Thursday, September 28, 2023
HomeAP Newsత్యాగ‌ధ‌నుల‌కు సెల్యూట్‌

త్యాగ‌ధ‌నుల‌కు సెల్యూట్‌

మ‌నంద‌రి సైనికుడే పోలీసు
పోలీసు అమ‌ర‌వీరుల దినోత్స‌వంలో జ‌గ‌న్‌
అమ‌రుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ఏపీ సీఎం
విజయవాడ, అక్టోబ‌ర్ 21:
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు.


ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ మనందరి సైనికుడే పోలీసు సోదరుడని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబరు 21 నాడు పోలీసుల అమరవీరుల్ని స్మరించుకుని, వారికి నివాళులు అర్పిస్తున్నామ‌ని చెప్పారు. సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలు కూడా లెక్కచేయని మనందరి సైనికుడే మన పోలీసు సోదరుడని నివాళి అర్పించారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే


కరణ్‌ సింగ్‌ స్ఫూర్తిగా…
కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైన ఈ సామాజికభాధ్యతను నిర్వహిస్తున్నారు. వారి విధిలో ఉన్నప్పుడు, ఆ విధిని నిర్వహిస్తున్నప్పుడు అనుకోని సంఘటనలు ఎన్నింటినో వారందరూ ఎదుర్కొంటూ ఉంటారు. వీరందరికీ సమాజం తరపున, ప్రభుత్వం తరపున మనమంతా అండగా ఉండాలి, ఉంటామని కూడా తెలియజేస్తున్నాను.

కర్తవ్యాన్ని దైవంగా భావించి 1959 అక్టోబరు 21న చైనా సైనికులని ఎదురించి, సాహసోపేతంగా జరిగిన ఆ పోరాటంలో ప్రాణాలను సైతం వదిలిన కరణ్‌సింగ్‌ స్ఫూర్తిని ఈ పోలీసు అమరవీరుల దినోత్సవానికి 63 సంవత్సరాల క్రితం నాంది పలికింది.


త్యాగధనులకు సెల్యూట్‌…
2022 పోలీసుఅమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం తరపున, ప్రభుత్వం తరపున సెల్యూట్‌ చేస్తున్నాను.


అమరులైన వారి కుటుంబాలకు అండగా…
గత సంవత్సర కాలంలోనే దేశవ్యాప్తంగా కూడా విధి నిర్వహణలో దాదాపు 261 మంది పోలీసులు అమరులైతే వారిలో రాష్ట్రానికి చెందిన వారు 11 మంది. వీరిలో ఈ ఏడాది కాలంలో ముగ్గురు పోలీసులు కోవిడ్‌ సమయంలో చనిపోయారు. విధి నిర్వహణలో సమాజం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను.

పోలీసు శాఖ కష్టనష్టాలను తెలిసి ఉన్న ప్రభుత్వంగా వారి బాగోగులు మీద శ్రద్ధ పెట్టే ప్రభుత్వంగా శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి, పని ఒత్తిడి తగ్గించడానికి భారీ నియామకాలకు అనుమతి ఇచ్చాం.


6511 పోలీసు ఉద్యోగాల భర్తీ….
అందులో భాగంగా 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ నిన్ననే జీవో కూడా జారీ చేశాం. ఈ స్ధాయిలో ఇన్నివేల ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా జరగలేదు.


ఈ 6511 పోస్టుల భర్తీలో భాగంగానే చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్‌ బెటాలియన్‌ దళాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. పోలీసు శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవవేతనం కూడా మన హయాంలోనే పెంచాం.

ఈ 6511 కొత్త పోలీసు ఉద్యోగాలలో కూడా హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ పోలీసుశాఖలోనే 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే నియమించాం.


పోలీసు వ్యవస్ధలో నూతన మార్పులు….
దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు వ్యవస్ధలోకి మార్పులు వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్, దిశపోలీస్‌ స్టేషన్లు, దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రతి జిల్లాలో చేపట్టిన విషయం మీకు తెలుసు. రాష్ట్రంలోని దాదాపుగా 1.33 కోట్ల అక్కచెల్లెమ్మల ఫోన్‌లలో దిశ యాప్‌ డౌన్లోడ్‌ అయింది. దాదాపు 1.17 కోట్ల అక్కచెల్లెమ్మల ఫోన్‌లలో దిశయాప్‌ రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి అయింది.


దిశ యాప్‌ వల్ల ఆపదలో ఉన్నామని చెప్పి 23,039 మంది అక్కచెల్లెమ్మలు పిలుపునిస్తే పోలీస్‌ అన్నదమ్ములు ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డారు.
2323 కేసులు పెట్టారు. 1237 రెస్క్యూ ఆపరేషన్లు కూడా చేశారు .అంటే 1237 చోట్ల ఆపద జరగకముందే ఆ అక్కచెల్లెమ్మలను రక్షించిన పరిస్థితులు కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూస్తున్నాం.

ఆపద జరిగిన తర్వాత కాకుండా జరగకముందే వాటిని నివారించగలుగుతున్నాం. సెల్‌ఫోన్‌ తీసుకుని పోతున్న ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్‌లో దిశ యాప్‌తో పోలీసు సోదరుడు తనకు తోడుగా ఉన్నాడన్న భరోసా అక్కచెల్లెమ్మల మనసులో కల్పించగలిగాం.


మూడేళ్లలో మెరుగుపడిన పోలీసుల పనితీరు….
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు గత మూడు సంవత్సరాలలో మెరుగుపడింది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణకూడా తెలియజేస్తున్నాను. మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణకు పట్టే సమయం గత ప్రభుత్వ హయాంలో 2017లో 160 రోజులు పడితే.. 2018లో 164 రోజులు పట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021కే అది 79 రోజులకు తగ్గింది. ఈ యేడాదికి అది 42 రోజులకే ఇంకా తగ్గిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అంటే దానర్ధం మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణను కేవలం 42 రోజుల్లోనే పూర్తి చేసి దోషులను న్యాయస్ధానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తోంది.


ఇది గొప్ప మార్పు. దీనితో పాటు ఇక్కడ గొప్ప జవాబుదారీ తనం కూడా రాష్ట్రంలో కనిపిస్తోంది. మన పోలీసులు తీసుకొచ్చిన మార్పు ఇది. అదే సమయంలో మనం తీసుకున్న అనేక చర్యలతో ప్రజల్లో అవేర్‌నెస్‌ క్రియేట్‌ చేయగలిగాం.

నేరానికి సంబంధించిన ఫిర్యాదు చేసే టెక్నాలజీలో మార్పు తీసుకొచ్చాం. వెసులుబాటులో మార్పు తీసుకొచ్చాం. ఫిర్యాదుదారుడికి తోడ్పాడుగా నిలిచే కార్యక్రమం చేస్తున్నాం. సంబంధిత పరిజ్ఞానాన్ని బాగా పెంచగలిగాం. కాబట్టి ఫిర్యాదులు పెరిగి నేరాలు తగ్గుముఖం పట్టాయని పోలీసుల పక్షాన సగర్వంగా తెలియజేస్తున్నాను.


వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
ఆపదలో ఉన్నవారికి, నేరం సంభవించక మునుపే నిమిషాల్లోనే అక్కడకి చేరుకుని రక్షించే కార్యక్రంలో చురుగ్గా పాల్గొన్న ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా పోలీసుశాఖకు ఇవ్వబోతున్నాం.


మహిళలు, పిల్లలు, అణ గారిన వర్గాల భద్రతే….
ఒక విషయం స్పష్టంగా ఈరోజు తెలియజేస్తున్నాను. శాంతిభద్రతలు ముఖ్యంగా మహిళలు, పిల్లలు అణగారిన సామాజిక వర్గాల భద్రత.. మనకు ఈ విషయాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలన్న సంగతి ఏ ఒక్కరూ మర్చిపోవద్దని పోలీసు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క విషయం తెలియజెప్పాలనుకుంటున్నాను.

మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పోలీసుశాఖకు మంత్రిగా ఈరోజు ఎవరున్నారు అంటే… ఒక మెసేజ్‌ పంపే విధంగా ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. ఈ రోజు ఉన్న వనితమ్మతో పాటు అంతకుముందు ఉన్న సుచరితమ్మ ఇద్దరూ దళిత మహిళలే. ఎందుకు తెలియజేస్తున్నాను అంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, అణగారిన వర్గాలకు వీరి తరపున ఎంతగా తోడుగా నిలబడుతోందో చెప్పడమే కాకుండా.. నిలబడబోతున్నామన్న సంకేతం ఇవ్వడాని కోసం చేస్తున్న చర్య అని తెలియజేస్తున్నాను.

ఈ బాధ్యతను మన భుజస్కంధాలమీద వేసుకున్నాం. అందుకనే శాంతిభద్రతల విషయంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, అణగారిన సామాజిక వర్గాల భద్రకతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత గల అంశాలని చెప్పి ఎవరూ మర్చిపోవద్దని ప్రతి పోలీసు సోదరుడికి తెలియజేస్తున్నాను.


మరో ముఖ్య విషయం ఏమిటంటే…
మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ఇవాళ ఇంటింటికీ, గ్రామ గ్రామాన చేరడం వల్ల.. గతంలో మావోయిజం, తీవ్రవాదం వైపు ప్రభావితమైన ప్రాంతాల్లో గత కొంత కాలంగా తీవ్రవాదం తగ్గుముఖం పట్టిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దానర్ధం మనసులు గెల్చుకుని, మనుషులకు అండగా నిలబడ్డం ద్వారా శాంతిని, భద్రతను పెంచుకోగలుగుతాం అన్న విషయానికి అద్దం పడతాయి.


ఇవన్నీ ఒకవైపు చెప్తూనే..
మరోవైపు పోలీసులకు సంబంధించి ఇంకా చేయవల్సినవి, పెండింగ్‌లో ఉన్నాయి అన్న సంగతి నాకు తెలుసు. ముఖ్యంగా పోలీసులుకు కచ్చితంగా వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలన్నది నా మనసులో మాట. ఈ మధ్య కాలంలో డీజీపీని అడిగాను. వీక్లీఆఫ్‌ అమలవుతోందా అని అడిగాను. సిబ్బంది ఇంకా కొరతగానే ఉంది కాబట్టి.. పూర్తిగా అనుకున్న స్ధాయిలో దాన్ని అమలు చేయలేకపోతున్నాం అని చెప్పారు.

ఆ మాట అన్న వెంటనే 6511 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది. గతప్రభుత్వం హయాంలో కేవలం 2700 ఉద్యోగాలు మాత్రమే ఐదేళ్లలో ఇచ్చారు. ఇవాళ 6511 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూనే.. మరో 16వేల చెల్లెమ్మల ఉద్యోగాలు మహిళా పోలీసులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే భర్తీ చేశాం.


హామీ ఇస్తున్నాను…
అయినప్పటికీ వీక్లీ ఆఫ్‌ అనుకున్న స్ధాయిలో అమలు చేయలేకపోతున్నామన్న డీజీపీ మాటలు నాకు గుర్తుంటాయి. ఆ దిశగా మనస్ఫూర్తిగా అడుగులు వేయడానికి అన్నివిధాలుగా ప్రయత్నం చేస్తాను అని ప్రతి పోలీసు సోదరుడికి హామీ ఇస్తున్నాను.

మీకు సంబంధించిన అన్ని విషయాలలోనూ, అన్ని రకాలుగా మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధితో తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాను.


చివరిగా….
సమాజం కోసం విధి నిర్వహణ చేస్తున్న మీకు, మీ కుటుంబాలకు, మీతో పాటు రాష్ట్ర ప్రజలకు, మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటూ . జైహింద్ అని నిన‌దించారు సీఎం జ‌గ‌న్‌.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ