క‌డ‌ప స్టీల్ ప్లాంట్‌, జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం అర్హుల ఎంపిక‌లో హేతుబ‌ద్ధ‌త‌, తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన బ‌కాయిలు త‌దిత‌ర అంశాల‌ను జ‌గ‌న్ ప్ర‌ధాని దృష్టికి తెచ్చారు. విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. గంట‌కు పైగా స‌మావేశం సాగింది. జ‌గ‌న్ నివేదించిన అంశాల‌పై న‌రేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారు. ప్ర‌ధాన మంత్రి నివాసంలో మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌గ‌న్ ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ప్ర‌ధానికి విన్న‌వించిన అంశాలు ఇలా ఉన్నాయి..
స‌వ‌రించిన పోల‌వ‌రం అంచ‌నాలు ఆమోదించ‌రూ!
– పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరుతున్నాను. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
– ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ – పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుందని జ‌గ‌న్ తెలిపారు.
– పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని కోరుతున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తిరస్కరించింది. కాంపొనెంట్‌వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను ప‌రిగణన‌లోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. నిధులను సకాలానికే విడుదలచేయాలని జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు.
– పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని కోరారు.
ల‌బ్ధిదారుల గుర్తింపు విధానం లోప‌భూయిష్టం
– జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంద‌నీ, దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతోంద‌నీ జ‌గ‌న్ ప్ర‌ధాని దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్‌ అందిస్తుంటే, ఇందులో కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోంది. మిగిలిన 0.56 కోట్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చుచేస్తూ రేషన్‌ ఇస్తోంది. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లోని 50శాతం ప్రజలకు రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఏపీలో మాత్రం 61శాతం రూరల్, 41శాతం అర్బన్‌ ప్రజలకు మాత్రమే రేషన్‌ను ఇస్తున్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
భోగాపురానికి తాజా క్లియ‌రెన్స్ అవ‌స‌రం
– భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ గడువు ముగిసిందనీ, తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వాలనీ జ‌గ‌న్ ప్ర‌ధానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు పౌరవిమానయాన శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్ర‌ధానిని కోరారు.


క‌డ‌ప స్టీల్స్‌కు చేయూత‌నివ్వండి
– రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌ధానికి గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్‌ ఇప్పటికీ నివేదికను ఇవ్వలేదన్నారు. రాయలసీమ, కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నడుంబిగించిన విష‌యాన్నీ ఆయ‌న ప్ర‌స్తావించారు. దీనికోసం వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశామ‌నీ, ఈమేరకు కేంద్రం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇత‌ర విన‌తులు
– ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రాంతాలను కేటాయించాలని కోరారు. 16 చోట్ల బీచ్‌శాండ్‌ ఉన్న ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించాలని కోరారు. అటమిక్‌ ఎనర్జీ విభాగం ఇప్పటికే 2 ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించింద‌నీ, సంబంధిత‌ అనుమతులు కూడా పెండింగులో ఉన్నాయనీ చెప్పారు. మిగిలిన 14 ప్రాంతాలకు సంబంధించి కేటాయింపులు, అనుమతులకు ఆదేశాలివ్వాలని కోరుతున్నట్టు చెప్పారు.
– మహమ్మారులు సోకినప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ఎంత కీలకమో ఇటీవల కోవిడ్‌ పరిస్థితుల్లో వెల్లడైంది. ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను గణనీయంగా పెంచడానికి ఏపీ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరుచేసింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 12 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు.
విభజనతో రాష్ట్రానికి భారీ నష్టం
– రెవిన్యూ గ్యాప్‌ భర్తీకి ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని ప్ర‌ధానికి జ‌గ‌న్ నివేదించారు. తత్కార‌ణంగా ఆర్థికంగా ఏపీకి నష్టం వాటిల్లిందన్నారు.
– విభ‌జన నాటికి పెండింగ్‌ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సి బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు రూ.32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు చేసింది. ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీచేయాలి.
– రాష్ట్ర విభజన వల్ల 58.32శాతం జనాభా విభజిత ఆంధ్రప్రదేశ్‌కురాగా, కేవలం 46శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9శాతం జానాభా ఉన్న హైదరాబాద్‌ నగరంను కోల్పోవడంద్వారా ఆ నగరం నుంచి అందే 38శాతం రెవిన్యూను కోల్పోయాం. తర్వాత వచ్చిన కోవిడ్‌.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసింది. దాదాపు రూ. 33,478 కోట్ల మేర ఆదాయం కోవిడ్‌ కారణంగా రాకుండాపోయింది. కోవిడ్‌ నివారణా, చికిత్సలకోసం మరో రూ.7,130 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా రాష్ట్రానికి తగ్గడం మరొక ప్రతికూల పరిణామం.
– గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారు. ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా… రాష్ట్ర రుణపరిమితుల్లో కోత విధిస్తామని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది. విధించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకురాలేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా కోరుతున్నాం.
– తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజించిన నాటినుంచీ జూన్‌ 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్‌ పంపిణీకి సంబంధించి ఈమొత్తాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈమేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాం. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు తమ ఆర్థిక నిర్వహణకోసం ఈ డబ్బు చాలా అవసరమ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధానికి విన్న‌వించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ