అంత‌రిక్షానికి ఆంధ్ర యువ‌తి

0

ప‌ట్టుద‌ల‌తో ల‌క్ష్యాన్ని సాధించిన వైనం
అమ్మా! అలా స్పేస్‌లోకి వెళ్ళొస్తా! అంటున్న శిరీష బండ్ల‌
(సుబ్ర‌హ్మ‌ణ్యం వి.ఎస్. కూచిమంచి)

అమ్మా అలా స్పేస్‌లోకి వెళ్ళొస్తాన‌మ్మా అంటే ఆ త‌ల్లి మ‌న‌సు ఎలా ఉంటుంది? నాన్నా ఓకేనా అంటే తండ్రి మ‌దిలో ఎలాంటి ఆలోచ‌నా త‌రంగాలు రేగుతాయి? ఏదెలా ఉన్నా ఆ అమ్మాయి తాను అనుకున్న‌ది సాధిస్తోంది. చీరాల‌లో పుట్టి మూడేళ్ళ వ‌య‌సులో అమెరికా చేరిన ఆ బుడ‌త గ‌గ‌నం నుంచి ఇలాత‌లాన్ని చూడ‌బోతోంది. టెక్సాస్‌, హూస్ట‌న్‌ల‌లో ఉన్న‌ప్పుడు వారున్న వీధి చివ‌రిలోనే జాన్స‌న్ స్పేస్ సెంట‌ర్ ఉండేది. అనేక సార్లు ఆ ప‌రిస‌రాల్లో తిరిగింది. వైజ్ఞానిక అధ్య‌య‌నం కోసం మ‌రికొన్నిసార్లు లోప‌లికి కూడా వెళ్ళింది. అప్పుడు అనుకుంది నేను ఆస్ట్రోనాట్ ఎందుకు కాకూడ‌దు అని. ఆ ఆలోచ‌న క్ర‌మేపీ బ‌ల‌ప‌డింది.

త‌ల్లిదండ్రులు, అక్క‌ల‌తో శిరీష బండ్ల‌(కుడి నుంచి రెండో వ్య‌క్తి) Pic courtesy: Chandra Kanneganti

అప్ప‌ట్లో ఆస్ట్రోనాట్ కావాలంటే నాసా ఒక్క‌టే ఆధారం. బ్యాడ్‌ల‌క్ ఏమిటంటే ఆ చిన్నారికి కాస్త దృష్టిలోపం ఉంది. ఆస్ట్రోనాట్ కావాలంటే మంచి దృష్టి అవ‌స‌రం అని తెలిసి, ఇక ఆ ఆశ‌లు వ‌దులుకుంది. అక్క‌డి నుంచి 2004 ప్రాంతానికి వ‌స్తే… ప‌రిస్థితులు ఎంత‌గానో మారిపోయాయి. అంత‌రిక్ష రంగంలోకి ప్రైవేటు ఏజెన్సీలు ప్ర‌వేశించాయి. స్పేస్ షిప్ వ‌న్ అంత‌రిక్షంలోకి వెళ్ళి వ‌చ్చిన మొద‌టి ప్రైవేట్ వెహికిల్‌గా నిలిచింది. ఈ సంగ‌తి తెలుసుకున్న ఆ అమ్మాయికి కొత్త ఆశ చిగురించింది. ఏరోస్పేస్ ఇంజినీర్ కావాల‌ని దృఢంగా నిశ్చ‌యించుకుంది. సాధించింది. ఆ యువ‌తే శిరీష బండ్ల‌.

చీరాల ఇంటిలో పూల జ‌డ‌తో చిన్నారి శిరీష‌ Pic courtesy: Chandra Kanneganti


గోంగూర ప‌చ్చ‌డి..ఆవ‌కాయ‌
దేశానికి రాజైనా త‌ల్లికి సంతాన‌మే కదా…అందుకే భార‌త్‌లో పుట్టిన శిరీష‌కు భార‌తీయ వంట‌కాలే ఎక్కువ‌గా న‌చ్చుతాయి. మూడేళ్ళ దాకా చీరాల‌లో పెరిగిన శిరీష త‌ల్లిదండ్రుల‌తో ఒక్లాహామాలో స్టిల్ వాట‌ర్‌కు వ‌చ్చారు. గోంగూర ప‌చ్చ‌డి.. ఆవ‌కాయ‌… ముద్ద‌ప‌ప్పు… ఇవీ శిరీష బండ్ల‌కు ఇష్ట‌మైన ఆహారం. చేప‌ల పులుసు అంటే మ‌రింత ఇష్టం. బీర‌కాయ కారం పెట్టిన కూర ఇంకా ఇష్టం. భార‌తీయ సంప్ర‌దాయానికి పెద్ద‌పీట వేస్తుంది. బంధుత్వాలు..బాంధ‌వ్యాలు ఆమెకు అత్యంత ప్రియ‌త‌మ‌మైన‌వి.

(ఎడ‌మ వైపున ఉన్న‌ది చిన్నారి శిరీష‌. మిగిలిన ఇద్ద‌రిలో ఒక‌రు ఆమె అక్క ప్ర‌త్యూష‌, మేన‌త్త‌గారి అబ్బాయి విరించి) Pic courtesy: Chandra Kanneganti


ఇంజ‌నీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చేయ‌కుండా ఎమ్బీఏ చ‌ద‌వ‌డం వెనుకా ఎంతో దూర‌దృష్టి క‌న‌బ‌రిచింది శిరీష‌. సాధార‌ణంగా పీజీ చేస్తే ఆ త‌ర‌వాత డాక్ట‌రేట్ చేయ‌డం ఓ మంచి ఉద్యోగంలో సెటిలైపోవ‌డం..చేస్తుంటారు..కానీ శిరీష మాత్రం త‌న దృష్టిని పెరుగుతున్న స్పేస్ బిజినెస్‌మీద కేంద్రీక‌రించింది. స్పేస్ బిజినెస్‌లో ఎలా ఎద‌గాలో నేర్చుకోవడానికి ఎమ్బీఏను సాధనంగా మార్చుకుంది. జార్జి వాషింగ్ట‌న్ యూనివ‌ర్ధ్శిటీలో ఆమె చ‌దివిన ఆ కోర్సు స్పేస్ బిజినెస్ లోతుల్ని చూసేలా చేసింది. అప్ప‌టి వ‌ర‌కూ త‌న విద్యాభ్యాసంలో బిజినెస్ కోణం లేని అంశాన్ని గ‌మ‌నించిన శిరీష ఆ లోటును కూడా తీర్చుకుంది.


గాల్లో తేలిన‌ట్టుందే….
జీరో గ్రావిటీ విమానంలో ఎగిరే అవ‌కాశం రావ‌డాన్ని మ‌రిచిపోలేనంటోంది శిరీష‌. ఆ అవ‌కాశం క‌ల్పించిన నాసాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఒక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌ను ఎలా మొద‌లు పెట్టాలి నుంచి ఎలా ముగించాలి వ‌ర‌కూ క్షుణ్ణంగా తెలుసుకునే అవ‌కాశం క‌ల్పించింద‌ని పేర్కొంది. మైక్రో గ్రావిటీ అప్లికేష‌న్స్ మించి నేర్చుకునే అవ‌కాశం క‌లిగింద‌ని చెబుతోంది శిరీష‌.


అంత‌రిక్ష రంగంలోకి త‌న ప్ర‌వేశానికి దారి తీసిన ప‌రిస్థితుల్ని ఇలా వివ‌రించింది శిరీష‌
కాలేజీ చ‌దువు పూర్త‌యిన త‌ర‌వాత‌, వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ స్పేస్ ఫ్లైట్ ఫెడ‌రేష‌న్‌లో స్నేస్ పాల‌సీ ఉద్యోగం ఇంట‌ర్వ్యూకు వెళ్లా. ఉద్యోగం వ‌చ్చింది. నా ముందు ప‌నిచేసిన మాథ్యూ ఇస‌కోవిట్జ్ స్పేస్ పాల‌సీని నాకు ఒక క్రాష్ కోర్సు మాదిరిగా నేర్పించారు. స్పేస్ పాల‌సీ క‌మ్యూనిటీ గురించి ఆయ‌న నాకు పూర్తిగా అవ‌గాహ‌న క‌లిగేలా చేశారు. మా నిర్ణ‌యాలు, ప్రోగ్రామ్స్‌లో స్పేస్ పాల‌సీ చాలా కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌థ్యూ 2017లో మ‌ర‌ణించారు. పాల‌సీ, బిజినెస్‌, ఇంజినీరింగ్‌ల‌లో మాథ్యూకు ప‌రిపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉంది. భ‌విష్య‌త‌రాల‌కు ఆయ‌న స్ఫూర్తిని అందించాల‌నే ఉద్దేశంతో మాథ్యూ ఇస‌కోవిట్జ్ ఫెలోషిప్‌ను ఆయ‌న కుటుంబం ప్రారంభించింది. ఈ ప్రొగ్రామ్‌లో మొద‌టి సంవ‌త్స‌రం కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించే బాధ్య‌త‌ను ఆ కుటుంబం నాకు అప్ప‌గించింది.


వ‌ర్జిన్ గెలాక్టిక్‌, వ‌ర్జిన్ ఆర్బిట్ ఎన్‌టైల్ కంపెనీల‌కు సంబంధించిన ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ను నేను ప‌ర్య‌వేక్షిస్తాను. వాషింగ్ట‌న్ డిసిలో చిన్న ఆఫీసు అందులో చిన్న టీమ్‌.. ఇది కంపెనీల వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతుంది. విభిన్న‌మైన విద్యా రంగాల నుంచి వ‌చ్చే వారికి నేనిచ్చే స‌ల‌హా ఒక్క‌టే. బాగా అధ్య‌య‌నం చేయండి. అవ‌గాహ‌న పెంచుకోండి. మా స్పేస్ ఇండ‌స్ట్రీ కార‌ణంగా మేమెంతో మందిని క‌లిసి, క‌లిసి ప‌నిచేశాం. విజ‌యాలు సాధించాం.
తొలి తెలుగు యువ‌తిగా అంత‌రిక్ష అందాల్ని ఆస్వాదించబోతున్న శిరీష బండ్ల‌కు వ్యూస్ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తోంది. కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతార‌న్న నానుడికి ప్ర‌త్య‌క్షం నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ప‌ట్టుద‌ల‌తో తాను అనుకున్న గ‌మ్యాన్ని చేరుకుంది శిరీష‌. ఇదే సంద‌ర్భంలో మ‌నం మ‌రొక యువ‌తిని గుర్తుచేసుకోవాల్సి ఉంది.

స్పేస్ ఎక్స్‌కు సంబంధించిన ఓ మిష‌న్‌కు నేతృత్వం వ‌హించిన సీత శొంఠి కూడా అచ్చ‌తెలుగువారే. కోన‌సీమ వారి స్వ‌స్థ‌లం. తండ్రి వృత్తిరీత్యా అమెరికాకు వ‌ల‌స వెళ్ళారు. అక్క‌డే పెరిగి, చ‌దువుకున్న సీత కూడా అంత‌రిక్ష రంగం అంచుల్ని చూస్తున్నారు. మ‌హిళ‌కు కాదేదీ అసాధ్యం అని నిరూపిస్తున్నారు ఈ ఇద్ద‌రు. మాన‌వులే మ‌హ‌నీయులు అన్న పాట‌ను ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకోవ‌చ్చు. గ‌గ‌నాంత‌ర రోద‌సిలో ప‌రిశోధ‌న‌ల‌కు వెడుతున్న శిరీష త‌న మిష‌న్ విజ‌యవంతంగా పూర్తిచేసుకుని రావాల‌ని యావ‌త్ తెలుగు జాతి ఆశీర్వ‌దిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here